ప్రజాస్వామ్యానికి శక్తులు ఉడిగాయా? ఉన్నాయా?
ABN , Publish Date - Sep 04 , 2026 | 04:36 AM
క్రమబద్ధంగా జరిగే ఎన్నికలూ, అధిక సంఖ్యలో పాల్గొనే ఓటర్లూ, శాంతియుతంగా ప్రభుత్వాలు మారటాలూ.. ప్రజాస్వామ్యమంటే ఇదే అనుకుంటాం. ఇలా చూస్తే మన ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే ఘనమైందిగా కనిపిస్తుంది.
క్రమబద్ధంగా జరిగే ఎన్నికలూ, అధిక సంఖ్యలో పాల్గొనే ఓటర్లూ, శాంతియుతంగా ప్రభుత్వాలు మారటాలూ.. ప్రజాస్వామ్యమంటే ఇదే అనుకుంటాం. ఇలా చూస్తే మన ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే ఘనమైందిగా కనిపిస్తుంది. ఏ దేశమూ మనకు సాటిరానిది గానే అనిపిస్తుంది. దీన్నే అసలుసిసలైన ప్రజాస్వామ్యంగా భావిస్తే అందరికంటే ర్యాంకుల్లో మనమే ముందుంటాం. కానీ వీ–డెమ్ (వెరైటీస్ ఆఫ్ డెమొక్రసీ) ఇనిస్టిట్యూట్ తాజాగా మన ప్రజాస్వామ్యానికి ఇచ్చిన ర్యాంకు చాలా దయనీయంగా ఉంది. 179 దేశాల్లో భారత్‌కు 106వ స్థానం లభించింది. కిందటి ఏడాది 100వ ర్యాంకు ఉంటే అది ఈ ఏడాది 106కు పడిపోయింది. అన్నిరకాల ప్రాథమిక హక్కులను హరించివేసిన 1975 నాటి ఎమర్జన్సీ కాలం తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం ఇంతటి దుస్థితికి దిగజారటం ఇప్పుడేనని వీ–డెమ్ నివేదిక పేర్కొంది.
ఎన్నికల ద్వారా అధికారాన్ని కైవసం చేసుకునే పార్టీలూ, నేతలూ నియంతృత్వ పోకడలను ప్రదర్శిస్తూ, అసమ్మతిని నయానాభయానా అణచి, వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేసి.. తమకు ఎదురులేని రీతిలో వ్యవహారాలను నడపటాన్ని ‘ఎలక్టోరల్ అటోక్రసీ’గా వర్ణించటం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. భారత్‌ను ఆ కోవలోకి చేర్చటమే కాదు... తాజా నివేదికలో మన దేశాన్ని పాకిస్థాన్, కజకిస్థాన్ సరసన వీడెమ్ నివేదిక నిలబెట్టింది. న్యాయవ్యవస్థలో జవాబుదారీతనం లోపించటం, ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తితో వ్యవహరించలేకపోవటం, ప్రభుత్వ యంత్రాంగంలో నిష్పాక్షికత గణనీయంగా క్షీణించటం అనేవి ఒక ప్రజాస్వామ్య దేశంగా భారత్ ర్యాంకు పడిపోవటానికి కారణాలుగా వీ–డెమ్ వ్యాఖ్యానించింది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు అడ్డంకులూ, పౌరసమాజానికి తన గళం వినిపించటంలో వివిధ రూపాల్లో ఎదురయ్యే ఇబ్బందులూ భారత ప్రజాస్వామ్య నాణ్యతను బాగా దెబ్బతీశాయని కూడా విమర్శించింది. ఎలక్టోరల్ అటోక్రసీ మీదే గాక, ‘డెమొక్రటిక్ బ్యాక్‌స్లైడింగ్’ అనే పేరు మీద కూడా ఇటీవల కాలంలో చాలా రచనలు వచ్చాయి. ఎలక్టోరల్ అటోక్రసీ అన్నా, డెమొక్రటిక్ బ్యాక్‌స్లైడింగ్ అన్నా అర్థంలో పెద్దగా తేడాలేదు. ప్రజాస్వామ్యం అన్ని విధాలుగా దిగజారి ఆలోచనల్లో ఆచరణలో నియంతృత్వ ధోరణులు పెరుగుతున్నాయని చెప్పటానికే ఆ రెండు పదబంధాలను వాడుతున్నారు.
