ఇరాన్‌కు అంతటి శక్తి ఎక్కడిది?
ABN , Publish Date - May 05 , 2026 | 01:46 AM
ఇరాన్ అమెరికాల మధ్య జరుగుతున్న యుద్ధం తాలూకు ఆర్థిక ప్రభావం ప్రపంచం మీద పెరుగుతోంది. ఈ రెండు దేశాల మధ్య ఒక శాంతి సయోధ్య ఎప్పుడు కుదురుతుందా అని ప్రపంచ దేశాలన్నీ వేయి కళ్ళతో...
ఇరాన్ అమెరికాల మధ్య జరుగుతున్న యుద్ధం తాలూకు ఆర్థిక ప్రభావం ప్రపంచం మీద పెరుగుతోంది. ఈ రెండు దేశాల మధ్య ఒక శాంతి సయోధ్య ఎప్పుడు కుదురుతుందా అని ప్రపంచ దేశాలన్నీ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధాన్ని గెలిచేశానని ప్రకటించుకుంటూ, హోర్ముజ్ జలసంధికి వెయ్యి కిలోమీటర్ల దూరంలో నిల్చుని డాంబికాలు పలుకుతున్నాడు. కానీ వాస్తవం వేరేలా ఉంది. అత్యంత ధనిక దేశమూ, సైనికంగా శక్తిమంతమైన దేశమై ఉండి కూడా అమెరికా గగనతలం నుంచి ఇరాన్‌పై బాంబులు, టాంహాక్ క్షిపణులు వేయడం తప్ప ఇరాన్ నేల మీద కాలు పెట్టే సాహసం చేయడం లేదు. ఈ హోర్ముజ్ దిగ్బంధం ఇంకా ఇలా ఎన్నాళ్ళు కొనసాగుతుందో ఎవరికీ అంచనాకు చిక్కటం లేదు. అమెరికా నుంచి ఇండియా వరకు చమురు గ్యాస్ ధరల మంటలు ప్రజల్ని తాకుతున్నాయి. ఎవరు ముందు తలొగ్గుతారు, నష్టాన్ని సుదీర్ఘ కాలం భరించే శక్తి ఎవరికుందీ అన్న బలాబలాల పరీక్షగా ఇది కొనసాగుతున్నది. అందరూ ఇరాన్ తలొగ్గుతుందని ఎదురుచూస్తున్నారు. కానీ వాస్తవానికి ఒకప్పటికీ ఇప్పటికీ భౌగోళిక రాజకీయాలు చాలా మారిపోయాయి. ఇరాన్ నేడు ఒక శక్తిమంతమైన దేశంగా పునరుత్థానం పొందింది.
1971 నాటికి మధ్య ఆసియాలో చమురు ఉన్న దేశాలు, తక్కిన దేశాలు అన్నీ అమెరికా సమర్థక దేశాలుగా మారిపోయి ఉన్నాయి. కానీ ఇరాన్ మాత్రం లొంగలేదు. ఇరాన్‌లో అమెరికా తెచ్చిపెట్టిన పాలకుడు రెజా పహ్లావి షా పట్ల క్రమంగా వ్యతిరేకత మొదలైంది. పాశ్చాత్య సంస్కృతి పట్ల, ముఖ్యంగా స్త్రీలు పాశ్చాత్య దుస్తులు వేసుకోవడం పట్ల కింది వర్గం పురుషుల నుంచి ఒక పితృస్వామ్య భావజాలంతో కూడిన ప్రతిఘటన మొదలైంది. ఇస్లామిక్ విలువలు ధ్వంసం అవుతున్నాయని సనాతనవాదుల నుంచి వ్యతిరేకత మొదలైంది. వియత్నాంలో అమెరికా యుద్ధం, అల్జీరియాలో ఫ్రాన్స్ ఘాతుకం, పాలస్తీనాపై ఇజ్రాయెల్ దురాక్రమణ వంటి పరిణామాల తర్వాత అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఇరాన్‌లో ప్రజాభిప్రాయం గట్టిగా నాటుకుంది. ఖొమైనీ, అతని సమర్థకులు ఇరాన్‌ను ఒక ఇస్లామిక్ గణతంత్ర రాజ్యంగా ప్రకటించారు. ‘ఇస్లామిక్ విప్లవ రక్షణ సమితి’ అనే ఒక సాయుధ మిలిటరీ అనుబంధ సంస్థను స్థాపించారు. 1979లో దేశంలో అన్ని వ్యవస్థలనూ స్వాధీనం చేసుకుని ఒక ఇస్లామిక్ రాజ్యానికి స్థాపన చేశారు. ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి వామపక్షవాదుల్ని, రెజా పహ్లావీ షా సమర్థకులందరినీ జైల్లో వేశారు. ఇస్లామిక్ కౌన్సిల్ నిర్ణయించిన పరిధిలో ప్రజాస్వామ్యం అమలు అయ్యే వ్యవస్థను తయారు చేశారు. పేద వర్గాల కనీస అవసరాలను ఫ్రీ రేషన్ ద్వారా తీరుస్తూ ప్రజాదరణ పొందారు. అమెరికాను ప్రపంచ శత్రువుగా ప్రకటించి, ‘అమెరికా చావు రావాలి’ అని నినాదాలు ఇచ్చి, ప్రచార మాధ్యమాల్లో రోజూ అమెరికాని అవమానించే ప్రకటనలు చేసేవారు.
