సరళీకరణేనా..?
ABN , Publish Date - Oct 10 , 2026 | 12:48 AM
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో మరో విడత సంస్కరణల పేరిట జీఎస్టీ కౌన్సిల్ తన 57వ సమావేశంలో కొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది. దేశంలో జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు ఏ ఆదర్శాలూ..
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో మరో విడత సంస్కరణల పేరిట జీఎస్టీ కౌన్సిల్ తన 57వ సమావేశంలో కొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది. దేశంలో జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు ఏ ఆదర్శాలూ ఆశయాలూ చెప్పుకున్నామో వాటికి అనుగుణంగా ఈ సరికొత్త చర్యలు ఉన్నాయంటూ వీటి సమర్థకులు సంతోషిస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నది ఇప్పుడు దేశంలో సర్వత్రా వినిపిస్తున్న మంత్రం కనుక, తీసుకున్న ఈ నిర్ణయాల్లో అత్యధికం వ్యాపారవర్గాలు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నదానికి అనుగుణంగా, వారికి అనుకూలమైనవిగా ఉండటం సహజం.
జీఎస్టీ అధికారుల చేతిలో ఉన్న అరెస్టు అధికారాలను రద్దుచేయడం వ్యాపారులకు కచ్చితంగా ఉపశమనం కలిగించే చర్య. పన్ను వివాదం దర్యాప్తు దశలో ఉన్నప్పుడు చెల్లింపుదారుకు అరెస్టు భయంలేకుండా ఉంటుంది. నిర్దిష్ట సమాచారం ఉన్నప్పుడు మాత్రమే వాహనాలను ఆపి చెక్‌చేయాలన్న నియమం కూడా రాబోతున్నది కనుక, అనుమానం ఉన్నా లేకున్నా ఎక్కడపడితే అక్కడ సరుకును ఆపి తనిఖీలు చేయడానికి కూడా అధికారులకు ఇక అధికారాలు ఉండవు. సరుకుల స్వాధీనం కూడా వాటి ఆరంభంలోనో, చివరిలోనో జరగాలన్న మరో వెసులుబాటువల్ల వాహనాలు మధ్యదారి అంతా నిర్భయంగా సాగిపోవచ్చు. నేరవిచారణ చేపట్టాలంటే పన్ను ఎగవేత ఐదుకోట్లు దాటాలంటూ ప్రస్తుతం ఉన్న పరిమితిని ఏకంగా ఐదురెట్లు పెంచడం కూడా వ్యాపారులకు ఊరట కలిగించేదే.
అత్యధికశాతం క్లెయిమ్స్‌ను సత్వరమే పరిష్కరించి, మూడురోజుల్లోనే రిఫండ్ అందేట్టు చేయడం కూడా వారికి ఉపశమనం కలిగించేదే. రిఫండ్ ప్రక్రియలను వేగవంతం చేయడం వంటివి ప్రధానంగా చిరువ్యాపారులకు పెద్ద ఊరట. చిన్నచిన్న పొరపాట్లు అని పాలకులు, వ్యాపారులు భావిస్తున్నవన్నిటిపైనా ఇకపైన మహా అయితే జరిమానాలు ఉంటాయేమో తప్ప అంతకుమించిన చర్యలేమీ ఉండవు. అత్యధికశాతం కేసుల్లో ఆ జరిమానా పరిమాణం కూడా మూడోవంతుకు తగ్గిపోబోతోంది. వ్యాపార నిర్వహణను మరింత సరళం, సులభం చేసేందుకు ఈ ప్రతిపాదనలు ఉపకరిస్తాయనీ, వ్యాపారవర్గాలు, పన్నుచెల్లింపుదారులపై నమ్మకమే ఈ సంస్కరణలకు ప్రాతిపదిక అనీ ఆర్థికమంత్రి అంటున్నారు. ప్రక్రియల పరంగా 99శాతం సవాళ్ళను పరిష్కరించిన ఈ కొత్తతరం జీఎస్టీ సంస్కరణలు కేంద్రానికీ, రాష్ట్రాలకు కూడా సుస్థిర ఆదాయాన్ని తెచ్చిపెడతాయని ఆమె హామీ ఇస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రాబోతున్న ఈ సంస్కరణల వెనుక, ఏడు రాష్ట్రాల ఎన్నికల ప్రభావం కూడా ఉన్నదని, వాటిలో ప్రధానంగా పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయని కొందరు వక్రభాష్యాలు కూడా చెబుతున్నారు.
