దలైలామా కోసం 140 కిలోమీటర్లు గుర్రాలపై!
ABN , Publish Date - Jun 27 , 2026 | 01:20 AM
స్వాతంత్ర్య ప్రదాతలు, గణతంత్ర రాజ్య వ్యవస్థాపకులు అయిన మహాత్మాగాంధీ, పండిట్ నెహ్రూ, డాక్టర్ అంబేడ్కర్, సర్దార్ పటేల్ మొదలైన మహోన్నతుల జనన, మరణ తేదీలను మనం మరచిపోము. ఆ సందర్భాలలో...
స్వాతంత్ర్య ప్రదాతలు, గణతంత్ర రాజ్య వ్యవస్థాపకులు అయిన మహాత్మాగాంధీ, పండిట్ నెహ్రూ, డాక్టర్ అంబేడ్కర్, సర్దార్ పటేల్ మొదలైన మహోన్నతుల జనన, మరణ తేదీలను మనం మరచిపోము. ఆ సందర్భాలలో ఆ మహనీయులను సంస్మరించుకుని స్ఫూర్తి పొందుతున్నాం, నివాళులర్పించి కర్తవ్యోన్ముఖులమవుతున్నాం. ఆ మహానుభావుల వలే ప్రసిద్ధులు కాని, అయితే జాతి నిర్మాణానికి ప్రశస్త సేవలు అందించిన సముదాత్తులకు సంబంధించిన ముఖ్యమైన వార్షికోత్సవాలను విస్మరిస్తున్నాం. భారత రిపబ్లిక్ సంస్థాపక భావాలను తన విధ్యుక్త ధర్మ నిర్వహణలో సంపూర్ణంగా ప్రతిబింబింపజేసిన ఒక పాలనాదక్షుడి శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించేందుకు ఈ కాలమ్‌ను ఉద్దేశించాను. ఆ అనుపమేయ దేశభక్తుడు హర్‌మందర్ సింగ్. నేడు (జూన్ 27) ఆయన శతజయంతి. జాతి నిర్మాణంలో ఒక సాహస ప్రయోగమైన ‘ఇండియన్ ఫ్రాంటియర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్’ (ఐఎఫ్‌ఏఎస్)కు చెందిన ప్రముఖ అధికారి. ఒక ప్రత్యేక లక్ష్యం కోసం ఏర్పడి విశిష్ట సేవలు అందించిన సర్వీస్ అది. ప్రస్తుతం ఉనికిలో లేని ఆ సర్వీస్ గురించి ఈ తరం వారికి దాదాపుగా ఏమీ తెలియదనే చెప్పవచ్చు. అయితే ఐఎఫ్‌ఏఎస్ గురించి ప్రజలకు మరింత మెరుగైన అవగాహన కల్పించాల్సిన అవసరమున్నది.
ఇండియన్ ఫ్రాంటియర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ గురించి నేను మొట్టమొదట 1990ల తొలినాళ్లలో విన్నాను. మానవశాస్త్రవేత్త వెరియర్ ఎల్విన్ (1902–1964) జీవిత చరిత్ర రచనా కృషిలో నేను తలమునకలై ఉన్న రోజులవి. ఎల్విన్ బ్రిటిష్ జాతీయుడు. మధ్య భారతదేశంలోని ఆదివాసీల మధ్య రెండున్నర దశాబ్దాల పాటు నివసించాడు. ఆ ఆదివాసీల చరిత్ర, సంస్కృతి గురించి విస్తృతంగా రాశాడు. అంతకంటే ముఖ్యంగా వారి సమస్యలపై సమగ్ర అవగాహన ఉన్న మానవశాస్త్ర విజ్ఞాని. స్వాతంత్ర్యానంతరం ఆయన భారత పౌరసత్వాన్ని స్వీకరించారు. 1954లో నార్త్ ఈస్ట్రన్ ఫ్రాంటియర్ ఏజెన్సీ (నీఫా) ఆదివాసీ వ్యవహారాలపై సలహాదారుగా నియమితులయ్యారు (ప్రస్తుత అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రమే నాటి నీఫా).
