Share News

ఎవరికి ఎవరు?

ABN , Publish Date - Sep 18 , 2026 | 01:04 AM

తాము సొంతంగా తయారుచేసుకున్న ఒక నాటు క్షిపణితో సౌదీ అరేబియాకు చెందిన ఎఫ్‌–15 యుద్ధవిమానాన్ని కూల్చివేశామంటూ హౌతీలు చేసిన ప్రకటన ప్రపంచాన్ని నివ్వెరపరచింది.

ఎవరికి ఎవరు?

తాము సొంతంగా తయారుచేసుకున్న ఒక నాటు క్షిపణితో సౌదీ అరేబియాకు చెందిన ఎఫ్‌–15 యుద్ధవిమానాన్ని కూల్చివేశామంటూ హౌతీలు చేసిన ప్రకటన ప్రపంచాన్ని నివ్వెరపరచింది. ఒక ‘లోకల్‌ మేడ్‌’ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌తో ఈ అత్యంత శక్తిమంతమైన, అత్యాధునిక అమెరికన్‌ యుద్ధవిమానాన్ని సెంట్రల్‌ యెమెన్‌లోని మారిబ్‌ ప్రావిన్సులో తాము నేలకూల్చామన్న వార్తను మిగతా ప్రపంచం అంత సులభంగా నమ్మదని ఈ తిరుగుబాటుదారులకు తెలుసు. కనుకనే, అది గాలిలో ఎగురుతున్నప్పటినుంచి నేలకూలేంతవరకూ మొత్తం ఓ నాలుగునిముషాల వీడియోను వారు విడుదల చేశారు. అత్యాధునిక రాడార్లు, మిసైల్‌ హెచ్చరిక వ్యవస్థలు దట్టించివున్న ఈ అమెరికా తయారీ యుద్ధవిమానం హౌతీల చేతిలో కూలినట్టుగా చెబుతున్న ఆ వీడియో నిజమైనదో, నకిలీదో తేల్చడానికి రంగంలోకి దిగిన పాశ్చాత్యమీడియా సంస్థలు, సాంకేతిక సంస్థలు పలురకాలుగా దానిని పరీక్షించే పనిలో పడ్డాయి. మొదట కొద్దిసేపు థెర్మల్‌ గ్రాఫిక్స్‌ ఉన్న ఈ వీడియో చివరలో తగలబడిపోతున్న యుద్ధవిమానం, దాని చుట్టూ చేరి నినాదాలు చేస్తున్న హౌతీలు కనిపిస్తున్నారు. విమానం తోకభాగాన ఉన్న నాలుగు అంకెల సీరియల్‌ నెంబర్‌, సౌదీ జెండా తదితర గుర్తులన్నీ ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. సౌదీ వైమానిక స్థావరాల్లో ఉన్న విమానాల వివరాలతో దీనిని సరిపోల్చి, కూల్చివేత నిజం అని తేల్చుకున్న మీడియా సంస్థలు హౌతీలకు ఇంత సాంకేతికశక్తి ఎలా వచ్చింది? అంటూ విశ్లేషణలు ఆరంభించాయి. ఇరాన్‌మీద అమెరికా యుద్ధం మొదలెట్టిన తరువాత కుప్పకూలిన రెండవ ఎఫ్‌–15 ఇది. ఏప్రిల్‌లో ఇరాన్‌ జరిపిన దాడిలో ఒక విమానం కూలి, మరొకటి కనిపించకుండా పోయింది. మొదటి ఎఫ్‌15ను ఇరాన్‌ కూల్చివేసినప్పుడు ఆశ్చర్యపోయిన పాశ్చాత్యమీడియా ఇప్పుడు రెండోది హౌతీల చేతిలో ధ్వంసమైంది కనుక, ఇరాన్‌ సాంకేతికసాయం ఈ తిరుగుబాటుదారులకు ఎంత ఉధృతంగా చేరుతోందో లెక్కలు వేస్తోంది.


