Share News

హిందూత్వ మూలం ఇజ్రాయెల్‌లో దొరకదు!

ABN , Publish Date - Oct 13 , 2026 | 01:00 AM

రాణి శివశంకర శర్మ వ్యాసం ‘ఇజ్రాయెల్ చరిత్ర... హిందూత్వ మూలాలు!’ (13.09.2026) వ్యాసంలో ‘హిందూత్వ’ మూలాలు ఆధునిక రాజకీయ పరిణామాల్లో ఉన్నాయన్న వాదనలో కొంత వాస్తవం ఉంది.

హిందూత్వ మూలం ఇజ్రాయెల్‌లో దొరకదు!

రాణి శివశంకర శర్మ వ్యాసం ‘ఇజ్రాయెల్ చరిత్ర... హిందూత్వ మూలాలు!’ (13.09.2026) వ్యాసంలో ‘హిందూత్వ’ మూలాలు ఆధునిక రాజకీయ పరిణామాల్లో ఉన్నాయన్న వాదనలో కొంత వాస్తవం ఉంది. సావర్కర్ 1923లో హిందూత్వాన్ని రాజకీయ–సాంస్కృతిక భావనగా నిర్వచించారు. జియోనిజం పట్ల ఆయనకు ఆసక్తి ఉంది. యూదుల పితృభూమి–పుణ్యభూమి భావనను తన రచనలో ప్రస్తావించిన ఆధారాలు కూడా ఉన్నాయి. కానీ అక్కడి నుంచి ‘ఇజ్రాయెల్ చరిత్రే హిందూత్వ మూలం’ అన్న వాదన దాకా వెళ్ళగలమా? ఒక భావజాలానికి మరో భావజాలంతో సారూప్యతలు ఉండటం వల్లనే ఒకటి మరొకదాని నుంచే పుట్టిందని నిరూపించలేం. ప్రభావం, పోలిక, సమాంతర పరిణామం– ఇవి వేర్వేరు. వీటిని ఒకటిగా కలపడమంటే చరిత్రను సరళీకరించడమే.

వ్యాసకర్త బ్రిటిష్ పాలన, పాశ్చాత్య సామ్రాజ్యవాదం, ఇజ్రాయెల్ ఆవిర్భావాన్ని ఒకదాన్ని ఒకటి ప్రేరేపించిన పరిణామాలుగా వరుసలో పెట్టారు. కానీ ఇజ్రాయెల్ ఏర్పడటానికి జియోనిజం, యూరప్‌లోని యూదు వ్యతిరేకత, నాజీ హింస, హోలోకాస్ట్, బ్రిటిష్ మాండేట్, రెండో ప్రపంచ యుద్ధానంతర రాజకీయాలు, ఐక్యరాజ్యసమితి విభజన ప్రణాళిక వంటి అనేక అంశాలు పనిచేశాయి. బ్రిటన్ పాత్రను చెప్పడం వరకు పర్లేదు, కానీ ఇజ్రాయెల్‌ ఆవిర్భావాన్ని కేవలం ‘బ్రిటిష్–అమెరికన్ అండదండల ఫలితం’గా కుదించడం మిగిలిన కారణాలను మరుగు పరుస్తుంది.

1947లో ఐక్యరాజ్యసమితి పాలస్తీనా విభజన ప్రణాళికకు భారత్ వ్యతిరేకంగా ఓటు వేసింది. ఐన్‌స్టీన్ 1947 జూన్ 13న నెహ్రూకు ఉత్తరం రాసి యూదు రాష్ట్రానికి మద్దతు కోరారు. నెహ్రూ జూలై 11న సమాధానమిచ్చారు. ఇవి వాస్తవాలు. కానీ ఆ చరిత్రను ఉపయోగించి తరువాతి హిందూత్వ రాజకీయాలకు నేరుగా ఒకే మూలాన్ని నిర్ధారించడం సాధ్యం కాదు.


గాంధీ 1938 నవంబరు 26న ‘హరిజన్’లో ‘ది జ్యూస్’ వ్యాసంలో యూదుల పట్ల సానుభూతి చూపుతూనే, పాలస్తీనాలో అరబ్బుల హక్కులను పక్కన పెట్టడాన్ని అంగీకరించలేదు. జర్మన్ యూదులకు సత్యాగ్రహాన్ని మార్గంగా సూచించారు. మార్టిన్ బూబర్ వంటి యూదు మేధావులు దీన్ని విమర్శించారు. కానీ దీన్నుంచి ‘గాంధీ యూదుల చారిత్రక హక్కును నిరాకరించాడు’ లేదా ‘హిందూ–ముస్లిం ఐక్యత అనే స్వప్రయోజనం కోసమే జియోనిజాన్ని వ్యతిరేకించాడు’ అని తేల్చడం అంత సులభం కాదు. ఆయన వైఖరిలో అహింస, వలసవాద వ్యతిరేకత, అరబ్బుల హక్కులపై అవగాహన కూడా ఉన్నాయి.

అంబేడ్కర్ విషయంలో వ్యాసకర్త చెప్పినది పూర్తిగా తప్పు కాదు. 1941లో ‘జ్యూయిష్ అడ్వకేట్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబేడ్కర్‌ పాలస్తీనాలో యూదుల సమాజం గురించి సానుకూలంగా మాట్లాడారు. ‘మోసెస్ అండ్ హిస్ సిగ్నిఫికెన్స్’ అనే తన వ్యాసంలో యూదుల విముక్తి ప్రయాణాన్ని దళితుల విముక్తి ఆకాంక్షతో పోల్చారు. కాబట్టి యూదు జాతీయ విముక్తి పట్ల ఆయనకు సానుభూతి ఉంది. అయితే 1941లో ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా ఏర్పడలేదు. అందువల్ల అంబేడ్కర్‌ అభిప్రాయాన్ని ‘ఇజ్రాయెల్ ఏర్పాటుకు మద్దతు’గా కాకుండా, అప్పటి యూదు జాతీయ ఉద్యమం పట్ల సానుకూలతగా చెప్పడం సరైనది.

సావర్కర్ జియోనిజాన్ని ప్రశంసించారు, పితృభూమి–పుణ్యభూమి భావనను ప్రస్తావించారు, 1947లో యూదు దేశం ఏర్పాటును స్వాగతించారు– ఇవి ఆధారాలున్న వాస్తవాలే! కానీ వీటన్నిటినీ కలిపి ‘హిందూత్వం పాశ్చాత్య నమూనాకు ప్రతిబింబం’ అన్న నిర్ణయానికి వచ్చే వీలు లేదు.

హిందూత్వానికి జియోనిజంతో సారూప్యతలు ఉన్నాయన్నది నిజమే. సావర్కర్‌పై జియోనిజం ప్రభావాన్ని సూచించే చారిత్రక ఆధారాలూ ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్ చరిత్రే హిందూత్వానికి మూలమా? రాణి శివశంకర శర్మ వ్యాసం ఆ స్థాయి నిర్ధారణకు కావలసిన ఆధారాలు ఇవ్వలేదు.

- పి. మాధవి

Updated Date - Oct 13 , 2026 | 01:02 AM