మిషనరీల దృష్టిదోషం అందరికీ సోకింది!
ABN , Publish Date - Oct 25 , 2026 | 02:30 AM
‘హిందూత్వ’, ‘బ్రాహ్మిణిజం’, ‘సంస్కృత సంప్రదాయం’ అనే అంశాలు నేటి చర్చల్లో, వాదనల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. హిందూత్వవాదులతో పాటు వారిని వ్యతిరేకించే...
‘హిందూత్వ’, ‘బ్రాహ్మిణిజం’, ‘సంస్కృత సంప్రదాయం’ అనే అంశాలు నేటి చర్చల్లో, వాదనల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. హిందూత్వవాదులతో పాటు వారిని వ్యతిరేకించే సెక్యులరిస్టులు, దళితవాదులు, కమ్యూనిస్టులు అందరూ ఒకే రకమైన ఏకశిలా సదృశ సంస్కృతిని ఊహిస్తూ మాట్లాడటం విశేషం. ‘బ్రాహ్మిణిజమే హిందూయిజం, హిందూయిజమే బ్రాహ్మిణిజం’ అని బ్రిటిష్ ప్రొటెస్టెంట్ క్రైస్తవ మిషనరీలు నిర్వచించాయి. ‘సంస్కృతం అన్ని భారతీయ భాషలకూ తల్లి’ అన్నారు. సంస్కృతాన్ని, బ్రాహ్మణులను ప్రభావశీలురుగా చిత్రిస్తూ, ఇతరులను నిష్క్రియాత్మక స్వభావం కలవారిగా చూడటం ఈ క్రైస్తవ దృష్టిలోని లోపం. ఇది భారతీయులను కూడా ఆవహించింది.
ఆగ్నేయాసియా అంతటా బ్రాహ్మణులు, కర్మకాండలు, సంస్కృత భాష వర్ధిల్లాయి. అయితే అక్కడి బ్రాహ్మణులు కులాంతర వివాహాలు కూడా చేసుకునేవారు. దేశ కాల పరిస్థితులను బట్టి బ్రాహ్మణ వ్యవస్థ, సంస్కృత సంప్రదాయాలు సౌలభ్యాన్ని, సర్దుబాటు తత్వాన్ని ప్రదర్శించాయి. ప్రాంతీయ భాషల వికాసం తర్వాత సంస్కృత ప్రాధాన్యం పరోక్షంగా మారిందే తప్ప నశించలేదు. స్థానిక భాషలను సంస్కృతం, సంస్కృతాన్ని స్థానిక భాషలు పరస్పరం ప్రభావితం చేసుకున్నాయి. అందుకే, మీమాంస భాష్యకారుడు శబరుడు ‘వేదాన్ని అధ్యయనం చేయడానికి మ్లేచ్ఛ భాషల పరిజ్ఞానం కూడా పనికొస్తుంది’ అన్నాడు. అలంకార శాస్త్రవేత్త రాజశేఖరుడు సంస్కృతంపై ప్రాకృత భాషల ప్రభావాన్ని ఏనాడో చెప్పాడు. అలాగే సంస్కృతం స్థానిక భాషల్లోకి ఇంకిపోయి వాటిని సంపన్నం చేసింది. కాబట్టి, మాతృభాషల వికాసాన్ని ‘సంస్కృత వ్యతిరేకత’గా భావించలేం. ప్రతిదాన్నీ Binary Oppositionsగా చూసే ఆధునిక దృక్పథం నుంచి బయటపడాలి. బ్రాహ్మణులు మాత్రమే ఆధ్యాత్మికతకు, సంస్కృతికి, జ్ఞానానికి, చదువుకు మారుపేరని... శూద్రులు, బ్రాహ్మణేతరులు భౌతిక శ్రమకు మాత్రమే వారసులని భావించడం పొరపాటు. సంస్కృతం కేవలం పురోహిత ఆధ్యాత్మిక భాష అని, మాతృభాషలు లౌకిక వ్యవహారాలకే పరిమితమైన భాషలని అనుకోవడం కూడా తప్పు. ఇటువంటి అభిప్రాయాలు ఏర్పడటానికి ప్రొటెస్టెంట్ క్రైస్తవ మిషనరీల ధోరణి కారణం. బిషప్ హెన్రీ వైట్ హెడ్ వంటి క్రైస్తవ మిషనరీలు బ్రాహ్మణులను వారి సంస్కృతి, ఆచార వ్యవహారాలను మాత్రమే చూస్తూ, శూద్రుల ఆచారాలను, సంస్కృతిని తక్కువ స్థాయివిగా నిలిపారు. ఈ క్రమంలోనే ‘హిందూయిజం’ అనే కృత్రిమ సిద్ధాంతాన్ని సృష్టించారు.
