విదేశీ విరాళాలు
ABN , Publish Date - Jun 30 , 2026 | 12:06 AM
ఒక నిర్దిష్ట లక్ష్యంతో చేపట్టిన చర్యలు సమాజ విశాల ప్రయోజనాలకు హాని కలిగించేవి కావడం సమంజసమేనా? పది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన విదేశీ విరాళాల నియంత్రణ చట్టం..
ఒక నిర్దిష్ట లక్ష్యంతో చేపట్టిన చర్యలు సమాజ విశాల ప్రయోజనాలకు హాని కలిగించేవి కావడం సమంజసమేనా? పది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ‘విదేశీ విరాళాల నియంత్రణ చట్టం’ (ఎఫ్‌సీఆర్‌ఏ) సవరణ నిబంధనలు ఆ ప్రశ్నకు ఆస్కారమిస్తున్నాయి. దేశ అంతర్గత వ్యవహారాలలో విదేశీ జోక్యాన్ని అడ్డుకునేందుకు ఉద్దేశించిన ఈ చట్టానికి అర్ధ శతాబ్ది చరిత్ర ఉంది. రాజకీయ పార్టీలకు విదేశాల నుంచి సమకూరే ఆర్థిక వనరులు పార్లమెంటరీ ఎన్నికలు, ప్రజాస్వామ్య సంస్థలను ప్రభావితం చేయడాన్ని నిరోధించేందుకు 1976లో ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. చట్టంలోని లొసుగులను సరిదిద్ది, మారిన పరిస్థితులకు అనుగుణంగా దాని పరిధిని విస్తృతం చేస్తూ 2010లో ఆ చట్టాన్ని సమగ్రంగా పునర్వ్యవస్థీకరించారు. 2011 మే నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ‘విదేశీ విరాళాల నియంత్రణ చట్టం’ నిబంధనలను తాజా సవరణలతో సహా మొత్తం పదిసార్లు సవరించారు.
విదేశీ విరాళాలను స్వీకరించడంలో ఎటువంటి దాపరికం ఉండకూడదు; ఆ నిధులను చట్టబద్ధంగా వినియోగించాలి; జాతీయ భద్రతకు వాటి వల్ల విఘాతం వాటిల్లకూడదు. ఇదీ చట్టం. ఆ సంకల్ప స్ఫూర్తితో దాన్ని అమలుపరచాలి. అలా కాకుండా స్వచ్ఛంద సేవా సంస్థలు అయిన ఎన్‌జీవోలు పనిచేసే తీరుతెన్నులు ఎలా ఉండాలో తాజా సవరణలు నిర్దేశిస్తున్నాయి. పౌర సమాజం ప్రభుత్వానికి పొడిగింపు కాదు. పౌరుడికి, రాజ్యానికి మధ్య ఉన్న రాజ్యాంగ ప్రదేశమే పౌర సమాజం. అనేక రాజకీయ, సామాజిక, సాంస్కృతిక సంస్థలు, వాటి కార్యకలాపాలకు నెలవు ఆ రాజ్యాంగ ప్రదేశం. అది సదా చైతన్యశీలంగా, స్వతంత్రంగా, వైవిధ్యభరితంగా ఉంటేనే ప్రజాస్వామ్యం సమస్త ప్రజలకు శ్రేయోదాయకమవుతుంది. స్వతంత్ర భారతదేశాన్ని అటువంటి శ్రేయోరాజ్యంగా పురోగమింప చేయడంలో పౌర సమాజ సంస్థలూ విశిష్టపాత్ర వహించాయన్న వాస్తవాన్ని విస్మరించకూడదు. మహిళా స్వయం సహాయ సంఘాలు, జాతీయ గ్రామీణ జీవనోపాధుల కార్యక్రమం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆశా కార్యకర్తలు, సమాచార హక్కు చట్టం మొదలైనవి పౌర సమాజ సంస్థల ఆలోచనలు, ఆచరణల నుంచి ప్రభవించినవే.
విదేశీ విరాళాలను అందుకుంటున్న ఎన్‌జీవో కార్యకలాపాలపై తాజా సవరణలు తీవ్ర ఆంక్షలు విధించాయి. ముఖ్యంగా మత మార్పిడి కార్యకలాపాలకు విదేశీ నిధులను ఏ విధంగానూ ఉపయోగించకుండా కట్టడి చేశాయి. మత స్వేచ్ఛకు సంబంధించిన రాజ్యాంగ అధికరణ 25 –మనసారా ఆత్మసాక్షిగా నమ్మే విశ్వాసాలకు,, మతప్రచారాలకు సంపూర్ణ స్వాతంత్ర్యం– ను పలు ఎన్‌జీవోలు దుర్వినియోగం చేస్తున్నాయనేది ప్రభుత్వ వాదన. ఈ అధికరణ ప్రకారం ప్రతి ఒక్కరికీ తాము విశ్వసించే మతాన్ని ప్రచారం చేసుకునేందుకు హక్కు ఉన్నదని, అయితే అన్యమతస్థులను తమ మతంలోకి మార్చే ప్రయత్నాలు చేసేందుకు ఎవరికీ హక్కు లేదని దశాబ్దాల క్రితమే ఒక తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1967లో ఒడిషా మొదలు 2026లో మహారాష్ట్ర వరకు మొత్తం పన్నెండు రాష్ట్రాలు మత మార్పిడులకు వ్యతిరేకంగా చట్టాలు చేశాయి. 1954లోనే మధ్య ప్రదేశ్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ భవాని శంకర్ నియోగి కమిటీ నివేదిక గిరిజన ప్రాంతాలలో క్రైస్తవ మిషనరీల మతాంతరీకరణ కార్యకలాపాలకు వ్యతిరేకంగా గట్టి సిఫారసులు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉపేక్షించిన ఆ సిఫారసులను అమలుపరిచేందుకు ప్రస్తుత పాలకులు పూనుకున్నారని ఎఫ్‌సీఆర్‌ఏ తాజా సవరణలను సమర్థిస్తున్నవారు అభిప్రాయపడుతున్నారు.
నిజమే, విదేశీ నిధులు అందుకుంటున్న కొన్ని ఎన్‌జీవోలు మతమార్పిడిలకు పాల్పడుతున్నాయి. ఆ మాటకొస్తే ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానే తోడ్పడిన ఎన్‌జీవోలు సైతం ఉన్నాయనేది కొట్టివేయలేము. అయినంత మాత్రాన ఎన్‌జీవోల కార్యకలాపాలను గణనీయంగా తగ్గించివేసే లక్ష్యంతో చట్టానికి సవరణలు చేయడం సహేతుకమేనా? నిక్కచ్చిగా మాట్లాడాలంటే పౌర సమాజాన్ని పూర్తిగా నియంత్రించేందుకే కేంద్రం ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలను మరింత కఠినతరం చేసింది.
ఏవో కొన్ని ఎన్‌జీవోల చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టే పేరిట పౌరసమాజాన్ని అన్ని విధాలా నియంత్రించేందుకు, పూనుకోవడం సబబవుతుందా? పౌర సమాజం క్రియాశీలంగా ఉండలేని పరిస్థితులలో మన సర్వోన్నత న్యాయస్థానం ఆదర్శంగా తీసుకున్న మహాభారత ధర్మసూక్తి ‘యతో ధర్మస్తతో జయః’ (ధర్మం ఎక్కడ ఉంటే విజయం అక్కడ ఉంటుంది) మన ప్రజాస్వామ్యంలో నిండుగా ఎలా పల్లవిస్తుంది?