Fatima Sheikh: బడుగుల జీవితాల్లో వెలుగురేఖ
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:48 AM
మానవ హక్కులంటే, సమాజంలోని అన్ని వర్గాల హక్కులని, ముఖ్యంగా బలహీన వర్గాలు, మహిళలు, పిల్లల హక్కులని, వాటి సాధనకు అక్షరమే ఆయుధమని నమ్మిన సమాజ సేవకురాలు ఫాతిమా షేక్.
మానవ హక్కులంటే, సమాజంలోని అన్ని వర్గాల హక్కులని, ముఖ్యంగా బలహీన వర్గాలు, మహిళలు, పిల్లల హక్కులని, వాటి సాధనకు అక్షరమే ఆయుధమని నమ్మిన సమాజ సేవకురాలు ఫాతిమా షేక్. సావిత్రీబాయి పూలేతో కలిసి అణగారిన వర్గాల మహిళలు, పిల్లలకు అక్షరజ్ఞానం ప్రసాదించిన విద్యాదాత. ఆధునిక భారత విద్యారంగానికి మార్గదర్శకురాలు. మనువాద, అగ్రవర్ణ భావజాలికులు సంప్రదాయం పేరుతో శూద్రులకు విద్యను నిరాకరించినప్పుడు ఆ హక్కు కోసం గళమెత్తిన ధీరవనిత. సావిత్రీబాయి, జ్యోతిరావు పూలేలతో కలిసి విద్యాభివృద్ధికి పాటుపడిన త్యాగమయి. పూలే నేతృత్వంలోని సత్యశోధక్ ఉద్యమంలో భాగస్వామి.
1848లో దళిత పిల్లలు, మహిళల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించడానికి ప్రయత్నించినప్పుడు, ‘మత వ్యతిరేక చర్య’గా పేర్కొంటూ పూలే దంపతులను కుటుంబ సభ్యులు, గ్రామస్థులు బహిష్కరించినప్పుడు ఫాతిమా షేక్, ఆమె సోదరుడు ఉస్మాన్ షేక్ వారికి సహాయం చేసి ఆదుకున్నారు. పూలే ఆలోచనల నుంచి ప్రేరణ పొందిన ఉస్మాన్, తన సోదరికి ఉపాధ్యాయురాలిగా శిక్షణ ఇప్పించాడు. సావిత్రీబాయితో పాటు, ఫాతిమా కూడా నాటి ఆధిపత్య వర్గాల నుంచి సామాజిక పరంగా అనేక అవమానాలను ఎదుర్కొన్నారు. ఎందుకంటే వారు దుర్మార్గమైన నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడారు. విద్యాభివృద్ధి జరగాలంటే విద్యాసంస్థలు సజీవంగా ఉండాలి. వాటిని నిర్మూలించడానికి మనువాదులు విశ్వప్రయత్నాలు చేసినప్పుడు వాటిని కాపాడుకోడానికి ఫాతిమా చేసిన కృషి అనుపమానమైనది.
ముస్లిం మైనారిటీలు అనుసరించే ఇస్లాం ధర్మం స్త్రీ విద్యను వ్యతిరేకించనప్పటికీ, ఇస్లాం తెలియని ముస్లింల నుంచి, అగ్రకుల హిందువుల నుంచి ఫాతిమా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. అనేక ఆటుపోట్లు, అవమానాలు చవిచూశారు. అయినా అకుంఠిత దీక్షతో ఆమె దళితులు, ఆదివాసీలు, స్త్రీలు, పిల్లల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసి, చరిత్రలో నిలిచి పోయారు. 2014లో మహారాష్ట్ర ప్రభుత్వం ఫాతిమా షేక్ సేవలను గుర్తించి, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, జాకీర్ హుసేన్, అబ్దుల్ కలామ్‌లతో పాటు ఆమె సంక్షిప్త పరిచయాన్నీ రాష్ట్ర పాఠ్య పుస్తకాలలో పొందుపరిచింది. 2021లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఫాతిమా గురించిన పాఠాన్ని ఎనిమిదవ తరగతిలో ప్రవేశపెట్టింది. 2022లో ఫాతిమా జన్మదినం సందర్భంగా గూగుల్ ఇండియా ప్రత్యేక డూడుల్ ద్వారా ఆమె సేవలను స్మరించింది. కాస్త ఆలస్యమైనా జాతీయ– అంతర్జాతీయ స్థాయిలో ఆమెకు లభించిన సమున్నత గుర్తింపు ఇది.
అక్షరాన్ని అమితంగా ప్రేమించి, అణగారిన వర్గాలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి, అలుపెరుగని పోరు సలిపిన ఫాతిమా షేక్ విస్మృత చరిత్రను మరింతగా పరిశోధించి భావితరాలకు అందించవలసిన అవసరం మేధావులు, చరిత్రకారులపై ఉంది.
యండి.ఉస్మాన్ ఖాన్
(నేడు ఫాతిమా షేక్ జయంతి)