చైనాలోని కన్ఫ్యూషియస్ సిద్ధాంతం, ఒకే భాష, ఒకే హాన్ జాతి ఆధిపత్యం కేంద్రీకృత రాజ్యానికి పునాదిగా నిలిస్తే, భారతదేశంలో అటువంటి ఏకీకృత జాతీయత లేకపోవడం హిందూత్వవాదులను ఆందోళనకు గురిచేస్తుంటుంది. బ్రాహ్మణుడు, సంస్కృతం హిందూయిజానికి కేంద్రం అని విలియం కేరీ వంటి మిషనరీలు క్రైస్తవ దృక్పథంతో ప్రచారం చేశాయి. బ్రిటిష్ పాలనా సౌలభ్యం కోసం ఐరోపాలోని ‘కోడ్ ఆఫ్ లా’ తరహాలో విలియం జోన్స్ వంటి వలస అనువాదకులు ‘మనుస్మృతి ఆధారిత సంస్కృత సంప్రదాయమే ప్రధాన హిందూమతం’ అనే మూస చట్రాన్ని తయారు చేశారు. తమిళనాడులో పనిచేసిన ఫ్రాన్సిస్ జేవియర్, బార్తలోమాయస్ జీగెన్బాల్గ్ (17–18 శతాబ్దం) వంటి మిషనరీల లేఖలు... స్థానిక ఆచారాలు ధర్మశాస్త్రాన్ని అనుసరించవని నిరూపిస్తున్నాయి. గ్రామ పంచాయతీల ద్వారానే న్యాయం జరిగేది. కొన్ని కులాల్లో మాతృస్వామ్యం ఆధారంగా ఆస్తి వారసత్వం ఉండేది.
క్రైస్తవ మిషనరీలు తమ ఐరోపా నియో–ప్లాటోనిక్ చట్రంలో అద్వైతాన్ని ఒక రకమైన ‘సర్వేశ్వరవాదం’గా అర్థం చేసుకున్నాయి. క్రైస్తవ ప్యూరిటానిజం ప్రభావంతో భాగవత లీలల కృష్ణుడి స్థానంలో, మహాభారతంలోని ధీరోదాత్తుడైన, పౌరుషం కలిగిన కృష్ణుడిని సంస్కర్తగా, చరిత్ర పురుషుడిగా బంకించంద్ర చటర్జీ వంటివారు ముందుకు తెచ్చారు. అద్వైతాన్ని పాంథీయిజంగా, వైష్ణవాన్ని ‘మ్యాన్లీ గాడ్’ భావనగా మార్చి, క్రైస్తవ ప్యూరిటానిజం ప్రభావంతో నిర్మించినదే– నేటి హిందుత్వ.
క్రైస్తవ వలసవాదులు వర్తమానంతో సంబంధంలేని– సుదూర గతానికి సంబంధించిన–ఒక బ్రాహ్మణిజాన్ని హిందూయిజంగా నిర్వచించారు. ముఖ్యంగా దక్షిణాదిన ఎప్పుడూ ఏకశిలా సంస్కృతి లేదు. సంస్కృత– వైదిక వ్యవస్థలపై, ఆచారాలపై విమర్శలు వ్యక్తమవుతూ వచ్చాయి. పల్లవ రాజు మహేంద్రవర్మ (7 శ.) ‘మత్తవిలాస ప్రహసనం’ సంస్కృత నాటకంలోనే బ్రాహ్మణ వైదిక ఆచారాలను, కాపాలిక, బౌద్ధ సన్యాసుల వేషధారణలను, ఆడంబరాలను, నైతిక పతనాన్ని హాస్యస్ఫోరకంగా విమర్శించాడు. తమిళ ప్రాచ్య పండితుడు నీలకంఠ దీక్షిత (17 శ.) ‘కలివిడంబనమ్’ అనే సంస్కృత గ్రంథంలో ఆధ్యాత్మిక విశ్వాసాలు, పూజాది క్రమాలు, వైదిక కర్మకాండలు వ్యాపారాత్మకంగా ఎలా దిగజారిపోయాయో ఎండగట్టాడు.
జగన్నాథ పండితరాయలు (17 శ.) సంస్కృతంలో ‘అసఫ్ విలాసము’, అలాగే ప్రేమ కవిత్వం రాయడం సంస్కృతంలోని లౌకిక, శృంగార స్వభావాన్ని నిరూపిస్తాయి. అదే కాలంలో, తెలుగులో భక్త రామదాసు, మరాఠీలో తుకారాం, సమర్థ రామదాసు వంటి భక్తకవులు ఆధ్యాత్మిక భావాలను వెల్లివిరియజేశారు. తిరుప్పావైని వేదంగా ఆరాధించేలా చేశారు. దీనిద్వారా సంస్కృతం కేవలం ఆధ్యాత్మిక భాష కాదని, అలాగే ప్రాంతీయ భాషలు కేవలం లౌకికమైనవి కాక, ఆధ్యాత్మిక రచనలకు నిలయాలని స్పష్టమవుతోంది.
