Share News

గాజా గుర్తుందా?

ABN , Publish Date - Oct 09 , 2026 | 01:45 AM

ఇరాన్‌తో అమెరికా చేస్తున్న యుద్ధం, ఏర్పడిన సంక్షోభాలతో ప్రపంచం గాజా బాధను పూర్తిగా గాలికి వదిలేసింది. గాజాను ఉద్ధరిస్తామంటూ పలు దేశాలు చేసిన వాగ్దానాలు మాటలకే పరిమితమైనాయి.

గాజా గుర్తుందా?

ఇరాన్‌తో అమెరికా చేస్తున్న యుద్ధం, ఏర్పడిన సంక్షోభాలతో ప్రపంచం గాజా బాధను పూర్తిగా గాలికి వదిలేసింది. గాజాను ఉద్ధరిస్తామంటూ పలు దేశాలు చేసిన వాగ్దానాలు మాటలకే పరిమితమైనాయి. మూడేళ్ళక్రితం అక్టోబర్‌ 7న హమాస్‌ జరిపిన నరమేధంలో 1,200 మంది ఇజ్రాయెల్‌ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఓ 250 మందిని బందీలుగా తీసుకుపోయారు. దీనికి ప్రతీకారంగా, గాజాలో ఇజ్రాయెల్ రెండేళ్ళపాటు అతిభయానకమైన యుద్ధాన్ని కొనసాగించింది. ఐక్యరాజ్యసమితి విచారణ కమిషన్ సహా చాలా సంస్థలు దీనిని నరమేధం అన్నాయి. 75వేలకు పైగా పాలస్తీనియన్లు మరణించారు, నేలమట్టమైన ఆ గాజా శిథిలాల కింద ఇంకా అనేకవేలమంది పూడుకుపోయారు. నేటికి ఏడాది క్రితం అమెరికా ఒత్తిడిమేరకు కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తరువాత కూడా ఓ పద్నాలుగు వందలమంది గాజా ప్రజలు ఇజ్రాయెల్‌ హింసతో కన్నుమూశారు. ఐడీఎఫ్ ఆధ్వర్యంలో భారీ ఊచకోతలు ఆపి, చిన్నాచితకాదాడుతో ఇజ్రాయెల్ తన దమనకాండను కొనసాగిస్తూనే ఉంది. ఆహారం, మందులు ఇత్యాది సరఫరాలమీద ఇజ్రాయెల్‌ ఆంక్షలతో మిగిలిన గాజావాసులు ప్రత్యక్షనరకం అనుభవిస్తున్నారు. గాజా పునర్నిర్మాణం ఊసే ప్రపంచం మరిచిపోయింది.


అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెచ్చిన 20 -అంశాల శాంతి ప్రణాళిక తొలిదశలో భాగంగా 2,000 మంది పాలస్తీనా ఖైదీల విడుదలకు బదులుగా, హమాస్‌ దగ్గర ప్రాణాలతో మిగిలివున్న ఇజ్రాయెలీ బందీలు ఇళ్లకు చేరుకున్నారు, ఇళ్ళు కోల్పోయిన లక్షలాదిమంది గాజావాసులు ఉత్తరదిక్కుకు తరలివెళ్లారు. అమెరికా అధ్యక్షతన అనేక దేశాలతో కూడిన శాంతి మండలితో పాటు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కూడా ఈ ప్రణాళికను ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే, మిగతా ప్రపంచం నుంచి ఒత్తిడిలేకపోవడంతో, ట్రంప్‌ ప్రణాళిక రెండోదశ నత్తనడకన సాగుతోంది. గాజాలో భద్రతను పర్యవేక్షించాల్సిన దళాలు కానీ, దానిని పాలించాల్సిన సాంకేతిక నిపుణుల కమిటీ కానీ ఇంకా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగలేదు. ఆయుధాలు వదిలేయడానికి హమాస్‌ సిద్ధంగా లేదు కనుక, అది పూర్తిగా అస్త్రసన్యాసం చేస్తే తప్ప పునర్నిర్మాణానికి ఇజ్రాయెల్‌ ఒప్పుకోవడం లేదు. దీంతో ఆ పనులు ఆరంభించే ప్రయత్నం కూడా బలంగా సాగడం లేదు. ఈ నెలాఖరులో ఎన్నికలు జరగబోతున్నందున నెతన్యాహూ శాంతి ప్రక్రియకు మోకాలడ్డుతూనే ఉన్నారు. గాజాతో ఎంత నిర్దయగా వ్యవహరిస్తే ఓటర్లు తమను అంతగా ఆదరిస్తారని నెతన్యాహూ నేతృత్వంలోని మితవాద కూటమి నమ్మకం.


ఉక్రెయిన్‌, ఇరాన్‌, లెబనాన్‌ యుద్ధాలు, అవి తెచ్చిన ఆహార, ఇంధన సంక్షోభాలు ముఖ్యమైపోయి, గాజాలో ఇజ్రాయెల్‌ సాగిస్తున్న హింస, వెస్ట్‌బ్యాంకులో అది ఉధృతంగా సాగిస్తున్న దురాక్రమణలు ప్రపంచానికి పట్టడం లేదు. పాలస్తీనియన్లపై యూదుసెటిలర్ల దాడులు కూడా రికార్డుస్థాయిని దాటిపోయాయి. అక్టోబర్ 27న జరగబోయే పార్లమెంటరీ ఎన్నికల్లో తిమ్మినిబమ్మిని చేసైనా నెగ్గుకురావడానికి నెతన్యాహూ ప్రయత్నిస్తున్నారు. ఆయనకు విజయావకాశాలు తక్కువని అనేక సర్వేలు నిర్థారించిన తరుణంలోనే, ఫ్లైదుబాయ్‌ ఘటన జరిగింది. ప్రజలను నిత్యం భద్రతాభయంలో ముంచెత్తుతూ వారి ఏకైక రక్షకుడుగా తానే కనిపించాలన్న నెతన్యాహూ విధానానికి ఇది మరింత ఉపకరిస్తుంది. మహామతోన్మాది అన్న భయంతో ఒమాన్‌ నిషేధించిన వ్యక్తి, ఇజ్రాయెల్‌కు పోతున్న ఈ విమానంలోకి కో పైలట్‌గా ఎలా వచ్చికూర్చోగలిగాడన్న అనుమానం మిగతా ప్రపంచానికి అలాగే ఉండిపోయింది. ఈ ఘటన వెనుక ఏదో రాజకీయకుట్ర ఉన్నదన్న భావనతో కొన్ని మీడియా కథనాలు కూడా వెలువడ్డాయి. నిజానిజాలు అటుంచితే, ప్రజలను కాపాడలేని అసమర్థతను సైతం తనకు అనుకూలంగా మార్చుకోగల సమర్థుడు నెతన్యాహూ. హమాస్‌దాడిని వాడుకున్నట్టే, ఫ్లైదుబాయ్‌ ఘటనను కూడా ఆయన తన ఓటుబ్యాంకును సుస్థిరం చేసుకోవడానికి అనుగుణంగా మలుచుకుంటున్నారు. ఇజ్రాయెల్‌లో ప్రభుత్వం మారితేనే, గాజా పరిస్థితిలో కాస్తంత మార్పు మొదలుకావచ్చు.

Updated Date - Oct 09 , 2026 | 01:48 AM