నదుల అనుసంధానం... తెలంగాణ హక్కులకు విఘాతం
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:52 AM
నదుల అనుసంధానమనే ముసుగులో కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఏకపక్ష విధానాలు గోదావరి, కృష్ణా జలాలలో తెలంగాణకు ఉన్న న్యాయబద్ధమైన వాటాను దెబ్బతీసే ప్రమాదాన్ని సృష్టిస్తున్నాయి...
నదుల అనుసంధానమనే ముసుగులో కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఏకపక్ష విధానాలు గోదావరి, కృష్ణా జలాలలో తెలంగాణకు ఉన్న న్యాయబద్ధమైన వాటాను దెబ్బతీసే ప్రమాదాన్ని సృష్టిస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ గట్టిగా కొట్లాడాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతారహిత వైఖరి అవలంబించడం విచారకరం. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణలో అలసత్వం ప్రదర్శిస్తే, అది చారిత్రక తప్పిదంగా మిగిలిపోతుంది. తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న జల ద్రోహాన్ని భవిష్యత్ తరాలు క్షమించవు.
గోదావరి నుంచి ఏకంగా 200 టీఎంసీల నీటిని తరలించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగా గోదావరి–బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదిస్తే దీన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా పరీవాహక ప్రాంతానికి మళ్లిస్తే జల వివాదాల ట్రైబ్యునల్ (GWDT) అవార్డు ప్రకారం తెలంగాణకు 45 టీఎంసీల మేర అదనపు నీటి హక్కులు సంక్రమిస్తాయని స్పష్టం చేస్తూ పోరాటం సాగించింది. బీఆర్ఎస్ నిరంతర ఒత్తిడితో బనకచర్ల ప్రాజెక్టు పేరును మార్చి ‘నల్లమల సాగర్’గా ప్రకటించినా, అసలు ఉద్దేశంలో మార్పు రాలేదు. ఈసారి కృష్ణానదిలో కలపకుండా గోదావరి జలాలను నేరుగా నల్లమల సాగర్‌కు తరలించే ప్రయత్నం చేశారు. గోదావరిలో ‘మిగులు జలాలు’ ఉన్నాయనే వాదననే ప్రశ్నిస్తూ, ప్రాజెక్టు నిర్మాణంపై బీఆర్ఎస్ నిలదీసింది. నికర జలాల కేటాయింపులు లేకుండా బనకచర్ల–నల్లమల సాగర్ ప్రతిపాదనలు ముందుకు సాగకపోవడంతో, ఇప్పుడు అదే లక్ష్యాన్ని ‘గోదావరి–కావేరి నదుల అనుసంధానం’ అనే కొత్త ముసుగులో అమలు చేయాలనే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
నదుల అనుసంధానం అంశంపై జరిగిన అనేక NWDA సమావేశాల్లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున ఇరిగేషన్ మంత్రిగా నేను పాల్గొన్నాను. కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ తరఫున అభిప్రాయాలు, అభ్యంతరాలను తెలియజేశాం. గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల వినియోగానికి సంబంధించిన ప్రాజెక్టులకు పూర్తి స్థాయి అనుమతులు, అమలు జరిగాకే నదుల అనుసంధానం గురించి చర్చించాలని స్పష్టంగా చెప్పాం. అంతేకాదు, నదుల అనుసంధానం ద్వారా తరలించే జలాల్లో కనీసం 50శాతం వాటా తెలంగాణకు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాం. అలాగే ఈ అనుసంధాన ప్రక్రియను తెలంగాణలోని ఇచ్చంపల్లి లేదా సమ్మక్క సాగర్ నుంచి నాగార్జునసాగర్ వరకు చేపట్టాలని గట్టిగా వాదించాం. నదుల అనుసంధానం ఫలాలు తెలంగాణ ప్రాంతానికి దక్కాలని పోరాడినం.
గత ప్రతిపాదనల్లో సమ్మక్క సాగర్ లేదా ఇచ్చంపల్లి నుంచి నదుల అనుసంధానం చేపట్టాల్సి ఉండగా, ఇప్పుడు తెలంగాణను పూర్తిగా పక్కనపెట్టి పోలవరం–నల్లమల సాగర్–గ్రాండ్ ఆనికట్ మార్గాన్ని ప్రతిపాదించారు. దీంతో ఈ నదుల అనుసంధాన ప్రాజెక్టులో తెలంగాణకు ఎలాంటి భాగస్వామ్యం లేకుండా పోయింది.
రెండో అంశం.. నదుల అనుసంధాన ప్రాజెక్టుకు అంగీకరిస్తే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ఏపీ నుంచి ఎన్ఓసీ తెస్తానని ముఖ్యమంత్రి చెబుతున్నారు. అయితే ఇది తెలంగాణకు దక్కాల్సిన గోదావరి, కృష్ణా జలాల వినియోగంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. 90 టీఎంసీల పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు అవసరమైన నీటిని నాటి కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. ఇందులో 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్, మరో 45 టీఎంసీలు పోలవరం ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌లోకి మళ్లించడం వల్ల తెలంగాణకు హక్కుగా లభించాల్సిన వాటా. ఈ అంశంపై ట్రిబ్యునల్ తీర్పు కూడా త్వరలో వెలువడనుంది. మొత్తంగా తెలంగాణకు 700కు పైగా టీఎంసీల కృష్ణా నీళ్లు వాటాగా వస్తాయి. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలకు ఒప్పుకున్నా ట్రిబ్యునల్ ద్వారా మనకు దక్కే నీటి వాటాలో కోత పడుతుంది.