ప్రజాస్వామ్య క్షీణతా, నియంతృత్వ ధోరణుల పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా ప్రబలం అవుతుంటే, వాటి తాలూకూ విపరిణామాల వల్ల నష్టపోయేది సాధారణ ప్రజలే. ముఖ్యంగా పెద్దగా ఆస్తిపాస్తులూ లేకుండా వేతనాల మీద ఆధారపడేవారే అందులో ప్రధానంగా ఉంటారు. సంపదలో, ఆదాయంలో వాటా తక్కువగా ఉన్నవాళ్లే గొంతెత్తాల్సి వస్తుంది. అలా ఎత్తే అవకాశాలను తగ్గించటం ప్రజాస్వామ్య దేశాల్లో కూడా ఎక్కువవుతోంది. ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో మత, జాతి విద్వేషాల చుట్టూ ప్రజలను ఊపేసే నాయకులు రంగం మీదకు వస్తారు. వీళ్లందరూ ఎన్నికల్లో మెజారిటీ జనాభిమానం పొందుతారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని లోపల నుంచీ బలహీనపరుస్తారు. 2000 సంవత్సరం తర్వాత అన్ని దేశాల్లో ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరిగాయి. వీటితోపాటే అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తామనే జనాకర్షక నేతల ప్రాబల్యమూ పెరిగింది. భారత్ లాంటి దేశాల్లోనే కాదు... అమెరికాలో సైతం ప్రజాస్వామ్య క్షీణతపై ఆలోచనాపరుల్లో భయం పట్టుకుంది. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలను బహిరంగంగా తూలనాడటం, ఫలానా విధంగా తీర్పులు ఇవ్వాలని న్యాయస్థానాలను హెచ్చరించటం, చట్టసభలను ఖాతరు చేయకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవటం లాంటివి ప్రపంచ దేశాలన్నిటి మీదా ప్రభావం చూపుతున్నాయి. అన్నింటా అమెరికా వైపుచూసే వివిధ దేశాల్లోని పాలకులకు తాము ఆ దారిలో ఇంకా ఎక్కువ వేగంగా అడుగులు వేసేలా అవి ప్రేరణను ఇస్తున్నాయి.
ప్రజాస్వామ్యానికి అన్ని వైపుల నుంచి ఇలా సమస్యలు చుట్టుముడుతున్న నేపథ్యంలో దాని మనుగడపైనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఆర్థికశాస్త్రంలో రెండేళ్ల క్రితం నోబుల్ బహుమతి పొందిన డరాన్ అసెమోగ్లూ ఈ సమస్యలన్నిటినీ విశ్లేషిస్తూ ‘ఉదారవాద ప్రజాస్వామ్యానికి ఏమైంది?’ అంటూ తాజాగా ఒక సమగ్ర పుస్తకాన్ని ప్రచురించారు. ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఏం చేయాలన్నదే ఆయనకు ప్రధానం కాబట్టి ఆ కోణంలోనే కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఆధునిక రాజకీయాల్లో ప్రజాస్వామ్యాన్ని అత్యుత్తమ వ్యవస్థగా, జీవన విధానంగా భావించే వారికి ఆయన ప్రతిపాదనలు ఆలోచనాత్మకంగా ఉంటాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే దాన్ని మళ్లీ సాధారణ ప్రజల జీవితాలను మెరుగుపరచేలా చేయగలగాలి. దాన్నే ఆయన ‘వర్కింగ్ క్లాస్ లిబరలిజం’గా వర్ణించారు. అమెరికా, పశ్చిమయూరపు దేశాల్లో రెండో ప్రపంచయుద్ధం ముగిసిన నాటి నుంచి దాదాపు 30 ఏళ్లు ప్రజల జీవనప్రమాణాలు విశేషంగా మెరుగుపడ్డాయి. ఆర్థికరంగాన్నీ, ప్రజల, కార్మికుల బాగోగులనూ మార్కెట్ శక్తులకే వదలివేయకుండా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకున్నాయి. ప్రజల సామాజిక, ఆర్థిక సంక్షేమాన్ని పాలనకు ముఖ్య కర్తవ్యంగా భావించాయి. ఈ కారణంగానే ప్రజలు ఉదార ప్రజాస్వామ్యంలో నమ్మకాన్ని పెంచుకున్నారు. ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ తమకు అండగా ఉంటుందని భావించారు. 1950ల తర్వాత పరిశ్రమలు పెరిగాయి. ఉద్యోగాలు పెరిగాయి. కార్మికుల జీతాలు పెరిగాయి. మధ్యతరగతి విస్తరించింది. ప్రభుత్వసేవలు మెరుగయ్యాయి. విద్య, ఆరోగ్య రంగాల్లో ఎంతో పురోగతి సాధ్యమైంది. ఆర్థికాభివృద్ధి ఫలితాలు అన్నివర్గాల ప్రజలకూ చేరటం వల్ల ‘ఈ వ్యవస్థలో నాకూ స్థానం ఉంది’ అన్న భావన ప్రజల్లో బలపడింది.
