ఇంటా బయటా పితృస్వామ్య బంధనాలే!
ABN , Publish Date - Jul 11 , 2026 | 03:04 AM
‘చైతన్య స్రవంతి’ కథన పద్ధతికి పథ నిర్దేశంచేసిన ఆంగ్ల రచయిత్రి వర్జీనియా వూల్ఫ్ 1929లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో విద్యార్థినుల నుద్దేశించి ఒక సుప్రసిద్ధ ప్రసంగాన్ని వెలువరించారు. సాహిత్య ప్రపంచం ఇప్పటికీ...
‘చైతన్య స్రవంతి’ కథన పద్ధతికి పథ నిర్దేశంచేసిన ఆంగ్ల రచయిత్రి వర్జీనియా వూల్ఫ్ 1929లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో విద్యార్థినుల నుద్దేశించి ఒక సుప్రసిద్ధ ప్రసంగాన్ని వెలువరించారు. సాహిత్య ప్రపంచం ఇప్పటికీ ఉటంకించే ఆ ప్రసంగంలో ఆంగ్ల సాహిత్య చరిత్రలో పురుష రచయితల ప్రాబల్యాన్ని గురించి ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. పురుష రచయితల ప్రాముఖ్యానికి కారణం జెండర్ వివక్షేనని అభిప్రాయపడ్డారు. సమాజ నిర్మాణం, స్వభావరీతుల్లో ఆ వివక్ష అంతర్లీనంగా ఉందని ఆమె పేర్కొన్నారు. పురుష రచయితల సాహిత్య సృజనలు వర్ధిల్లుతున్న విధంగా మహిళలు సృష్టించే సాహిత్య కృతులు సువిఖ్యాతమవ్వాలంటే రచయిత్రులకు రాజకీయ, ఆర్థిక స్వాతంత్ర్యం ఉండాలని వాదించారు. ‘ఒక మహిళకు ధనరాశులు, సాహిత్య సృజనకు ఆమెకు ఒక సొంత గది ఉండితీరాలని’ వర్జీనియా వూల్ఫ్ సుప్రసిద్ధంగా ఉద్ఘాటించారు.
ఆర్థిక భద్రత, సామాజిక హోదా ఉన్న ఉన్నత వంశ సంజాతురాలు వర్జీనియా. వాటితో పాటు తనకున్న అద్భుత అనుకూలతల గురించి ఆమె చెప్పలేదు. తనను ప్రగాఢంగా ప్రేమించే లియోనార్డ్ వూల్ఫ్ ఆమెకు ‘దైవమిచ్చిన భర్త’. తన భార్య తనకంటే అనంతంగా ప్రతిభావంతురాలు అని గుర్తించి ఆమె సృజనాత్మక సామర్థ్యాలు సమగ్రంగా వికసించేందుకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించిన వివేకశీలి లియోనార్డ్ వూల్ఫ్. అయితే వర్జీనియాను బైపోలార్ డిప్రెషన్ (తీవ్రమైన, నిరాశాజనకమైన మానసిక స్థితి) నుంచి విముక్తం చేయడంలో ఆ ఉదార హృదయుడు విఫలమయ్యాడు. పట్టి పీడిస్తున్న ఆ మానసిక వ్యాధి మూలంగా వర్జీనియా 1941లో ఆత్మహత్య చేసుకున్నారు. తన భర్తకు వదిలివెళ్లిన వీడ్కోలు సందేశంలో వర్జీనియా ఇలా రాశారు: ‘నా విషయంలో మీరు ఓర్పు చూపారు. నన్ను అపురూపంగా చూసుకున్నారు. ఒక భర్తగా, తోటి మనిషిగా మీరు చేయగలిగిన దాని కంటే అత్యుత్తమంగా ప్రతి విషయంలోనూ వ్యవహరించారు. నా ఆశలన్నీ హరించుకుపోయాయి, నా మనసు శూన్యమైపోయింది. అయితే మీ మంచితనాన్ని విస్మరించలేను. మీరు ఎంత ఉత్తమ స్వభావులు అనే విషయంలో నాకు ఇప్పటికీ పరిపూర్ణ నమ్మకం ఉన్నది’.
