భారత్ ప్రతిష్ఠకు మానవతా ప్రదీప్తి
ABN , Publish Date - Oct 09 , 2026 | 01:52 AM
విదేశాలలోని భారతీయులు తమ ఉద్యోగ బాధ్యతలను పరిపూర్ణ నిబద్ధత, నిండు నిజాయితీతో నిర్వహిస్తారు.. తోటి ఉద్యోగులైన ఇతర దేశాల వారికి ఆదర్శప్రాయంగా వ్యవహరిస్తారు.
విదేశాలలోని భారతీయులు తమ ఉద్యోగ బాధ్యతలను పరిపూర్ణ నిబద్ధత, నిండు నిజాయితీతో నిర్వహిస్తారు.. తోటి ఉద్యోగులైన ఇతర దేశాల వారికి ఆదర్శప్రాయంగా వ్యవహరిస్తారు. కర్తవ్య పాలనలో భారతీయ ఉద్యోగుల నిమగ్నతే ప్రపంచ దేశాలలో భారత్ పేరు ప్రతిష్ఠలను సదా పెంపొందిస్తోంది. ఎడారిలో ఒంటెలను కాసే కాపరి నుండి ఆకాశంలో విమానాన్ని నడిపే పైలట్ దాకా ప్రతి ప్రవాస భారతీయుడూ అంకితభావంతో పని చేస్తాడు.
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫ్లై దుబాయి విమాన సంఘటనలో భారతీయుడు అయిన ఆ విమాన పైలట్ స్మిత్ మచ్చర్ ప్రదర్శించిన సమయస్ఫూర్తి, చొరవ, తెగువతో భారతదేశ ప్రతిష్ఠ మరింత పెరిగింది. ఉగ్రవాద పెనుభూతానికి ఎదురొడ్డి స్మిత్ చాకచాక్యంగా వ్యవహరించిన తీరును యావత్ ప్రపంచమూ కొనియాడింది. అరబ్బు సంప్రదాయంలో సాధారణంగా నుదిటపై ముద్దాడడం అనేది గౌరవభావాన్ని వ్యక్తపరుస్తుంది. తండ్రితో సమానమైన వారి పట్ల మాత్రమే అరబ్బులు అటువంటి గౌరవభావాన్ని చూపుతారు. అందునా రాజకుటుంబీకులు కేవలం తమ తండ్రి సమానులు లేదా ఇస్లాం ధార్మిక విద్వాంసులకు మాత్రమే ఆ ఉదాత్త గౌరవాన్ని ఇస్తారు. విమాన ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్మిత్‌ను పరామర్శించిన సందర్భంగా దుబాయి యువరాజు శేఖ్ హాందాన్ ఆయనను ఈ విధంగా ముద్దాడి తన అభినందనలు తెలిపారు. అత్యంత అతి అరుదైన ఈ గౌరవం ఒక్క స్మిత్‌కు మాత్రమే కాకుండా సమస్త భారతదేశానికీ దక్కినట్టు భావించాలి.
అబుధాబి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్మిత్‌ను దుబాయి యువరాజు అక్కడకు వెళ్లి పరామర్శించడం ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించవల్సిన విషయం. దుబాయి, అబుధాబి రెండు వేర్వేరు రాజ్యాలు. ఈ రెండింటిని రెండు వేర్వేరు రాజకుటుంబాలు పరిపాలిస్తున్నాయి. స్మిత్ పని చేసే ఫ్లైదుబాయి సంస్ధ దుబాయి కేంద్రంగా పని చేయడమే కాకుండా, దుబాయి రాజకుటుంబం యాజమాన్యంలో ఉంది. దుబాయి యువరాజు ఇరుగు పొరుగు దేశాలలో ఒక అధికారిక పని మీద పర్యటించడమనేది అరుదైన సన్ని వేశమేనని చెప్పవచ్చు. ‘ఆయన మా బృందంలో ఒక భాగం, మా దేశ చరిత్రలో ఒక భాగం కావడం మాకు గర్వకారణం’ అని దుబాయి యువరాజు తన సామాజిక మాధ్యమ ఖాతాలో స్మిత్‌ను కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అబుధాబి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పైలట్ స్మిత్‌తో విడియో కాల్‌లో మాట్లాడుతూ ‘మీరు ఒక క్షణంలో తీసుకున్న పలు నిర్ణయాలు అనేక మంది ప్రాణాలను రక్షించాయి’ అని ఆ సాహసోపేత భారతీయుడి సమయస్ఫూర్తిని ప్రశంసించారు.
అత్యవసరంగా విమానం క్రిందకు దిగిన కొన్ని నిమిషాలలోపే ఆ ఘటనను ఉగ్రవాద చర్యగా ఇజ్రాయిల్ ప్రభుత్వం ప్రకటించగా, ఈ ఘటనతో ఉగ్రవాద బృందాలకు సంబంధం ఉందా లేదా అన్న విషయమై దర్యాప్తు చేస్తున్నట్టు యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ ప్రభుత్వం వెల్లడించింది. ఫ్లై దుబాయి విమాన ఘటనను అంతర్జాతీయ మీడియా ప్రముఖంగా ప్రస్తావించిన తర్వాత రాత్రివేళ సౌదీ అరేబియాలోని భారత్ ఎంబసీ తమ దేశ పౌరుడైన పైలట్ గాయపడి చికిత్స పొందుతున్నట్లుగా ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. సున్నితమైన ఈ ఘటనపై గల్ఫ్ మీడియా అత్యంత జాగ్రత్తగా స్పందించింది.
జోర్డాన్, ఇజ్రాయిల్, సౌదీ అరేబియా సరిహద్దుల మధ్య సంభవించిన ఫ్లైదుబాయి విమాన సంఘటనపై ఒక్కసారిగా మధ్యప్రాచ్యంతో పాటు సమస్త ప్రపంచ దేశాలూ ఉలిక్కిపడ్డాయి. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయిల్ దాడులతో ఉద్రిక్తతలు నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ విమాన సంఘటన అనేక సవాళ్ళను విసిరింది. ఇజ్రాయిల్, అమెరికా దేశాధినేతల దుందుడుకు చర్యలతో మధ్యప్రాచ్య దేశాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని అరబ్బులు భావిస్తున్న వేళ, ఇజ్రాయిల్‌తో ముడిపడి ఉన్న ఈ విమాన ఘటన చోటుచేసుకున్నది.
అబ్రహం ఒడంబడిక తర్వాత దుబాయి మీదుగా ఇజ్రాయిల్‌కు విమానయానం సునాయాసమయింది. ప్రతి రోజూ పది ఫ్లైదుబాయి విమానాలు దుబాయి నుంచి ఇజ్రాయిల్‌కు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ఈ సంఘటన అనంతరం ఇజ్రాయిల్‌కు తన విమాన సర్వీసులను ఫ్లైదుబాయి నిలిపివేసింది. మధ్యపాచ్య దేశాలలో అనేక సవాళ్ళను సంధించిన ఈ విమాన సంఘటనలో పైలట్ స్మిత్ సమయస్ఫూర్తి ఈ ప్రాంతంలోని ప్రవాస భారతీయుల ఉద్యోగ నిష్ఠను ప్రతిబింబించింది.
- మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)