పరీక్షలంటే భూతం కాదు!
ABN , Publish Date - Oct 23 , 2026 | 02:31 AM
‘పరీక్షలు: పొదల వెనక పులులు!’ అనే శీర్షికతో సెప్టెంబర్ 29న బి.ఆర్.బాపూజీ రాసిన వ్యాసం ప్రస్తుత పరీక్షా విధానంపై కొన్ని ప్రశ్నలను ముందుకు తెచ్చింది. పరీక్షల ఒత్తిడి, బట్టీ చదువు, పరీక్షా కేంద్రాల్లో ..
‘పరీక్షలు: పొదల వెనక పులులు!’ అనే శీర్షికతో సెప్టెంబర్ 29న బి.ఆర్.బాపూజీ రాసిన వ్యాసం ప్రస్తుత పరీక్షా విధానంపై కొన్ని ప్రశ్నలను ముందుకు తెచ్చింది. పరీక్షల ఒత్తిడి, బట్టీ చదువు, పరీక్షా కేంద్రాల్లో పర్యవేక్షణ, ప్రవేశ పరీక్షల భయం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. విద్యార్థులపై మానసిక ఒత్తిడి ఉండకూడదన్న విషయంలో ఎలాంటి విభేదం లేదు. కానీ పరీక్షల చుట్టూ ఉన్న కొన్ని లోపాలను చూపించి పరీక్షా వ్యవస్థనే విద్యార్థుల శత్రువుగా చిత్రీకరించడం, పరీక్షల వల్లే విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయన్న భావన కనబరచడం సరికాదు.
బాపూజీ తన వ్యాసంలో 2014 నుంచి 2024 వరకు దేశంలో 1.23 లక్షల మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వ గణాంకాలను ప్రస్తావించారు. ఈ సంఖ్య ఆందోళన కలిగించేదే. అయితే, ఆ ఆత్మహత్యలన్నింటికీ పరీక్షలే కారణం కాదు. కేంద్ర విద్యాశాఖ 2026లో ఎన్సీఆర్బీ గణాంకాలను వివరిస్తూ వృత్తి/కెరీర్ సమస్యలు, ఒంటరితనం, కుటుంబ సమస్యలు, మానసిక రుగ్మతలు, హింస, ఆర్థిక సమస్యలు తదితర అనేక కారణాలు ఉండవచ్చని పేర్కొంది. కాబట్టి ఈ విషాద గణాంకాన్ని పరీక్షలపై నేరారోపణ చేయడానికి మాత్రమే కాకుండా, విద్యార్థి జీవితాన్ని చుట్టుముట్టిన మొత్తం ఒత్తిడి వ్యవస్థను సరిదిద్దడానికి హెచ్చరికగా చూడాలి.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో సోషియాలజీ ప్రొఫెసర్‌గా తాను అమలు చేసిన పరీక్షా పద్ధతిని బాపూజీ ఉదాహరణగా చెప్పారు. పది ప్రశ్నలను ముందుగానే ఇచ్చి, వాటిలో ఐదింటికి సమాధానాలు రాయించడం, భాషా తప్పులకు మార్కులు తగ్గించకపోవడం, మాతృభాషలో రాయడానికి అవకాశం ఇవ్వడం, కొన్ని సందర్భాల్లో మౌఖికంగా సమాధానాలు చెప్పించడం వంటి పద్ధతులను ఆయన వివరించారు. విద్యార్థి భయాన్ని తగ్గించడం, విషయాన్ని అర్థం చేసుకున్నాడా లేదా అన్నదానికి ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాల్లో ఆ అనుభవం నుంచి నేర్చుకోవాల్సింది ఉంది. ముందుగానే పది ప్రశ్నలు ఇచ్చి వాటిలో ఐదింటికి సమాధానం రాయించడం విద్యార్థి ఆందోళనను తగ్గించవచ్చు. కానీ విద్యార్థి మొత్తం పాఠ్యాంశాన్ని చదివి విస్తృత అవగాహన పెంచుకోవడం కంటే, ముందే ఇచ్చిన ఆ కొన్ని ప్రశ్నలకే పరిమితమయ్యే అవకాశం ఉంది. అందుకే ప్రశ్నలను ముందుగానే వెల్లడించడం ఒక్కటే ఆధునిక పరీక్షా సంస్కరణ కాదు, ప్రశ్నల స్వభావాన్ని మార్చడం అసలు సంస్కరణ.
