Share News

జానపదంలో రాజకీయ చైతన్య ఝరి

ABN , Publish Date - Jan 31 , 2026 | 03:34 AM

రైతులు, వ్యవసాయ కూలీలు, దళితులు, మహిళలు, కార్మికుల జీవన అనుభవాల నుంచే గద్దర్‌ పాటలు పుట్టాయి. బుర్రకథ, ఒగ్గుకథ, జముకుల కథ వంటి సంప్రదాయ కళారూపాలను సంస్కరించి, వాటిలో విప్లవ భావజాలాన్ని నింపారు....

జానపదంలో రాజకీయ చైతన్య ఝరి

రైతులు, వ్యవసాయ కూలీలు, దళితులు, మహిళలు, కార్మికుల జీవన అనుభవాల నుంచే గద్దర్‌ పాటలు పుట్టాయి. బుర్రకథ, ఒగ్గుకథ, జముకుల కథ వంటి సంప్రదాయ కళారూపాలను సంస్కరించి, వాటిలో విప్లవ భావజాలాన్ని నింపారు. సాధారణ భాష, గ్రామీణ స్వరం, ఉత్సాహభరితమైన నృత్యంతో గద్దర్, ‘కార్మిక వర్గం’, ‘బూర్జువా రాజ్యం’, ‘విప్లవం’ వంటి క్లిష్టమైన సిద్ధాంతాలను ప్రజలకు అర్థమయ్యేట్టు చేశారు.

గుమ్మడి విఠల్‌రావుగా జన్మించి గద్దర్‌గా ప్రసిద్ధికెక్కిన ఈ విప్లవ కవి గాయకుడు తెలుగు సాంస్కృతిక, రాజకీయ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సొంతం చేసుకున్నారు. 1949 జనవరి 31న అప్పటి మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామంలో ఒక పేద దళిత కుటుంబంలో జన్మించిన గద్దర్ తన జీవితాన్ని ప్రజల పాటగా, పోరాట స్వరంగా మలిచారు. 2023 ఆగస్టు 6న ఆయన మరణించినప్పటికీ, పీడిత వర్గాల స్వరంగా ఆయన వారసత్వం ఇప్పటికీ ఎప్పటికీ జీవించే ఉంటుంది.

బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన, పంజాబ్‌కు చెందిన చారిత్రక గదర్ పార్టీ పట్ల గౌరవంతో తన పేరును ‘గద్దర్’గా మార్చుకున్న విఠల్‌రావు, జానపద కళను రాజకీయ చైతన్యానికి ఆయుధంగా మార్చారు. తన నేతృత్వంలోని జననాట్య మండలి ద్వారా వర్గపోరాట భావజాలాన్ని గ్రామాలు, పొలాలు, కార్మిక కాలనీల్లోకి తీసుకెళ్లారు. విద్యార్థి దశలో పేదరికం వల్ల గద్దర్ ఇంజినీరింగ్ చదువును మధ్యలోనే వదిలేయాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచి దేశభక్తి, సమసమాజ భావాలు మెండుగా ఉన్నాయి. తొలినాళ్లలో గాంధీ బాట అనుసరణీయం అని భావించి బుర్రకథ కళారూపంతో ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాచిగూడ సమీపంలో చాపెల్ బజార్ దగ్గర గుమ్మడి రామస్వామి నేతృత్వంలో బాపూజీ బుర్రకథ పార్టీ ఏర్పాటు చేశారు. అక్కడ కళాకారులకు బుర్రకథ, ఒగ్గుకథ, నాటికలు, డోలక్, తబలా, డప్పు, కంజర తదితర వాయిద్యాలపై శిక్షణ ఇచ్చేవారు. జాతీయ నాయకులపై, కుటుంబ నియంత్రణపై, ప్రభుత్వ పథకాలపై ప్రదర్శనలు ఇచ్చారు. 1975లో విమలమ్మతో గద్దర్ వివాహం జరిగింది. సమాచార ప్రసార శాఖ వారి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ వచ్చే పారితోషికంతో జీవితం కొనసాగించారు. కొంతకాలం రసాయన కర్మాగారంలో కూలీగా కూడా పనిచేశారు. ఈ అనుభవాలు ఆయనను కార్మిక జీవనానికి మరింత దగ్గర చేశాయి.


1970ల ప్రారంభంలో బి. నర్సింగరావు నేతృత్వంలోని ఆర్ట్ లవర్స్ అసోసియేషన్‌తో పరిచయం కావటం ఆయన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత గద్దర్ చొరవతోనే ఆ సంఘం జననాట్య మండలిగా రూపాంతరం చెందింది. బి. నరసింగరావు ప్రోద్బలంతో ‘రంగుల కల’, ‘దాసి’, ‘మా భూమి’ సినిమాల్లో పాటలు రాశారు. ‘ఒరేయ్ రిక్షా’, ‘జై బోలో తెలంగాణ’ సినిమాలకు ప్రతిష్ఠాత్మక నంది అవార్డు వచ్చినా తృణప్రాయంగా తిరస్కరించారు.

జానపద కళలకు రాజకీయ చైతన్యాన్ని జోడించడంలో గద్దర్ ప్రత్యేకత కనిపిస్తుంది. రైతులు, వ్యవసాయ కూలీలు, దళితులు, మహిళలు, కార్మికుల జీవన అనుభవాల నుంచే ఆయన పాటలు పుట్టాయి. బుర్రకథ, ఒగ్గుకథ, జముకుల కథ వంటి సంప్రదాయ కళారూపాలను సంస్కరించి, వాటిలో విప్లవ భావజాలాన్ని నింపారు. సాధారణ భాష, గ్రామీణ స్వరం, ఉత్సాహభరితమైన నృత్యంతో గద్దర్, ‘కార్మిక వర్గం’, ‘బూర్జువా రాజ్యం’, ‘విప్లవం’ వంటి క్లిష్టమైన సిద్ధాంతాలను ప్రజలకు అర్థమయ్యేలా చేశారు. ‘‘భారతదేశం భాగ్యసీమరా’’ పాట దేశ సంపద– ప్రజల పేదరికం మధ్య విరోధాన్ని చూపితే, ‘‘ఊరు మనదిరా’’ పాట శ్రమజీవుల స్వతంత్రాన్ని ప్రకటించింది. కారంచేడు, చుండూరు వంటి దళిత మారణకాండకు స్పందనగాను, మహిళా సమస్యలు, రైతు ఆత్మహత్యలు, గ్లోబలైజేషన్ దుష్ప్రభావాలు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వంటి అంశాలపైన... ఇలా ఆయన మూడు వేలకు పైగా పాటలు రచించారు.

ముద్రిత మాధ్యమాలకు దూరంగా ఉన్న అణగారిన వర్గాలకు గద్దర్ తన పాటల ద్వారా స్వరం ఇచ్చారు. డప్పు, డోలక్ వంటి ప్రజల వాయిద్యాలతో, సినిమాలు– ఎలక్ట్రానిక్ మీడియా ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా ప్రజల జ్ఞాపకాలను, అనుభవాలను వేదికపైకి తీసుకొచ్చారు. తన కళాతత్వాన్ని ఆయన మూడు సూత్రాల్లో వివరించారు: ప్రజల బాణి, ప్రజల పలుకుబడి, ప్రజల జీవితం. ఒంటిపై చొక్కా లేకుండా నల్లటి గొంగడి, గోచికట్టు పంచె, కాళ్లకు గజ్జెలు, ఎర్ర కర్చీఫ్‌తో ఆయన వేదికపై కనిపించేవారు. ఆ ఎర్ర కర్చీఫ్ సందర్భాన్ని బట్టి తల్లి ప్రేమకు, విప్లవానికి, అమరత్వానికి సంకేతంగా మారింది.

‘‘ప్రజల నుంచి ప్రజలకే’’ అనే విప్లవ సూత్రాన్ని గద్దర్ తన జీవితంలో ఆచరించారు. జానపద కళలను రాజకీయీకరించి, ప్రజల జీవితాలతో మమేకం చేసిన ఆయన, సంస్కృతి కూడా సామాజిక మార్పుకు శక్తిమంతమైన ఆయుధమేనని నిరూపించారు. తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు చూసిన గద్దర్ చివరి రోజుల్లో సామాజిక సమగ్రత కోసం మెరుగైన పౌర సమాజం కోసం కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యారు. ప్రియాంకగాంధీ, రాహుల్‌గాంధీతో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సభలలో పాల్గొన్నారు. గద్దర్ లేకున్నా ఆయన పాటలు, ఆయన స్వరం, ఆయన పోరాట స్ఫూర్తి ఇంకా ప్రజల్లో చైతన్యాన్ని నింపుతూనే ఉన్నాయి.

డా. వెన్నెల గద్దర్

చైర్‌పర్సన్, తెలంగాణ సాంస్కృతిక సారథి

Updated Date - Jan 31 , 2026 | 03:34 AM