Farmers Foundation: సేంద్రియ శిక్షణలో పదేళ్ల ప్రస్థానం
ABN , Publish Date - Jan 03 , 2026 | 04:08 AM
మన నేలలే మన భవిత. సారమున్న భూములే ప్రగతికి పునాది. ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహార భద్రత, గ్రామీణ ఉపాధి, సామాజిక స్థిరత్వం, సమగ్ర అభివృద్ధి సైతం వ్యవసాయ, అనుబంధ రంగాలతోనే ముడిపడి ఉంది.
మన నేలలే మన భవిత. సారమున్న భూములే ప్రగతికి పునాది. ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహార భద్రత, గ్రామీణ ఉపాధి, సామాజిక స్థిరత్వం, సమగ్ర అభివృద్ధి సైతం వ్యవసాయ, అనుబంధ రంగాలతోనే ముడిపడి ఉంది. భూముల్లో సేంద్రియ కర్బనస్థాయి 1951లో 4 శాతంగా ఉంటే ఇప్పుడు 0.4శాతానికి తగ్గిపోయింది. దీనికి విచక్షణ లేకుండా రసాయన ఎరువుల వినియోగం ప్రధాన కారణం. నేలల్లో నత్రజని, భాస్వరం, పొటాష్ వినియోగం సిఫారసు చేసిన 4:2:1 నిష్పత్తి కంటే అధికంగా 6:4:1గా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ పరిస్థితి మరింత దిగజారకుండా, క్షేత్ర స్థాయిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా అహరహం శ్రమిస్తున్నాయి. వీటిలో భిన్నమైనది రైతునేస్తం ఫౌండేషన్.
పదేళ్లుగా రైతునేస్తం వ్యవసాయ మాసపత్రికను విజయవంతంగా నడిపిన యడ్లపల్లి వెంకటేశ్వరరావు తన అనుభవంలో– నిరంతర శిక్షణ అవసరం అన్న విషయం గ్రహించి 2016 ఫిబ్రవరి 28న జాతీయ రైతు నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు అప్పటి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు చేతుల మీదుగా గుంటూరు జిల్లా పుల్లడిగుంట, కొర్నెపాడులో రైతునేస్తం ఫౌండేషన్ ప్రారంభించారు. పదేళ్ల కాలంలో ఈ ఫౌండేషన్ సేంద్రియ రైతులకు వేదికయింది. వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువల జోడింపుతోనే రైతుకు గిట్టుబాటు అనే సూత్రం నేర్పిన పాఠశాల అయింది. రసాయన రహిత సేద్య ఉద్యమానికి కేంద్రమైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలతో వందలాది అవగాహన కార్యక్రమాలు, శిక్షణ తరగతులు నిర్వహించి, లక్షలాది రైతులకు సేంద్రియ, రసాయన రహిత వ్యవసాయ విధానాలు బోధించింది. అనుబంధ రంగాలపై అవగాహన కల్పించి వారి ఆలోచనా ధోరణిలో మార్పునకు బీజం వేసింది. దీనిని ఒక సామాజిక బాధ్యతగా రైతునేస్తం ఫౌండేషన్ చేపట్టింది.
శిక్షణ తరగతులలో సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో పాటు అనుబంధ రంగాలైన పశుపోషణ, గొర్రెలు, కోళ్ళు, చేపలు, పశుగ్రాసాలు, పుట్టగొడుగులు, తేనెటీగల పెంపకంతో పాటు పెరటిలో కూరగాయల సాగు అంశం కూడా చేర్చి, ఆయా రంగాల్లో నిపుణులతో అవగాహన తరగతులు నిర్వహించడం విశేషం. వీటితో పాటు వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా డ్రోన్స్ వాడకంపై చైతన్యపరచింది. ఇక మన సంప్రదాయ పంటలయిన చిరుధాన్యాలను తిరిగి సాగులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో వీటి ప్రాముఖ్యం, వాడకంతోనే సంపూర్ణ ఆరోగ్యం అనే అంశాలపై తెలుగు రైతులోకానికి డా. ఖాదర్‌వలితో వందలాది అవగాహన సదస్సులు నిర్వహించి, నిశ్శబ్ద విప్లవానికి శ్రీకారం చుట్టింది. చిరుధాన్యాల సాగు, మార్కెటింగ్‌పై అవగాహన తీసుకురావటానికి రైతునేస్తం ఫౌండేషన్‌లో చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్‌ను సైతం ఏర్పాటు చేశారు. అలాగే సేంద్రియ వ్యవసాయానికి మూలమైన దేశీ జాతి 50 ఆవులతో రైతునేస్తం గోశాలను ఏర్పాటు చేసింది.