ఐఎఫ్‌ఏఎస్ అధికారులకు సలహాలు, సూచనలు ఇవ్వడంలో మిష్మి ఆదివాసీ విద్యావంతుడు ఒకరు తనకు చెప్పిన మాటలను ఎల్విన్ సదా మనసులో ఉంచుకున్నారు. ఆ మిష్మి గిరిజనుడు ఎల్విన్‌ను ఇలా సూటిగా, స్పష్టంగా హెచ్చరించారు: ‘గుర్తుంచుకోండి, సంస్కృతిపరంగా చూసినా, జాతిపరంగా చూసినా మేము భారతీయులం కాబోము. మా సంస్కృతిని, మతాన్ని తక్కువ చూపు చూసే, అసలు మమ్ములను తోటి మనుషులుగా గుర్తించని అధికారులను మా వ్యవహారాల నిర్వహణకు పంపితే కొద్ది సంవత్సరాలలోనే మేము మీకు నిశ్చితంగా వ్యతిరేకులమవుతాము’.
ఐఎఫ్‌ఏఎస్ అధికారులు తమ విధులను నిర్వహిస్తున్న తీరుతెన్నులను ప్రధాని నెహ్రూ విశేష శ్రద్ధాసక్తులతో పర్యవేక్షిస్తుండేవారు. నెహ్రూ వారికి చెప్పిన మాటలను ఒక అధికారి ఇలా గుర్తుచేసుకున్నారు: ‘సిబ్బంది జాతీయ పతాక వెంట వెళ్లాలి. టైప్ రైటర్లు ఆ తరువాత వస్తాయి’. నిగూఢంగా ఉన్న ఈ గంభీరమైన మాటల అర్థం ఇది: ‘ప్రజలే ప్రథమం. అధికారిక ప్రభుత్వ వ్యవస్థలను ప్రవేశపెట్టే ముందు పాలనా సిబ్బంది ప్రజల గౌరవాన్ని, స్నేహాన్ని సంపాదించుకోవాలి. స్థానికులతో సత్సంబంధాలను ఏర్పరచుకున్న తరువాతే అధికారిక ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి క్రమబద్ధమైన పాలననందించాలి’. స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ అధికారుల వలే కాకుండా ఐఎఫ్‌ఏఎస్ అధికారులు లోతట్టు ప్రాంతాలకు సైతం వెళ్లేవారు. సాయుధ అంగరక్షకులు లేకుండా, తరచూ భార్యలతో కలిసి వెళ్లేవారు. ఈ వ్యవహారశైలి, స్థానికులతో సౌహార్దత, సాన్నిహిత్యం పెంపొందించుకునేందుకు విశేషంగా తోడ్పడింది.
ఎల్విన్ జీవితచరిత్ర రచనకై నా పరిశోధనా వ్యాసంగాలలో భాగంగా విశ్రాంత జీవనంలో ఉన్న ఐఎఫ్‌ఏఎస్ అధికారులు కొంత మందిని ఇంటర్వ్యూ చేశాను. తొలుత హర్‌మందర్ సింగ్, ఆ తరువాత రషీద్ యూసఫ్ అలీ, ఆర్‌ఎన్‌ఎన్ హల్డిపర్, టీఎస్ మూర్తి, ఎన్‌డీ జయాళ్‌తో వివిధ విషయాల గురించి మాట్లాడాను. ప్రతి ఒక్కరూ నీఫాలో తమ ఉద్యోగ కాలపు అనుభవాల గురించి ఉత్సాహంగా మాట్లాడారు. మారుమూల ప్రాంతాలకు వెళ్లి బయటి ప్రపంచం అంతగా తెలియని ఆదివాసులతో సంబంధాలు నెలకొల్పుకుని వారి విశ్వాసాన్ని ఎలా చూరగొన్నదీ సంవేదనశీలతతో వివరించారు.
పథ నిర్దేశక పాలన నందించిన ఐఎఫ్‌ఏఎస్ అధికారులలో ఒకరైన బాబ్ ఖథింగ్ పురాతన బౌద్ధ సంఘారామాల పట్టణమైన తవాంగ్‌ను భారతదేశ నియంత్రణలోకి తీసుకురావడంలో కీలకపాత్ర వహించారు. ఇండో–టిబెటన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఎగువ శుభంసిరి లోయలోని ఆదివాసులతో సంబంధాలు ఏర్పరచుకున్న భారత ప్రభుత్వ అధికారులలో ఎస్‌ఎమ్ కృష్ణాత్రి ప్రప్రథముడు. నీఫాకు ఎల్విన్ నిర్దేశించిన, నెహ్రూ ఆమోదించిన పాలనా వ్యూహాలను సమర్థంగా, మానవీయంగా అమలుపరిచినవారుగా ఐఎఫ్‌ఏఎస్ అధికారులు గౌరవమన్ననలు పొందారు.
భారత్ శరణు కోరిన దలైలామాను చైనా ఆక్రమిత టిబెట్ నుంచి మన దేశానికి సురక్షితంగా తీసుకురావడంలో హర్‌మందర్ సింగ్ కీలకపాత్ర వహించారు. ఆయన తన డైరీలో నమోదు చేసిన రోజువారీ విశేషాల ఆధారంగా రాణీసింగ్ తన ‘An Officer and His Holiness’లో భారత్‌కు దలైలామా పలాయన ప్రస్థానాన్ని విపులంగా వివరించారు. 1959లో దలైలామా భారత్‌లో ఆశ్రయం పొందాలని నిర్ణయించుకుని కామెంగ్ ఫ్రాంటియర్ డివిజన్‌లోకి ప్రవేశించారు. హర్‌మందర్ సింగ్ ఆ డివిజన్‌కు రాజకీయ అధికారి. అసిస్టెంట్ పొలిటికల్ ఆఫీసర్ టీఎస్ మూర్తి ఇండో– టిబెటన్ సరిహద్దులో దలైలామాతో సౌహార్దపూర్వకంగా సమావేశమయ్యారు. కామెంగ్ ఫ్రాంటియర్ డివిజన్ ప్రధాన పరిపాలనా స్థావరమైన బొమ్డిలా నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న తవాంగ్ పట్టణానికి (ఆ రోజుల్లో ఆ హిమాలయ పొలిమేర ప్రాంతాల్లో మోటారు వాహనాలు ప్రయాణించగల రోడ్లు లేవు) గుర్రాలపై వెళ్లి దలైలామాను సాయుధ సంరక్షణతో ఆ బౌద్ధ క్షేత్రానికి తీసుకువచ్చి ఆయనకు, ఆయన పరివారానికి సకల సదుపాయాలు కల్పించే బాధ్యత నిర్వహించారు.
తవాంగ్‌లో 6 ఏప్రిల్ 1959న దలైలామాకు ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ పంపిన సందేశాన్ని హర్‌మందర్ సింగ్ చదివి విన్పించారు. ఆ చరిత్రాత్మక సందేశం: ‘మీరు భారత్‌కు సురక్షితంగా చేరుకోవడాన్ని నేను, నా సహచరులు ఆహ్వానిస్తున్నాము. మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీరు, మీ కుటుంబం, మీ సహచరులు భారతదేశంలో నివసించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించేందుకు మేము సంతోషిస్తాము. మిమ్ములను అత్యంత పవిత్రంగా, భక్తి శ్రద్ధలతో గౌరవించే భారతీయులు ఎప్పటిలాగే తమ సంప్రదాయ మర్యాదలను పరిపూర్ణంగా చూపుతారు’.
తవాంగ్ నుంచి దలైలామా, ఆయన బృందాన్ని బొమ్డిలాకు హర్‌మందర్ సింగ్ తీసుకువెళ్లారు. టిబెటన్లు బుద్ధుడి అవతారంగా ఆరాధించే దలైలామా (అప్పటికి ఆయన తన తొలి ఇరవైలలో ఉన్నారు), భారత గణతంత్ర రాజ్య పౌర పాలకుడిగా విశిష్ట విధులు నిర్వర్తిస్తున్న హర్‌మందర్ సింగ్ (తన తొలి ముప్పైలలో ఉన్న యువ అధికారి) మార్గమధ్యంలో (ఒక దుబాసి సహకారంతో) సంభాషించుకున్నారు. ఆ మాటా మంతీలో ఒక స్నేహబంధం కుసుమించింది. మాతృభూమి నుంచి ప్రవాసానికి వచ్చి, ఆత్మీయ ప్రజలకు దూరమైన యువ ఆధ్యాత్మిక గురువు దలైలామా స్థితప్రజ్ఞత, ఆయన మాటల్లో నిండుగా వ్యక్తమైన ఆశావాదం గురించి తదనంతర కాలంలో హర్‌మందర్ సింగ్ ప్రగాఢ అనుభూతితో రాశారు. బౌద్ధ ఆధ్యాత్మిక –రాజకీయ నాయకుడు, నికార్సయిన లౌకికవాద పౌర అధికారి మధ్య నెలకొన్న పరస్పర గౌరవాభిమానాలు హర్‌మందర్ జీవిత పర్యంతం వర్ధిల్లాయి.
