నిరసనలన్నీ ముస్లింల ఖాతాలోనే..!
ABN , Publish Date - Oct 25 , 2026 | 02:34 AM
ప్రపంచ దేశాల్లో ఇప్పుడొక ఒక విచిత్రమైన సంప్రదాయం కొనసాగుతోంది. తినడానికి తిండి దొరక్కపోయినా, ఉద్యోగాలు లేకపోయినా, మంచిచదువు అందకపోయినా, వైద్యం దొరక్కపోయినా...
ప్రపంచ దేశాల్లో ఇప్పుడొక ఒక విచిత్రమైన సంప్రదాయం కొనసాగుతోంది. తినడానికి తిండి దొరక్కపోయినా, ఉద్యోగాలు లేకపోయినా, మంచిచదువు అందకపోయినా, వైద్యం దొరక్కపోయినా ప్రజలు ప్రభుత్వాలను ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక పాలకులు ఆ నిందను ముస్లింల మెడకు చుడుతున్నారు. ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ తదితర యూరోపియన్ దేశాలలో యువతరం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నది. ఈ అసంతృప్తికి పరిష్కారం చూడమని సలహా ఇవ్వాల్సిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘పారిస్ అతి త్వరలో ముస్లింల నగరంగా మారబోతోంది!’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మేక్రాన్‌ను హెచ్చరించాడు.
భారత ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్‌కుమార్ రాజీనామాను కోరుతూ ఢిల్లీ జంతర్ మంతర్‌లో నిరసన ప్రదర్శనకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు ఇచ్చినపుడు దాన్ని ఆపడానికి మోదీ సర్కార్ జెన్‌జీపై ఉక్కుపాదం మోపింది. ఏకంగా 30 వేల మందికి పైగా సాయుధ బలగాల్ని మోహరించింది, నిషేధాజ్ఞలు పెట్టింది, మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసింది. 45 మెట్రో స్టేషన్లను మూసివేసి, ఢిల్లీకి వచ్చే దాదాపు 250 రైళ్లను రద్దు చేసింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా అన్న ప్రశ్నకు ప్రభుత్వం దగ్గర ఒక గొప్ప సమాధానం ఉంది. అది అప్పుడప్పుడు నోటితో చెపుతుంది, కుదరనప్పుడు సోషల్ మీడియా వాడుతుంది. ‘సాధారణంగా ఈ రైళ్లలో ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన ప్రయాణికుల రిజర్వేషన్లు 10 నుంచి 15శాతం మాత్రమే ఉంటాయట. కానీ అక్టోబర్ 9, 10 తేదీల్లో ఆ సంఖ్య 40 నుంచి 60 శాతానికి పెరిగిపోయిందట! ఎవరీ నిర్దిష్టవర్గం? ముస్లింలు అని చెప్పకనే చెప్పారు. ప్రభుత్వం నిందలు వేస్తుంది. ఆధారాలు చూపదు.
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేవి మన రాజ్యాంగ ఆదర్శాలు. ఈ మహోన్నత భావాల పుట్టినిల్లు 1789 నాటి ఫ్రెంచ్ విప్లవం. ఇప్పుడు ఆ పుట్టినింటిలోనే ఈ ఆదర్శాలకు ముప్పు వచ్చింది. ప్రస్తుత ఫ్రాన్స్ పరిస్థితి విక్టర్ హ్యూగో 1862లో రాసిన ‘లే మిజరబుల్స్’ ఫ్రెంచ్ నవలకు పోలి ఉంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ నవల అనేకభాషల్లో అనువాదమయింది. తెలుగులో రెండుసార్లు బీదలపాట్లు పేరుతో సిని మాగా వచ్చింది. పిల్లల ఆకలిని చూడలేక రొట్టెను దొంగిలించి జైలు పాలవుతాడు ప్రధానపాత్ర జీన్ వాల్జీన్. పిల్లల్ని చూడాలని జైలునుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో శిక్షను 19 ఏళ్లకు పెంచుతారు.
