Share News

ఆ స్వాతంత్ర్య యోధులు బానిసలయ్యారు!

ABN , Publish Date - May 17 , 2026 | 01:22 AM

ఆధునిక ప్రపంచంలో అతిపెద్ద ఒప్పంద కార్మిక వలసలు భారతదేశం నుంచే జరిగాయి. 1870–1930 మధ్య కాలంలో విదేశాలకు వలస వెళ్లిన భారతీయుల సగటు వార్షిక సంఖ్య 2,40,000 నుండి 6,60,000 మధ్య ఉన్నది.

ఆ స్వాతంత్ర్య యోధులు బానిసలయ్యారు!

ధునిక ప్రపంచంలో అతిపెద్ద ఒప్పంద కార్మిక వలసలు భారతదేశం నుంచే జరిగాయి. 1870–1930 మధ్య కాలంలో విదేశాలకు వలస వెళ్లిన భారతీయుల సగటు వార్షిక సంఖ్య 2,40,000 నుండి 6,60,000 మధ్య ఉన్నది. కేవలం 1911–15 సంవత్సరాల మధ్య మొత్తం 24,83,000 మంది వలస వెళ్లారు. ఒప్పంద వ్యవస్థలోని ఈ భారతీయుల ఇతిహాసం మానవ అక్రమ రవాణాల చరిత్రే.

1833లో బానిసత్వం రద్దయిన తరువాత, తోట యజమానులు అయిన బ్రిటిష్‌ వ్యాపారులు భారీ ఆర్థిక నష్టాలు చవిచూశారు. ఒకవైపు భారతీయులు స్వేచ్ఛ కోసం తమ ప్రాణాలు త్యాగం చేస్తున్న ఆ సమయంలోనే, బానిసత్వ నష్టాన్ని భర్తీచేసుకోవడానికి అన్ని ‘కులాల’ భారతీయులను కార్మిక కూలీలుగా మార్చేందుకు బ్రిటిష్ వ్యాపారులు, అధికారులు కలసికట్టుగా కుట్ర పన్నారు. అప్పటి నిరాశాజనక పరిస్థితులను ఆసరాగా చేసుకొని, ఒప్పంద కార్మికుల నియామక వ్యవస్థ పేరున, వలసవాద మోసాలతో, దాదాపు 13 లక్షల మంది భారతీయులను ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు కూలీల ముద్రవేసి పంపగలిగారు.

1857లో ఈస్టిండియా కంపెనీ పాలనపై దాని సొంత (భారత) సైనికులే తిరుగుబాటు చేశారు. ఆ ఘటన భారతదేశ చరిత్రలో అత్యంత వీరోచిత గాథలలో ఒకటి. సిపాయిల తిరుగుబాటుగా, మొదటి భారత స్వాతంత్ర్య సమరంగా దానిని భావిస్తారు. ఈస్టిండియా కంపెనీ ఓటమిని జీర్ణించులోలేక, బ్రిటిష్ ప్రభుత్వం నేరుగా భారతదేశ పాలనను తన అధీనంలోకి తీసుకున్నది. విక్టోరియా రాణి భారతదేశ సామ్రాజ్ఞి అయింది. సిపాయి తిరుగుబాటులో పాల్గొన్న వందలాది సైనికులకు విధించిన శిక్షలలో ఒకటి– వారిని ఒప్పంద కార్మికులుగా విదేశాలకు పంపడం! అందులో భాగంగా 1000 మందిని వారి కుటుంబాలతో సహా బెలిజ్‌కు బహిష్కరించారు.తమకు కనీసం 70,000 మంది కావాలని ట్రినిడాడ్‌లోని తోటల యజమానులే అడిగినట్లు బ్రిటిష్ రికార్డులు చెబుతున్నాయి. దాస్య శృంఖలాల నుంచి మాతృభూమి విముక్తికి పోరాడిన వీర యోధులకు బ్రిటిష్ విధించిన శిక్షే ఒప్పంద కార్మిక బానిసత్వం. భారత స్వాతంత్ర్య సమరయోధులు వలసపాలకుల దృష్టిలో రాజద్రోహులయ్యారు. వేల మైళ్ల దూరాన ఉన్న దేశాలకు కుటుంబాలతో సహా బహిష్కృతులయ్యారు. బానిస శ్రామికుల కొరతను భర్తీ చేసేందుకు వారిని ఉపయోగించుకున్నారు.