దక్షిణాదిన లేదా భారత ఉపఖండంలో ‘ఆర్యావర్త సంస్కృతి’ ఏకపక్షంగా విస్తరించలేదు. అలాగే ఆర్యావర్తం, ఉత్తరాది అంటే– సంస్కృతం, బ్రాహ్మణులు మాత్రమే కాదు. బ్రాహ్మణేతర సంస్కృతులు, సంస్కృతేతర భాషలు భారత ఖండ సంస్కృతిని మొత్తంగా ప్రభావితం చేశాయి. దక్షిణాదిలోకి ఉత్తరాది సంస్కృతి మాత్రమే కాదు, ఉత్తరాదిలోకి దక్షిణాది సంస్కృతి కూడా విస్తరించింది (శంకర, రామానుజ, మధ్వ మొదలైన సిద్ధాంతకర్తలు). కాలక్రమేణా భారతదేశాన్ని ఒకే చట్రంలోకి నెట్టడం సాధ్యం కాదని గ్రహించిన అనంతర మిషనరీలు ‘తమిళ శైవం’ వంటి ద్రవిడ సంప్రదాయాలను కూడా అధ్యయనం చేశాయి. భారతదేశంలో గుప్తులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, పల్లవులు, చోళులు, రాజపుత్రుల పాలనలో సుమారు 900 ఏళ్లు సంస్కృతం ప్రధాన రాజభాషగా వెలిగింది. ఆ తర్వాత వెయ్యి సంవత్సరాలుగా ప్రాంతీయ భాషలే (తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ మొదలైనవి) రాజ్యం చేశాయి. తుకారాం, పోతన, జ్ఞానేశ్వరుడు, కబీర్ వంటి భక్తకవుల వల్ల ఆధ్యాత్మికత కూడా ప్రాంతీయ భాషల ద్వారానే వ్యాపించింది.
‘‘భారతదేశంలో ముస్లింల దండయాత్రల వల్లే సంస్కృత భాష, సంస్కృతి క్షీణించాయి’’ అన్న హిందూత్వవాదుల వాదన తప్పు. ఆగ్నేయాసియా దేశాలలో ముస్లిం దండయాత్రల తాకిడి తక్కువ. సా.శ.200 నుంచి 1350 వరకు సంస్కృతం రాజభాషగా వెలిగినా, 14వ శతాబ్దం నాటికి దాని ఆధిపత్యం తగ్గింది. థేరవాద బౌద్ధమతం ప్రజాదరణ పొందడంతో పాళీ భాష, స్థానిక మాతృభాషలు రాజభాషలుగా మారాయి. సంస్కృతం స్థానంలో స్థానిక భాషలు ఆధిపత్యంలోకి రావడం.. దండయాత్రల వల్ల జరిగింది కాదు. అది కాలక్రమేణా సంస్కృత క్లిష్టతను దాటి, ప్రజల భాషలు బలపడే సహజ సాంస్కృతిక–భాషా పరిణామం. సంస్కృత ఆధిపత్యాన్ని సనాతన సంస్కృత పండితుడు, హరికథా పితామహ ఆదిభట్ల నారాయణదాసు వ్యతిరేకిస్తూ, అచ్చ తెలుగులో కావ్యం రాయడం విశేషం.
ఆధునిక అర్థంలో నిశ్చితమైన సరిహద్దులు కలిగిన ‘నేషన్–స్టేట్’ లేదా ‘దేశం’ అనే భావన ప్రాచీన కాలంలో మనకు లేదు. విశాలమైన సాంస్కృతిక క్షేత్రంగా మాత్రమే ఉనికిలో ఉండేది. విభిన్న భాషలు, సంస్కృతులు, తెగలు సమ్మిళితమవడానికి ఈ పరిస్థితి దారితీసింది. అయితే సెక్యులరిస్టులు, దళితవాదులు, కమ్యూనిస్టులు, హిందూత్వవాదులు అందరూ బ్రాహ్మణ–సంస్కృత కేంద్రక హిందూయిజాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. జయధీర్ తిరుమలరావు వెలికితీసిన శైవ మఠాల చరిత్ర, ఆదిజాంబ పురాణం, డక్కలి ప్రదర్శనలు, చిందు భాగవతం వంటివి దళిత–బహుజనుల మౌఖిక, లిఖిత సంస్కృతిని ఆవిష్కరిస్తాయి. ‘సహస్ర శీర్షా పురుషః సహస్రాక్ష స్సహస్రపాత్’ వేల మార్గాలు, వేల కళ్లు, వేల ప్రతిస్పందనల బహుళత్వమే ఈ నేల సారం.
రాణి శివశంకరశర్మ
(ది లాస్ట్ బ్రాహ్మిణ్)
ఈ వార్తలూ చదవండి
అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు.. సీజేపీ నేతపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు..
గ్రీకు రెస్టారెంట్లో తొలి పరిచయం.. రాజీవ్ గాంధీతో ప్రేమకథను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ..