Share News

కొత్త సీసాలో పక్వతలేని పాకం!

ABN , Publish Date - Aug 22 , 2026 | 12:20 AM

బండి నారాయణస్వామి రాసిన ‘దళిత బహుజన వాదానికి కొత్త పిలుపు’ అనే వ్యాసం (ఆంధ్రజ్యోతి, 18.07.2026) దళిత బహుజనుల మతపరమైన అస్తిత్వాన్ని, సామాజిక న్యాయాన్ని ఒకేసారి కాపాడగల ప్రత్యామ్నాయంగా..

కొత్త సీసాలో పక్వతలేని పాకం!

బండి నారాయణస్వామి రాసిన ‘దళిత బహుజన వాదానికి కొత్త పిలుపు’ అనే వ్యాసం (ఆంధ్రజ్యోతి, 18.07.2026) దళిత బహుజనుల మతపరమైన అస్తిత్వాన్ని, సామాజిక న్యాయాన్ని ఒకేసారి కాపాడగల ప్రత్యామ్నాయంగా ‘హిందూ దళిత బహుజనవాదం’ అనే భావనను ప్రతిపాదిస్తోంది. అయితే, ఈ వ్యాసంలో అనేక తార్కిక లోపాలు, భావనాత్మక అస్పష్టతలు, చారిత్రక సరళీకరణలు, ఆధార రహిత సాధారణీకరణలు ఉన్నాయి.

వ్యాసకర్త ఒకవైపు ఆరెస్సెస్–బీజేపీ భావజాలాన్ని, మరోవైపు నాస్తిక–మార్క్సిస్టు లౌకికవాదాన్ని ఉంచి, ఈ రెండు ధ్రువాల మధ్య హిందూ దళిత బహుజనులు చిక్కుకున్నారని వాదించారు. భారతదేశంలోని సామాజిక–రాజకీయ ఆలోచనా ప్రపంచం కేవలం ఈ రెండు ధ్రువాలకే పరిమితం కాలేదు. అంబేడ్కరిజం, జ్యోతిరావు ఫూలే భావజాలం, పెరియార్ ఉద్యమం, బౌద్ధ దళిత ఉద్యమం, గాంధేయ సామాజిక సంస్కరణ, రాజ్యాంగవాదం, వివిధ సోషలిస్టు సంప్రదాయాలు వంటి అనేక ప్రత్యామ్నాయ భావజాలాలు కూడా ఉన్నాయి.

అదేవిధంగా, మొత్తం నాస్తికవాదాన్ని ఆయన చిత్రీకరించిన తీరు కూడా ఆధార రహిత సాధారణీకరణ. నాస్తికులు మతాన్ని అధ్యయనం చేయరన్న వాదనను సమర్థించే ఉదాహరణలు సైతం వ్యాసంలో లేవు. మతాన్ని విశ్లేషించిన ప్రముఖ సామాజిక సిద్ధాంతకర్తలూ లేకపోలేదు. ఉదాహరణకు, డి.డి. కోశాంబి, రొమిలా థాపర్, ఇర్ఫాన్ హబీబ్ వంటి అనేకమంది మతాన్ని లోతుగా అధ్యయనం చేశారు. మతాన్ని విమర్శించడం, మతాన్ని అధ్యయనం చేయకపోవడం రెండూ వేర్వేరు విషయాలు. అలాగే, ‘మతం తెలియనివారికి సంస్కృతి తెలియదు’ అనే వాదన సైతం తార్కికంగా నిలబడదు. సంస్కృతి అనేది కేవలం మతం కాదు. భాష, సాహిత్యం, కళలు, సంగీతం, జానపద సంప్రదాయాలు, చరిత్ర, వంటకాలు, కుటుంబ నిర్మాణం, సామాజిక సంబంధాలు, స్థానిక ఆచారాలు, జీవన విధానాలు... ఇవన్నీ కలిపే సంస్కృతి అవుతుంది. మతం సంస్కృతిలో ఒక భాగం; సంస్కృతి మొత్తాన్ని మతంతో సమానంగా చూడలేం. ఈ రెండింటిని ఒకే అర్థంలో చూడటం భావనాత్మక పొరపాటు (Conceptual Error).


