జాతీయోద్యమ స్ఫూర్తి అజేయం
ABN , Publish Date - Aug 15 , 2026 | 01:15 AM
బ్రిటిష్ వలస పాలకుల నుంచి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం దశాబ్దాలపాటు సాగించిన జాతీయోద్యమం ఫలించి అప్పుడే ఎనభయ్యో ఏట అడుగుపెడుతున్నాం. మహోధృతంగా సాగిన జాతీయోద్యమంతోనూ..
బ్రిటిష్ వలస పాలకుల నుంచి స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం దశాబ్దాలపాటు సాగించిన జాతీయోద్యమం ఫలించి అప్పుడే ఎనభయ్యో ఏట అడుగుపెడుతున్నాం. మహోధృతంగా సాగిన జాతీయోద్యమంతోనూ, ఆ తర్వాత గత 79 ఏళ్ల మన దేశ ప్రగతి బాటతోను కాంగ్రెస్ పార్టీది పేగుబంధం. దీన్ని చాలా ముందుగా గ్రహించడం వల్లనే కావొచ్చు, దక్షిణాఫ్రికా నుంచి నౌకలో స్వదేశానికి పయనమై 1915 జనవరి 9న బొంబాయి రేవులో అడుగుపెట్టిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ తన కార్యక్షేత్రానికి సరైన వేదిక ఏదో సులభంగానే ఆకళింపు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పయనిస్తేనే ఈ దేశాన్ని వలస పాలకుల నుంచి రక్షించటం సాధ్యపడుతుందని గ్రహించారు. ఈ క్రమంలో ఆయన తనదైన అహింస, సత్యాగ్రహం వంటి మహోన్నత ఆదర్శాలను జాతీయోద్యమ చోదకశక్తులుగా మార్చి, మహాత్ముడై విశాల ప్రజారాశుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు.
చరిత్ర పొడవునా ఎన్నో స్వాతంత్య్రోద్యమాలు తారసపడతాయి. కొన్ని తుపాకులతో సాగాయి. మరికొన్ని సైన్యాలతో ముందుకెళ్లాయి. కొన్నిచోట్ల అంతర్యుద్ధాలు, మరికొన్నిచోట్ల నెత్తుటి విప్లవాలు తప్పలేదు. కానీ మన స్వాతంత్ర్య పోరాటం విలక్షణమైనది. కర్కశులైన బ్రిటిష్ పాలకులను ఓడించటం ఒక్కటే దాని ప్రత్యేకత కాదు. బానిసత్వంలో మగ్గుతున్న ప్రజలు క్రమేపీ తమ స్వీయశక్తిని గ్రహిస్తూ తోటివారిని సమీకరించటం; రాజకీయ సంస్థను బలోపేతం చేసుకోవడం; త్యాగాలకు సిద్ధపడటం; అన్నిటికీ మించి సత్యాగ్రహం, అహింస అనే రెండు అసాధారణ నైతిక శక్తుల్ని ఆవహింపజేసుకోవటం... చిరస్మరణీయాలు. అందుకే ఆగస్టు 15 ఒక సాధారణ జాతీయ సెలవుదినం కాదు. మానవాళి చరిత్రలోనే అసాధారణ, అపురూప ప్రయోగం సాకారమైన ఉత్సవం.
పశుబలాన్ని చాటే వలసపాలకుల్ని అనుకరించటంకాక, వారికి వ్యతిరేకంగా కోట్లాది మందిని సమీకరించటంలోనే మన శక్తిసామర్థ్యాలు ఇమిడి ఉంటాయని గాంధీ మహాత్ముడు గుర్తించాడు. తర్వాత నిత్యావసర వస్తువైన ఉప్పు ప్రతిఘటనకు ప్రతీకగా మారింది. ఖద్దరు ఆత్మగౌరవానికి చిహ్నమైంది. విదేశీ వస్త్ర బహిష్కరణ వలసపాలకులకు సవాలైంది. జైలుకెళ్లడం సిగ్గుపడే విషయంగా కాక, గర్వపడే సందర్భమైంది. జాతీయోద్యమం న్యాయవాదులకూ, మేధావులకూ, రాజకీయ నాయకులకు మాత్రమే పరిమితం కాలేదు. అది రైతునూ, శ్రామికుణ్ణి, విద్యార్థిని, దుకాణదారును, సగటు గృహిణిని స్పృశించింది.