సేంద్రియ వ్యవసాయంలో రైతులకు అవగాహనతో పాటు, ఆ విధానంలో పండించిన పంటలను క్షేత్రస్థాయిలో చూపించటంతో పాటు, రైతునేస్తం మొబైల్ యాప్ ద్వారా సేంద్రియ వ్యవసాయ సమాచారాన్ని రైతులకు అందించడాన్ని ఫౌండేషన్ బాధ్యతగా పెట్టుకున్నది. రైతునేస్తం పబ్లికేషన్స్ ద్వారా 100కి పైగా వ్యవసాయం, అనుబంధ రంగాల పుస్తకాలు అందుబాటులోకి తీసుకువచ్చింది. సేంద్రియ రైతులను, అందుకు కృషిచేస్తున్న శాస్త్రవేత్తలను, విస్తరణ అధికారులను, అగ్రి జర్నలిస్టులను ‘రైతునేస్తం పురస్కారాలు’తో ప్రతి ఏటా గౌరవించే కొత్త సంప్రదాయానికి తెరతీసింది. అంతటితో ఆగకుండా మారిన కాలానికి దీటుగా వీరి ‘రైతునేస్తం యూట్యూబ్ చానెల్’ సేంద్రియ రైతుల విజయగాథలకు ఆలంబన అయింది. దాదాపు 14 లక్షల మంది చానెల్‌కు చందాదారులు కావటం వారి విశ్వసనీయతకు, పనితీరుకు, ప్రతిభకు నిదర్శనం. రైతులు పండించిన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలపై అవగాహన కల్పించి, మంచి ధర లభించేలా రైతునేస్తం కృషి చేస్తున్నది. అయితే రైతాంగం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ‘సేంద్రియ వ్యవసాయ హబ్’లుగా తెలుగు ప్రాంతాలను మార్చాలన్న వారి లక్ష్యం ఈ దశాబ్దకాలంలో ఎంత మేర నెరవేరిందన్నది వారు విశ్లేషించుకోవాలి. ఇన్నేళ్ల కృషి ఫలితాన్ని మదింపు చేసుకోవాలి.
గత పదేళ్లుగా వారి ఆలోచనలను వారికున్న పరిధిలో త్రికరణశుద్ధిగా ఆచరణలో పెట్టారు. క్షేత్ర స్థాయిలో కలసి వచ్చిన ఉద్యాన, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖలతో పాటు మరెందరినో సమన్వయం చేసుకుంటూ ముందుకు నడిచారు. అయితే ఎవ్వరి ఆర్థిక సహాయ సహకారాలు లేకుండా స్వంత నిధులతో పనులు నిర్వహిస్తూ ఫౌండేషన్ రైతులకు దగ్గరైంది. కొన్ని శిక్షణలకు అడపా దడపా నాబార్డు పాత్ర ఉండివుండవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో రైతు సాధికారిక సమితి ఆధ్వర్యంలో సాగుతున్న సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ ఉద్యమం కూడా వీరిని భాగస్వామిగా తీసుకోలేదు. ఎవరి తోవలో వారు నడుస్తున్నారు. సేంద్రియ సేద్యం, చిరుధాన్యాలు, మిద్దెతోటల ఆలోచనలను మాత్రం తెలుగు నాట రైతునేస్తం ఫౌండేషన్ నాటగలిగింది.
-వలేటి గోపీచంద్
(ఈ నెల 5న గుంటూరు జిల్లా కొర్నెపాడులో రైతునేస్తం ఫౌండేషన్
దశాబ్ది ఉత్సవాలను పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు.)