మన సినిమా దిక్సూచి ‘గద్దర్’ అవార్డులు!
ABN , Publish Date - Mar 17 , 2026 | 02:32 AM
సినిమా నిజమైన జీవితానికే ప్రతిబింబం కావాలని ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రాయ్ అంటారు. మనం చూసే మనుషులు, వారి సమస్యలు, ఆనందాలు, పోరాటాలు తెరపై కనిపించినప్పుడే ప్రేక్షకుడికి...
సినిమా నిజమైన జీవితానికే ప్రతిబింబం కావాలని ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రాయ్ అంటారు. మనం చూసే మనుషులు, వారి సమస్యలు, ఆనందాలు, పోరాటాలు తెరపై కనిపించినప్పుడే ప్రేక్షకుడికి ఆ సినిమాతో అనుబంధం ఏర్పడుతుంది. ఇదే స్ఫూర్తితో తెలంగాణ మట్టివాసన, జీవభాష, మధ్యతరగతి జీవన వాస్తవాలు, గ్రామీణ అనుభవాలు, సామాజిక సంఘర్షణలను ప్రతిబింబించే ఒక కొత్త తరహా సినిమా ప్రస్తుతం రూపుదిద్దుకుంటోంది. ఈ నేపథ్యంలో గద్దర్ అవార్డులు తెలంగాణ సినిమా ప్రపంచానికి ఒక కొత్త సాంస్కృతిక గుర్తింపుగా నిలుస్తున్నాయి.
తెలంగాణ నేల కథలు, ఈ నేల ప్రజల అనుభవాలు, వారి భావోద్వేగాలు గతంలో తెలుగు సినిమాల్లో అరుదుగా కనిపించేవి. ఇటీవల పరిస్థితి మారింది. తెలంగాణ భాష, సంస్కృతి, గ్రామీణ జీవితం, సాధారణ ప్రజల పోరాటాలు ఇప్పుడు అనేక చిత్రాల్లో ప్రధాన కథాంశాలుగా మారుతున్నాయి. ఈ మార్పు కేవలం సినిమా నిర్మాణంలో జరిగిన సాంకేతిక మార్పుల వల్ల మాత్రమే కాదు; సమాజంలో ఏర్పడిన కొత్త అవగాహన వల్ల కూడా సాధ్యమైంది. ప్రేక్షకులు కొత్త కథలను, నిజ జీవితాన్ని ప్రతిబింబించే సినిమాలను ఆదరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం సినీ అవార్డులను ఏర్పాటు చేయడం ఒక ముఖ్యమైన సాంస్కృతిక ప్రకటనగా నిలిచింది. గద్దర్ తన పాటల ద్వారా అణచివేతకు గురైన ప్రజల బాధను, వారి ఆశలను, వారి పోరాటాలను ప్రపంచానికి వినిపించారు. ఆయన పేరుతో ఏర్పాటు చేసిన అవార్డులు కళలోని సామాజిక బాధ్యతను గుర్తు చేస్తాయి. అవార్డులు కళాకారులకు ఇచ్చే బహుమతులు మాత్రమే కావు. అవి ఒక సమాజం ప్రోత్సహించాలనుకునే విలువల వక్కాణింపు కూడా. గద్దర్ అవార్డులు తెలంగాణ సినిమా రంగానికి ఒక నైతిక దిశను చూపే శక్తిని కలిగి ఉన్నాయి. కొత్త దర్శకులకు ధైర్యం ఇవ్వడం, స్థానిక కథలను చెప్పే ప్రయత్నాలను ప్రోత్సహించడం కూడా ఈ అవార్డుల ముఖ్య లక్ష్యాలలో ఒకటి. తెలంగాణ నేపథ్యాన్ని ప్రతిబింబించే చిత్రాలకు గౌరవం ఇవ్వడం ద్వారా ఈ నేల కథలకు మరింత విలువ లభిస్తుంది.
ఇవి కూడా చదవండి..
ఆటో డ్రైవర్ అని తేలిగ్గా చూడకండి.. ఇతడు ఒక్క రోజులో ఎంత సంపాదిస్తాడో తెలిస్తే..
మీవి డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోలో జింక ఎక్కడ దాక్కుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..
ఈ ఏడాది గద్దర్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సామాన్యుల జీవిత అనుభవాలను, భావోద్వేగాలను హృద్యంగా ప్రతిబింబించింది. ద్వితీయ ఉత్తమ చిత్రంగా ‘దండోరా’, తృతీయ ఉత్తమ చిత్రంగా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ గుర్తింపు పొందాయి. జాతీయ సమైక్యతను ప్రతిబింబించిన చిత్రంగా ‘తండేల్’, సామాజిక సందేశంతో రూపొందిన చిత్రంగా ‘కోర్టు’, వినోదాత్మక చిత్రంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’, బాలల చిత్రంగా ‘అనగనగా’, కొత్త దర్శకుడి ప్రతిభను ప్రతిబింబించిన చిత్రంగా ‘లిటిల్ హార్ట్స్’ ఎంపికయ్యాయి. కొండా లక్ష్మణ్ బాపూజీ, పైడి జైరాజ్, డాక్టర్ ఎ.ఎస్.రావులపై రూపొందిన డాక్యుమెంటరీలు అవార్డులు అందుకున్నాయి. చిరంజీవి, కమలహాసన్, జయసుధ, అశ్వనిదత్, సుద్దాల అశోక్‌తేజ, ఆర్.నారాయణమూర్తి సినీ రంగానికి అందించిన సేవలకు పలు సత్కారాలు అందుకున్నారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించాలి. అవార్డులు మాత్రమే గాక తెలంగాణ సినిమాకి బలమైన విధానాలు, ప్రోత్సాహకాలు, సబ్సిడీలు కూడా అవసరం. క్రీడలు, టూరిజం పాలసీల వలె సినీ రంగానికీ ఒక పాలసీ తేవాలి. ఎన్‌ఎఫ్‌డీసీ తరహాలో స్థానిక కథలతో సినిమాలు తీసే యువదర్శకులకు ఆర్థిక సహాయం, తెలంగాణలో చిత్రీకరణకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలి. ఎఫ్‌టీఐ లాగా ఒక ఇన్‌స్టిట్యూట్ మొదలుపెట్టాలి. ఈ సదుపాయాలు సమకూరితే యువదర్శకులు తెలంగాణ నేల కథలను ధైర్యంగా చెప్పగలుగుతారు. ఈ నేల మనుషుల జీవితం, వారి సంస్కృతి, వారి పోరాటాలు తెరపైకి వస్తాయి. అప్పుడే తెలంగాణ సినిమా తన ప్రత్యేక స్వరాన్ని ప్రపంచానికి వినిపించగలదు. అదే గద్దర్‌కి నిజమైన నివాళి.
కుమారస్వామి (అక్షర)
సినిమా దర్శకులు
ఇవి కూడా చదవండి..
ఆటో డ్రైవర్ అని తేలిగ్గా చూడకండి.. ఇతడు ఒక్క రోజులో ఎంత సంపాదిస్తాడో తెలిస్తే..
మీవి డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోలో జింక ఎక్కడ దాక్కుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..