హిందీ రచయిత్రి మన్ను భండారి స్వీయ చరిత్ర ‘ఏక్ కహానీ యే భీ’ ఆంగ్లానువాదం ‘దిస్ టూ ఈజ్ ఏ స్టోరీ’ (ఇది కూడా ఒక కథే)ను చదివినప్పుడు వర్జీనియా వూల్ఫ్ అంతిమ మాటలు, లియోనార్డ్‌తో ఆమె వైవాహిక జీవితమూ గుర్తుకువచ్చాయి. మన్ను తండ్రి విద్వజ్ఞుడు, తల్లి ఉత్తమ గృహిణి. తనకు హిందీ సాహిత్యాన్ని బోధించిన షీలా అగర్వాల్ చదవడానికి పుస్తకాలు ఇచ్చి, ఆ తరువాత వాటి గురించి తనతో చర్చించేవారని మన్ను రాశారు. ఆమె గురించి ఇంకా ఇలా రాశారు: ‘షీలాజీ నాకు ధైర్యాన్నిచ్చారు, నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. జీవితంలో ఒక దిశానిర్దేశం చేశారు. నా జీవితానికొక అర్థాన్ని కల్పించారు’. మన్ను భండారి తన స్వీయచరిత్రలో సాహిత్య జీవితం గురించి విశేష శ్రద్ధాసక్తులతో రాశారు. తాను రాసిన నవలలు, కథలు; రచనా శైలులు, రచయితల కలహాలు, విరోధాలు; రచయితల బృందాలు, ముఠాలు వాటి వైనాలు; సాహిత్య జీవితంలో దార్శనిక సంపాదకుల, సాహిత్య పత్రికల పాత్ర తదితర అంశాలను వివరంగా ప్రస్తావించారు. ‘మై హర్ గయా’ (నేను ఓడిపోయాను) అన్న తన తొలి కథ ఒక పత్రికలో ప్రచురితమయినప్పుడు తాను ఎంతగానో పులకించిపోయానని మన్ను రాశారు. అటువంటి పులకింపు మరెప్పుడూ జీవితంలో ఎన్నో ముఖ్యమైన సంఘటనల సందర్భాలలో కూడా తనకు కలగలేదని మన్ను గుర్తు చేసుకున్నారు.
మన్ను స్వీయచరిత్రలో కొన్ని భాగాలు సాహిత్య, సాహిత్య చరిత్ర విద్యార్థులకు విశేష ఆసక్తి కలిగిస్తాయి. ఇతర భాగాలు ముఖ్యంగా తన వైవాహిక జీవితం గురించిన ఆమె కథనాలు విస్తృతంగా ఆసక్తికరమైనవి. భారతీయ పితృస్వామ్య వ్యవస్థపై ఆమె నిర్మొహమాటంగా వెలుగులు ప్రసరించారు. కలకత్తాలో ఉన్నప్పుడు మన్నుకు సాహిత్య ప్రతిభాశాలి రాజేంద్ర యాదవ్‌తో పరిచయమయింది. ఆ పరిచయం ప్రేమగా పరిణమించింది. ఆ ప్రేమ వివాహంగా రూపుదాల్చింది. భార్యాభర్తలు అయిన కొద్ది కాలానికే ఇరువురమూ ఇక నుంచి సమాంతర జీవితాలు గడుపుదామని రాజేంద్ర ఆమెకు స్పష్టం చేశాడు. ‘ఒకే ఇంటిలో ఉంటున్నప్పటికీ మనం మన సొంత బతుకులు బతుకుదాం.. ఒకరి జీవితంలో మరొకరు జోక్యం చేసుకోకుండా స్వతంత్రంగా, స్వేచ్ఛగా వేర్వేరుగా జీవిద్దాం అని రాజేంద్ర నిర్దేశించాడు. మన్ను నుంచి వీలైనంత ఎక్కువ సమయం తన పురుష స్నేహితులతో ఉబుసుపోక కబుర్లు చెప్పుకునేందుకు లేదా ఇతర మహిళలతో ప్రేమాయణాలు సాగించేందుకే రాజేంద్ర ప్రాధాన్యమిచ్చేవాడు. మన్నుతో వైవాహిక బంధం తెగిపోయే వరకు రాజేంద్ర అనేకానేక ప్రేమాయణాలలో కొనసాగాడు. తన సంసార జీవితం రాజేంద్ర అబద్ధాలు, వంచనలతో గడిచిందని మన్ను రాశారు.
కలకత్తాలో పదేళ్ల కాపురం అనంతరం ఇరువురూ హిందీ సాహిత్య జగత్తుకు కేంద్రమైన ఢిల్లీకి మారారు. ఢిల్లీ జీవితంలోనే ఇరువురూ తమ సుప్రసిద్ధమైన కథలు, నవలలు రాశారు. ప్రముఖ సాహిత్య పత్రిక ‘హాన్స్’కు రాజేంద్ర ఎడిటర్ అయిన తరువాత యువ రచయితలు, రచయిత్రులు సదా ఆయన చుట్టూ పరివేష్ఠితమై ఉండేవారు. సాహిత్య సమాలోచనలతో మునిగి తేలుతుండేవారు. అయితే వారెప్పుడూ మన్నుకు ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని ఇవ్వలేదు. ఆమె ఇవ్వగలిగేది ప్రేమాభిమానాలు మాత్రమే కదా. ఇది ఆమెకు పెద్దగా మనస్తాపం కలిగించకపోయినప్పటికీ రాజేంద్ర కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం ఆమెను బాగా చికాకుపరిచేది. తాను అనారోగ్యం పాలయినప్పుడు, చివరకు తమ బిడ్డ ఆరోగ్యంగా లేనప్పుడు సైతం రాజేంద్ర తమను ఏ మాత్రం పట్టించుకునేవాడు కాదని మన్ను రాశారు. ఆ రోజుల గురించి ఆమె ఇంకా ఇలా గుర్తుచేసుకున్నారు: ‘మా సంబంధాలు ఉద్రిక్తతతో నిండిపోయి ఉండేవి. అనుక్షణం బాధాకరంగాను అంతులేని వేదన కలిగించేవిగాను ఉండేవి. అయితే భావోద్వేగ ఒత్తిళ్లను కప్పిపుచ్చుకునేలా మా దైనందిన జీవితం కొనసాగింది.
ఒక రచయిత్రిగా తనకు రాజేంద్ర ప్రేరణనిచ్చేవాడని, సాహిత్య వ్యాసంగాలలో ప్రోత్సహించేవాడని మన్ను అంగీకరించారు. యువ రచయితలతోను, తలపండిన రచయితలతోను అతడి సాహిత్య సమాలోచనలు తనకు ఉత్తేజకరంగా, జ్ఞానదాయకంగా ఉండేవని ఆమె అన్నారు. తన నవలలకు, అనేక కథలకు పేర్లు పెట్టింది రాజేంద్రేనని ఆమె పేర్కొన్నారు. అయినప్పటికీ రాజేంద్ర ప్రతికూల వైఖరులకు, దాడులు, దుర్భాషలకు తాను తరచూ గురవుతుండేదానినని ఆమె రాశారు. రాజేంద్ర ప్రవర్తన తనను ఎంతో బాధించిందని, తన రచనా వ్యాసంగానికి కూడా నష్టం చేసిందని, సాహిత్య సృజనా సామర్థ్యంలో తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని మన్ను భండారి బాధాకరంగా గుర్తు చేసుకున్నారు.
‘రాజేంద్ర తనను తాను ఆధునిక ఆలోచనాపరుడుగా, వ్యక్తిగా, రచయితగా ఒక ప్రత్యేకత ఉన్న మనిషిగా భావించుకుంటాడు. అయితే సంసార జీవితంలో భార్య పాత్ర గురించి ఆయన భావాలు విచిత్రమైనవి. జీవిత భాగస్వామి గురించి రచయిత రాజేంద్రకు అటువంటి అభిప్రాయాలు ఉండడం తెలిస్తే అతడి పాఠకులు తప్పక ఉలిక్కిపడతారు. రాజేంద్ర దృష్టిలో భార్య ఒక నర్సులా ఉండాలి. పతి సేవే పరమ ధ్యేయంగా సదా వ్యవహరించాలి. అదీ, ఎటువంటి ప్రతిఫలాలు ఆశించకుండా భర్తకు సేవ చేయాలి. సేవా పరాయణురాలిగా, అదే సమయంలో స్వార్థ రహితురాలిగా ఉండడమే భార్య అనే మహిళ కర్తవ్యం అని అతడు భావించేవాడు అని మన్ను తిరస్కారపూరిత వైఖరితో రాశారు. తమ రచనా వ్యాసంగాలు, వాటి ఆధారంగా పేరు ప్రతిష్ఠలు సముపార్జించుకోవడానికే ప్రాధాన్యమిస్తూ కుటుంబ బాధ్యతలను పట్టించుకోని, ముఖ్యంగా భార్య అస్తిత్వాన్ని గౌరవించని రచయితల గురించి ఆమె ఇలా గర్హించారు:
‘షష్టిపూర్తి చేసుకున్న తరువాతే ఈ రచయితలకు జ్ఞానోదయం కలుగుతుంది. అప్పటివరకు తాము నిర్లక్ష్యం చేసిన భార్యలు వారి జీవితాలలో హఠాత్తుగా అత్యావశ్యకమైన మనుషులు అవుతారు!’ త్యాగశీలి, అనురాగశీలి అయిన మహిళకు స్వతస్సిద్ధంగా ఉండే సహన స్వభావంతో మన్ను చాలాకాలం వ్యవహరించారు. అయితే రాజేంద్ర తీరు ఆమె సహనానికి ఒక నిత్య పరీక్ష అయిపోయింది. ఓర్పు ఇంకెంత మాత్రం వివేకం కాదని విశ్వసించక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాజేంద్ర నుంచి విడిపోవాలనే నిర్ణయానికి మన్ను వచ్చారు. చాలాసార్లు ఆమె ఆ నిర్ణయానికి వచ్చారు. బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించారు. దాంతో పాటు తాను ఒక బుద్ధిమంతుడిగా వ్యవహరిస్తానని రాజేంద్ర అనేకమార్లు వాగ్దానాలు చేశాడు. ఎన్నిసార్లు వాగ్దానం చేశాడో అన్నిసార్లూ అతడు వాగ్దాన భంగానికి పాల్పడ్డాడు. అతడిలో మార్పురాదని తేలిపోయింది. ముప్పై ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం రాజేంద్రతో జీవితం అర్థరహితమనే దృఢ నిర్ణయానికి మన్ను అంతిమంగా వచ్చారు, విడిపోయారు.
మన్ను తన నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నారన్న విషయాన్ని రాజేంద్రకు చెప్పినప్పుడు అతడు దిగ్భ్రాంతి చెందాడు. నమ్మలేకపోయాడు. ఆగ్రహించాడు. మన్నుతో సంసార జీవితం ముగిసిన కథ అని అతడు అంగీకరించక తప్పలేదు. రాజేంద్ర ప్రతిస్పందనల గురించి మన్ను తిరస్కార భావంతో ఇలా రాశారు: ‘భార్యలను ఇంటి నుంచి గెంటివేయడం పురుషులకు బాగా తెలుసు. విడిపోవాలని ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవడం గురించి కూడా వారికి తెలుసు. అయితే భార్య తన సొంతంగా విడిపోయేందుకు నిర్ణయం తీసుకోవడం, ఎటువంటి అభ్యంతరాలు చెప్పకుండా, చిక్కులు కల్పించకుండా భర్త ఆ నిర్ణయాన్ని అంగీకరించడమనేది చాలావరకు జరగని పని. మహిళా సమానత్వం గురించి విశ్వసించే, మహిళలకు అన్నింటా సమ హక్కులు కల్పించాలని వాదించే పురుషులు సైతం భార్య స్వయంగా విడిపోయేందుకు నిర్ణయం తీసుకోవడాన్ని ఆమోదించలేరు, హర్షించలేరు. ఇదొక కఠోర వాస్తవం’.
ఆనందప్రదమైన వైవాహిక జీవితం విషయంలో మన్ను భండారీ కంటే వర్జీనియా వూల్ఫ్ మహా అదృష్టవంతురాలు, ఇతర మహిళా సాహితీవేత్తల కంటే కూడా ఆమె గొప్ప అదృష్టవంతురాలు. భారత్‌లోనూ, సకల సమాజాలలోనూ భర్తలు లియోనార్డ్ వూల్ఫ్ లాంటి పురుషులు అయితే మన ప్రపంచం, మరింత మహోన్నత సాహిత్యంతో మహా ఆనందధామంగా విలసిల్లుతుంది.
రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)
Also Read:
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్