1979 విప్లవం జరిగిన కొన్ని నెలలకు ఒక రోజు వందమంది విద్యార్థులు అమెరికా రాయబార కార్యాలయంలోకి వెళ్లి, 64 మంది దౌత్య సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారు. వారిని విడిపించడానికి ‘ఆపరేషన్ ఈగిల్ క్లా’ పేరుతో అమెరికా కమెండోలను పంపిస్తే వారి హెలికాఫ్టర్లు ఇరాన్ ఎడారిలో కూలిపోయాయి. చివరికి అమెరికా ఏడాదిపాటు బతిమిలాడి, ఇరాన్‌కి చెందిన 8 బిలియన్ డాలర్లను ఇచ్చిన తర్వాతే బందీలకు విముక్తి లభించింది. ఇది ఇరాన్‌కు అతి పెద్ద విజయం. అమెరికా ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్‌కు అతిపెద్ద అవమానం. అప్పటి నుంచి ఇరాన్‌లో ప్రభుత్వాన్ని మార్చడం దీర్ఘకాలిక లక్ష్యంగా అమెరికా ఎదురు చూస్తూనే ఉంది.
1981లో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ని ఉసిగొలిపి ఇరాన్‌పై ఒక విఫల యుద్ధం చేయించింది. ఎనిమిదేళ్ళ ఆ యుద్ధంలో ఇరాన్ అజేయంగా నిలవడమే గాక తమ దేశాన్ని ఎలా నిర్మాణం చేయాలో, ఎలా రక్షించుకోవాలో నేర్చుకుంది. ఒక దీర్ఘకాలిక రక్షణ వ్యూహాన్ని కూడా అమలు చేయటం ప్రారంభించింది. పాలస్తీనా అంశాన్ని అన్ని గల్ఫ్ దేశాలూ వదిలేసి, అబ్రహం తీర్మానం అని ఇజ్రాయెల్‌తో వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న సందర్భంలో, ఇరాన్ మాత్రం అన్ని నష్టాలనూ భరిస్తూ, పాలస్తీనా ప్రజలకు తన ధర్మంగా మద్దతు ఇచ్చింది. 1984లో లెబనాన్‌లో హిజ్బుల్లా సంస్థను నిర్మించి, లెబనాన్‌ను ఇజ్రాయెల్ ఆక్రమణ నుంచి విముక్తి చేసి కాపాడే శక్తిగా దాన్ని రూపొందించింది. 1991లో సోవియెట్ యూనియన్ పడిపోయిన దశలో సిరియాకు మద్దతు ప్రకటించి ఇజ్రాయెలీ దాడుల నుంచి రక్షించే బాధ్యతను తీసుకుంది. తమపై టెర్రరిస్టు దేశం అనే ముద్రపడినా భయపడకుండా తన నైతిక కోణాన్ని ఇరాన్ స్పష్టంగా అన్ని విధానాల్లో అమలు చేసింది.
