Share News

గద్దర్ అవార్డులు.. వేడుక మాత్రమేనా?

ABN , Publish Date - Feb 14 , 2026 | 01:01 AM

స్టేట్‌ అవార్డులు కేవలం వేడుకలు కావు, అవి ప్రభుత్వం తన సాంస్కృతిక ప్రాధాన్యాలను ప్రకటించే Cultural Statements. మెయిన్ స్ట్రీమ్‌లో ఎవరిని గౌరవిస్తామో, ఏ కథలకు పట్టం కడతామో...

గద్దర్ అవార్డులు.. వేడుక మాత్రమేనా?

స్టేట్‌ అవార్డులు కేవలం వేడుకలు కావు, అవి ప్రభుత్వం తన సాంస్కృతిక ప్రాధాన్యాలను ప్రకటించే Cultural Statements. మెయిన్ స్ట్రీమ్‌లో ఎవరిని గౌరవిస్తామో, ఏ కథలకు పట్టం కడతామో, అదే ఆ సమాజపు దృక్పథాన్ని నిర్వచిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ‘గద్దర్ అవార్డులు’ కూడా అలాంటి సంకేతమే, తెలంగాణ తన సినిమాను తానే నిర్వచించుకునే తొలి అధికారిక అడుగు.

ప్రతి కొత్త అడుగుతో పాటు ప్రశ్నలూ పుడతాయి: ‘‘ఈ అవార్డులు తెలంగాణ సినిమాలకే పరిమితం కావాలి’’ అని కొందరు అడుగుతున్నారు. ‘‘తెలంగాణ ప్రజల డబ్బు ఆ రాష్ట్ర సినిమాలకే అందాలి కదా’’ అన్నది మరొక వాదన. ‘‘గద్దర్ పేరుకు సినిమా రంగానికి సంబంధం ఏమిటి?’’ అన్న సందేహం మరోవైపు. ఈ ప్రశ్నలు వేర్వేరు రూపాల్లో ఉన్నా, వీటి వెనుక ఉన్న అసలు ప్రశ్న ఒక్కటే– ‘తెలంగాణ సినిమా పట్ల ప్రభుత్వ దృష్టికోణం ఏమిటి?’ అన్నది.

ఈ చర్చకు ముందుగా ఒక ప్రాథమిక సత్యాన్ని అర్థం చేసుకోవాలి. అసలు సినిమాలకు అవార్డులు ఎందుకు ఇస్తారు? అవార్డులు వ్యక్తుల్ని మాత్రమే గౌరవించవు, అవి విలువలను గౌరవిస్తాయి. ఒక ప్రభుత్వం ‘‘ఇది ఉత్తమ సినిమా’’ అని ప్రకటించినప్పుడు, అది కేవలం ప్రశంస కాదు. ‘‘మేము ఈ తరహా కథలను ప్రోత్సహిస్తున్నాం’’ అనే విధాన సంకేతం. అవార్డులు పరిశ్రమకు ఒక నైతిక దిశను సూచిస్తాయి. కొత్త దర్శకులకు ధైర్యాన్ని ఇస్తాయి. మంచి కథలకు మార్కెట్ విలువను పెంచుతాయి. అందుకే అవార్డులు కేవలం పతకాలు కాదు, పరిశ్రమను మలిచే సాఫ్ట్ పాలసీ సాధనాలు. అయితే ఇక్కడే ఒక కీలకమైన ప్రశ్న ఎదురవుతోంది, ‘‘ఉత్తమ సినిమా అంటే ఏమిటి?’’ ఉత్తమ సినిమా అంటే, కేవలం ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమా కాదు. స్టార్ హీరో ఉన్న సినిమా కాదు. భారీ బడ్జెట్ సినిమా కూడా కాదు. నిజమైన ఉత్తమ సినిమా అంటే, Artistic Merit, Social Relevance, Cultural Representation ఈ మూడు కలిసిన సమ్మేళనం. ఈ ప్రమాణాలు లేని అవార్డులు అసలు అవార్డులే కాదు.

ఇప్పుడు గద్దర్ అవార్డుల విషయానికి వస్తే, గద్దర్ సినిమా వ్యక్తి కాకపోవచ్చు. కానీ ఆయన ఒక ప్రజా సాంస్కృతిక ఉద్యమం. అణచివేయబడిన గొంతుల ప్రతినిధి. అధికారాన్ని ప్రశ్నించిన ధిక్కార స్వరమతడు. అలాంటి వ్యక్తి పేరుతో అవార్డులు ఇవ్వడం అంటే, సినిమాను కేవలం వినోద పరిశ్రమగా కాక, సామాజిక బాధ్యత గల కళగా చూడటం. ఈ సంకేతం రాజకీయంగా, సాంస్కృతికంగా చాలా శక్తిమంతమైనది. అందువల్ల గద్దర్ అవార్డుల రూపకల్పన కూడా ఆ విలువలను ప్రతిబింబించే విధంగా ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డులను ప్రారంభించిన ప్రధాన ఉద్దేశం, తెలంగాణ సినిమా వాతావరణాన్ని బలోపేతం చేయడమే అయితే, అవార్డుల విధానం సహజంగానే అదే దిశలో రూపొందాలి. తెలంగాణ నేపథ్యం, తెలంగాణ అనుభవం, తెలంగాణ దృష్టికోణం ప్రతిబింబించే చిత్రాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం అంటే అది ఒక కొత్త రాష్ట్రం తన సాంస్కృతిక స్వరాన్ని బలోపేతం చేసుకునే న్యాయమైన ప్రయత్నం.


‘అవార్డుల పేరిట, తెలంగాణ ప్రజల డబ్బు ఇతర రాష్ట్రాల సినిమాల కోసం ఎందుకు ఖర్చు చెయ్యటం?’’ అని కొందరు విమర్శిస్తున్నారు. ఏ రాష్ట్ర వనరులు ఆ రాష్ట్ర సృజనాత్మక వాతావరణాన్ని బలోపేతం చేయడానికి మాత్రమే వినియోగించాలి అన్న ఆకాంక్ష సహజమే. కానీ దీనికి పరిష్కారం విభజన రేఖలు గీయడం కాదు, పారదర్శకమైన, న్యాయమైన విధానాలు రూపొందించడం. ఉమ్మడి తెలుగు సినిమా వారసత్వాన్ని గౌరవిస్తూ, అదే సమయంలో తెలంగాణకు ప్రత్యేకమైన సాంస్కృతిక అవసరాలను ప్రతిబింబించే విధానమే సరైన మార్గం. అవార్డులు ఓపెన్ కేటగిరీలుగా ఉండొచ్చు, కానీ తెలంగాణ కథలకు ప్రత్యేక ప్రాధాన్యం, స్పష్టమైన ప్రమాణాలు, పారదర్శక జ్యూరీ విధానం తప్పనిసరి.

ఇక్కడే మరో సున్నితమైన తాత్విక సమస్య ముందుకు వస్తోంది. గద్దర్ పేరుతో ఇచ్చే అవార్డులు పూర్తిగా సాధారణ ప్రభుత్వ అవార్డుల్లా ఉండగలవా? గద్దర్ విలువలకు విరుద్ధమైన భావజాలంతో రూపొందిన చిత్రాలకు అవార్డులు ఇవ్వడం, ఆ పేరుకు ఉన్న ఆత్మను బలహీనపరిచే ప్రమాదం ఉంటుంది. అదే సమయంలో మరో నిజం కూడా ఉంది. ప్రభుత్వ అవార్డులు ప్రజల డబ్బుతో నడిచే ప్రజాస్వామ్య వ్యవస్థలు. కాబట్టి భావజాల విభేదాల కారణంగా అలాంటి సినిమాలకు అవార్డ్స్ ఇవ్వకుండా పక్కన పెట్టడం కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఇక్కడే ideological integrity (సైద్ధాంతిక నిబద్ధత), democratic fairness (ప్రజాస్వామిక న్యాయము) అనే రెండు విలువలు వేరు వేరు మార్గాలుగా కాక, సమన్వయంతో కలిసి నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.

ఈ వైరుధ్యానికి పరిష్కారం, అవార్డుల రూపకల్పనలోనే ఉంది. Artistic Merit (కళాత్మక ప్రతిభ)కు ఓపెన్ కేటగిరీలు ఉండాలి. అదే సమయంలో గద్దర్ విలువలకు అనుగుణమైన ప్రత్యేక విభాగాలు, Social Relevance (సమాజంతో నిమిత్తం), Cultural Representation (సాంస్కృతిక ప్రాతినిధ్యం) ఉన్న తెలంగాణ కథాంశాలకు స్పెషల్ కేటగిరీని స్పష్టంగా రూపొందించాలి. అప్పుడు అవార్డులు ప్రజాస్వామ్యయుతంగా కూడా ఉంటాయి, భావజాలపరంగా అర్థవంతంగా కూడా నిలబడతాయి. అయితే ఈ మొత్తం చర్చ ఒక పరిమితి వరకు మాత్రమే వర్తిస్తుంది. అవార్డులు ఒక దిశను సూచించగలవు, కానీ పరిశ్రమను నిర్మించలేవు, ఇందుకు ప్రభుత్వ పాలసీలు కావాలి. తెలంగాణ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్, స్థానిక కథలకు ప్రత్యేక ఫండ్‌లు, కొత్త దర్శకులకు ప్రొడక్షన్ గ్రాంట్లు, ఇవే అసలైన సాంస్కృతిక పెట్టుబడులు. ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చినప్పుడే తెలంగాణ నేపథ్య సినిమాలు తీయటానికి నిర్మాతలు ధైర్యంగా ముందుకు వస్తారు. ఆర్థిక భరోసా లేకుండా అవార్డులు మాత్రమే ఉంటే, అవి అలంకారాలుగా మిగిలిపోతాయి. అవార్డులు ఇంటి పైకప్పులాంటివి, పాలసీలు పునాది లాంటివి. పునాది లేకుండా పైకప్పు నిలబడదు. తెలంగాణ ఇంకా తనను తాను వెతుక్కుంటున్న సమాజం. ఆ వెతుకులాటకు సినిమా ఒక దిక్సూచి కావాలి. అవార్డులు ఆ దిక్సూచికి దిశ చూపాలి. తెలంగాణ తన సినిమాను తానే నిర్వచించుకునేందుకు గద్దర్ అవార్డులు ఒక అవకాశం. ఇది తన కథలను తానే గౌరవించుకునే అవకాశం. ఈ అవకాశం కేవలం వేడుకగా మిగిలిపోతుందా, లేక ఒక నిజమైన సాంస్కృతిక విధానంగా మారుతుందా అన్నదే ఇప్పుడు కీలకం. ఆ రోజునే, అవార్డులు నిజంగా ప్రజల అవార్డులవుతాయి. ఆ రోజునే, తెలంగాణ సినిమా తనను తాను గౌరవించుకున్న రాష్ట్రంగా చరిత్రలో నిలుస్తుంది.

-వేణు ఊడుగుల

Updated Date - Feb 14 , 2026 | 01:01 AM