Share News

ఈ బంగారు తల్లులు ఎందరికో స్ఫూర్తి

ABN , Publish Date - Oct 10 , 2026 | 01:21 AM

ఇటీవల జపాన్‌లోని ఐచీ నగోయాలో అట్టహాసంగా ముగిసిన ఆసియా క్రీడల్లో భారత్ అత్యద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. భారత క్రీడాకారులు 21 బంగారు పతకాలు సహా మొత్తం 85 పతకాలు సాధించి.

ఈ బంగారు తల్లులు ఎందరికో స్ఫూర్తి

ఇటీవల జపాన్‌లోని ఐచీ నగోయాలో అట్టహాసంగా ముగిసిన ఆసియా క్రీడల్లో భారత్ అత్యద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. భారత క్రీడాకారులు 21 బంగారు పతకాలు సహా మొత్తం 85 పతకాలు సాధించి 140 కోట్ల మంది భారతీయులు గర్వపడేలా చేశారు. 2022లో చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో సత్తా చాటినట్లుగానే, ఈసారి జపాన్ ఏషియాడ్‌లోనూ మనవాళ్లు అదరగొట్టారు. గత దశాబ్దకాలంగా భారతదేశంలో క్రీడాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, అందిస్తున్న ప్రోత్సాహం కారణంగా మన క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై నిలకడ ప్రదర్శన కనబరుస్తున్నారు. 1982లో ఢిల్లీ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలుచుకున్న భారత మహిళల హాకీ జట్టు.. 44 ఏళ్ల తర్వాత ఈ ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలుచుకుంది. 17 ఏళ్ల కుముద్ మహోద్.. ఆర్చరీ మహిళల విభాగంలో స్వర్ణం గెలుచుకుని.. 1998 నుంచి ఆసియా క్రీడల్లో ఆర్చరీలో కొరియా మహిళల ఆధిపత్యానికి చెక్ పెట్టారు.

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌పూర్ అనే చిన్న గ్రామం నుంచి వచ్చిన చికిత తానిపర్తి.. కాంపౌండ్ ఆర్చరీలో బంగారు పతకాన్ని గెలుచుకోవడం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం. ఆ కుటుంబం పడిన శ్రమకు, చేసిన త్యాగాలకు ఈ విజయం గొప్ప బహుమానం. అద్భుతమైన టాలెంట్ ఉన్న చికిత.. హరియాణాలోని సోనిపత్‌లో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ‘నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’లో చేరి, కోచ్ వివేక్ కుమార్ ప్రోత్సాహంతో ఎంతో సాధన చేశారు. దీని ఫలితంగానే ఇవాళ ఆసియాడ్‌ ఆర్చరీలో భారత్ ఖాతాలో స్వర్ణం చేరింది. ఇదే విభాగం నుంచి విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ స్వర్ణం సాధించి మరెందరికో ఆదర్శంగా నిలిచారు.


ఇక, 400 మీటర్ల హర్డిల్స్ పరుగులో విథియా రామరాజ్ 42 ఏళ్ల నేషనల్ రికార్డును బద్దలు కొట్టారు. 1984 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో పీటీ ఉష రికార్డును అధిగమించారు. ఇలాంటి ఎన్నో కుటుంబాల కృషి ఫలితమే ఇవాళ మెరికల్లాంటి క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై మన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. మనందరం గర్వపడేలా చేస్తున్నారు. భారత్ సాధించిన 21 బంగారు పతకాల్లో సగం పతకాలను మహిళలే సాధించారు. వీరేమీ సకల సౌకర్యాలున్న నేపథ్యం నుంచో, బాగా డబ్బున్న కుటుంబాల నుంచో రాలేదు. వీరిలో ఉన్న ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించి.. వారి పరిస్థితులు సహకరించకపోయినా.. కష్టనష్టాలకు ఓర్చి ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకుని వీరికి క్రీడల్లో శిక్షణ అందించారు.