1858–62 మధ్య కాలంలో మారిషస్, గయానా, ట్రినిడాడ్, గ్రెనడా, సెయింట్ లూసియా, జమైకాకు ఇలా పంపబడిన వారి సంఖ్య 1,57,719 అని వలసలపై నివేదిక ఒకటి పేర్కొంది. మారిషస్‌కు ‘వలస’ వెళ్ళిన 90,000 మందిలో అత్యధికులు సైనికులే అని ఆ నివేదిక గుర్తించింది. ‘...సైనిక శిక్షణకు అర్హతలు కలిగి ఉన్న ఒప్పంద కార్మికుల్లో దాదాపు 25 లేదా 30 మంది బహుశా తిరుగుబాటు దళానికి చెందినవారు కావచ్చు’ అని వెస్టీండీస్‌ మైగ్రేషన్‌ ఏజెంట్‌ తెలిపాడు. ఈ వాస్తవాన్ని ‘...వారు అతి జాగ్రత్తగా దాచిపెట్టారు’ అని అతడు పేర్కొన్నాడు. నిజానికి, స్వాతంత్య్ర సమరయోధులలో చాలామంది హింస, జైలు శిక్షల ఉచ్చు నుండి తప్పించుకోవడానికి కార్మికులుగా వలసరాజ్యాలకు మారువేషంలో కూడా వెళ్లారు. బ్రిటిష్ పాలనను వ్యతిరేకించినందుకు, గతంలో దేశద్రోహం కేసులో జైలులో పెట్టబడిన వారు కూడా చాలా మంది అందులో ఉన్నారు.

‘ఉన్నత కుల’ భారతీయ సైనికులు, తోటలలో మారువేషంలో ఉండే అవకాశం ఉందని, అందువల్ల కలకత్తాలోని ఏజెంట్‌కు ‘...బ్రాహ్మణులు, ఠాకూర్లు, ఫకీర్లు, ఇతర శ్రామికేతర కులాల వారు కాలనీకి బయలుదేరకుండా నిరోధించమని’ గయానాలోని తోటల యజమానుల నుంచి అనేక సూచనలు జారీఅయ్యాయి. తోటి భారతీయులను సమ్మెకు ప్రేరేపించారనే అనుమానంతో చాలా మంది పండితులు లేదా బ్రాహ్మణులను కూడా గయానా నుంచి బహిష్కరించారు. వారెవరూ ఆయుధాలు ధరించి ఉండేవారు కాదు. భారతీయ జనాభాను సామూహిక తిరుగుబాటుకు ప్రేరేపించే ప్రమాదం ఉందన్న గ్రహింపుతో, అలాంటి బ్రాహ్మణులను వారున్న ప్రాంతంలో హతమార్చలేదు. ఫిజీలో చాలా మంది భారతీయులను ఇతర తోటలకు తీసుకెళ్లే నెపంతో చిన్న పడవలలో రవాణా చేస్తూ పడవలు పడవలనే ముంచేశారు! బ్రిటిష్ వారు దాచిపెట్టిన సామూహిక హత్యాకాండలివి.