వ్యాసంలో ఆరెస్సెస్ పట్ల ఆయన తీసుకున్న వైఖరిలోనూ స్పష్టత లేదు. ఒకచోట దళిత బహుజనుల సామాజిక న్యాయాన్ని ఆరెస్సెస్ నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు, వెంటనే అదే సంస్థ దేశభక్తికి పునాదులు వేసిందని ప్రశంసిస్తారు, ఆ తర్వాత మళ్లీ.. అది హిందూ దళిత బహుజనులకు ప్రమాదమని చెబుతారు. ఇంతకూ ఏ అంశాన్ని అంగీకరిస్తున్నారు? ఏ అంశాన్ని తిరస్కరిస్తున్నారు? ఈ రెండింటి మధ్య గీత ఎక్కడ? అట్లాగే ఆరెస్సెస్ మధ్యయుగాల వారసత్వ వృత్తులను సమర్థిస్తోందన్న ఆరోపణ తీవ్రమైనది. ఈ ఆరోపణకు తగిన కారణాలు చూపకపోవడంతో అది నిర్ధారిత అంశంగా కాక కేవలం అభిప్రాయంగానే మిగిలిపోతుంది.

‘హిందూ దళిత బహుజనుడు’ అనే భావనను ప్రతిపాదించినప్పుడు కూడా బండి నారాయణస్వామి ఒక ముఖ్యమైన చారిత్రక ప్రశ్నను పక్కనపెట్టారు. హిందుత్వానికి భిన్నంగా హిందూ దళిత బహుజన అస్తిత్వం అవసరమని చెబుతున్నప్పటికీ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఎందుకు బౌద్ధమతాన్ని స్వీకరించారు? ఎందుకు లక్షలాది మంది దళితులు హిందూమతాన్ని విడిచారు? ఆయన ప్రతిపాదిస్తున్న ఈ కొత్త సిద్ధాంతం, అంబేడ్కర్ చేపట్టిన హిందూమత విమర్శతో ఏకీభవిస్తుందా? విభేదిస్తుందా? లేక దాన్ని అధిగమించాలనుకుంటుందా? అనే ఏ ప్రశ్నకూ వ్యాసం సమాధానం ఇవ్వదు. ఇదే తరహా సాధారణీకరణ క్రిస్టియన్ మేధావుల విషయంలోనూ కనిపిస్తుంది. అలాగే, ముస్లింల రాజకీయ–సామాజిక ప్రతిస్పందనను కేవలం మతగ్రంథాలకు మాత్రమే ఆపాదించడం అతి సరళీకరణ (Reductionism).


‘‘హిందూ మతాన్ని ప్రజాస్వామ్యీకరించాలి’’ అనే ప్రతిపాదన కూడా ఒక నినాదంగా మాత్రమే మిగిలిపోయింది. కానీ దాన్ని ఎలా సాధించాలి? ఆలయాల నిర్వహణలో మార్పులా? పూజారి వ్యవస్థలో సంస్కరణలా? వర్ణ వ్యవస్థ నిర్మూలనా? ఒకవైపు బ్రాహ్మణాధిపత్యాన్ని నిర్మాణాత్మక సమస్యగా పేర్కొంటూనే, మరోవైపు అదే వర్గం మతపరమైన వారసత్వాన్ని సంరక్షించిన పాత్రను ప్రశంసిస్తున్నప్పుడు ఈ రెండు మూల్యాంకనాలను ఏ ప్రమాణం ఆధారంగా సమన్వయిస్తున్నారో కూడా వివరించాలి.

వ్యాసంలో ‘‘దేశం ముందు మతం’’ అనే స్థానం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ కూడా ‘‘దేశం’’ అనే పదాన్ని ఏ అర్థంలో తీసుకున్నారో సరైన నిర్వచనం లేదు. దేశం అంటే రాజ్యమా? జాతియా? నాగరికతా? లేక రాజ్యాంగ ప్రజాస్వామ్యంలోని పౌరసమాజమా? అలాగే ‘‘హిందూ దళిత బహుజనవాదం’’ అనే భావన ఒక మతపరమైన ఉద్యమమా? రాజకీయ సిద్ధాంతమా? సామాజిక ఉద్యమమా? సాంస్కృతిక వేదికా? అంబేడ్కరిజానికి విస్తరణా? హిందుత్వానికి ప్రత్యామ్నాయమా? అనే ప్రశ్నలకు వ్యాసం చివరివరకూ స్పష్టమైన సమాధానం ఇవ్వదు.

‘హిందూ దళిత బహుజనవాదం’ అనే భావనకు స్పష్టమైన నిర్వచనం, తార్కిక సమగ్రత, చారిత్రక ప్రాతిపదిక, ఆచరణాత్మక రూపకల్పన నారాయణస్వామి వ్యాసంలో కనిపించవు. అందువల్ల ఆయన వ్యాసం చర్చకు ఆహ్వానించే ప్రతిపాదనగా నిలిచినా, సిద్ధాంత నిర్మాణంగా మాత్రం నిలబడదు.

- బాలాజీ పోతుల

Updated Date - Aug 22 , 2026 | 12:25 AM