ఇటీవల ప్రపంచ దేశాలన్నింటిలోనూ సంపద పంపకాల్లో ఒక సాధారణ నియమం కనిపిస్తున్నది. దేశ సంపదలో అత్యధికం కొద్ది కుటుంబాల చేతుల్లో కేంద్రీకృతమవుతోంది. అతి తక్కువ సంపదను అత్యధిక కుటుంబాలు పంచుకోవాల్సి వస్తున్నది. ఫ్రాన్స్‌లో ప్రభుత్వ విద్యాసంస్థల్ని మూసేస్తున్నారు, క్లాస్ రూములు కిక్కిరిసిపోతున్నాయి. టీచర్లు లేరు. జీతాలు ఇంటి అద్దె చెల్లించడానికి కూడ సరిపోవడం లేదు. ఇంట్లో ఒక్కరికి ఆరోగ్య సమస్య వచ్చినా కుటుంబం రోడ్డున పడాల్సి వస్తోంది. ఈ దయనీయ పరిస్థితుల మీద పత్రికలు పుంఖాను పుంఖలుగా కథనాలు ప్రచురించాయి. సెప్టెంబర్‌లో అసహనం బద్దలయింది, అక్టోబర్‌లో తార స్థాయికి చేరుకుంది.
సీజేపీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాల జ్యుడిషియల్ కస్టడీ కేసు విచారణకు వచ్చినపుడు ఢిల్లీ హైకోర్టు బెంచి మీరిద్దరూ జెన్–జీ కాదుకదా? అని ఒక ఆసక్తికర వ్యాఖ్య చేసింది. 1997–2012 మధ్య కాలంలో పుట్టిన వారిని జెన్–జీ అంటారు. వాళ్ళిద్దరూ అంతకన్నా ముందు పుట్టారని హైకోర్టు బెంచి గుర్తు చేసింది. ఫ్రాన్స్‌లో నిరసన ప్రదర్శనలకు నాయకత్వం వహిస్తున్న ర్యాధ్ రానీ 2007లో పుట్టాడు. అచ్చమైన జెన్–జీ. ముక్కుపచ్చలారని ఈ 19 యేళ్ళ కుర్రాడు హైస్కూలు విద్యార్థి యూనియన్ యాక్టివిస్టు. ఇప్పుడు ఇదొక ట్రెండ్. పటిష్ఠమైన నిర్మాణాలున్న వ్యక్తులు, సంస్థలు చేయలేని అద్భుతాలను ‘కుర్రకుంకలు’ చేసేస్తున్నారు. వీళ్లు ఎంతకాలం నిలబడతారూ వంటి ప్రశ్నలు సహజంగానే ముందుకు వస్తాయి. సీజేపీ నాయకుడు అభిజిత్ దీప్కేమీద మన దగ్గర కూడ అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి. నిజానికి అతను చేయాల్సిన పనిని ఈ పాటికే చేశాడు. సింహాసనాన్ని వణికించాడు, ఆ సింహాసనం మీద ప్రజల్లో భయాన్ని పోగొట్టేశాడు. సీజేపీ నిలదొక్కుకుంటుందా? ఎవరితో జత కడుతుంది? వగైరాలన్నీ జరగవచ్చు, జరక్కపోనూవచ్చు. అయినప్పటికీ అభిజిత్ ఈ పాటికే చేసిన పని చరిత్రలో నిలిచిపోతుంది.
ఫ్రాన్స్ నిరసన ప్రదర్శనల్లో మనకు టోపీవాలాలు, బుర్ఖా మహిళలు కనిపించరు. కానీ, ట్రంప్ వంటివాళ్ళు వాళ్లందర్నీ ముస్లింల ఖాతాలో వేస్తున్నారు. కొత్త పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా సాగిన షాహీన్ బాగ్ ఉద్యమం అచ్చంగా ముస్లిం మహిళలు నడిపిన కార్యక్రమం. ఈ జంతర్ మంతర్ ఉద్యమం అలా కాదు. నిరసనల్లో చాలా అరుదుగా మాత్రమే ముస్లింలు కనిపిస్తారు. అయినప్పటికీ ముస్లింలే దాన్ని నిర్వహిస్తున్నారని ప్రభుత్వవర్గాలు ప్రచారం చేస్తున్నాయి.
