Share News

బాధిత హిందూ దళితులకే రిజర్వేషన్లు దక్కాలి!

ABN , Publish Date - Jul 05 , 2026 | 12:35 AM

సమాజంలో అంటరానితనానికి గురై, ఊరి బయటకు వెలివేయబడిన ప్రజలను.. భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించి వారి అభ్యున్నతి కొరకు కల్పించిందే రిజర్వేషన్ విధానం.

బాధిత హిందూ దళితులకే రిజర్వేషన్లు దక్కాలి!

మాజంలో అంటరానితనానికి గురై, ఊరి బయటకు వెలివేయబడిన ప్రజలను.. భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించి వారి అభ్యున్నతి కొరకు కల్పించిందే రిజర్వేషన్ విధానం. రాజ్యాంగం అమలై 75 ఏళ్లు పూర్తయినప్పటికీ ఇంకా ఎక్కువ శాతం దళితులు అభివృద్ధి సాధించకపోవడానికి కారణం ఈ ఎస్సీ రిజర్వేషన్ల లబ్ధిని నిజమైన ఎస్సీలకు అందించడంలో ప్రభుత్వాలు, అధికారులు, రాజకీయ నాయకులు విఫలం కావటమే! ఇస్లాం, క్రైస్తవ మతంలోకి మారిన ఎస్సీలు దొడ్డిదారిలో ఎస్సీ సర్టిఫికెట్లు పొంది, హిందూ ఎస్సీలకు చెందాల్సిన విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలను కొల్లగొడుతున్నారు. నిజానికి ఎస్సీలు క్రైస్తవ మతంలోకి మారితే బీసీ–సీ కేటగిరిలో వారికి రిజర్వేషన్ అవకాశాలు లభిస్తాయి, ముస్లింలలో నిమ్న వర్గాలకు బీసీ–ఈ కేటగిరీలో రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అంతేకాక మతం మారినవారికి మరెన్నో ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి.

1) ఎస్సీ/ఎస్టీ/బీసీ విద్యార్థులకు ఉన్న విధంగానే మైనారిటీ విద్యార్థులకు కూడా పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నడపబడే ప్రత్యేక సోషల్ వెల్ఫేర్ మైనారిటీ విద్యా గురుకులాలు ఉన్నాయి. వాటి ద్వారా మతం మారినవారితో సహా ముస్లిం, క్రైస్తవ మైనారిటీల పిల్లలందరూ ఉచితంగా చదువుకోవచ్చు. 2) ఎలాగైతే ఎస్సీ/ ఎస్టీ/బీసీల కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఉన్నాయో అదేవిధంగా ముస్లిం, క్రైస్తవ మైనారిటీల కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఉన్నాయి, వాటి ద్వారా మతం మారిన వారికి కూడా వ్యాపారానికి రుణాలు, స్వయం ఉపాధి పథకాలు, రుణ రాయితీలు లాంటి అన్ని సదుపాయాలు లభిస్తాయి. 3) ఎస్సీ ఎస్టీల కమిషన్ల మాదిరిగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో మైనారిటీ కమిషన్లు మైనారిటీ ప్రజల అభివృద్ధి, పురోగతుల మూల్యాంకనం చేస్తూ, సమాజంలో ఆర్థిక సామాజిక అసమానతల నుంచి వారికి రక్షణ కల్పిస్తూ, వారి రాజ్యాంగ హక్కులను పరిరక్షణను పర్యవేక్షిస్తున్నాయి. 4) భారత రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు కూడా లేని ఒక అద్భుత అవకాశం మైనారిటీలకు ఉంది, అదే ఈ ఆర్టికల్ 30.