అమెరికా వ్యతిరేక రాజకీయాల వల్ల ఇరాన్ చాలా నష్టపోయిన మాట వాస్తవం. అమెరికన్ ఆంక్షల వల్ల తన చమురును చవకగా అమ్ముకుని ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అయినప్పటికీ, ఇరాన్ తన అంతర్గత అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. ఆత్మ నిర్భరతను నిర్మించుకోవడానికి యూనివర్సిటీల్లో సైన్స్ టెక్నాలజీ విద్యలకు ప్రాధాన్యమిచ్చింది. అణు విద్యుత్, వ్యవసాయ సాంకేతికత, పెట్రో కెమికల్స్, కెమికల్స్ వంటి రంగాల్లో భారీగా అభివృద్ధి సాధించింది. విచిత్రంగా, ఒకపక్క హిజాబ్ వేసుకోవాలని బలవంతపెడుతూనే, స్త్రీలను ఆరోగ్య, విద్య, సాంకేతిక రంగాల్లో విపరీతంగా ప్రోత్సహించింది. ముస్లిం దేశాల్లో అత్యధికమైన మహిళా కార్మికులు గలిగిన ప్రత్యేకమైన దేశంగా ఎదిగింది.
రెజా పహ్లావి షా మొదలుపెట్టిన అణు ఇంధన కార్యక్రమాన్ని ఇరాన్ పునరుద్ధరించింది. దీనితో ఆ దేశం అణుబాంబు తయారు చేస్తోందని ఇజ్రాయెల్ పుకార్లు పుట్టించింది, ఇరాన్‌పై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది. ఎమర్జెన్సీ మందులు కూడా దిగుమతి చేసుకోనీకుండా అమెరికా నిషేధం విధించింది. ఇరాన్ నుంచి గ్యాస్ దిగుమతికి పైపులైన్ నిర్మాణం చేద్దామన్న భారత్‌ను బెదిరించి ఆపింది. కానీ ఇంత అష్టదిగ్బంధనంలోనూ ఇరాన్ లొంగిపోయేకన్నా పోరాడడమే సరైన మార్గమన్న కర్బలా స్ఫూర్తిని ప్రదర్శించింది. తమ దేశంపై ఏదో ఒక రోజు ఇజ్రాయెల్–అమెరికాలు దాడి చేస్తాయని ముందే ఊహించిన ఇరాన్.. ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఒక పథకం ప్రకారం సిద్ధమైంది. ఈలోపు మారిన గ్లోబల్ పరిస్థితులు కూడా ఇరాన్‌కు కలిసొచ్చాయి.
2014 తరవాత చైనా–రష్యాలకు వ్యతిరేకంగా అమెరికా చేసే రహస్య యుద్ధం ఇరాన్‌కు ఒక కొత్త జీవితాన్నే ఇచ్చింది. తన మీద దాడి చేస్తే ఎదుర్కోవడానికి కొన్ని వేల క్షిపణులను అండర్‌గ్రౌండ్ గుహల్లో రహస్యంగా నిర్మించి ప్రపంచాన్నే ముక్కున వేలు వేసుకునేలా చేసుకుంది. వీటికి రష్యా, చైనాల సహకారం ఉందన్నది జగమెరిగిన సత్యం. ఈ రోజు ఇరాన్ దగ్గర 4 వేల కిలోమీటర్లు ప్రయాణించగల హైపర్ మిస్సైల్స్ ఉన్నాయి. టెలవీవ్, హైఫాలను తన క్షిపణులతో గట్టిగా కొట్టి చూపించింది కూడా. కొత్తగా వచ్చిన డ్రోన్ టెక్నాలజీ మీద దృష్టి సారించి ఎంతో విలువైన రాడార్లను, విమానాశ్రయాలను, నౌకలను అతి చౌకగా ధ్వంసం చేయగలిగే FPV డ్రోన్లను తయారు చేసింది. ఈ డ్రోన్ యుద్ధతంత్రం వల్లనే నేడు అమెరికా దగ్గర మిస్సైళ్ళు అయిపోయి, యుద్ధం ఆపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఇరాన్ హోర్ముజ్ సంధిని నియంత్రించే మినీ సబ్‌మెరైన్లను తనకు కావాల్సిన రీతిలో సొంత శక్తితో తయారు చేసుకోగలిగింది. హోర్ముజ్‌ను మూసివేసే శక్తి ఇరాన్‌కు ఉందన్న స్పృహ అమెరికాకు లేకపోవడం దాని అహంకారానికి పరాకాష్ఠ. మారిన బహుళ ధ్రువ ప్రపంచంలో చైనా, రష్యాలను తన ప్రత్యర్థులుగా అమెరికా ప్రకటిస్తోంది. దాంతో ఆ దేశాలు కూడా అదే రీతిన స్పందించాల్సిన అవసరం కలుగుతోంది. అందువల్లనే ఆ దేశాలు ఇరాన్‌ను తమ వ్యూహాత్మక భాగస్వామిగా చేసుకున్నాయి. అమెరికాతో పోరులో ఇరాన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దేశాలు ఓడిపోనివ్వవు. అందుకే రష్యా ఎస్–400 అనే బ్రహ్మాండమైన రక్షణ వ్యవస్థను ఇరాన్‌కు ఇచ్చింది. రాబోయే రోజుల్లో ఇంకా ఆయుధాలిస్తుంది. మరోపక్క ఎన్ని దేశాలు తిరస్కరించినా చైనా ఇరాన్ చమురును కొనే కస్టమర్ అయ్యింది.