మూడో అంశం.. పాలమూరు ప్రాజెక్టుకు ఏపీ ఎన్‌ఓసీ ఇవ్వాలంటే సమ్మక్క సాగర్‌కు కేటాయించిన 47 టీఎంసీలను ఏపీకి వదులుకోవాలని కేంద్ర జలసంఘం చేత ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించడం విడ్డూరం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే, గోదావరిలో తెలంగాణకు ఉన్న 968 టీఎంసీల నీటిలో కోత పడుతుంది. కేసీఆర్ పదేళ్ల పాటు గోదావరిలో 968 టీఎంసీల తెలంగాణ హక్కులు కాపాడారు. ఇందులో 828 టీఎంసీలకు టీఏసీ అనుమతులు, 933 టీఎంసీలకు హైడ్రాలజీ అనుమతులు సాధించారు. పెండింగ్‌లో ఉన్న 140 టీఎంసీలకు టీఏసీ అనుమతులు తేవడం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం, ఉన్న నీటి హక్కులను పక్క రాష్ట్రానికి తాకట్టు పెడుతున్నది.
వరద జలాల ఆధారంగా ప్రాజెక్టులకు అనుమతులు జారీ చేసే విధానం దేశంలో లేదు. అందుకే రూట్ మార్చిన ఏపీ ప్రభుత్వం నికర జలాలు ఉన్నాయని చూపే కుట్ర చేస్తున్నది. అందులో భాగంగా.. గోదావరి–కావేరి అనుసంధాన ప్రాజెక్టును ఇచ్చంపల్లి నుంచి పోలవరానికి మార్చడం, పాలమూరు ప్రాజెక్టును సాకుగా చూపి సమ్మక్కసాగర్‌కు కేటాయించిన 47 టీఎంసీలను వేరే దిశకు మళ్లించడం... వంటివి చేస్తున్నారు. దీనికి తోడు గోదావరి–కావేరి అనుసంధానంలో ఏపీ వాటా 45 టీఎంసీలు, పోలవరం లెక్కల్లో మినహాయించిన 15 టీఎంసీలు, కర్ణాటక వాటా 16 టీఎంసీలను ఏపీ వినియోగించేలా మార్పులు చేయడం వంటి ప్రతిపాదనలతో మొత్తం 123 టీఎంసీల గోదావరి నికర జలాలను సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వరద జలాల ప్రాజెక్టుగా ఉన్నది నికర జలాల ప్రాజెక్టుగా మారిపోతుంది. గోదావరిలో అనుమతులు రాని 140 టీఎంసీలతో పాటు, ఇంటర్ లింకింగ్ డైవర్షన్‌లో వచ్చే సగం, అంటే 74 టీఎంసీలు మొత్తంగా 213 టీఎంసీలను తెలంగాణ కోల్పోతుంది. తెలంగాణకు అన్యాయం చేస్తూ, ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే లాభం చేకూర్చే ఈ ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు ఎలా అవుతుంది?
మేడిగడ్డకు మరమ్మతులు చేయకపోవడం, పాలమూరు ప్రాజెక్టుపై నిర్లక్ష్యం ప్రదర్శించడం, ఈ వాటర్ ఇయర్‌లో కేవలం 25శాతం కృష్ణా నీటిని మాత్రమే వినియోగించడం కాంగ్రెస్ ద్రోహ వైఖరికి నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి తెలంగాణ జల హక్కులకు విఘాతం కలిగిస్తుంటే, తెలంగాణకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటం బాధాకరం. ఏపీ జల దోపిడీని అడ్డుకోవడంలో ముందుండి పోరాటం చేయాల్సిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏపీకి వత్తాసు పలకడం తెలంగాణకు చేస్తున్న తీరని అన్యాయం.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని గోదావరి–కావేరీ లింక్ ప్రాజెక్టుపై స్పష్టమైన వైఖరిని ప్రకటించాలి. అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఏపీ అక్రమ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. గురుదక్షిణ చెల్లించడం కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టాలని చూస్తే తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. కేసీఆర్ సారథ్యంలో మరో జలసాధన ఉద్యమానికి బీఆర్ఎస్ నాంది పలుకుతుంది. తెలంగాణ నీటి హక్కులను కాపాడుతుంది.
తన్నీరు హరీశ్‌రావు
మాజీ మంత్రి
ఇవి కూడా చదవండి..
అమేథీ పంచాయతీ ఓటర్ల జాబితా నుండి స్మృతి ఇరానీ పేరు గల్లంతు
మోహన్ భాగవత్ ప్రయాణిస్తున్న రైలుపై దాడి.. ఇద్దరి అరెస్టు