కఠినమైన పన్ను విధానాలతో ఇబ్బంది పడుతున్న వ్యాపారరంగానికి భారీ ఊరట కలిగించే ఈ చర్యలను ఇప్పటివరకూ జీఎస్టీ కౌన్సిల్ ఎందుకు ఉపేక్షించిందో తెలియదు కానీ, ఇదంతా సరళం చేయడం కాదు, ప్రక్రియలను బలహీనపరచి అధికారుల చేతులు కట్టివేయడమని కొందరి విమర్శ. కౌన్సిల్ ప్రతిపాదించిన కొన్ని చర్యలు వ్యాపారవర్గాల్లో నేరభయం తగ్గించి, మరిన్ని అడ్డుతోవలకు, ఎగవేతలకు అవకాశం ఏర్పరుస్తుందన్న వాదనలూ లేకపోలేదు. అరెస్టు అధికారాన్ని జీఎస్టీ అధికారులకు మొదట ఏ ఉద్దేశాలతో, లక్ష్యాలతో కల్పించారో, ఇప్పుడు అవే ఎందుకు పనికిరాకుండా పోయాయో, వాటిని ఇంతకాలం తరువాత ఏ ప్రాతిపదికన తొలిగించారో తెలియదు. సులభతరం చేయడం పేరిట విధానాలను, నిబంధనలను బలహీనపరచకుండా జాగ్రత్తపడటం ముఖ్యం.
గత ఏడాది సెప్టెంబర్ నుంచి అమలులోకి వచ్చిన తక్కువ జీఎస్టీ రేట్ల వల్ల ఎలాంటి ఆదాయ నష్టం జరగలేదని ఆర్థికమంత్రి ఒప్పుకున్నందుకు సంతోషించాలి. అప్పటివరకూ ఉన్న నాలుగుస్లాబులను రెండుగా కుదించడం వల్ల చాలా సరుకుల ధరలు తగ్గి సామాన్యుడికి కాస్తంత ఉపశమనం కలిగింది. ప్రజలే కాదు, వ్యాపారులు సైతం పలు రకాల స్లాబులతో తమకు ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వానికి ఏకరువుపెట్టారు. ఆహారపదార్థాలపై వివిధరకాల జీఎస్టీలు ఉండటంతో కస్టమర్లనుంచి తాము ఎదుర్కొంటున్న ఫిర్యాదులను కోయంబత్తూరుకు చెందిన ఒక హోటల్ వ్యాపారి ఆర్థికమంత్రికి వివరిస్తున్న వీడియో ఒకటి బయటకు పొక్కిన విషయం తెలిసిందే. క్రీమ్–బన్, స్వీట్లు–కారాలు మధ్య జీఎస్టీలో ఉన్న తేడాపాడాలను ఆయన ఎంతో చక్కగా వివరించారు. స్లాబుల హేతుబద్ధీకరణతో ఈ రకమైన సమస్యలను పరిష్కరించిన ప్రభుత్వం ఇప్పటికీ పెట్రోల్, డీజిల్‌ను మాత్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు మాత్రం ససేమిరా అంటోంది. సామాన్యుడికి నేరుగా మేలు చేసే ఇటువంటి నిర్ణయాలు మరిన్ని జరిగినప్పుడే దానిని గుడ్ అండ్ సింపుల్ టాక్స్ అని పిలుచుకోవడానికి అతడికి మనసొప్పుతుంది, దాని ఆశయం కూడా నెరవేరుతుంది.