Share News

జెన్‌జీ తరం కోసం... ఓ తెలుగు సంతకం!

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:50 AM

తెలుగు సాహిత్యం కేవలం పదాల సమాహారం కాదు, అది యుగచైతన్యానికి నిదర్శనం, సంస్కృతికి సజీవ సాక్ష్యం. అలాంటి అరుదైన సృజనల్లో ఒకటిగా నిలిచేలా రచయిత్రి డి.పి.అనురాధ కలం నుంచి ఉద్భవించిన..

జెన్‌జీ తరం కోసం... ఓ తెలుగు సంతకం!

తెలుగు సాహిత్యం కేవలం పదాల సమాహారం కాదు, అది యుగచైతన్యానికి నిదర్శనం, సంస్కృతికి సజీవ సాక్ష్యం. అలాంటి అరుదైన సృజనల్లో ఒకటిగా నిలిచేలా రచయిత్రి డి.పి.అనురాధ కలం నుంచి ఉద్భవించిన చరిత్రాన్వేషణే ‘చరిత్రపైన తెలుగు సంతకం’ గ్రంథం! ‘క్రీస్తు పూర్వమే మహాసామ్రాజ్యం’ అనే ధైర్యోక్తితో ఈ గ్రంథ రచనకు శ్రీకారం చుట్టడం విశేషం. ‘మూడు సముద్రాల నౌకాయానంలోనైనా మనదే ముందడుగు...’ అనే ఉత్సాహభరితమైన స్వరంతో ఆమె ఇచ్చిన పిలుపు, నేటి తరానికి ఒక జాగరణ మంత్రం. ఇది కేవలం గర్వోత్కంఠతో పలికిన వాక్యం కాదు; ఇది మన చరిత్రపై ఉన్న అచంచల విశ్వాసానికి ప్రతిబింబం.

తెలుగు అనే మాట వినగానే మనసు పులకరించే వారికి ఆమె రచనలోని ఈ ఆత్మీయ స్వరంతో మది మరింత లోతుగా అనుభూతి చెందుతుంది. చరిత్ర రచనలో భావోద్వేగం అవసరం; కానీ, అది నిరాధార అతిశయోక్తిగా కాక, సత్యానికి అవలంబించిన స్వాభిమానంగా వికసించాలి. పాఠకునిలో ఆత్మగౌరవాన్ని మేల్కొలిపి, తన జాతిపట్ల నిబద్ధతను రగిలించగలిగితేనే చరిత్ర తన అసలు ధ్యేయాన్ని సాధించినట్టవుతుంది. మన చరిత్ర మనకంతగా చెందనిదన్నట్టు, అందులో మన స్థానం అల్పమన్నట్టు భావించే ఆత్మన్యూనత మనలో ఎక్కువ. అలాంటి మనోభావాలకు ఈ పుస్తకం ఒక కనువిప్పు, ఒక మేల్కొలుపు కూడా!


‘చరిత్రపై తెలుగు సంతకం’ గ్రంథంలో ప్రతిపాదించిన చారిత్రక దృశ్యాలు మరింత విశిష్టతను సంతరించుకున్నాయి. తెలుగువారి త్రిసముద్రాధిపత్యం, వారి విస్తృత వాణిజ్య ప్రావీణ్యం, మౌర్యయుగంలో బౌద్ధధర్మ ప్రచారకులుగా వారి పాత్ర– ఈ అంశాలన్నింటినీ రచయిత్రి సమగ్రంగా, సాక్ష్యాలతో విశదీకరించారు. శాతవాహన యుగంలో తొలి రాజధానిగా ప్రసిద్ధి పొందిన కోటిలింగాల గౌరవాన్ని, శాతవాహనుల నాణేలు చెబుతున్న చరిత్రను, అశ్మక, కళింగాది జనపదాల వైభవాన్ని ఆ నాణేల ఆధారంగా విపులీకరించడం ఆమె పరిశోధనా దృష్టికి నిదర్శనం.

భౌగోళిక సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తెలుగువారి అడుగుజాడలను అనురాధ విశ్లేషించిన తీరు మరింత ఆకర్షణీయం. బర్మా నుంచి థాయిలాండ్ వరకూ, ఇండోనేషియా నుంచి శ్రీలంక వరకు, వియత్నాం నుంచి మలేషియా దాకా– తెలుగువారి చారిత్రక స్పర్శను ఆమె అన్వేషించిన తీరు, తెలుగు జాతి విస్తృతిని విశ్వవ్యాప్తంగా ప్రతిపాదిస్తుంది. అనురాధ రచనలో చరిత్ర సజీవంగా ప్రవహించే సంస్కృతి సరితగా మన ముందుకు విస్తరిస్తుంది. ప్రతి అంశం పాఠకునిలో కొత్త ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తూ, ‘మనమే ఇంత చరిత్రకు వారసులం’ అనే గర్వభావాన్ని మేల్కొలుపుతుంది. ఇదే ఈ గ్రంథం సాధించిన అత్యున్నత విజయం.

- మండలి బుద్ధప్రసాద్

శాసనసభ్యులు, అవనిగడ్డ

(సెప్టెంబర్‌ 20వ తేదీ ఉదయం 10.30 గంటలకు

హైదరాబాద్‌ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలోని

ఎన్టీఆర్‌ కళామందిరంలో

‘చరిత్రపై తెలుగు సంతకం’ పుస్తకావిష్కరణ.)

Updated Date - Sep 19 , 2026 | 12:53 AM