భారత్‌కు వీటో హక్కు లభించేనా?
ABN , Publish Date - Sep 26 , 2026 | 01:09 AM
విదేశీ వ్యవహారాలలో మొదటి నుంచీ గాంధీజీ ఉపదేశించిన అహింస, శాంతి, సహకారం వంటి విలువల మార్గంలో పయనించే భారత్‌కు అంతర్జాతీయంగా ఎనలేని పలుకుబడి, ప్రతిష్ఠ ఉన్నాయి.
విదేశీ వ్యవహారాలలో మొదటి నుంచీ గాంధీజీ ఉపదేశించిన అహింస, శాంతి, సహకారం వంటి విలువల మార్గంలో పయనించే భారత్‌కు అంతర్జాతీయంగా ఎనలేని పలుకుబడి, ప్రతిష్ఠ ఉన్నాయి. విస్తృత ప్రపంచం పట్ల అనుకూల వైఖరితో వ్యవహరించడం, జాతీయ సార్వభౌమత్వాల ప్రాదేశిక సమగ్రతపై రాజీ లేని వైఖరి అవలంబించడం మన విదేశాంగ విధాన మౌలిక స్వభావం. దేశాన్ని పాలించేది ఎవరైనా, అధికారంలో ఉన్నది ఏ పార్టీ అయినా మన విదేశాంగ విధానాన్ని ఎప్పటికప్పుడు బలోపేతం చేయడం గర్వకారణం.
ఇటీవల న్యూఢిల్లీ వేదికగా భారత్ ఆతిథ్యం ఇచ్చిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో చైనా మొట్టమొదటిసారిగా భారత్‌కు అనుకూలంగా మాట్లాడి పాకిస్థాన్‌కు ఝలక్ ఇచ్చింది. కశ్మీర్‌లోని పహల్గావ్‌లో అమాయకులైన యాత్రికులపై పాకిస్థాన్ ముష్కరులు దాడిచేసి అమానుషంగా వారిని కాల్చి చంపిన ఉగ్రవాద చర్యను చైనా ఖండించడం భారత్ సాధించిన పాక్షిక దౌత్య విజయంగా చెప్పాలి. అంతేకాదు, బ్రిక్స్ న్యూఢిల్లీ సదస్సులో పాల్గొన్న ఇరాన్ తనపై యుద్ధం చేస్తున్న అమెరికా ప్రస్తావన తీసుకురాకుండా బ్రిక్స్ అజెండాకు పరిమితం కావడం కూడా భారత్ అవలంబించిన దౌత్యనీతిలో భాగమేనని చెప్పాలి.
ఆధునిక యుగ ప్రపంచ చరిత్రలో భారత జాతీయోద్యమానికి ఎంతో ప్రత్యేకత ఉంది. బ్రిటిషు వలస పాలకుల అణచివేత, హింస, దోపిడీలకు వ్యతిరేకంగా అహింసా మార్గంలో భారతీయులు చేసిన పోరాటం అంతర్జాతీయ సమాజానికి గొప్ప స్ఫూర్తినిచ్చింది స్వాతంత్య్రం లభించిన తర్వాత మనం ఏర్పాటు చేసుకున్న సుదృఢమైన రాజ్యాంగం, దాని ద్వారా దేశ పౌరులకు సంక్రమించిన ప్రాథమిక హక్కులు, రాజ్యాంగబద్ధంగా పాలన చేసే ప్రజా ప్రభుత్వాల ఏర్పాటు.. తదితర ప్రజాస్వామ్య పరిణామాలన్నీ ప్రపంచాన్ని విస్తుపోయేలా చేశాయి. ముఖ్యంగా ప్రపంచ దేశాలు రెండుగా చీలి అటు అమెరికా, ఇటు రష్యాల శిబిరాల పక్కన చేరిన సందర్భంలో భారత్ తటస్థ వైఖరి అవలంబించి అలీనోద్యమానికి అంకురార్పణ చేసింది. నాటి పండిట్ నెహ్రూ నుంచి నేటి నరేంద్ర మోదీ వరకు మన విదేశాంగ విధానం మౌలికంగా ఎటువంటి మార్పు లేకుండా కొనసాగుతూ వస్తోంది. ఈ విశిష్టతే అంతర్జాతీయ సమాజంలో భారత్‌కు ఒక ప్రత్యేక ప్రాధాన్యాన్ని సమకూర్చుతోంది.
