Share News

దేశంలో విద్వేష విషం పెరుగుతోంది!

ABN , Publish Date - Jan 31 , 2026 | 03:29 AM

అమెరికాలోని వాషింగ్టన్‌ కేంద్రంగా నడుస్తున్న ‘సెంటర్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ ఆర్గనైజ్డ్‌ హేట్‌’ అనే ఎన్జీవో సంస్థ భారతదేశంలో 2025 సంవత్సరంలో రాజకీయ నాయకులు చేసిన విద్వేష ప్రసంగాలపై అధ్యయనం చేసింది.....

దేశంలో విద్వేష విషం పెరుగుతోంది!

అమెరికాలోని వాషింగ్టన్‌ కేంద్రంగా నడుస్తున్న ‘సెంటర్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ ఆర్గనైజ్డ్‌ హేట్‌’ అనే ఎన్జీవో సంస్థ భారతదేశంలో 2025 సంవత్సరంలో రాజకీయ నాయకులు చేసిన విద్వేష ప్రసంగాలపై అధ్యయనం చేసింది. ‘ఇండియా హేట్‌ ల్యాబ్‌’ పేరుతో తన నివేదికను ఇటీవలే విడుదల చేసింది. దీని ప్రకారం 2025లో దేశవ్యాప్తంగా 1,318 విద్వేష ప్రసంగాలు నమోదయ్యాయి. ఇందులో 1,164 ప్రసంగాలు బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే నమోదయ్యాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర ఢిల్లీ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలలో ఎక్కువగా నమోదయ్యాయి. ఇందులో 1,289 ప్రసంగాలు ముస్లింలను టార్గెట్‌ చేస్తూ, వందకు పైగా ప్రసంగాలు క్రిస్టియన్లను టార్గెట్‌ చేస్తూ ఇచ్చినవి. మొత్తం ప్రసంగాలలో 98శాతం ముస్లింలకు, 2శాతం క్రిస్టియన్లకు వ్యతిరేకంగా ఉన్నాయి.

ఈ సంస్థ విడుదల చేసిన గత మూడేళ్ళ గణాంకాలను గమనిస్తే ప్రతి ఏటా విద్వేష ప్రసంగాల సంఖ్య రెట్టింపు అవుతూనే ఉన్నదని అర్థమవుతుంది. బీజేపీ నాయకులు వారి పార్టీ ర్యాలీలలో, మతపరమైన ఊరేగింపులలో, సాంస్కృతిక ర్యాలీలలో ఈ విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు. తర్వాత, ఈ ప్రసంగాలను సోషల్‌ మీడియాలో బీజేపీ విస్తృతంగా ప్రచారం చేయిస్తోంది. ర్యాలీలలో పాల్గొన్న, సోషల్‌ మీడియాలో ఈ వీడియోలు చూసిన పేద, మధ్యతరగతి హిందువుల పిల్లలు మతపరమైన భావోద్వేగాలకు లోనవుతున్నారు. హద్దుమీరి మైనార్టీ ప్రార్థనా మందిరాలపైన, వ్యక్తులపైన దాడులు చేస్తూ, కేసులూ జైళ్ళ పాలై, జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ విష వలయాన్ని పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి.


ఎన్నికల సమయంలో ఈ విద్వేష ప్రసంగాలు తీవ్రస్థాయికి చేరుతున్నాయి. గత 12 ఏళ్లుగా బీజేపీ ప్రతి ఎన్నికను ప్రజా సమస్యలకు కేంద్రంగా కాకుండా, విభజన రాజకీయాలకు కేంద్రంగా మార్చుతూ వచ్చింది. ఓటర్లు భావోద్వేగంతో ఓటు వేసే పరిస్థితులను సృష్టించింది. ఇదే పద్ధతి కొనసాగితే దేశ ప్రజల భవిష్యత్తు అంధకారమే!

విద్వేష ప్రసంగాలు చేసేవారిని శిక్షించడానికి ఇప్పటికీ ఒక ప్రత్యేక చట్టం లేదు. ఈ చట్టం రూపకల్పనకు సుప్రీంకోర్టు చొరవ చూపాలి. కేంద్ర ప్రభుత్వం గైడ్‌లైన్స్‌ రూపొందించేలా ఆదేశాలు ఇవ్వాలి. లేకపోతే ఈ విద్వేష పాలకుల విష ప్రసంగాలు ఆగవు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మార్గనిర్దేశకత్వంలో ఇటీవలే కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్వేష ప్రసంగాలకు వ్యతిరేకంగా ఒక బిల్లును రూపొందించి అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. త్వరలోనే అది చట్టంగా మారే అవకాశం ఉంది. ఇదే స్ఫూర్తితో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ చట్టాన్ని రాష్ట్రంలో కూడా తీసుకొస్తామని ప్రకటించారు. దీనికి రాష్ట్రంలోని బీజేపీయేతర పార్టీలన్నీ మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. విద్వేష ప్రసంగాలకు తెలంగాణ కేంద్రంగా మారకుండా చూసుకోవలసిన బాధ్యత ఉద్యమకారులుగా మనందరి మీదా ఉంది.

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ప్రజల చైతన్యమే ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుంది. ఈ విద్వేష ప్రసంగాలు చేసే నాయకులను, విభజన రాజకీయాలను ప్రోత్సహించే రాజకీయ పార్టీలను వ్యతిరేకించాలి. ప్రజలలో ఈ స్థాయి చైతన్యానికి పౌర సమాజం, విద్యార్థి, యువజన సంఘాలు కృషి చేయాలి.

మాసంపల్లి అరుణ్‌ కుమార్‌, న్యాయ విద్యార్థి

Updated Date - Jan 31 , 2026 | 03:29 AM