Share News

ఓర్బాన్‌ ఓటమి

ABN , Publish Date - Apr 14 , 2026 | 12:21 AM

హంగేరీ ప్రధాని విక్టర్‌ ఓర్బాన్‌ను పదహారేళ్ళ సుదీర్ఘ పాలన తరువాత ఆ దేశ ప్రజలు ఆదివారం గద్దె దించేశారు. ఓర్బాన్‌తో విభేదించి ఇటీవలే సొంత పార్టీ ‘టీస్జా’ పెట్టుకున్న పీటర్‌ మాగ్యార్‌ ఏకంగా మూడింట రెండువంతుల మెజారిటీతో అధికారం చేజిక్కించుకున్నారు.

ఓర్బాన్‌ ఓటమి

హంగేరీ ప్రధాని విక్టర్‌ ఓర్బాన్‌ను పదహారేళ్ళ సుదీర్ఘ పాలన తరువాత ఆ దేశ ప్రజలు ఆదివారం గద్దె దించేశారు. ఓర్బాన్‌తో విభేదించి ఇటీవలే సొంత పార్టీ ‘టీస్జా’ పెట్టుకున్న పీటర్‌ మాగ్యార్‌ ఏకంగా మూడింట రెండువంతుల మెజారిటీతో అధికారం చేజిక్కించుకున్నారు. అంతటి విజయాన్ని పీటర్‌ కానీ, ఇంతటి పరాభవాన్ని ఓర్బాన్‌ కానీ ఊహించలేదు. ఓర్బాన్‌ ఓటమిని ట్రంప్‌ పరాజయంగా చూస్తున్నారు కొందరు. యూరప్‌లో ట్రంప్‌కు అత్యంత విశ్వాసపాత్రుడైన ఈ మాజీ ప్రధాని తన దేశం యూరోపియన్‌ యూనియన్‌లో కాక, అమెరికాలో భాగం అన్న స్థాయిలో ట్రంప్‌ ఆదేశాల మేరకు నడుచుకుంటారని అంటారు. ట్రంప్‌ తన అధ్యక్ష ఎన్నికల ప్రచారం ప్రారంభించగానే, ఆయనకు బహిరంగంగా మద్దతు ప్రకటించిన తొలి ఈయూ దేశాధినేత ఇతడే. మాటలు, విధానాలే కాదు, సిద్ధాంతాలు కూడా వీరిద్దరివీ ఒకటే. ఓర్బాన్‌ విజయం కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ సరిగ్గా ఎన్నికల ముందు వచ్చి సహకరించినా, ఓర్బాన్‌ను గెలిపి‍స్తే హంగేరీకి భారీ ఆర్థికసాయం చేస్తానని ట్రంప్‌ హామీ ఇచ్చినా ఫలం దక్కకపోవడం విశేషం.


ఓర్బాన్‌ పార్టీ ‘ఫిడెస్జ్‌’లో సుదీర్ఘకాలం కొనసాగి, వివిధ ఉన్నత పదవులు నిర్వహించిన పీటర్‌ మాగ్యార్‌ రెండేళ్ళక్రితం లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్న ఒకరికి తమ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించడంతో ఆగ్రహించి వేరుపడ్డారు. హంగేరీ రాజకీయాలను సమూలంగా ప్రక్షాళించడానికి తాను ఉద్యమిస్తున్నానని చెప్పుకున్నాడు. ఓర్బాన్‌‌ విధానాల వల్ల ఈయూలోనే కాదు, మొత్తం ప్రపంచంలోనే హంగేరీ ఒంటరి అయిపోయిందని, సహాయసహకారాలు నిలిచిపోయాయని ఈ యువనాయకుడు ప్రజలను నమ్మించగలిగాడు. ఓర్బాన్‌‌ ఒంటెత్తుపోకడలు, నియంతృత్వ విధానాలు కూడా ఆయన మీద జనంలో వ్యతిరేకతను పెంచాయి. ఆర్థికరంగం సవ్యంగా లేకపోవడంతో పాటు, సివిల్‌ సర్వీసుల ప్రక్షాళన వంటి కొన్ని నిర్ణయాలు కూడా ఓర్బాన్‌‌ మీద విముఖత పెంచాయని అంటారు. తన పార్టీ విజయానికి వీలుగా ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టినా, చట్టాలను మార్చి ఎన్నికల నిబంధనలను తనకు అనుకూలంగా రాసుకున్నా, కీలకమైన స్థానాల్లో తనవారిని నియమించుకున్నా, మీడియాను నియంత్రించినా ఓర్బాన్‌‌ గెలవలేకపోయాడు. ట్రంప్‌, పుతిన్‌ మాత్రమే కాదు, ఫ్రాన్స్‌ లీపెన్‌, ఇటలీ మెలోనీ ఇత్యాదులు ఓర్బాన్‌‌ను ఆకాశానికి ఎత్తేసినా ఫలితం లేకపోయింది.


వి–డెమ్‌ సర్వేలో ఎన్నికల నిరంకుశత్వంలో భారత్‌ కంటే ముందుస్థానంలో హంగేరీ ఉంది. కొత్త నాయకుడు ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి కూడా చాలా హామీలు ఇచ్చాడు. అవినీతి అంతం, న్యాయవ్యవస్థకు, ఇతర సంస్థలకు పూర్తి స్వతంత్రతను ఇవ్వడం వంటివి ఆ హామీల్లో కొన్ని. కోటిలోపు జనాభా ఉన్న హంగేరీలో సుమారు 80శాతం పోలింగ్‌ జరగడం కమ్యూనిస్టు పాలన అంతమైన తరువాత ఇదే తొలిసారి.

ఓర్బాన్‌‌ ఓటమికి అందరికంటే ఉక్రెయిన్‌ అధినేత జెలెన్‌స్కీ ఎక్కువగా సంతోషించి వుంటారు. ఉక్రెయిన్‌కు అందాల్సిన 105 బిలియన్‌ డాలర్ల రుణానికి ఓర్బాన్‌‌ మోకాలడ్డుతున్నందువల్ల, ఇప్పుడు మాగ్యార్‌ రాకతో ఆ నిధుల విడుదలకు మార్గం సుగమం అవుతుంది. ప్రజాస్వామ్య విలువల ఉల్లంఘన ఆరోపణతో హంగేరీకి ఈయూ నిలిపివేసిన నిధులు కూడా విడుదలవుతాయి. అమెరికా అధ్యక్షుడికే కాదు, ఆయన మిత్రుడైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు కూడా ఓర్బాన్‌‌ సన్నిహితుడే కనుక, సహజంగానే ఉక్రెయిన్‌ వ్యతిరేక వైఖరితోనే వ్యవహరించాడు. ఇప్పుడు పీటర్‌ ప్రధాని కావడం అంటే, యుద్ధంలోకి హంగేరీ కూడా పూర్తిగా ప్రవేశించడం, ఉక్రెయిన్‌ కోసం హంగేరియన్ల సొమ్మును ఖర్చుచేయడం. పీటర్‌ విజయం తరువాత, ఇప్పటివరకూ ఉక్రెయిన్‌ పక్షాన కీలకమైన నిర్ణయాలు తీసుకోలేని ఈయూకు అసమ్మతిబాధలు, అడ్డంకులు ఉండవు. హంగేరీ ఇకపై రష్యాకు దూరం జరిగి, ఉక్రెయిన్‌, ఈయూలకు మరింత సన్నిహితమవుతుంది. అతిమితవాద రాజకీయాలకు, నిరంకుశ పాలనలకు ఓర్బాన్‌‌ ఓటమి ఒక గుణపాఠం. వలసలు, శరణార్థులు, హక్కులు ఇత్యాది చాలా అంశాల్లో ఒక ఉన్మాదపూరిత వైఖరిని సమాజం మీద రుద్ది, దానిని చీలికలు పేలికలు చేయడానికి ప్రయత్నించినవారికి ఈ ఫలితాలు ఓ హెచ్చరిక.

Updated Date - Apr 14 , 2026 | 12:23 AM