చరిత్రలో అంటరానితనం వల్ల ఏ విద్యా అవకాశాలైతే దళితులకు లభించలేదో, అవి ఆర్టికల్ 30 ద్వారా ముస్లిం, క్రైస్తవ, మైనారిటీలకు కల్పించేందుకు విదేశీ నిధుల సౌలభ్యంతోను, కేంద్ర ప్రభుత్వ సహకారంతోను ప్రత్యేక ప్రైవేట్ విద్యా సంస్థలు ఏర్పరచుకునే వెసులుబాటు ఉంది. అలాంటి మైనారిటీ విద్యా సంస్థలలో ఆయా మతాలకు సంబంధించిన విద్యార్థులకు 75శాతం రిజర్వేషన్ ఉంటుంది. కానీ ఈ విద్యా సంస్థలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు మాత్రం ఎలాంటి రిజర్వేషన్ ఉండదు. ఈ ప్రత్యేక మైనారిటీ విద్యా సంస్థల ద్వారా మతం మారిన వారికి కూడా చదువుకునే అవకాశం మెండుగా ఉంది. కానీ ఇప్పటికీ 90శాతం హిందూ దళితుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కాలేజీల్లోనే చదువుకుంటున్నారు. మరి మతం మారి ప్రత్యేక మైనారిటీ విద్యా సంస్థల్లో చదువుకునే పిల్లలతో ప్రభుత్వ విద్యా సంస్థలలో చదివే పేద హిందూ దళితుల పిల్లలు పోటీపడగలరా?


మతం మారినవారికి పైన తెలిపిన అన్ని సదుపాయాలు, అవకాశాలు లభిస్తున్నప్పటికీ, ఇప్పటికీ 90శాతం పేదరికంలో బతుకుతున్న దళిత ప్రజలకు అందాల్సిన ఫలాలను కూడా తామే ఆరగిస్తామనడం ఎంతవరకు సబబు? ఊరి చివరన పూరి గుడిసెల్లో బతుకుతూ దేవాలయాల్లోను, పాఠశాలల్లోను, చివరికి శ్మశానాల్లోను అందరితో పాటు సమాన అవకాశాలు దొరక్క శతాబ్దాలుగా జంతువుల కన్నా హీనంగా చూడబడినది హిందూ మతంలో భాగమైన దళితులే తప్ప, ఈ దేశాన్ని వెయ్యేళ్లపాటు పాలించిన ముస్లిం–క్రైస్తవులు కాదు. ఈ దేశాన్ని పాలించిన వర్గాల్లోకి వెళ్లి బాధిత వర్గాల్లోని కంచంలో భాగం అడగడం ఎంతవరకు సమంజసం? హిందూ మతంలో వివక్ష ఉందనే కారణం చేతనే వారు ఇతర మతాలను స్వీకరించారు కదా, మరి ఇంకా ఎస్సీ రిజర్వేషన్లు కావాలని అనడం ఎంతవరకు సబబు?

ఒకప్పుడు ఎక్కువగా అగ్రవర్ణాల కుల అహంకారానికి గురైన హిందూ దళితులు నేడు మతం మారినవారి మతమౌఢ్యం వల్ల కష్టాల పాలవుతున్నారు. ఉదాహరణకు, మతం మారిన క్రైస్తవులు కన్నతల్లిదండ్రులకు కూడా వారి పూర్వ సంస్కృతి ప్రకారం దహన సంస్కారాలు చేయడానికి ఒప్పుకోవడం లేదు, హిందూ దళితులతో పెళ్లి సంబంధాలు కలుపుకోవడానికి ఇష్టపడడం లేదు, కనీసం హిందూ దళితుల శుభకార్యాలకు కూడా వాళ్లు హాజరు కావడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు పని ప్రదేశాలలో హిందూ దళితులను హేళనగా చూస్తున్నారు. అసలు వాళ్లను వాళ్లు దళితులుగా చెప్పు కోవడానికి ఏ మాత్రం ఇష్టపడడం లేదు. దీని అర్థం వారు హిందూ దళితులతో సామాజిక బంధాన్ని పూర్తిగా తెంపుకున్నట్టే కదా? మరి సామాజిక బంధమే లేనప్పుడు రిజర్వేషన్ల బంధం మాత్రం ఎలా ఉంటుంది?


