Share News

లంచాల్లో మనం విశ్వగురువులం!

ABN , Publish Date - Oct 13 , 2026 | 01:10 AM

ప్రతివారం ఇద్దరో ముగ్గురో ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ దాడుల్లో పట్టుబడుతూనే ఉన్నారు. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో చట్టాన్ని ఉల్లంఘించడానికో..

లంచాల్లో మనం విశ్వగురువులం!

ప్రతివారం ఇద్దరో ముగ్గురో ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ దాడుల్లో పట్టుబడుతూనే ఉన్నారు. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో చట్టాన్ని ఉల్లంఘించడానికో, తప్పులు చేయడానికో లంచం అడుగుతారు. కానీ, చట్టబద్ధంగా చేయాల్సిన పనిని నిర్వర్తించడానికి సైతం లంచం డిమాండ్ చేసే సంస్కృతి మన దేశంలో మాత్రమే కనిపిస్తోంది! మన ప్రభుత్వోద్యోగులు తాము నిర్వర్తించాల్సిన అధికారిక బాధ్యతను వ్యక్తిగత ఆదాయ మార్గంగా మార్చుకుని, లంచం ఇవ్వగలిగే వారికే సేవలు అందించడం ప్రారంభించి చాలా కాలమైంది. నిత్యం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చే సామాన్యులకు ఈ అవినీతి తీవ్రత, దాని విస్తృతి ఎంత దారుణంగా ఉన్నాయో స్పష్టంగా తెలుసు.

సమాజంలో మధ్యతరగతి వర్గానికి ఈ అవినీతి అసలు ఒక సమస్యగానే కనిపించకపోవచ్చు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కోట్లు వెచ్చించి గేటెడ్ కమ్యూనిటీల్లో ఇళ్లు కొంటున్నారు, పిల్లలను విదేశాల్లో చదివిస్తున్నారు, నూతన దంపతుల హనీమూన్‌ను మాల్దీవులలో ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ కేవలం తమ నెల జీతంతోనే సాధించామని చెప్పే స్థితి లేదు. మరోవైపు, ‘ఇప్పటికీ అద్దె కొంపలోనే ఉన్నాం’ అని ఆవేదన చెందే గృహిణి, తన భర్త నిజాయితీని మెచ్చుకోవడానికి బదులు అతని చేతగానితనాన్ని ఎత్తి చూపుతుంది. ‘కుటుంబంలో ఒక్కరికి సర్కారీ కొలువు వస్తే, వంశమంతా బాగుపడింది’ అనే మెచ్చుకోలు వెనుక బినామీ ఆస్తులు, అవినీతి సంపాదనతో కూడిన లోతైన లంకె దాగి ఉంది.


‘ఆ ఐఏఎస్ అధికారి మంచి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు’ అనే వార్తలు, సమాజంలో అవినీతి ఏ స్థాయిలో సాధారణీకరణ అయిందో చాటి చెబుతున్నాయి. ‘ఆదాయం వచ్చే సీటు మారితే నెలకు లక్షల్లో నష్టం జరుగుతుంది’ అనే వారిలో, లంచాన్ని తమ హక్కుగా భావించే తీరు కనిపిస్తుంది. ‘అందరూ చేసే పనే కదా!’ అనే మాటలో అవినీతికి సమర్థన లభిస్తుండగా.. ‘నేనొక్కడినే తిన్నానా? పైన ఉన్న వారికీ తినిపించలేదా?’ అనే వాదనల్లో అవినీతి ముఠాల అక్రమ వలయం స్పష్టమవుతోంది. ‘నీతిగా ఉండటానికి నేనేమైనా గాంధీనా?’ అనే సమాధానం చూస్తే, నేటి సమాజంలో నిజాయితీ ఎంత అరుదైన విషయంగా, చులకనగా మారిపోయిందో అర్థమవుతుంది.

పదవీ విరమణ చేసిన తరువాత గౌరవంగా విశ్రాంతి తీసుకోకుండా, ఎన్నికల వైపు లంఘించేవారు దానిని ఒక సహజ పరిణామంగా చిత్రీకరిస్తున్నారు! ఇటువంటి వారు రాజకీయాల్లో చేరుతున్నంత కాలం, ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకమని నమ్మడం కష్టం. అలాగే, విద్యారంగాన్ని వ్యాపారంగా మార్చి కోట్లు ఆర్జించిన వ్యక్తులు, సేవ చేయడానికే రాజకీయాల్లోకి వస్తున్నారని ఎవరూ నమ్మడం లేదు. నీతిగా బతకడం అంటే జీవితంలో ఓడిపోవడమే అని భావించే సమాజంలో, అధికారంలో ఉన్నవారు పదే పదే గెలుస్తుంటే వారు లంచాలు తిననట్టా? లేదా ఇతరులకు తినిపించనట్టా? మనకు చూపిస్తున్న దృశ్యం వెనుక ఉన్న వాస్తవాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నాం?