ఒకప్పుడు స్వేచ్ఛకూ, ప్రజాస్వామ్యానికీ, ఆర్థికాభివృద్ధికీ విజయవంతమైన నమూనాగా లిబరల్ డెమొక్రసీ కనపడింది. ఇప్పుడు దానికి గండిపడింది. ప్రజలతో ఆర్థిక, రాజకీయ సంబంధాన్ని క్రమంగా డెమొక్రసీ కోల్పోయింది. ఇది ఒక్కసారిగా జరగలేదు. 1980ల తర్వాత మొదలై 2000ల తర్వాత తీవ్రమైంది. ‘మా ఉద్యోగాలు భద్రంగా లేవు. మా ఆదాయం పెద్దగా పెరగటం లేదు. మా పిల్లల భవిష్యత్తు మాకంటే మెరుగ్గా ఉంటుందన్న నమ్మకం కలగటం లేదు. రాజకీయ నాయకులు మా వినతులను వినటం లేదు. దేశం అభివృద్ధి అవుతోంది. కానీ ఆ ప్రయోజనం మాకు తగినంతగా దక్కటం లేదు’ అన్న మాటలు సగటు మనుషుల నుంచి వినిపించటం ఇప్పుడు సాధారణమైంది. ‘ప్రతి వ్యక్తికీ తనకు నచ్చినట్లు జీవించే స్వేచ్ఛ ఉంది’.. లిబరలిజం అంటే అంతకు మించి ఏముంటుంది? అని అనుకుంటే సంక్షోభం అర్థంకాదు. నచ్చినట్లు జీవించే స్వేచ్ఛ ఉండటం వల్ల జీవన ప్రమాణాలు వాటంతట అవే పెరగవు. స్వేచ్ఛను ఉపయోగించుకుని మెరుగైన జీవితాన్ని ఏర్పరచుకునే పరిస్థితులనూ, అవకాశాలనూ ప్రభుత్వాలు సృష్టించాలి. ఒకప్పుడు లక్షలాది కార్మికుల అవసరం ఉండేది. కార్మికులు కూడా సంఘటితంగా ఉండి డిమాండ్లు సాధించుకునేవారు. ఎక్కువ జీతాల కోసం పోరాడగలిగేవారు. వారికి రాజకీయ ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడన్నీ పోయాయి. ఆటోమేషన్ పెరిగింది. ఫ్యాక్టరీలు కనుమరుగయ్యాయి. కార్మిక సంఘాలు బలహీనపడిపోయాయి. 1990ల తర్వాత (పోస్ట్ ఇండస్ర్టియల్) బాగా ఉన్నత చదువులు చదివిన వారికీ, టెక్నాలజీ నిపుణులకూ ప్రాధాన్యం పెరిగింది. ఉద్యోగాలన్నీ ఫైనాన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఐటీ రంగాలకు తరలిపోయాయి. సాధారణ చదువులు చదివినవారు వెనుకబడిపోయారు. వేతనాల్లోనూ విపరీత వ్యత్యాసాలు పెరిగాయి. సంప్రదాయ పరిశ్రమలు, రంగాలపై ఆధారపడినవాళ్లు స్థిరత్వాన్ని కోల్పోయారు. అందుకే కొద్ది ఉద్యోగాలను మాత్రమే కల్పించే విధానాలకు పెద్దపీట వేసిన నిపుణుల పట్ల వ్యతిరేకత ప్రబలింది. రాజకీయాల్లోనూ ఉన్నతవర్గాల ప్రాబల్యం పెరిగింది. వీరందరిపై మధ్య, కింది వర్గాల ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఉపయోగించుకుని ట్రంప్ లాంటి నేతలు అధికారంలోకి వచ్చారు. ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తున్న విధానాలపైనా, వాటి సృష్టికర్తపైనా పోరాడుతున్నామంటూ ఉద్రేక ప్రసంగాలు చేసి ఎన్నికల్లో గెలిచారు.