బ్రిక్స్ న్యూఢిల్లీ సదస్సులో సాధించిన పాక్షిక విజయంతోనే భారత్ సంతృప్తి చెందకూడదు. దౌత్యపరంగా ఇంకా అనేక సవాళ్లు దేశం ముందున్నాయి. పొరుగు పాకిస్థాన్ ఇంకా పక్కలో బల్లెంగానే ఉంది. అంతర్జాతీయ వాణిజ్యంలో వెనుకబడే ఉన్నాము. ఇవన్నీ దేశ సత్వర అభివృద్ధికి అవరోధమవుతున్నాయి. ముఖ్యంగా 1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వం ఆనాటి దేశ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దే క్రమంలో జాతి ప్రయోజనాలకు దీర్ఘకాలంలో జరిగే నష్టాలను బేరీజు వేసుకోకుండా ప్రపంచీకరణ విధానాలను అనుసరించింది. అందులో భాగంగా చేసుకున్న అనేక అంతర్జాతీయ ఒప్పందాలు నేడు భారత్‌కు ప్రతికూలంగా పరిణమించాయి. ఎగుమతులు దిగుమతుల రంగంలో మన సొంత ఉత్పత్తిని పణంగా పెట్టి రాయితీలతో దిగుమతులు అనుమతించాము. దీనివల్ల వ్యవసాయంతో సహా పలు రంగాలు దెబ్బతిన్నాయి. దేశ జనాభాలో సగానికి పైగా ఆధారపడిన మన వ్యవసాయ రంగం విదేశీ సబ్సిడీ ఉత్పత్తుల పోటీని తట్టుకోలేకపోయింది. దేశీయ మార్కెట్లలో తమ ఉత్పత్తులకు సరైన మద్దతు ధర లభించక వ్యవసాయదారులు నష్టాల ఊబిలో కూరుకొని పోతున్నారు. మన రైతాంగానికి రక్షణ కల్పించేందుకు అమెరికాతో సహా వివిధ దేశాలతో కుదుర్చుకున్న వ్యవసాయ, వాణిజ్య ఒప్పందాలను ఇప్పటికైనా సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇందుకు దౌత్యపరమైన సంప్రదింపులే శరణ్యం. అలాగే తయారీ రంగంలో భారత్ అవకాశాలు కోల్పోయింది. ప్రపంచీకరణ వల్ల చైనా తన తయారీ రంగాన్ని ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి చేర్చి ‘వరల్డ్ ఫ్యాక్టరీ’గా చేసుకోగలిగింది. పాక్షిక నైపుణ్యాలు కలిగిన కార్మికులకు ఉపాధి కల్పించగలిగే మన తయారీ రంగం దెబ్బ తినడంతో దేశంలో ఉపాధి లేమి ఏర్పడి ఆర్థిక అంతరాలు పెరిగిపోయాయి. ఆర్థిక వ్యవస్థల ప్రపంచీకరణతో ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు రావడంతో వాటిని వెతుక్కుంటూ మన యువ విద్యాధికులు తరలిపోయారు. అంటే దేశీయ వనరులతో చదువుకున్న విద్యావంతుల ప్రతిభ ఇతర దేశాలకు ఉపయోగపడింది! మన విద్యావంతుల ప్రతిభను ఉపయోగించుకొని ఇక్కడే గ్లోబల్ బ్రాండ్లను సృష్టించే అవకాశాన్ని భారత్ కోల్పోయింది.
మరోవైపు బహుళ జాతి సంస్థలు సువిశాల భారతీయ విపణిలో ప్రవేశించడం వల్ల మన సంప్రదాయ కుటీర పరిశ్రమలు, చేనేత కార్మికులు, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. చిన్న తరహా పరిశ్రమలు చాలా వరకు మూతపడ్డాయి. విద్య, వైద్య రంగాల ప్రైవేటీకరణతో పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం దూరమయ్యాయి. ఆర్థికాభివృద్ధి, సాంకేతిక పురోగతి సాధించినప్పటికీ స్వయం తప్పిదాల వల్ల భారత్ కొన్ని రంగాలలో వెనుకబడి ఉంది. ఈ అంశాలను ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ అనివార్య ప్రస్తావనలను నాటి పీవీ నరసింహారావు, ఆ తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల వాణిజ్య విధానాలను విమర్శించడంగా చూడడం సబబు కాదు. వర్తమాన ప్రపంచ వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా వాటిని విశ్లేషించాల్సిన అవసరం ఉంది.