పోలీసులకు ఒక అపద్ధర్మ నియమం ఉంటుంది. ‘Round up the usual suspects.’ ‘ఎప్పుడూ అనుమానించేవాళ్లనే మళ్లీ పట్టుకోండి!’ ఏదైనా ఒక పెద్ద సంఘటన జరగ్గానే వాళ్ళు హడావిడిగా కొందరిని అరెస్టు చేసి, అప్రమత్తంగా ఉన్నామనే సంకేతాన్ని ఇస్తుంటారు. 2007 మే నెలలో హైదరాబాద్ మక్కా మసీదులో పేలుడు జరిగినపుడు పాతబస్తీలో అనేకమంది ముస్లింలను జైళ్లకు పంపించారు. మీడియా చెలరేగిపోయింది. కొంతకాలం తరువాత ఆ సంఘటన వెనుక అభినవ భారత్ అనే సంస్థ పేరు బయటికి వచ్చింది. స్వామీ ఆసీమానంద తదితరుల్ని అరెస్టు చేసి ముస్లింలను విడుదల చేశారు. 2020 మార్చి నాటి సంచలన నిజాముద్దీన్ మర్కజ్–కరోనా సూపర్ స్ర్పెడర్ కేసు కూడ ఇలాంటిదే. మర్కజ్లో ముస్లింలు కరోనాను ‘సోకించుకుని’ దాన్ని దేశమంతా వ్యాపింపచేయాలని కుట్ర చేశారనేది ఆరోపణ. ఈ మాత్రం ఉప్పు అందగానే ‘ఒళ్ళో మీడియా’ (గోదీ మీడియాకు తెలుగు) చెలరేగిపోయింది. ఆ సందర్భంగా మర్కజ్లో వున్న 70 మందిని అరెస్టు చేశారు. విచిత్రం ఏమంటే వైద్య పరీక్షల్లో వారిలో ఒక్కరికీ కరోనా పాజిటివ్ రాలేదు. ఢిల్లీ హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు ఈ కేసుల్ని నిరాధారంగా తేల్చి కొట్టిపడేశాయి. ఈ లోపు ముస్లిం ఫోబియా తెగ ప్రచారం అయిపోయింది.
దేశ సంపద పెరిగినంత మాత్రాన ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని అనుకోవడానికి వీల్లేదు. కార్పొరేట్ లాభాలు పెరగవచ్చు, స్టాక్ మార్కెట్లు ఎగబాకవచ్చు. కానీ ఆ సంపదలో సామాన్యులకు ఎంత వాటా దక్కుతోంది? అనేది ప్రశ్న. ద్రవ్యోల్బణం అంటే కేవలం మార్కెట్లో ధరలు పెరగడం కాదు. ఆదాయాలు, ఖర్చుల మధ్య సంబంధం కూడా ముఖ్యం. ధరలు పెరుగుతున్నప్పుడు ఆదాయం పెరగకపోతే, ప్రజల వాస్తవ కొనుగోలు శక్తి పడిపోతుంది.
ఫ్రాన్స్ ఆందోళనకారులు మూడే ప్రశ్నలు అడుగుతున్నారు. ఒక టీచర్ జీతంతో కుటుంబ ఖర్చులు తీరుతున్నాయా? ఒక విద్యార్థి భవిష్యత్తుకు సమాన అవకాశాలు ఉన్నాయా? ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికేవరకు ర్యాద్ రానీ కాకపోతే మరొకరు జనాన్ని రోడ్ల మీదికి తీసుకుని వస్తారు. ఇది చర్యకు ప్రతిచర్య. చర్యను ఖండించని వారు ప్రతిచర్యను ఖండించడం సబబు కాదు.
ట్రంప్ మేక్రాన్‌ను హెచ్చరించాడు గానీ అతని భయాలు అతనికి ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా జీడీపీ 32 ట్రిలియన్ డాలర్లు. జాతీయ రుణం 41 ట్రిలియన్ డాలర్లు. డెట్ టు జీడీపీ రేషియో 127 శాతం. అంటే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని అర్థం. ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ నిరసనలు త్వరలో అమెరికాలోనూ చెలరేగే అవకాశం ఉండటంతో ముందుగానే ట్రంప్ బ్లేమ్ గేమ్ మొదలెట్టారు. ఇప్పటికే ఆయన న్యూయార్క్ ముస్లింల నగరంగా మారిపోయిందని అంటున్నారు. రేపు అమెరికా ముస్లింల దేశంగా మారిపోయిందని అంటారు. ఆ రోజులు ఎంతో దూరంలో లేవు.
డానీ
సమాజ విశ్లేషకులు
ఈ వార్తలూ చదవండి
అభిజీత్ దీప్కే లాంటి వాళ్లు వస్తారు.. సీజేపీ నేతపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు..
గ్రీకు రెస్టారెంట్లో తొలి పరిచయం.. రాజీవ్ గాంధీతో ప్రేమకథను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ..