వికసిత భారతమే మన గమ్యం
ABN , Publish Date - Aug 15 , 2026 | 01:19 AM
నేడు స్వతంత్ర భారతదేశం 80వ పడిలో అడుగుపెడుతోంది. అనేక వైరుధ్యాలకు నెలవైన భారతదేశం ఎక్కువ కాలం మనుగడ సాగించదన్న వాదనలను పటాపంచలు చేస్తూ, భిన్నత్వంలో ఏకత్వానికి ఆదర్శంగా నిలిచాం.
నేడు స్వతంత్ర భారతదేశం 80వ పడిలో అడుగుపెడుతోంది. అనేక వైరుధ్యాలకు నెలవైన భారతదేశం ఎక్కువ కాలం మనుగడ సాగించదన్న వాదనలను పటాపంచలు చేస్తూ, భిన్నత్వంలో ఏకత్వానికి ఆదర్శంగా నిలిచాం. ఆకలి కేకల నుంచి ఆహార భద్రత వైపు పయనించాం. అప్పుల కోసం ఆరాటపడే దేశం నుంచి ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగాం. వెనుకబడిన దేశం నుంచి ప్రపంచ వేదికపై ప్రభావం చూపుతున్న దేశంగా రూపాంతరం చెందాం. ఈ ప్రగతి ప్రస్థానంలో ఎన్నో చిరస్మరణీయ విజయాలు భారత కీర్తి కిరీటంలో చేరాయి. ఈ నిర్మాణాత్మక ప్రస్థానాన్ని గర్వంగా చాటుకోవాల్సిన వేళ.. విధ్వంస రాజకీయాల ఛాయలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికార యావలో పడి కొన్ని రాజకీయ పార్టీలు, వాటికి వంత పాడే శక్తులు దేశ నిర్మాణం కంటే విధ్వంసానికే ప్రాధాన్యమివ్వడం ఆవేదన కలిగిస్తోంది.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రాధాన్యతను విస్మరించలేం. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించడం, తప్పులను ఎత్తిచూపడం, ప్రజా సమస్యలపై పోరాడటం ప్రతిపక్షం బాధ్యత. పార్లమెంటులో చర్చకు పట్టుబట్టడం, ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టడం ప్రతిపక్షానికి ఉన్న ప్రజాస్వామ్య హక్కు. ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తన ఈ బాధ్యతలను, హక్కులను గుర్తించడం లేదు. పార్లమెంటు పనితీరును అడ్డుకోవడమే అజెండాగా పనిచేస్తోంది. నిర్మాణాత్మక చర్చలకు ఆస్కారం కల్పించకుండా నిరసనలకు, ఆందోళనలకు పార్లమెంటును వేదికగా మార్చుతోంది. ఇటీవలి పరిణామాలను గమనిస్తే కాంగ్రెస్ రాజకీయ వ్యూహంలో ఒక రకమైన ‘విఘాతం కలిగించే మనస్తత్వం’ (disruptive mentality) కనిపిస్తోంది.
పార్లమెంటులో ఏదైనా అంశంపై చర్చ జరగాలని ప్రతిపక్షం పట్టుబట్టడం ప్రజాస్వామ్యంలో సహజం. కానీ ప్రభుత్వం చర్చకు సిద్ధమని చెబుతున్నా నిరసనలు కొనసాగిస్తే ఏమనుకోవాలి? ప్రభుత్వం సమాధానం చెప్పాలంటే సభ నడవాలి కదా! నినాదాలు, నిరసనలు, వాకౌట్లతో సభ సజావుగా నడవకుండా అంతరాయం కలిగిస్తే ప్రభుత్వం ఎలా చర్చను కొనసాగిస్తుంది? ప్రతిపక్షం వాదన ప్రజలకు తెలియాలన్నా పార్లమెంటు నడవాలి కదా! కాంగ్రెస్, ఇండీ కూటమి పార్లమెంటుకు అంతరాయం కలిగించడమే లక్ష్యంగా, సభను అడ్డుకోవడమే ధ్యేయంగా పెట్టుకుంటున్నాయి. ఇది ముమ్మాటికి రాజ్యాంగకర్తలను అవమానించడమే. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనూ విద్యార్థుల ఆందోళనకు సంబంధించిన అంశంపై చర్చ జరపాలని తొలుత కాంగ్రెస్ పట్టుబట్టింది, చర్చకు సిద్ధమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ వెంటనే స్వరం మార్చి, జంతర్ మంతర్ ఆందోళనకారులపై జరిగిన లాఠీచార్జీకి ప్రధానమంత్రి క్షమాపణలు చెప్పాలంటూ కొత్త పల్లవి అందుకుంది.