ఐటీ విప్లవం, ఆటోమేషన్ కలిగించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాల నుంచి కృత్రిమమేధ (ఏఐ) కూడా ప్రజలను గట్టెక్కించలేదు. ఏఐని ఎవరికి ఉపయోగపడేలా అభివృద్ధి చేస్తున్నారో పరిశీలిస్తే కానీ దాని ప్రభావం అర్థంకాదు. కార్మికులను తొలగించటం, నిరుద్యోగ భయాన్ని మరింత పెంచటం, వీటితో పాటు అసమానతలు మరింత హెచ్చేలా చేయటం... ఏఐ వల్ల జరిగితే సంక్షోభం యథాతథంగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో నమ్మకం మరింతగా సడలిపోతుంది. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ తమకు ఏమీ చేయటం లేదన్న భావనను మరింత ఎక్కువ చేస్తుంది. లిబరల్ డెమొక్రసీని కాపాడుకోవాలంటే అది మళ్లీ సాధారణ ప్రజల జీవితాల మెరుగుదలకు తోడ్పడాలి. గౌరవంగా జీవించగల ఉద్యోగాలను కల్పించాలి. ఏమీ చేయలేని అశక్తులుగా ఉద్యోగులను మార్చకూడదు. అభివృద్ధి ఫలాలు (షేర్డ్ ప్రాస్పరిటీ) విస్తృతంగా ప్రజలకు చేరాలి. విధాన నిర్ణయాల్లో కేంద్రీకరణకు స్వస్తిపలకాలి. ఒక్కమాటలో చెప్పుకోవాలంటే ప్రజలకు సామాజిక, ఆర్థిక, ఉద్యోగ భద్రతనూ, నిజమైన రాజకీయ భాగస్వామ్యాన్నీ అందిస్తేనే లిబరల్ డెమొక్రసీ భవిత పదిలంగా ఉంటుంది. అది చేయలేనప్పుడు ప్రజలు ప్రత్యామ్నాయాల వైపు చూస్తారు. లిబరల్ డెమొక్రసీకి అప్పుడు అసలైన ప్రమాదం ముంచుకొస్తుంది.
ప్రధాన స్రవంతికి చెందిన అసెమోగ్లూ లాంటి ఆర్థికవేత్తలు కూడా విపరీత సంపద, ఆదాయ కేంద్రీకరణలతో వచ్చే సమస్యలు సమాజాన్నీ, ప్రజాస్వామ్యాన్నీ ఛిన్నాభిన్నం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించటం చాలా మందిని ఆలోచింపచేస్తోంది. టెక్నాలజీని... అది ఏఐ అయినా... మరొకటైనా దాని మానాన దాన్ని వదిలేస్తే మొదటికే మోసం తెస్తుంది. హఠాత్తుగా ఎందరి జీవితాలనో తారుమారు చేస్తుంది. హద్దుల్లేని లాభార్జన, అడ్డూఅదుపూ లేకుండా సంపదలు కొందరి చేతుల్లో పోగుపడటం సమాజాన్ని నిరాశమయంగా మార్చుతుంది. నిరాశ ఆవహించిన మనుషులూ, సమాజాలూ ఎప్పటికైనా ప్రమాదకరమే! ఆ ప్రమాదం ముదిరితే లిబరల్ డెమొక్రసీకీ కష్టకాలమే!
(ఆంధ్రజ్యోతి ఎడిటర్)