అన్ని వర్గాల్లోనూ చైతన్యాన్ని రగిల్చి, జాతీయ భావనా స్ఫూర్తిని పెంపొందింపజేసింది భారత జాతీయ కాంగ్రెస్. అందుకే కాంగ్రెస్ అసాధారణ తోడ్పాటును గుర్తించకుండా దేశ స్వాతంత్య్రోద్యమ చరిత్ర లిఖించటం అసాధ్యం. దశాబ్దాలుగా ఈ దేశ పౌరుల ఆశలనూ, ఆకాంక్షలనూ చర్చిస్తూ, వాటిని వ్యక్తీకరిస్తున్న ఏకైక జాతీయ వేదిక కాంగ్రెస్. గాంధీ మహాత్ముడి నాయకత్వంలో అది సకలజనుల సంస్థగా రూపుదిద్దుకుంది. సహాయ నిరాకరణోద్యమం, పౌర ఉల్లంఘనోద్యమం, క్విట్ ఇండియా ఉద్యమరూపాలు పై నుంచి వచ్చిన రాజకీయ కార్యక్రమాలు కాదు. అసంఖ్యాక ప్రజలు వెల్లువలా పాల్గొన్న మహోద్యమాలు. స్వాతంత్య్రోద్యమ కాలంలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ తొమ్మిది సార్లు జైలుకు వెళ్లాల్సివచ్చింది. 1942 ఆగస్టులో జరిగిన బొంబాయి ఏఐసీసీ సదస్సులో క్విట్ ఇండియా తీర్మానాన్ని ప్రతిపాదించింది ఆయనే. అహింస వంటి నైతిక శక్తికి మహాత్ముడు ప్రాతినిధ్యం వహిస్తే, పండిట్ నెహ్రూ జాతీయోద్యమానికి ఆధునికతనూ, అంతర్జాతీయ దృక్పథాన్నీ అద్దారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రజానీకాన్ని సంఘటితపరచి ముందుకు ఉరికించడంలో ప్రధానపాత్ర పోషించారు. ఇక సుభాస్‌చంద్రబోస్ ఈ ఉద్యమానికి సమరశీలతను తీసుకొచ్చి ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్‌ఏ) ద్వారా వేలాదిమందిలో స్ఫూర్తి నింపారు. యువతరం సాహసానికీ, వారి త్యాగానికీ భగత్‌సింగ్ శాశ్వత చిహ్నమయ్యారు. సరోజినీనాయుడు, మౌలానా అబుల్ కలాం ఆజాద్, రాజేంద్రప్రసాద్, ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్, అరుణ అసఫాలీ, రాజగోపాలాచారి వంటి ఉద్దండులెందరో ఈ ఉద్యమానికి వన్నె తెచ్చారు. స్వాతంత్య్ర సాధన ఒక లక్ష్యమైతే, అసంఖ్యాక నిరుపేదలతో, అనేక భాషలు, భిన్న సంస్కృతులు ఉన్న దేశాన్ని ఏకం చేయటం, సహనశీల సమాజంగా తీర్చిదిద్దటం మరో సవాలు. సరిగ్గా ఈ దశలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాత్ర అత్యంత కీలకం. రాజ్యాంగ ముసాయిదా రూపొందించి రాజ్యాంగ నిర్ణాయక సభ ముందుంచి, అందరినీ ఒప్పించి మెప్పించి ఆమోదముద్ర వేయించటం అసాధారణమైనది. గణతంత్ర రూపకల్పనలో సామాజిక అసమానతల్ని రూపుమాపటం, వ్యక్తిస్వేచ్ఛను నెలకొల్పటం, రాజ్యాంగ రక్షణలు కల్పించటం తదితరాలపై డాక్టర్ అంబేడ్కర్ అందరిలో లోతైన అవగాహన కల్పించారు.
స్వాతంత్ర్య సాధనకు రెండు మూడు దశాబ్దాల ముందటి దశకు మాత్రమే కాంగ్రెస్‌ను పరిమితం చేయడం సరికాదు. నవ భారత నిర్మాణంలో కాంగ్రెస్ పాత్ర తిరుగులేనిది. దేశ తొలి ప్రధానిగా పండిట్ నెహ్రూ నాయకత్వాన మన దేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఎంచుకుని, ప్రపంచ రాజకీయ భాగస్వామ్యంలో, సంస్థాగత నిర్మాణంలో ఎనలేని పాత్ర పోషించింది. కొత్తగా స్వాతంత్య్రాన్ని సముపార్జించిన ఎన్నో దేశాలు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడంలో ఒడుదుడుకులు పడుతున్నవేళ నెహ్రూ నాయకత్వాన మన దేశం ఆ దిశలో అజేయంగా దూసుకెళ్లింది.
మహాత్ముడు ప్రవచించిన అహింసావాదం ఈ దేశపు మట్టిలో ఎప్పటికీ నిక్షిప్తమై ఉంటుందన్న దానికి ఉదాహరణ నేటి ‘జెన్ జీ’ ఉద్యమం. నేటి యువతరం శాంతియుత ధర్నాలతో, నిరసనోద్యమాలతో తమ పంథాను రూపొందించుకొని, అహింసా పద్ధతులతో ‘మా గోడు వినండి... మా సమస్యలేమిటో గ్రహించండి... మాకు న్యాయం చేయండి’ అని కోరడంలో జాతీయోద్యమ పరంపరను మనం గుర్తించాలి.
జాతీయ పతాకావిష్కరణ ఘట్టంలో మనం గుర్తుంచుకోవాల్సింది స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుల్ని మాత్రమే కాదు, ప్రతిఘటనలో వారు ఆచరించిన విలువలను కూడా. ప్రజాస్వామ్యం లేని స్వేచ్ఛ అసంపూర్ణం. విమర్శకు చోటీయని ప్రజాస్వామ్యం ఉత్త డొల్ల. రాజ్యాంగమంటే గౌరవం లేని
దేశభక్తి ప్రమాదకరమైనది. ప్రతి ఏటా ఆగస్టు 15న త్రివర్ణపతాక సమున్నతంగా ఎగురుతున్నప్పుడు కేవలం దానికి వందనం సమర్పిస్తే సరిపోదు. ఆ జెండా రెపరెపల్లో వన్నెలీనే భారతీయ భావధారకు ప్రణమిల్లాలి. జై హింద్.
- దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి