Share News

మితవాదులకు ఊతం

ABN , Publish Date - Oct 23 , 2026 | 02:23 AM

నెల క్రితం మొదలైన ఫ్రాన్స్‌ విద్యార్థి ఉద్యమం తగ్గుముఖం పట్టకపోగా, బలపడుతోంది, సమాజంలోని ఇతర వర్గాల ప్రత్యక్ష, పరోక్ష మద్దతుతో విస్తరిస్తోంది. స్కూళ్ళ స్థితిగతులను మెరుగుపరచాలంటూ..

మితవాదులకు ఊతం

నెల క్రితం మొదలైన ఫ్రాన్స్‌ విద్యార్థి ఉద్యమం తగ్గుముఖం పట్టకపోగా, బలపడుతోంది, సమాజంలోని ఇతర వర్గాల ప్రత్యక్ష, పరోక్ష మద్దతుతో విస్తరిస్తోంది. స్కూళ్ళ స్థితిగతులను మెరుగుపరచాలంటూ మొదలైన నిరసనలకు తోడుగా పెరుగుతున్న ఇంధన ధరలు, క్షీణిస్తున్న ప్రజాసేవలు, ఖరీదవుతున్న ఇళ్ళు ఇత్యాది పలు సమస్యలు ఈ నిరసనలకు ఆజ్యంపోస్తున్నాయి. పారిస్‌ సహా అనేకనగరాల్లో విధ్వంసకాండ, లూటీలు సాగుతూ, వారసత్వ సంపదగా ఫ్రాన్స్‌ సగర్వంగా చెప్పుకొనే పలు అద్భుతమైన భవనాలు సైతం తగలబడిపోవడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. కార్మికసంఘాలు, రైతులు, సామాన్యప్రజలు కూడా వచ్చిచేరడంతో, కేవలం నెలరోజుల్లో ఈ ఆందోళన స్వరూపమే మారిపోయింది. అత్యంత కర్కశంగా ఈ నిరసనలను అణచివేయబోతున్నానంటూ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు చేస్తున్న హెచ్చరికలతో మరింత హింసాయుతమైన పరిణామాలు చూడవలసి రావచ్చు.


ఫ్రాన్స్‌లో విధ్వంసానికి వలసదారులే కారణమంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు యూరప్‌లోని చాలా దేశాల నాయకులకు సమధికోత్సాహాన్నిచ్చాయి. ‘ఫ్రాన్స్ తగలబడుతోంది.. పూర్తిభిన్నమైన మరో ప్రపంచం నుంచి, గుండెలనిండా ద్వేషాన్ని నింపుకున్న వారి వలసలు, ఒకప్పుడు గొప్పగా వెలిగిన ఈ దేశాన్ని ముక్కలు చేశాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, సరిహద్దులు మూసివేయండి, మీ దేశాన్ని కాపాడుకోండి’ అని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మధ్యంతర ఎన్నికల్లో ఉభయసభల్లోనూ ఉన్న ఆ కాస్త మెజారిటీ కూడా రిపబ్లికన్‌ పార్టీ కోల్పోనుందన్న సంకేతాల నేపథ్యంలో, ఫ్రాన్స్‌ దారుణపరిస్థితులను చూపి అమెరికా జనాన్ని రెచ్చగొట్టడం ట్రంప్‌కు అవసరం. అమెరికా ఘనమైన వారసత్వాన్ని కాపాడి, దానిని గ్రేట్‌ ఎగైన్‌ చేయడానికే తాను వలసలను అడ్డుకుంటున్నాననీ, లేనిపక్షంలో మనమూ ఫ్రాన్స్‌లాగా కూలిపోతామని ఆయన సూచిస్తున్నారు. వర్ధమాన దేశాల కోసం ఐరోపా సరిహద్దులను తెరవడానికి పాశ్చాత్య ఉదారవాదులు కారణమనీ, మధ్యంతర ఎన్నికలలో కాంగ్రెస్‌ను డెమోక్రాట్లు కనుక కైవసం చేసుకుంటే, ఫ్రాన్స్‌కు పట్టిన దుర్గతే తమకూ పడుతుందని అమెరికన్ ఓటర్లు గుర్తించాలని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ సలహా ఇచ్చారు.


ఫ్రాన్స్‌ ఎంతో ఉదారంగా వలసలను అనుమతించడమే ఈ మహాఘోరానికి కారణమన్న రీతిలో యూరప్‌లోని ట్రంప్‌ తరహా నాయకులంతా వ్యాఖ్యలు చేస్తున్నారు. వలసలు ఒక్కటే ఫ్రాన్స్‌ తగలబడటానికి కారణమా? అన్న ప్రశ్నను అటుంచితే, ఫ్రాన్స్‌తో పాటు ఎన్నికలు జరగబోతున్న స్పెయిన్‌, ఇటలీ, పోలాండ్‌, గ్రీస్‌లలో వలసవ్యతిరేక వాదనలతో మితవాదులు రాజకీయంగా లబ్ధిపొందేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. యూరప్‌ అంతటా ఆయాదేశాల్లో అశాంతికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, ప్రజాసమస్యలన్నీ వెనక్కుపోయి, వలసలు, మతం చుట్టూ విమర్శలు ప్రధానంగా సాగుతున్నాయి. కమ్యూనిస్టులూ, సోషలిస్టులూ ఈ హింసకు కారణమనీ, దీనివెనుక ఒక అంతర్జాతీయ నెట్‌వర్క్‌ ఉన్నదంటూ మరికొందరు కుట్రసిద్ధాంతాలు తెరమీదకు తెస్తున్నారు. భారతదేశంలో సీజేపీ ఉద్యమాలకూ, ఫ్రాన్స్‌ విద్యార్థి నిరసనలకూ మధ్య ఆశయాల్లో ఆదర్శాల్లో గల పోలికలను పక్కనబెట్టి ఇదంతా ఐదుఖండాల్లో, యాభైఐదుకుపైగా సంస్థల సమన్వయంతో సాగుతున్న అంతర్జాతీయ కుట్ర అని ఒక అమెరికన్‌ చానెల్‌ వాదిస్తోంది. ఇరాన్‌తో ఎడతెగని యుద్ధం చేస్తూ ఇంధనం, ఎరువుల కొరతకు కారణమై ప్రపంచాన్ని ఆర్థికసంక్షోభంలోకి నెట్టినవారే ఈ తరహా ఆందోళనల వెనుక విచ్ఛిన్నకరశక్తులున్నాయని ప్రచారం చేయడం విచిత్రం.


ఫ్రాన్స్‌లో మరో ఆర్నెల్లలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నందున ఈ అల్లర్లు కచ్చితంగా ఫలితాలపై ప్రభావం చూపుతాయి. పలుసర్వేల్లో ఇప్పటికే ముందంజలో ఉన్న పచ్చిమితవాద నేషనల్‌ ర్యాలీ నాయకురాలు మెరినే లీపెన్‌కు ఇవి మరింత లబ్ధిచేకూర్చవచ్చు. భారతదేశంలో వివిధరాష్ట్రాల్లో అత్యంత దుర్భరమైన స్థితిలో ఉన్న స్కూళ్ళ చిత్రాలను సీజేపీ నాయకులు కొందరు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్‌లోనూ దాదాపు ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి. సగానికిపైగా స్కూళ్ళు అరవైయేళ్ళకు పైబడినవే. టీచర్ల కొరత, కారుతున్న పైకప్పులు, కిటకిటలాడుతున్న తరగతి గదులతో ఫ్రాన్స్‌లో సైతం బడులు కడుదయనీయస్థితిలో ఉన్నాయన్నది వాస్తవం. నిరసనకారుల డిమాండ్లలో అత్యధికం సరైనవేనని అంగీకరిస్తూనే, పరిష్కారాలు చూపడం కాక, ఉద్యమాన్ని కఠినంగా అణచివేస్తానని మేక్రాన్‌ ప్రతిజ్ఞలు చేయడం విచిత్రం.

Updated Date - Oct 23 , 2026 | 02:25 AM