యూపీఏ-2 హయాంలో అధికార పక్షమైన కాంగ్రెస్ నాటి విపక్షం గొంతు ఎలా నొక్కిందో తెలియడానికి 2010 శీతాకాల సమావేశాలను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. రూ.1.76 లక్షల కోట్ల కుంభకోణమైన 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో అవినీతిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తే, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. చివరకు సుప్రీంకోర్టు భారీ స్థాయిలో అవినీతి జరిగిందంటూ ఆ కేటాయింపులను రద్దు చేసి, పారదర్శకంగా మళ్లీ వేలం వేయాలని ఆదేశించిందంటే బీజేపీ డిమాండ్ ఎంత సహేతుకమో అర్థమవుతుంది. ఆ సెషన్‌లో లోక్‌సభలో మొత్తం సమయంలో 6శాతం, రాజ్యసభలో 2శాతం మాత్రమే సద్వినియోగం అయ్యింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం డిమాండ్లను పట్టించుకోని కాంగ్రెస్.. ఇప్పుడు మాత్రం పార్లమెంటరీ సంప్రదాయాలు, చర్చలు అంటూ గురివింద నీతులు వల్లిస్తోంది.
పార్లమెంటులోనే కాదు, బయటా కాంగ్రెస్ ధోరణి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఇటీవలి జంతర్ మంతర్ నీట్ ఆందోళనల సమయంలోనూ కాంగ్రెస్ ‘‘విఘాతం కలిగించే మనస్తత్వం’’ స్పష్టంగా బయటపడింది. నీట్ పరీక్ష లీకేజీపై విద్యార్థుల ఆవేదన అర్థం చేసుకోదగినదే! వారి ఆందోళనను తప్పుబట్టలేం. కానీ, విద్యార్థుల ముసుగులో కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు, విచ్ఛిన్నకర శక్తులు ఆ ఆందోళనల్లో ప్రవేశించాయి. కాంగ్రెస్ ఆ అరాచక శక్తులను ఉసిగొల్పిందనడం సబబుగా ఉంటుందేమో. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న ఉద్దేశంతో ప్రజల మధ్య విద్వేషాలు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నం దేశ సమగ్రతకే ప్రమాదం. ఇలాంటి చర్యలను ఈసడించుకుంటూ జంతర్ మంతర్ నిరసనల్లో పాల్గొన్న కొందరు విద్యార్థులు సైతం ఆందోళన వీడారు. ఇవి తమ నిరసన వెనక ఉన్న అసలైన ఉద్దేశాన్ని తప్పుదోవ పట్టిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం మాత్రం విద్యార్థుల ఆందోళనలను అర్థం చేసుకొని సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించింది.
ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 1949 నవంబర్ 25న రాజ్యాంగ సభలో చేసిన ప్రసంగాన్ని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్య మార్గాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత శాసనోల్లంఘన, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం వంటి రాజ్యాంగేతర పద్ధతులను ఆశ్రయించడం అరాచకానికి దారి తీస్తుందంటూ ‘గ్రామర్ ఆఫ్ అనార్కీ’’గా అభివర్ణించారు. నిరసన తెలపడాన్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ, ఆ నిరసన రాజ్యాంగబద్ధంగా ఉండాలి, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేలా ఉండాలి. కాంగ్రెస్ తీరు అందుకు విరుద్ధంగా ఉండడమే ఇక్కడ ఆందోళనకరం. అంతేకాక సుప్రీంకోర్టు, కేంద్ర ఎన్నికల కమిషన్, పార్లమెంటు, ప్రధానమంత్రి కార్యాలయం తదితర వ్యవస్థల విశ్వసనీయతపైనే సందేహాలు తలెత్తేలా వ్యవహరిస్తోంది.
కాంగ్రెస్‌లో గూడుకట్టుకున్న నిరాశ నిస్పృహలకు వారు ఉపయోగిస్తున్న భాష కూడా ఉదాహరణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల, ఆయన మాతృమూర్తి పట్ల కాంగ్రెస్ నాయకుల అభ్యంతరకర అసభ్య పద ప్రయోగం వారి పతనానికి పరాకాష్ఠ. వ్యక్తిగత అవమానానికి, నిర్మాణాత్మక విమర్శకు మధ్య తేడా ఉంటుంది. ప్రజలు కేవలం ప్రభుత్వ పనితీరునే కాదు.. ప్రతిపక్షం వ్యవహారశైలినీ గమనిస్తారు.
2014 నుంచి భారతదేశం అభివృద్ధి దిశగా వేగంగా పరిగెడుతోంది. సంక్షేమంలో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తోంది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అంతరిక్షంలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తోంది. అంతర్జాతీయ దౌత్యంలో కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచమంతటా భారత ప్రతిష్ఠ పెరిగింది. ఇటువంటి తరుణంలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు అయ్యే నాటికి, అంటే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న సంకల్పంతో నిర్విరామంగా కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా.. రాజకీయ ప్రయోజనాల కంటే ముందుగా దేశ ప్రయోజనాన్ని, రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య సంస్థల గౌరవాన్ని నిలబెట్టాలి. బ్రిటిష్ వలస పాలన నుంచి భారతావని విముక్తి కోసం పోరాడిన సమరయోధుల స్ఫూర్తితో వికసిత భారత నిర్మాణానికి సమస్త భారతీయులం సమైక్యంగా పునరంకితం అవుదాం!
- జి. కిషన్‌రెడ్డి
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి