Share News

జాషువా కవిత్వంలో.. జాతీయోద్యమం!

ABN , Publish Date - Sep 26 , 2026 | 01:17 AM

‘భరత ఖండంబు నా పాఠశాల’ అన్నాడు మహాకవి జాషువ. దేశం పట్ల అత్యంత భక్తిప్రపత్తులను ప్రదర్శించాడు. దేశ సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని పలవరిస్తూ కవిత్వం రాశాడు.

జాషువా కవిత్వంలో.. జాతీయోద్యమం!

‘భరత ఖండంబు నా పాఠశాల’ అన్నాడు మహాకవి జాషువ. దేశం పట్ల అత్యంత భక్తిప్రపత్తులను ప్రదర్శించాడు. దేశ సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని పలవరిస్తూ కవిత్వం రాశాడు. చారిత్రక పురుషుల గొప్పతనంలో భారతీయ విశిష్టత దాగి వుందని భావించాడు. జాతీయోద్యమం కాలాన కలం పట్టిన జాషువ మహాకవి... స్వేచ్ఛా భారతావనిని కలలుగంటూ జాతీయోద్యమ సాహిత్యాన్ని సృజించాడు. బుద్ధుడు, గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, రామకృష్ణ పరమహంస, ఇత్యాది దేశీయ నాయకుల గొప్పతనాన్ని చాటుతూ జాతీయోద్యమానికి పూనికగా నిలబడి కవిత్వం రాశాడు. బుద్ధుని అహింసా మార్గాన్ని, నైతిక జీవితాన్ని, గాంధీ సత్యవర్తనను, హృదయానికి హత్తుకొని విశ్వనరుడిగా రచనా వ్యాసంగాన్ని కొనసాగించాడు. సామాజికంగా తాను అంటరానితనాన్ని అనుభవిస్తున్నా, దేశ విముక్తి కోసం జరుగుతున్న జాతీయోద్యమానికి దన్నుగా కవిత్వం రాశాడు.

గాంధీ ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని, స్వతంత్ర భారతావనిలో తన జాతి జనులకు దక్కాల్సిన వాటా తమకు దక్కుతుందని నమ్మాడు. గోచిపాత గట్టుకొని జాతిమానంబు / నిలిపినట్టి ఖద్దరు నేతగాడు / విశ్వ సామరస్య విజ్ఞాన సంధాత / కామిత ప్రదాత గాంధీ తాత – అంటూ ఎలుగెత్తి చాటాడు. గాంధీ అహింసా సిద్ధాంత ధోరణే తన జీవిత మార్గంగా నమ్మాడు.


తెలుగు సాహిత్యంలోనూ గాంధీ ప్రభావ సాహిత్యం విరివిగానే వచ్చింది. గాంధీని హృదయానికి హత్తుకొని, గాంధేయవాదాన్ని జీవనమార్గంగా ఎన్నుకొని కవిత్వం రాసిన అత్యంత ప్రతిభావంతుడైన తెలుగు కవి గుర్రం జాషువ. ప్రపంచమంతా ఏదైనా మంచి, సత్యం, అహింస, శాంతిలకు సంబంధించిన అంశాలు ఉన్నాయంటే వాటి మూలాలు కచ్చితంగా బౌద్ధంలోనే ఉన్నాయి. మహాత్మాగాంధీ అనుసరించిన సత్యం, అహింసలకు మూలాలు కూడా బౌద్ధంలోనే ఉన్నాయి. గుర్రం జాషువాకు బుద్ధుడంటే ప్రాణం. ఆయన విశ్వనర భావన బుద్ధుని మానవీయ సిద్ధాంతం నుంచి తీసుకున్నదే. జాషువా తన కవిత్వంలో మహాపురుషులందరినీ వర్ణించాడు.

అంబేడ్కర్ గురించి జాషువ ‘గబ్బిలం’ కావ్యంలో ‘కలడంబేడ్కర్ నా సహోదరుడు మాకైయష్ట కష్టాలకుం, బలియై’ అని వర్ణించాడు. విద్వాంసుడైన అంబేడ్కర్ దళితజాతి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని జాషువా అభిప్రాయపడ్డాడు.

గాంధీ ద్వారానే భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తుందని, తమ వాటా తమకు లభిస్తుందని స్వాతంత్ర్యానికి ముందు రాసిన ‘గబ్బిలం’ కావ్యంలో అభిప్రాయపడ్డాడు. నిమ్నజాతుల కన్నీటి నీరదములు–పిడుగులై దేహమును గాల్చి వేయననుచూ... రాట్నమును దుడ్డుగర్ర కరానబూని దెసల దోతెంచె గుజరాతు ముసలిశెట్టి ‘గబ్బిలం’ రాసే నాటికి స్వాతంత్ర్య పోరాట రథసారథిగా ఉన్న గాంధీజీ తరతరాలుగా వేదనకు గురవుతున్న నిమ్నజాతుల కన్నీటిని తుడిచేవాడుగానే జాషువాకు కనబడ్డాడు. ఊరి వెలుపల అంటరానివారిగా ఉన్న మాలమాదిగలు కూడా మనుషులేనని దేశం గుర్తిస్తుందని జాషువా అభిప్రాయపడ్డాడు. మహాత్ముడి స్వాతంత్ర్యోద్యమం ద్వారా దళితులకు రాజ్యాభిషేకం రావచ్చని అభిప్రాయపడ్డాడు.