నలిగిన దుస్తులు, అరిగిన చెప్పులు, చేతిలో నాటుతుపాకీతో హౌతీలు ఈ వీడియోను విడుదల చేసి, తమను తక్కువగా అంచనావేయవద్దని అమెరికా, దాని మిత్రదేశమైన సౌదీ అరేబియాకు బలమైన సంకేతాన్ని పంపించారు. తాము మహాశక్తిమంతులమనీ, ఎంతటి యుద్ధానికైనా సంసిద్ధంగా ఉన్నామని దాని అర్థం. ప్రస్తుతానికి ప్రచారయుద్ధంలో వారిదే పైచేయి. ఇప్పటికే సౌదీపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తున్న హౌతీలు ఇప్పుడు యుద్ధవిమానం కూల్చివేత ప్రకటనతో పశ్చిమాసియా ఉద్రిక్తతలను మరింత పెంచేశారు. సౌదీ–హౌతీ ఘర్షణ మక్కా మదీనా వరకూ చేరడం కూడా ఆందోళన కలిగించే పరిణామం. మక్కాకు దక్షిణంగా ఒక హౌతీ డ్రోన్‌ను కూల్చివేశామని సౌదీ ప్రకటించడం, తాము మక్కాజోలికి పోనేలేదని హౌతీలు చెబుతున్నా, ఇస్లామిక్‌ దేశాల సమాఖ్య సహా చాలా దేశాలు ఈ పరిణామాన్ని ఖండించడం తెలిసిందే. ‘రెడ్‌లైన్‌’ దాటవద్దని హౌతీలను హెచ్చరిస్తున్న సౌదీకి అండగా నిలవాల్సిన పాకిస్థాన్‌, తుర్కియేలు కూడా మొఖం చాటేశాయి. పవిత్ర మక్కానగరం మీదే దాడిప్రయత్నం జరిగిందని సౌదీ అంటున్నప్పుడు మక్కా ఒప్పందానికి లోబడి మూడుదేశాలూ ఏకతాటిపైకి రాలేకపోవడం విశేషం.


యెమెన్‌లోని చాలా ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకొని, ఎర్రసముద్రం తీరాన్ని గుప్పిట్లో పెట్టుకొని, మూడు కీలకమైన ద్వీపాలను వేగంగా స్వాధీనం చేసుకున్న హౌతీలమీద యుద్ధవిమానాలతో విరుచుకుపడమని అమెరికాను సౌదీ కోరితే, నేరుగా వారితో తలపడేది లేదని ట్రంప్‌ కూడా తేల్చేశారు. హౌతీలను వెనక్కునెట్టడానికి సౌదీ దాడులు ఒక్కటే సరిపోవని ట్రంప్‌కు తెలియకపోదు. దాడులతో సౌదీ చమురు ఉత్పత్తిని దెబ్బతీసి, బాబ్‌–అల్‌ మాండెబ్‌ జలసంధి స్వాధీనం సహా యూరప్‌–ఆసియా మధ్య కీలక చమురు రవాణామార్గాన్ని నియంత్రిస్తున్న హౌతీలతో కయ్యం కంటే వియ్యం ఉత్తమమని ట్రంప్‌ భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సౌదీ కోసం హౌతీలతో పోరాడేకంటే, వారినే తనదారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు ఉంది. ఒమాన్‌లో అమెరికా–హౌతీ మధ్య చర్చల్లో ఉభయపక్షాలు బాగానే ఇచ్చిపుచ్చుకుంటున్నాయట. ఇవి అంతిమంగా ప్రపంచానికి ప్రయోజనం చేకూర్చుతాయో లేదో తెలియదు కానీ, సౌదీ యువరాజు ఎంబీఎస్‌కు మాత్రం ఈ వరుస పరిణామాలన్నీ పెద్ద ఎదురుదెబ్బ.

Updated Date - Sep 18 , 2026 | 01:15 AM