ఏదైనా ఒక శాఖలోని ఉద్యోగి అవినీతి సొమ్ముతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినప్పుడు– ‘ఇది మా శాఖకు ఎంతో చెడ్డపేరు తెచ్చిపెట్టింది’ అని బహిరంగంగా ఖండించిన మంత్రులు ఉన్నారా? లేరు. వారి ఈ మౌనం వెనుక దాగి ఉన్న నిండు సత్యాలేమిటి? ఒక లాభసాటి పదవిని ఎలా దక్కించుకోవాలో, ఆ సీటులో కూర్చుని ఎవరు ఏ స్థాయిలో చెలరేగిపోతున్నారో సంభ్రమాశ్చర్యాలతో చర్చించుకునే ముఠాలకు అధికార కారిడార్లలో కొదవలేదు. అవినీతిని ఒక కళాత్మక నైపుణ్య స్థాయికి తీసుకెళ్లిన వారి పట్ల సమాజంలోనూ, తోటి అధికారుల్లోనూ ఒక రకమైన గౌరవం పెరిగిపోతోంది. ప్రత్యేక శిక్షణ లేకుండానే లంచాల ఆర్జనలో ఇటువంటి ‘నైపుణ్యం’ సాధించడం సాధ్యం కాదు. ఇలాంటి అధికారులకు ఇతర శాఖల నుంచి కూడా తీవ్రమైన డిమాండ్ ఉంటుంది! నిబంధనలను పక్కనపెట్టి నిధులు రాబట్టగల నేర్పరులైన ఇటువంటి అధికారులను వెతికి మరీ మంత్రుల పేషీల్లో ప్రత్యేక అధికారులుగానో, సలహాదారులుగానో నియమించుకుంటున్నప్పుడు.. సాదాసీదా ఉద్యోగి మాత్రం మేతమేయకుండా గట్టు మీద కూర్చుంటాడా? నిఘా వ్యవస్థలు కునుకు తీస్తున్నప్పుడు ఆ ఉద్యోగి హఠాత్తుగా కోట్లు పోగేసినట్టు చెప్పడం కుదురుతుందా? ‘వేల కోట్లు కొల్లగొట్టిన బడా తిమింగలాలను వదిలేసి, కేవలం వందల కోట్లు కూడబెట్టిన చిన్న చేపలను మాత్రమే పట్టుకున్నారు’ అనే విమర్శే ఇక్కడ సత్యానికి చాలా దగ్గరగా ఉంటుంది. అంతేకాదు, ‘ఒకవేళ నిజంగా అవినీతి ప్రక్షాళన మొదలుపెడితే అసలు ఎంతమందిని ఉద్యోగాల నుంచి తొలగించగలం? అందుకే ఒక పరిమితి దాటకుండా అవినీతిని అదుపు చేయడమే ప్రభుత్వ బాధ్యత’ అంటూ ఒక అగ్రనేత చేసే ప్రకటనలోని నిజాయితీని చూడాలి. వంద రూపాయల లావాదేవీలో పది రూపాయల అవినీతి ఆమోదయోగ్యమే అయితే.. అదే ప్రాతిపదికన లక్ష కోట్ల బడ్జెట్‌లో పదివేల కోట్ల అవినీతి కూడా సహజంగానే ఆమోదనీయం అవుతుంది కదా?


అణగారిన వర్గాలు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని పడే ఆరాటం కేవలం సామాజిక గుర్తింపు కోసమే అయి ఉంటే ఎంత బాగుండేదో! అధికారం అనేది ప్రజలందరి ఉమ్మడి వనరు అని, పుట్టుక నుంచి చావు వరకు సామాన్యుడికి దాంతో అవసరం పడుతుందనే స్పృహ అందరికీ ఉంది. కానీ అదే సమయంలో, ప్రభుత్వంపైనే పూర్తిగా ఆధారపడే బలహీన వర్గాల కష్టార్జితాన్ని అధికార బలంతో ఎలా ఒడుపుగా పిండుకోవచ్చో అనే తెలివితేటలు కూడా ఉద్యోగులలో పెరిగిపోతున్నాయి.