క్రీడాకారుల కృషికి.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ఖేలో ఇండియా, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (TOPS), టార్గెట్ ఏషియన్ గేమ్స్ గ్రూప్ (TAGG) వంటి పథకాల ద్వారా అండగా నిలిచింది. TOPS పథకంలో భాగంగా వారికి జాతీయ కోచింగ్ క్యాంపుల్లో శిక్షణ, అంతర్జాతీయ స్థాయి ట్రైనింగ్ సెషన్స్‌తో పాటు విదేశాల్లోనూ శిక్షణ అందిస్తోంది. అవసరమైనచోట విదేశీ నిపుణులను, కోచ్‌లను, సపోర్టింగ్ స్టాఫ్‌ను నియమిస్తోంది. అవసరమైన క్రీడాసామగ్రిని, శిక్షణ వసతులను సమకూర్చుతోంది. అంతేకాదు, ఖేలో ఇండియా పథకం ద్వారా 2,786 మంది క్రీడాకారులను వెన్నంటి ప్రోత్సహిస్తోంది.

ఈ ఆసియా క్రీడల్లో మన మహిళా క్రీడాకారులు.. ఆర్చరీ, హాకీ, క్రికెట్, అథ్లెటిక్స్‌లోనే కాకుండా అనేక క్రీడల్లో తమ సత్తా చాటారు. గోల్ఫ్‌లో ప్రణవి ఉర్స్, బాక్సింగ్‌లో పర్వీన్ హుడా, లవ్లీనా బోర్గోహైన్, షూటింగ్‌లో నీరూ ధాండాతో పాటు టీం, మిక్స్‌డ్ ఈవెంట్లలోనూ మహిళా క్రీడాకారులు అద్భుతంగా రాణించారు.


దేశ ప్రాధాన్యతాంశాల్లో స్పోర్ట్స్‌కు కూడా కేంద్రం పెద్దపీట వేసింది. తాజా ఆసియాడ్ ఫలితాల నేపథ్యంలో మరింత ఉత్సాహంతో ముందడుగేయనుంది. అంతర్జాతీయ క్రీడల్లో మన ఆటగాళ్లు మెరుగైన ఫలితాలు సాధించేందుకు నిరంతరం అండగా నిలబడుతూనే ఉంటుంది. అహ్మదాబాద్‌లో 2030లో కామన్‌వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. అలాగే 2036 ఒలింపిక్స్ క్రీడలను భారత్‌లో నిర్వహించాలన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కల నెరవేరే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఒలింపిక్స్ నిర్వహణ కోసం భారత్‌తో పాటుగా మరో 6 దేశాల బిడ్స్‌ను పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం స్పష్టం చేసింది.

కాగా, రానున్న ఒలింపిక్ క్రీడల్లో, అంతర్జాతీయ పోటీల్లో సాధ్యమైనన్ని ఎక్కువ ఈవెంట్లలో మన క్రీడాకారులు పాల్గొనాలని 80వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి మోదీ సూచించారు. ఒలింపిక్ క్రీడల్లో దాదాపు 40 స్పోర్ట్స్, దాదాపు 325 ఈవెంట్లు ఉంటే, ఇందులో కనీసం మూడింట రెండొంతుల ఈవెంట్లలో కూడా భారతదేశం పాల్గొనలేకపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరి కొన్నింటిలో కనీసం అర్హత కూడా సాధించలేకపోతున్నామన్నారు. 2036 నాటికి అన్ని క్రీడాంశాలపై దృష్టి సారించాలని యువతకు మోదీ పిలుపునిచ్చారు. దీంతో ప్రధానమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారి సామర్థ్యాలకు సానబెట్టి 2036 ఒలింపిక్స్‌లో భారతదేశం వీలైనన్ని ఎక్కువ పతకాలను సాధించే దిశగా.. క్రీడామంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రపంచ క్రీడాపటంలో భారత్ అగ్రస్థానంలో నిలవాలంటే.. అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడం, వారికి మెరుగైన శిక్షణ అందించడం, శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించడం అవసరం. ఇందుకోసం అన్ని వ్యవస్థల సమన్వయంతో క్రమబద్ధంగా ముందుకు సాగాలి.