ప్రపంచీకరణ కొన్ని దేశాలకు వరంగా, మరికొన్ని దేశాలకు శాపంగా మారిన మాట నిజం. ప్రపంచీకరణ పేరుతో ప్రపంచ వాణిజ్య సంస్థతో భారత్ కుదుర్చుకున్న కొన్ని ఒప్పందాలు నేటికీ మన ఆర్థిక వ్యవస్థ పురోగతికి గుదిబండలుగా ఉన్నాయి. ఈ దృష్ట్యా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 40 శాతం వాటా ఉన్న బ్రిక్స్ దేశాల నడుమ దృఢమైన ఆర్థిక, వ్యాపార, వాణిజ్య సంబంధాలు వర్ధిల్లితే మన దేశానికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా బ్రిక్స్ భాగస్వామ్య దేశాలైన రష్యా, చైనాలతో పటిష్ఠ వాణిజ్య బంధాలను ఏర్పరచుకుంటే అమెరికా ఏకపక్షంగా విధిస్తున్న సుంకాల బెడదను తప్పించుకోవచ్చు. అయితే ఇదంత సులభమేమీ కాదు. ముఖ్యంగా భారత్ పట్ల చైనా నిలకడలేని వైఖరి ప్రదర్శిస్తోంది. భారత్ ఆర్థికంగా బలోపేతం కావడం చైనాకు ఇష్టం లేదన్నది బహిరంగ రహస్యమే. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లభించకుండా వీటో హక్కు గల చైనా ఎప్పటినుంచో అడ్డుకుంటోంది. భద్రతా మండలిలో సంస్కరణలు అత్యవసరమన్న భారత్ వాదనకు చైనా ఏ మాత్రం మద్దతు ఇవ్వడం లేదు. అంతర్జాతీయ వ్యవస్థను సమానత్వం వైపు నడిపించాలని బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ పిలుపునిచ్చారు! ఇది, భారత్‌కు వ్యతిరేకంగా చైనా అనుసరిస్తున్న ద్వంద్వ నీతికి నిదర్శనం.
193 దేశాలకు సభ్యత్వమున్న వ్యవస్థగా ఐక్యరాజ్యసమితి ఉన్నప్పటికీ దానికి అనుబంధంగా ఉన్న భద్రతామండలిలో కేవలం ఐదు దేశాలకు మాత్రమే వీటో హక్కుతో కూడిన శాశ్వత సభ్యత్వం ఉంది. దీంతో భద్రతా మండలిలో ముఖ్యంగా ఆ రెండు దేశాల పెత్తనం నడుస్తోంది. ఆశ్చర్యం ఏమిటంటే, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాల నుంచి ఒక్క దేశానికి కూడా భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేదు. ఈ ఖండాల దేశాలకూ మండలిలో సముచిత రీతిలో ప్రాతినిధ్యం ఉండాలని భారత్ సహా పలు దేశాలు పదేపదే చేస్తున్న విజ్ఞప్తులు కంఠశోషగానే మిగిలిపోతున్నాయి. భద్రతామండలిలో ఎక్కువ దేశాలకు శాశ్వత ప్రాతినిధ్యం కల్పిస్తే నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతుందనే సాకుతో అటువంటి ప్రతిపాదనలను బుట్ట దాఖలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏకపక్ష సుంకాల విధింపునకు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలను తోసిరాజని సొంత నిర్ణయాలను కొన్ని దేశాలు అమలు చేస్తున్నాయని అమెరికా పేరును నేరుగా ప్రస్తావించకుండానే ప్రధాని మోదీ బ్రిక్స్ సదస్సులో తప్పు పట్టడం గమనార్హం. ఐక్యరాజ్యసమితిలో ప్రతి ఒక్కరికి సమాన భాగస్వామ్యం ఉండాలి. భద్రతా మండలి విస్తరణ వాయిదా పడకూడదని మోదీ విస్పష్టంగా చెప్పారు. భారత్ ప్రతిపాదనలను అమలు పరచడానికి 10 సూత్రాలతో ఒక మార్గదర్శక ప్రణాళికను వచ్చే బ్రిక్స్ సమావేశాల నాటికి ఉమ్మడిగా రూపొందించాలని కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. బ్రిక్స్ వేదికపై భారత ప్రధానమంత్రి ఇంత స్పష్టంగా అభివృద్ధి చెందుతున్న దేశాల హక్కులు, ప్రయోజనాల గురించి మాట్లాడటం బహుశా ఇదే ప్రథమం. ఇది అంతర్జాతీయ సంబంధాల విషయంలో భారత్ వేసిన ఓ గొప్ప ముందడుగు.
- సి. రామచంద్రయ్య
శాసన మండలి సభ్యులు