ఇండియన్ ఫ్రాంటియర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌ను 1968లో రద్దు చేశారు. అయితే ఈ ప్రత్యేక సివిల్ సర్వెంట్లు తదనంతరం వివిధ కీలక బాధ్యతలు నిర్వహించి జాతి నిర్మాణంలో సమున్నత పాత్ర వహించారు. హర్‌మందర్ సింగ్ అండమాన్స్ అండ్ నికోబార్ చీఫ్ కమిషనర్ అయ్యారు. బాబ్ ఖథింగ్ బర్మాలో మన రాయబారిగా పనిచేశారు. ఆర్‌ఎన్ హల్దిపర్ కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అయ్యారు. కేసీ జొహొరె గోవా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అయ్యారు. మర్కొట్ రామ్మునీ నేపాల్, బంగ్లాదేశ్‌లో మన రాయబారిగా సేవలు అందించారు. నాగాలపై ఒక ఆసక్తికరమైన పుస్తకాన్ని కూడా ఆయన రాశారు.
వెరియర్ ఎల్విన్ జీవిత చరిత్రలో నేను ఇలా రాశాను: ‘ఐఎఫ్‌ఏఎస్ క్యాడర్ సమర్థులైన యువ అధికారులు, తమ విధ్యుక్త ధర్మాల నిర్వహణకు సంపూర్ణంగా అంకితమైనవారు... ఏ ప్రజల బాగోగులను చూసే బాధ్యతను ప్రభుత్వం తమకు అప్పగించిందో ఆ ప్రజలతో కలిసిమెలిసి జీవించేందుకు సిద్ధమైనవారు, అంతకంటే ముఖ్యంగా ఆ ప్రజల మాదిరిగా ఆలోచించినవారు. విశిష్ట గుణసంపన్నులైన ఈ అధికారులు భారత రాజకీయ చరిత్రలో అద్వితీయులు’. ఈ సేవావ్రతుల గురించి భారత్–టిబెట్ సంబంధాల చరిత్రకారుడు క్లాడ్ అర్పి ఇలా రాశారు: ‘ఐఎఫ్‌ఏఎస్‌లో చేరేందుకై తమ ఉజ్వల వృత్తి జీవితాలను త్యాగం చేసేందుకు వెనుకాడని ఉదాత్తులు ఈ అధికారులు. పాలనలో ఉత్కృష్ట ప్రమాణాలను నెలకొల్పినవారు. ఆ ప్రత్యేక సర్వీసు ఇప్పుడు లేనప్పటికీ ఆ అధికారులను ఈనాటి యువ ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ ఆదర్శంగా తీసుకోవాలి.
అరుణాచల్ ప్రదేశ్ నేడు ఇతర భారతీయ రాష్ట్రాలకు భిన్నంగా లేదు. ప్రభుత్వ వ్యవస్థల్లో అంతులేని అవినీతి తాండవమాడుతోంది. రాజకీయవేత్తలు, కాంట్రాక్టర్లు కుమ్మకై ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్నారు. ఆ హిమాలయ రాష్ట్రంలో పర్యావరణ విధ్వంసం మరింత వేగంగా జరుగుతోంది. అయితే అరుణాచల్ ప్రదేశ్‌లో ఇతర ఈశాన్య భారత రాష్ట్రాలలో వలే విచ్ఛిన్నకర తిరుగుబాటు కార్యకలాపాలు లేవు. నెహ్రూ, ఎల్విన్‌లు రూపొందించిన దార్శనిక విధానాలు, వాటి అమలులో ఐఎఫ్‌ఏఎస్ అధికారుల నిస్వార్థ సేవాపరాయణతే అందుకు ప్రధాన కారణాలని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)
(నేడు హర్‌మందర్ సింగ్ శత జయంతి)
ఈ వార్తలనూ చదవండి:
అపరేషన్ అమిస్తాడ్.. వెనెజువెలాకు భారత్ ఆపన్న హస్తం
ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడి.. రష్యాలోని 12 ప్రాంతాలపై..