క్రీడలు, యువజన వ్యవహారాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న బడ్జెట్ గత 12 ఏళ్లలో దాదాపు 4 రెట్లు పెరిగింది. 2013–14లో రూ.1,219 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.4,480 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. భారత క్రీడా రంగాన్ని సమూలంగా మార్చే లక్ష్యాల్లో భాగంగా 2026–27 నుంచి 2030–31 వరకు ‘ఖేలో ఇండియా’ పథకాన్ని కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.29,054 కోట్లు కేటాయించింది. అథ్లెట్లు, పారా–అథ్లెట్లకు సహకారం అందిస్తూనే, ఆదివాసీ క్రీడలు, వెనుకబడిన ప్రాంతాల్లోని క్రీడాకారులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టేలా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. క్రీడల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు 2021లో ప్రారంభించిన ‘ఖేలో ఇండియా మహిళల (అస్మిత) లీగ్’ ద్వారా ఇప్పటివరకు 700 నగరాల్లో, 38 ఈవెంట్లలో 3,500కు పైగా పోటీలు జరిగాయి. ఇందులో 6 లక్షలకు పైగా మహిళా క్రీడాకారులు పాల్గొన్నారు. ఇవన్నీ భారత క్రీడాప్రతిభను వెలికితీస్తూ, వారిని దేశానికి ప్రాతినిధ్యం వహించేలా ప్రోత్సహించేందుకు మోదీ సర్కారు చేపడుతున్న కార్యక్రమాలకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.

ఐచీ నగోయా ఆసియాగేమ్స్, స్కాట్లాండ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ విజయాలు, మన మహిళా క్రీడాకారుల అద్భుత ప్రదర్శన.. క్రీడా రంగంలో భారత్ మరిన్ని శిఖరాలను అధిరోహించేందుకు స్ఫూర్తిగా నిలుస్తాయి. ఈ విజయాల వెనుక క్రీడాకారుల కఠోర సాధన ఉంది, తల్లిదండ్రుల త్యాగం ఉంది, శిక్షకుల కృషి ఉంది. అందుకు తోడైన ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉంది.


భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన, పతకాలు సాధించిన మన బంగారు తల్లులు.. తమలాంటి లక్షలాది బాలికలకు ‘నేనూ సాధించగలను’ అనే నమ్మకాన్ని అందించారు. ఆ నమ్మకానికి అవకాశాలు కల్పించడం, ఆ అవకాశాలను విజయాలుగా మలచడం మనందరి బాధ్యత. ఇవాళ దేశం గర్వించేలా ఆడిన ఈ ఆడబిడ్డల స్ఫూర్తితో.. రేపు మరెందరో బాలికలు, యువతులు ప్రపంచం గర్వించేలా ఎదగాలి. వారి మెడలో పతకం మెరిసిన ప్రతిసారీ.. భారతదేశ కీర్తి కిరీటంలో మరో మణి చేరాలి. ప్రభుత్వాధినేతగా 25 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంలో.. అక్టోబర్ 7న ఢిల్లీలో నిర్వహించిన బహిరంగ సభలో.. ప్రధానమంత్రి మోదీ ‘వి విల్ డూ ఇట్’ (మనం చేయగలం) అనే స్ఫూర్తిమంత్రాన్ని మనకిచ్చారు. దీని ప్రేరణతో మనమంతా కలిసి క్రీడాశక్తిని మేల్కొలిపి భారతదేశానికి కీర్తిప్రఖ్యాతులు అందిద్దాం.

- జి.కిషన్‌రెడ్డి

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి

Updated Date - Oct 10 , 2026 | 01:27 AM