ఉత్తర భారతావనిలో సైనికుడు లేదా యోధుడికి సిపాయి లేదా సిపాహి అన్న పేరు ఉంది. ట్రినిడాడ్‌లోని భారతీయ సమాజం చాలా కాలంగా కాళీమాతని సిపాయిల/సిపాహీల తల్లి అని పిలుచుకుంటూనే ఉన్నారు. ముదురు నలుపు రంగులో ఆమె ప్రతిమలను తయారు చేసుకున్నారు. హిందూ మతంలో ముఖ్యంగా సైనికులకు లేదా సిపాహీలకు యుద్ధ దేవతగా ఆమె పూజ్యురాలు. ఈస్ట్ ఇండియా కంపెనీ సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాలలో సైనికులు కాళీమాతను పూజించే ఆలయం ఉండేది. 1947 వరకు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాట యోచనలు చేసే కేంద్రాలుగా కూడా అవి మనుగడలో ఉన్నాయి. వాస్తవానికి, భారతీయ విప్లవకారులు అప్పట్లో కాళీమాత ఆశీర్వాదం కోరేవారు. సుభాష్ చంద్రబోస్ సైతం రహస్యంగా కలకత్తాను విడిచిపెట్టే ముందు దక్షిణేశ్వర్ ఆలయం నుండి కాళీమాత ఆశీర్వాదం పొందారు. ఈ ఆచారం చాలా కాలం ముందే ప్రారంభమైంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 18వ శతాబ్దిలో సాదువులు, ఫకీర్లు కలసికట్టుగా దాదాపు 30 సంవత్సరాలు పోరాడారు. ‘సన్యాసి తిరుగుబాటు’గా సుప్రసిద్ధమైన ఆ పోరాటంలో ఎంతో మంది సాధువులు, ఫకీర్లు హతమయ్యారు. ఆ చరిత్రాత్మక తిరుగుబాటులోనే ‘వందేమాతరం’ ఒక యుద్ధ నినాదంగా మారింది.


1857 తిరుగుబాటు కాలంలో స్వాతంత్ర్య సమరయోధులు, వారితో పాటు పోరాడిన సామాన్య ప్రజల మీద బ్రిటిష్‌ వారు క్రూరంగా ప్రతీకారం తీర్చుకున్న గ్రామాల సంఖ్యను ఎవరూ లెక్కించలేరు. ఉదాహరణకు బిహార్‌లోని షాబాద్ గ్రామాన్ని మొత్తంగా అగ్నికీలలకు ఆహుతి చేశారు. అయితే ఇది తాను నేను కోరుకున్నంత సంతృప్తికరంగా జరగలేదని బ్రిటిష్‌ మెజిస్ట్రేట్‌ వాపోయాడు. పోరాటకారులను, వారికి తోడ్పడిన ప్రజలను శిక్షించేందుకు గ్రామాలకు గ్రామాలనే అనుమానాస్పద జాబితాలో చేర్చారు. చాలా మంది గ్రామీణులు భద్రత కోసం తమ ఇళ్లను విడిచి వెళ్ళవలసి వచ్చింది. ‘ఒప్పంద కార్మికులు’ అయిన స్వాతంత్ర్య సమరయోధులు తమ మతం, ఆచారాలు, సంప్రదాయాలను మాత్రమే కాకుండా బ్రిటిష వ్యతిరేక పోరాట జ్ఞాపకాలను కూడా తమతో తీసుకెళ్లారు. వాటి ఆధారంగా, ట్రినిడాడ్‌లో తాము నిర్మించుకున్న ఊర్లకు కూడా స్వదేశంలోని తమ తమ కన్న ఊర్ల పేర్లే పెట్టుకున్నారు. ట్రినిడాడ్‌లో ఇప్పటికీ బారక్‌పూర్, ఫైజాబాద్, కలకత్తా సెటిల్‌మెంట్, ఢిల్లీ సెటిల్‌మెంట్, హిందూస్తాన్, మతుర (మధుర), పాట్నా గ్రామాలు కనిపిస్తాయి. మీరట్ అనే వీధిపేరు కూడా తటస్థిస్తుంది.

- ముకుంద రామారావు

కవి, వలసజీవితాల చరిత్రకారుడు

Updated Date - May 17 , 2026 | 01:34 AM