ఇది కొత్త ఆలోచన కూడా కాదు. కొఠారీ కమిషన్ 1964–66లోనే పరీక్షా సంస్కరణల లక్ష్యం– పరీక్షల విశ్వసనీయత, ప్రామాణికతను పెంచడంతో పాటు మూల్యాంకనాన్ని నిరంతర ప్రక్రియగా మార్చి విద్యార్థి తన స్థాయిని మెరుగుపరుచుకునేలా చేయడమని పేర్కొంది. రాత పరీక్షతో కొలవలేని విద్యార్థి ఎదుగుదలలోని ఇతర అంశాలను కొలిచే పద్ధతులను కూడా అభివృద్ధి చేయాలని కమిషన్ సూచించింది. కాబట్టి ‘పరీక్షలకు వ్యతిరేకం’, ‘పరీక్షల్లో సంస్కరణ’ రెండూ ఒకటే కాదు. ఇక ‘ఓపెన్ బుక్’ లేదా ‘ముందుగానే ప్రశ్నలు’ అనే పద్ధతుల విషయంలో కూడా సమస్యలున్నాయి. ఉన్నత స్థాయి పరిశోధనాత్మక, విశ్లేషణాత్మక కోర్సుల్లో ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ ఉపయోగకరంగా ఉండవచ్చు. కానీ విద్యార్థికి ప్రతి ప్రశ్న ముందుగానే ఇచ్చి, అదే ప్రశ్నకు సమాధానం రాయించడం అన్ని స్థాయిలలో అనుకూలం కాదు. ఇవి పరిశోధనా దృక్పథాన్ని ఆలోచనా పరిజ్ఞానాన్ని పరిమితం చేస్తాయి. జ్ఞానాన్ని గుర్తుంచుకోవాల్సిన చోట జ్ఞప్తికి తెచ్చుకోవడం, అర్థం చేసుకోవాల్సిన చోట కీలక భావనల అవగాహన, ఉపయోగించాల్సిన చోట వినియోగం, ఆలోచించాల్సిన చోట విశ్లేషణ, కొత్తదాన్ని సృష్టించాల్సిన చోట సృజనాత్మకత... ఇలా ప్రతి దశకూ తగిన పరీక్షా పద్ధతి ఉండాలి. ఆచరణలో ఈ దిశగా ముందడుగు పడుతోంది కూడా. ఇదే నిజమైన సామర్థ్య ఆధారిత పరీక్ష.
పరీక్షా కేంద్రాల్లో పర్యవేక్షణ విషయానికి వస్తే విద్యార్థిని ముందుగానే ‘దొంగ’గా చూడటం తప్పు. కానీ మరోవైపు కాపీయింగ్‌ను అడ్డుకోవడం కూడా నిజాయితీగా పరీక్ష రాస్తున్న విద్యార్థి హక్కును కాపాడటమే. ఒక విద్యార్థి నెలల తరబడి కష్టపడి సిద్ధమై పరీక్ష రాస్తుంటే, మరొకరు చీటీ లేదా మొబైల్ ద్వారా అక్రమ సహాయం పొందితే ఇద్దరికీ ఒకే ఫలితం ఇవ్వడం సమానత్వం కాదు. అందువల్ల పర్యవేక్షణ ఉండాలి, కానీ అవమానకరంగా కాదు. నియమాలు ఉండాలి, కానీ విద్యార్థిని నేరస్థుడిగా చూసే ధోరణి ఉండకూడదు. పరీక్షలో కాపీయింగ్ చేస్తే నిబంధన ప్రకారం చర్య తీసుకోవాలి. కానీ ఆ చర్య విద్యార్థికి జీవితాంతం ముద్రగా మారకూడదు. మరోసారి పరీక్షలు రాసే అవకాశం, కౌన్సిలింగ్, వ్యక్తిగత రెమెడియల్ టీచింగ్ వంటి మార్గాలు సులభంగా, ప్రామాణికంగా అందుబాటులో ఉండాలి. బోర్డు పరీక్షల్లో కూడా వీటిని అందుబాటులోకి తీసుకురావాలి. సీబీఎస్ఈ కూడా ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్‌ను అమల్లోకి తెచ్చింది. ఇదే మనం బలంగా చెప్పాల్సిన ‘విఫలమయ్యే హక్కు’. విద్యార్థికి విజయాన్ని సాధించే హక్కు ఎంత ముఖ్యమో, ఒకసారి విఫలమైన తరువాత మళ్లీ ప్రయత్నించే హక్కు కూడా అంతే ముఖ్యమైనది. పరీక్షలో ఫెయిల్ అయితే జీవితం ముగిసినట్లు కాదు. ఒక సంవత్సరం ఆలస్యం అయితే ఓడిపోయినట్లు కాదు. పరీక్ష భూతం కాదు. పరీక్ష ఒక తీర్పు కాదు. పరీక్ష ఒక విద్యార్థి విలువకు కొలమానం కాదు. పరీక్ష ఒక నిర్దిష్ట దశలో నేర్చుకున్నదాన్ని అంచనా వేసే సాధనం మాత్రమే. సమాజానికి కావలసింది పరీక్షల రద్దు కాదు–పరీక్షల సంస్కరణ.
- బూరుగుపల్లి శ్రవణ్‌కుమార్
తెలంగాణ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు