Share News

విద్వేష విషం..!

ABN , Publish Date - Oct 17 , 2026 | 12:57 AM

అదృష్టవశాత్తూ ఆ ఘోరం తప్పిపోయింది కానీ, ఆ తుపాకీ పనిచేసివుంటే? అన్న ప్రశ్న భారతీయుల మనసులు దొలిచేస్తోంది. అమెరికాలోని ఇల్లినోయీ శివారు ప్రాంతంలో హిందూ ఆలయంలో ఒక శ్వేతజాతీయుడు నరమేధానికి పయత్నించాడన్న వార్త భయం కలిగిస్తోంది.

విద్వేష విషం..!

అదృష్టవశాత్తూ ఆ ఘోరం తప్పిపోయింది కానీ, ఆ తుపాకీ పనిచేసివుంటే? అన్న ప్రశ్న భారతీయుల మనసులు దొలిచేస్తోంది. అమెరికాలోని ఇల్లినోయీ శివారు ప్రాంతంలో హిందూ ఆలయంలో ఒక శ్వేతజాతీయుడు నరమేధానికి పయత్నించాడన్న వార్త భయం కలిగిస్తోంది. జాతివివక్షతో, హిందువులపై వ్యతిరేకతతో రగిలిపోతున్న అలెగ్జాండ్రోస్‌ పపోరాకిస్‌ అనే ఆ 19ఏళ్ళ యువకుడు పూర్తి సరంజామాతో భక్తులతో కిక్కిరిసిన ఆలయంలోకి ప్రవేశించి, విచ్చలవిడి కాల్పులకు యత్నించాడు. అయితే, చేతిలో ఉన్న రైఫిల్‌ అతడికి సహకరించకపోవడంతో అక్కడనుంచి జారుకొని, ఇంటికి తిరిగివచ్చి జామ్‌ అయిన రైఫిల్‌ను ఎలా సరిచేయాలన్నది ఇంటర్నెట్‌లో శోధించాడు. తాను చేసిన ఈ భయానకమైన ప్రయత్నాన్నంతా మిత్రుడితో పంచుకోవడంతో, అతడు దానిని పోలీసులకు తెలియపరచడంతో ఈ కుట్ర అంతా బయటపడింది. సదరు మిత్రుడు తనకు తెలిసిన రహస్యాన్ని పోలీసులతో గనుక పంచుకోకపోయివుంటే, విద్వేషంతో రగిలిపోతున్న ఈ ఉన్మాది మళ్ళీ ఆ ప్రయత్నానికి ఒడిగట్టేవాడేమో. ఏ విధమైన రక్షణలు, భద్రతా ఏర్పాట్లు లేని చోట విచక్షణారహితంగా కాల్పులు జరిగితే ఆ ఉన్మాదిని నిలువరించడం కూడా సాధ్యమయ్యేది కాదు.

దేవాలయంపై దాడికుట్రను అమెరికా ప్రజాప్రతినిధులు, నేతలు, పౌరసమాజ సభ్యులు పలువురు తీవ్రంగా ఖండించారు, దేశంలో పెరిగిపోతున్న విద్వేషాన్ని సమష్టిగా ఎదుర్కోవాలన్నారు. అమెరికాలో వివక్షకు తావులేదని, జాతి, మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దేశంలో స్వేచ్ఛగా జీవించగల వాతావరణం ఏర్పడాలని మరికొందరు హితవు చెప్పారు. ఈ ఘటన జరిగిన సమయంలో తాను కుటుంబసభ్యులతో కలిసి అక్కడే పూజలో ఉన్నానని, అమెరికాలో భారతీయులపై ద్వేషం, శ్వేతజాత్యహంకారం ఎంతగా పెరిగిపోయాయో ఈ ఉదంతం తెలియచెబుతోందని అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి వాపోయారు. ఈ కుట్రలో హిందూవ్యతిరేకత, భారతీయ సంతతికి చెందినవారిపట్ల హింసాత్మకమైన భావనలు ఉండటం కలవరపెడుతోందని భారత్‌ విదేశాంగశాఖ ప్రతినిధి కూడా ఆందోళన వెలిబుచ్చారు.


శ్వేతజాతీయుడైన ఈ చిరుద్యోగి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఇంతటి ఘాతుకానికి ఎలా తెగించాడు, భారతీయులపట్ల అతడికి ఎందుకంత విద్వేషం? అన్న ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఉండవు. జాత్యహంకారం అమెరికాలో ఎప్పటినుంచో ఉన్నదే కానీ, అది విద్వేషంగా పరిణమించడంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కృషి కాదనలేనిది. తొలివిడత పాలనలో నాటిన బీజాలు మలివిడత అధ్యక్షుడు కావడానికి ఉపకరించి, క్రమంగా ఫలాలనిస్తున్నాయి. అమెరికా సమాజంలో ఇస్లామాఫోబియా, ఆసియన్లపై ద్వేషం ఎంతగా హెచ్చిందో చాలా నివేదికలు ఘోషిస్తూనే ఉన్నాయి. ఇతరదేశాలకు, జాతులకు చెందినవారిమీద డిజిటల్‌ వేదికల్లో విషం కక్కేవారిసంఖ్య ఏడాదికాలంలో మూడురెట్లు పెరిగింది. ఆన్‌లైన్‌ విద్వేషంతోపాటు, భారతీయులు నడిరోడ్డుమీద అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొంటున్న సంఘటనలు కూడా చూస్తున్నాం. ‘అమెరికా ఫస్ట్‌’ పేరిట ఇతరదేశాలవారిని చొరబాటుదారులుగా, దోపిడీదారులుగా అభివర్ణిస్తూ ట్రంప్‌ తనకు అనుకూలమైన రాజకీయవాతావరణాన్ని సృష్టించుకుంటున్నారు. ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌’ ముసుగులో ఆయన మితవాదులను తీవ్రవాదులుగా మార్చుతున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో, కక్షపూరిత వలస విధానాలతో తాను కోరుకుంటున్న సమాజాన్ని తయారుచేస్తున్నారనడానికి ఈ సంఘటన ఓ నిదర్శనం. భారతీయ కంపెనీల ఉద్యోగాలు, ఉద్యోగులు, వీసాలు ఇత్యాది విషయాల్లో ట్రంప్‌కు ఏమాత్రం తీసిపోనిరీతిలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ అత్యంత అవమానకరంగా మాట్లాడుతున్నారు. అంతిమంగా, జాత్యహంకార విద్వేషాన్ని దేశభక్తిగా భావించే ఉన్మాదులు తయారవుతున్నారు. వివక్షకూ, విద్వేషానికి గురవుతామన్న భయంతో భారతీయ అమెరికన్లలో మూడోవంతుమంది రాజకీయాల గురించి మాట్లాడటమే మానేశారట. భౌతికదాడులకు తోడుగా, ఏకంగా సామూహిక హత్యాకాండలకు కూడా భారతీయులు లక్ష్యాలుగా తయారుకావడం అత్యంత బాధాకరం. ప్రవాస భారతీయులకు ఈ సంఘటన ఒక హెచ్చరిక. అమెరికన్‌ సమాజంతో మమేకమవుతూ, తోటి అమెరికన్లతో కలసికట్టుగా వ్యవహరిస్తూ, వారితో సత్సంబంధాలు నెలకొల్పుకోవడం ఈ విషానికి విరుగుడు.

Updated Date - Oct 17 , 2026 | 12:59 AM