అవినీతిని అర్థం చేసుకోవడానికి దానికి ఉన్న సామాజిక సందర్భాన్ని కూడా పరిశీలించాలి. నేటి మధ్యతరగతిని ఒక కొత్త ఆకర్షణల ప్రపంచం ఆహ్వానిస్తోంది. అయితే అది శ్రీశ్రీ ఊహించిన ‘మరో ప్రపంచం’ కాదు. భౌతిక సుఖాలు, విలాసవంతమైన జీవితపు కొత్త రుచుల ప్రపంచం! ఫామ్‌హౌస్‌లు, విదేశీ విద్యలు, అట్టహాసంగా జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్‌లు వారిని ఊరిస్తున్నాయి. థాయ్‌లాండ్, వియత్నాం, దుబాయ్, లాస్ ఏంజెల్స్‌ వంటి విదేశీ తీర్థాల నుంచి.. మానససరోవరం, అయోధ్య, కేదారనాథ్, పశుపతినాథ్‌ల ఆధ్యాత్మిక గమ్యస్థానాల వరకు అన్నీ ఆకర్షిస్తున్నాయి. కేవలం సాధారణ ఉద్యోగాల నెలసరి జీతాలతోనే ఈ ఖరీదైన గమ్యాలను చేరుకోవాలనుకోవడం అమాయకత్వమే అవుతుంది. ఒకవైపు ఇటువంటి విలాసవంతమైన జీవనశైలిని ప్రోత్సహించి, ఆరాధించి, సమాజంలో గౌరవాలు కట్టబెడుతూ.. తీరా ఆ హోదా కోసం అక్రమంగా నోట్ల కట్టల శిఖరాలను అధిరోహించిన వారిని ‘నూరు తప్పులు చేశారు’ అని వేలెత్తి చూపడం తర్కానికి అందని విషయం. నిజానికి నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం చుట్టూ తిరిగే కథలు చాలా మందికి స్ఫూర్తిని ఇస్తున్నాయేమో చూడాలి.


వ్యవస్థ తనకు లేని విశ్వసనీయతను ఉన్నట్టు ప్రదర్శించడానికి చేసే ప్రయత్నం ఫలిస్తున్న దాఖలా లేదు. కెమెరాల ముందు నోట్ల కట్టలను లెక్కించడం సులభమే కావచ్చు కానీ, ఆ సంపద వెనుక ఉన్న సూత్రధారులను, బినామీ వ్యవస్థల అసలు రూపాన్ని బయటకు తీయడం అంత తేలిక కాదు. ‘అయినప్పటికీ రైడుకు పోయిరావలెను...’ అంటూ సాగే ఈ విఫల నాటకాన్ని రక్తి కట్టించడం సాధ్యం కాదు. ఈ ముసుగు నాటకం ఆడక తప్పకపోవచ్చు. కానీ, జీవితంలో ఎదగడం అంటే కేవలం ఆస్తులు, సంపద పోగేయడమే అని భావించే నైతిక దారిద్య్రం ఉన్నంత కాలం.. సమాజం అనివార్యంగా ఈ అవినీతి సుడిగుండంలోకి జారిపోతూనే ఉంటుంది. తప్పని తెలిసే ఈ తంతు సాగిపోతోంది. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దంలోనే రాజోద్యోగులు పాల్పడే నలభై రకాల అక్రమాలను ‘అర్థశాస్త్ర’ కర్త కౌటిల్యుడు గుర్తించాడు. అయితే, నాటి ఆ ఘనమైన వారసత్వాన్ని నేడు యథావిధిగా కొనసాగిస్తున్న వారిని సమాజం జాతిరత్నాలు అంటుంటే, చట్టం మాత్రం మొక్కుబడిగా ‘అవినీతిపరులు’ అంటోంది.

ఇదంతా ఎవరికి తెలియదు? అందరికీ తెలిసిన విషయం ఎందుకు చెప్పాలి? అన్యాయం జరుగుతున్నప్పుడు చూసి కూడా మౌనంగా ఉండేవారికి, అన్యాయానికి పాల్పడిన వారి కంటే ఎక్కువ శిక్ష పడాలని ద్రౌపది అంటుంది. దుర్యోధన దుశ్శాసనులు మదంతో అన్యాయానికి ఒడిగడుతుంటే.. ఆ అన్యాయం తమ కళ్లెదుటే జరుగుతున్నా భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు మౌనంగా ఉండిపోవడం మరింత తీవ్రమైన నేరమని మహాభారతం వాదిస్తుంది. లంచం తీసుకునే సాధారణ ఉద్యోగి నేరస్థుడే కావచ్చు, కానీ వ్యవస్థకు ఆమోదయోగ్యంగా మారిపోయిన ఈ సామాజిక– రాజకీయ అవినీతి సంస్కృతి ముఖ్యంగా పేదలకు ఎంతో ప్రమాదకరమైనది!

- ప్రొ. మురళి కర్ణం (నల్సార్‌ వర్సిటీ)

Updated Date - Oct 13 , 2026 | 01:16 AM