అలాగే ఎస్సీల భవిష్యత్తును నిర్ణయించడానికి రంగనాథ్ మిశ్రా కమిషన్‌కు ఉన్న అర్హత ఏమిటి? ఎస్సీలకు సంబంధించిన రాజ్యాంగ హక్కులను, రిజర్వేషన్లను, సంక్షేమ పథకాల అమలును, దళితులపై అత్యాచారాలను అరికట్టే వ్యవస్థలను పర్యవేక్షించేది జాతీయ ఎస్సీ కమిషన్. వారి జీవన స్థితిగతులపై నివేదికలు తయారు చేయగలిగే అర్హత ఆర్టికల్ 341 ప్రకారం కేవలం జాతీయ ఎస్సీ కమిషన్‌కు మాత్రమే ఉన్నది. కానీ 2004లో యూపీఏ ప్రభుత్వం దళిత క్రైస్తవులను ముస్లింలను ఎస్సీలుగా గుర్తించి వారికి రిజర్వేషన్లు కల్పించేందుకు రంగనాథ్ మిశ్రా కమిషన్‌ను నియమించింది. నిజానికి రంగనాథ్ మిశ్రా కమిషన్‌కు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో సంబంధమే లేదు. అది కేవలం భాషా మైనారిటీల సామాజిక, ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేయడానికి, వారి సంక్షేమానికి తగిన సిఫార్సులు చేయడానికి 29 అక్టోబర్ 2004న భారత ప్రభుత్వంచే ఏర్పాటు చేసిన కమిషన్‌. అలాంటి కమిషన్ ద్వారా ఎస్సీల భవిష్యత్తును నిర్ణయించే నివేదికలు సిద్ధం చేయించి హిందూ దళితులను తప్పుదారి పట్టించడంలో ఎలాంటి కుట్ర దాగి ఉన్నదో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. దేశంలో షెడ్యూల్డ్ క్యాస్ట్ ప్రజలను మభ్యపెట్టి ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు ‘మతం మారితే కులం పోదు’ అని 2004లో సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) వేశారు. కానీ హిందూ దళితులకు, ముస్లింలకు, క్రైస్తవులకు సంస్కృతీ సంప్రదాయాల సంబంధమే లేదు. హిందూ దళితుల ఆచార వ్యవహారాలు వేరు, క్రైస్తవుల ముస్లింల ఆచార వ్యవహారాలు వేరు. ‘హిందూ సమాజంలో వివక్ష, అంటరానితనం అనుభవించిన వారికి మాత్రమే రిజర్వేషన్లు వర్తిస్తాయి’ అని, మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడం సరికాదని, మతపరమైన రిజర్వేషన్ల వల్లనే దేశ విభజన జరిగిందని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఏనాడో అభిప్రాయపడ్డారు.


దళిత క్రైస్తవులకు, ముస్లింలకు ఎస్సీ హోదా ఇవ్వాలా వద్దా అనే అంశంపై ప్రస్తుతం కె.జి.బాలకృష్ణన్‌ కమిషన్ దేశవ్యాప్తంగా అభిప్రాయ సేకరణ చేస్తున్నది. హిందూ దళితుల సమస్యలను, ఆర్థిక స్థితిగతులను, ఆచార వ్యవహారాలను, మతం మారిన వారివల్ల నిజమైన దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆ కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లాలి. అలాగే ఎస్సీ రిజర్వేషన్లు కేవలం హిందూ (సిక్కు, బుద్ధిస్ట్‌) దళితులకు మాత్రమే వర్తించే విధంగా కమిటీ రిపోర్టు ఇచ్చే విధంగా వారికి వినతి పత్రాలు ఇవ్వాలి. అలా ఇవ్వని పక్షంలో హిందూ దళిత సమాజం ఉనికికే ప్రమాదం. న్యాయమైన డిమాండ్లను సాధించడానికి యావత్ దళిత సమాజం జాగృతమై పోరాటానికి సిద్ధం కావాలి.

- గువ్వల బాలరాజు

మాజీ శాసనసభ్యులు

Updated Date - Jul 05 , 2026 | 12:39 AM