Share News

Indore Water Contamination Tragedy: హైదరాబాద్‌కు ఇండోర్‌ హెచ్చరిక!

ABN , Publish Date - Jan 10 , 2026 | 03:54 AM

భారతదేశ పటంలో ‘పరిశుభ్రత’ అనే పదానికి పర్యాయపదంగా మారిన నగరం ఇండోర్. వరుసగా ఏడుసార్లు ‘దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరం’గా ఎంపికై, అంతర్జాతీయ ఖ్యాతి...

Indore Water Contamination Tragedy: హైదరాబాద్‌కు ఇండోర్‌ హెచ్చరిక!

భారతదేశ పటంలో ‘పరిశుభ్రత’ అనే పదానికి పర్యాయపదంగా మారిన నగరం ఇండోర్. వరుసగా ఏడుసార్లు ‘దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరం’గా ఎంపికై, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఆ నగరంలో కలుషిత నీరు తాగి పలువురు ప్రాణాలు కోల్పోవడం, వందలాది మంది ఆసుపత్రుల పాలు కావడం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. స్వచ్ఛతలో శిఖరాగ్రాన ఉన్న నగరానికే ఈ పరిస్థితి దాపురిస్తే, హైదరాబాద్ వంటి నగరాల పరిస్థితి ఏమిటి?

ఇండోర్ ప్రపంచ స్థాయి నగరంగా ఎదగడానికి పునాది వేసిన దార్శనికుడు మన తెలంగాణ బిడ్డ, నాటి ఇండోర్ కలెక్టర్‌ పరికిపండ్ల నరహరి. ఇండోర్‌లో ‘డస్ట్‌బిన్ ఫ్రీ సిటీ’ విధానాన్ని తెచ్చి, చెత్తను ఇంటి నుంచే సేకరించే పద్ధతిని విప్లవాత్మకంగా అమలు చేశారు. ఒక తెలుగు అధికారి వేసిన ఆ పటిష్ఠమైన పునాది వల్లే ఇండోర్ ‘స్వచ్ఛత సౌధం’ నిర్మితమైంది. కానీ దురదృష్టవశాత్తు, ఆ పునాదులపై భవంతిని నిర్మించాల్సిన తర్వాతి పాలకులు, నిర్వహణలో అలసత్వం వహించారు. పైకి కనిపించే అందం (రోడ్ల పరిశుభ్రత) మీద పెట్టిన దృష్టి, భూగర్భంలో దాగి ఉన్న ప్రమాదం (నీటి పైపుల నిర్వహణ) మీద పెట్టకపోవడమే నేటి విషాదానికి కారణమైంది.

పాత నగరాల్లో తాగునీటి పైపులైన్లు, డ్రైనేజీ లైన్లు పక్కపక్కనే వెళ్తుంటాయి. దశాబ్దాల క్రితం వేసిన ఈ పైపులు తుప్పు పట్టి, చిన్న రంధ్రాలు పడతాయి. మన దేశంలో 24 గంటల నీటి సరఫరా లేకపోవడం వల్ల, నీళ్లు ఆగిపోయినప్పుడు ఖాళీ పైపుల్లో ‘నెగెటివ్ ప్రెజర్’ (వాక్యూమ్) ఏర్పడుతుంది. ఆ సమయంలో పక్కనే ఉన్న డ్రైనేజీ లైన్ లీక్ అవుతుంటే, ఆ మురుగు నీటిని మంచినీటి పైపు బలంగా లోపలికి పీల్చుకుంటుంది. ఇండోర్‌లో జరిగింది ఇదే.

హైదరాబాద్ పరిస్థితి ఇండోర్ కంటే భిన్నంగా ఏమీ లేదు. మన పాతబస్తీతో పాటు, సికింద్రాబాద్, అబిడ్స్, కోఠి వంటి ప్రాంతాల్లో ఇప్పటికీ నిజాం కాలం నాటి డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థలే ఉన్నాయి. అవి కాలం చెల్లినవి. మరోవైపు నగరంలో చాలా చోట్ల పాత సిమెంట్ (ఆస్బెస్టాస్) పైపులే వాడుతున్నారు. వీటికి తోడు, నగరంలో చాలామంది నీళ్లు రావడం లేదని నేరుగా మునిసిపల్ పైపులైన్‌కే మోటార్లు బిగిస్తున్నారు. దీనివల్ల పైపుల్లో కృత్రిమంగా పీడనం తగ్గిపోయి, చుట్టుపక్కల ఉన్న మురుగు నీరు లోపలికి వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుంది.


తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వం ‘మూసీ ప్రక్షాళన’ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇది మంచి పరిణామమే. నదిని శుభ్రం చేయడంతో పాటు నగర ప్రజల గొంతు దిగే గుక్కెడు నీళ్లు కూడా శుభ్రంగా ఉండేలా చూడటం కూడా అంతే ముఖ్యం. ‘స్వచ్ఛత’ అంటే కంటికి కనిపించే అందం మాత్రమే కాదు, కడుపులో చేరే ఆరోగ్యం కూడా. ఇప్పటికైనా పాలకులు రోడ్ల మీద తనిఖీలు తగ్గించి, భూగర్భంలో ఉన్న పైపులైన్ల పరిస్థితిపై ‘రోబోటిక్ ఆడిట్’ నిర్వహించాలి. పాత పైపులను యుద్ధ ప్రాతిపదికన మార్చాలి. అవార్డులు కేవలం అలంకారాలే కానీ, అవి ప్రాణాలకు రక్షణ కవచాలు కావు. లేదంటే, ఇండోర్ అనుభవం రేపు మన ఇంటి తలుపు తట్టవచ్చు.

– పురుషోత్తం నారగౌని

Updated Date - Jan 10 , 2026 | 03:54 AM