ఈ యుద్ధంలో అమెరికా గత అరవై రోజులుగా ఇరాన్‌పై వేల దాడులు చేసింది. ఇరాన్ వైమానిక, నౌకాదళ శక్తిపైన, ఆర్థిక వసతుల మీద బాంబులు వేసింది. రెండు వేల మందికి పైగా ప్రజలను చంపింది. ఇరాన్ సుప్రీం ఇమాం అలీ ఖొమైనీని, అతని భార్యను, కూతురును, అల్లుడిని, ఇంటలిజెన్స్ చీఫ్ లరిజాను, ఇంకా 39 మందికి పైగా నాయకులను హతమార్చింది. అయినా ఆత్మస్థైర్యం కోల్పోని ఇరాన్‌ను చూస్తే అది సాధారణ దేశం కాదు అనిపిస్తుంది. వలీ నస్ర్ వంటి మేధావుల ప్రతిపాదన ప్రకారం, ఇరాన్ సోషల్ సైకాలజీ మూడు పునాదుల మీద నిర్మితమైంది. మొదటిది– ఇరాన్ సమాజం ఎప్పుడూ కర్బలాలో షియా విషాదాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతిఘటనా భావజాలాన్ని నిర్మించుకుంది. రెండు, ఇస్లామిక్ సంప్రదాయంతో పాటు ప్రజాస్వామ్యం, ఆత్మనిర్భరత, సాంకేతిక స్వతంత్రతను నమ్ముకుంది. మూడు, తన అవసరాల కోసమని తన విలువలను తాకట్టు పెట్టే రాజకీయాలు ఆ దేశం ఎన్నడూ చేయలేదు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు తాను ఓడిపోయానని చెప్పడం ఇష్టం లేదు. న్యాయంగా అమెరికా గల్ఫ్ వదిలిపెట్టి వెళ్లడమే ఈ సమస్యకు పరిష్కారం. అది ఎప్పటికైనా జరగాల్సిందే. గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్‌తో సంధి చేసుకుని శాంతియుత సహజీవనం చేయక తప్పదు. ఇక ఇజ్రాయెల్‌ను కట్టడి చేసుకునే బాధ్యత అమెరికాదే. అఖండ జియానిస్ట్ ఇజ్రాయెల్ ఇక అసాధ్యం. నెతన్యాహు తన నేరాలను తప్పించుకోవడానికి చేసే చివరి యుద్ధం ఇది అని విమర్శకులు అంటున్నారు. మారిన భౌగోళిక రాజకీయాలను భారత్ సరిగా అర్థం చేసుకుంటుందా లేక అమెరికాకు దాసోహం అంటుందా అన్నది చూడాలి.
ప్రొ. ఆర్.వి.రమణమూర్తి
ఈ వార్తలు కూడా చదవండి
బెంగాల్‌లో చారిత్రక తీర్పు.. విజయోత్సవ సంబరాల్లో మోదీ
ఇది గెలుపు కాదు లూటీ.. మేం పుంజుకుంటాం.. బెంగాల్‌లో షాకింగ్ తీర్పుపై మమతా బెనర్జీ