Share News

హైబీమ్‌ లైట్లతో అధిక ప్రమాదాలు

ABN , Publish Date - Jun 16 , 2026 | 01:19 AM

రాత్రి వేళ రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ఎదురుగా వచ్చే వాహనాల హెడ్‌లైట్లు కళ్లు మిరుమిట్లు గొలుపుతున్నాయి. దీంతో ఒక్కసారిగా ఏమీ కనిపించదు...

హైబీమ్‌ లైట్లతో అధిక ప్రమాదాలు

రాత్రి వేళ రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు ఎదురుగా వచ్చే వాహనాల హెడ్‌లైట్లు కళ్లు మిరుమిట్లు గొలుపుతున్నాయి. దీంతో ఒక్కసారిగా ఏమీ కనిపించదు. క్షణకాలం చీకటి. ఆ సమయంలో చిన్న తప్పు జరిగినా ప్రాణం పోతుంది. ఇప్పుడు వస్తున్న కార్లు, బైకులన్నీ కంపెనీ నుంచే తెల్లటి ఎల్‌ఈడీ, హెచ్‌ఐడీ లైట్లతో వస్తున్నాయి. ఎక్కువ వెలుతురు ఇవ్వడం కోసం కొందరు వీటిని వాడుతున్నారు కానీ, ఎదుటి వారి పరిస్థితి గురించి ఆలోచించడం లేదు. పైగా చాలామంది హై–బీమ్‌లోనే నడుపుతున్నారు. నగరంలో కూడా డిప్పర్ వేయరు. దీనివల్ల రాత్రిపూట యాక్సిడెంట్లు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, వయసు పైబడినవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి డ్రైవింగ్ అంటేనే భయం వేయడం సర్వసాధారణం అయ్యింది.

కంపెనీలే లైట్ల వెలుతురు స్థాయిని తగ్గించాలి. నగరంలో హై–బీమ్ వేస్తే పోలీసులు ఫైన్ వెయ్యాలి. ‘‘డిప్పర్ వాడండి– ప్రాణం కాపాడండి’’ అని పెద్ద ఎత్తున ప్రచారం చెయ్యాలి. డ్రైవర్లకు అవగాహన కల్పించాలి. రోడ్డు అందరిదీ. తమ వెలుతురు కోసం ఎదుటి వారి ప్రాణం తీయడం న్యాయం కాదు. సంబంధిత అధికారులు, వాహన కంపెనీలు వెంటనే స్పందించి, ఈ ‘‘వెలుతురు భూతాన్ని’’ అరికట్టాలి.

– సోము సాయిరామకృష్ణ

Updated Date - Jun 16 , 2026 | 01:19 AM