‘ఏ జాతికి ఎంత వచ్చునో/ రాజత్వంబంత నాకు రావచ్చుకదా!’ అనే పద్యంలో ఈ భావన వ్యక్తమవుతుంది. జాషువా దృష్టిలో సబర్మతి వాసియైన గాంధీజీ ఆదిదేవుడు, బుద్ధునితో సమానమైనవాడు. సీమదొరలను కూడా లక్ష్యపెట్టని ధైర్యశాలి. గాంధీ అహింసా సిద్ధాంతంపై, జాతీయోద్యమంపై ఎనలేని గౌరవం, నమ్మకం, భక్తిప్రపత్తులున్నాయి. కర్రలు, ఖడ్గాలతోని, ప్రజలనేలే రోజులు పోయాయని ఇది జ్ఞానఖనియైన గాంధీయుగమంటాడు. దళితజాతి ఉద్ధరణకై ‘గబ్బిలం’తో ఈశ్వరునికి సందేశం పంపిన జాషువా గాంధీజీతో దళితోద్ధరణ జరుగుతుందని హృదయపూర్వకంగానే నమ్మాడు. ‘బాపూజీ’ అనే పేరుతో ఓ ఖండకావ్యం రాసిన జాషువా అసలుసిసలైన గాంధేయవాది. సంపన్న వర్గాల్లో గర్వం తగ్గి పేదల పట్ల సమదృష్టి ఉండాలన్న భావాన్ని ప్రదర్శించేందుకు గాంధీ పంచెకట్టు కడితే, నిరుపేదలైన దళితజాతిలో ఆత్మవిశ్వాసం నింపడానికి హుందాగా ఉండాలని అంబేడ్కర్ సూటూబూటూ ధరించాడు. అర్ధ దిగంబరుడైన గాంధీ... దళితుల పాలిట దైవమైన అంబేడ్కర్ బ్రిటిష్‌ సామ్రాజ్యవాదులతో రాజీలేని పోరాటం చేశారని జాషువా ఆ ఇద్దరు మహాత్ములను ఆరాధించాడు.

క్షమా ప్రవాసి, పండుముసలి గాంధీ తుపాకీ గుండుకెరయై మరణించడంపై జాషువా భారత జాతి హృదయాలను మెలిపెట్టేంత అర్థమైన పద్యాలను రాశాడు. కన్నీటి వరద పారించాడు. ‘అహింసామూర్తి, శాంతి, సహనం, సత్యం, జీవన మార్గాలుగా ఎంచుకున్న గాంధీజీని హత్యగావించటం భారతదేశానికి మాయని మచ్చ. గాడ్సేలాంటి ‘మత్త చిత్తుల తలలు ఖండించినా అది మాయదు కదా’ అని వాపోతాడు.


స్వాతంత్ర్య మహోత్సవ జయజయ ధ్వనులు వినిపిస్తూండగానే జరిగిన గాంధీ హత్య బాపూజీపై అద్భుత కావ్యం రాసేట్టు చేసింది. ఈ కలికాలంలో ఏసుక్రీస్తుతో గాంధీజీ సమానమైన వాడని జాషువా అభిప్రాయం. ప్రపంచానికే శాంతి, సత్యం, సహనం, అనే విద్యలను నేర్పిన అహింసావాది అని నమ్మాడు. సీమ దొరల శిలా సదృశ్యమైన మనసులను కరిగించి భారతజాతి దాస్యశృంఖలాలు తెంపిన అహింసామూర్తి లేని లోటు ఎలా తీరుతుందని వాపోతాడు. క్రైస్తవులకు అచ్చమైన క్రైస్తవుడని, బౌద్ధ బిక్షువులకు ఏ మచ్చా లేని బుద్ధుని వంటి వాడని, ముసల్మానులకు అచ్చమైన ఫకీరని ఆ మహాత్మునికి నివాళులర్పించాడు.

నెహ్రూ తన చితాభస్మాన్ని భారతదేశంలోని నదులన్నిటిలో కలపమన్నాడు. అలా తాను ఈ దేశపు పంట భూములలో శాశ్వతంగా నిలిచితానన్నాడు. ఇదే విధంగా విశ్వమానవాళికి అమూల్యమైన సందేశాన్నిచ్చిన గాంధీజీ చితాభస్మాన్ని అన్ని దేశాలపై చల్లాలంటాడు జాషువా మహాకవి.

‘గాంధీనమకంబు గాంధీ సందేశంబు / మరు మూలలందు మారుమ్రోగె / ఖండ పంచకంబు కౌగలించిన వాని’ని ఎవరూ ఏంచేయలేరంటాడు. ఒక్క భారతదేశంలో మాత్రమే కాదు... గాంధీ నామం విశ్వవ్యాప్తమైందని గర్వపడ్డ జాషువా నిఖార్సయిన గాంధేయవాది. తాను రాసినట్టే గాంధీ తత్వంతోనే జీవించిన ఆచరణశీలి. అద్భుతమైన మానవీయ సాహిత్యాన్ని సమాజానికందించిన మానవతావాదియైన విశ్వనరుడు మహాకవి జాషువా.

- డొక్కా మాణిక్య వరప్రసాద్‌

మాజీ మంత్రి

(సెప్టెంబర్ 28: జాషువా జయంతి)

Updated Date - Sep 26 , 2026 | 01:19 AM