యూథనేసియా.. ధార్మిక దృష్టి కోణం
ABN , Publish Date - Mar 14 , 2026 | 12:41 AM
ఆధునిక నైతిక చర్చల్లో యూథనేసియా (Euthanasia) లేదా కారుణ్య మరణం.. అంటే బాధను తగ్గించడానికి ఉద్దేశపూర్వకంగా జీవితం ముగించడం. ‘ఇది సరైనదా? కాదా?’ ఇది అత్యంత సంక్లిష్ట ప్రశ్నలలో ఒకటి.
ఆధునిక నైతిక చర్చల్లో యూథనేసియా (Euthanasia) లేదా కారుణ్య మరణం.. అంటే బాధను తగ్గించడానికి ఉద్దేశపూర్వకంగా జీవితం ముగించడం. ‘ఇది సరైనదా? కాదా?’ ఇది అత్యంత సంక్లిష్ట ప్రశ్నలలో ఒకటి. జబ్బు కంటే వైద్యమే బాధాకరం అయినప్పుడు దానిని కొనసాగించాలా లేక ఉపశమనం కలిగించాలా అని ప్రశ్న వస్తుంది. చట్టం మరణం హక్కు గురించి చర్చిస్తుంది. కానీ సమాజం– దయ, జీవితం పవిత్రత మధ్య తర్జనభర్జన పడుతుంది. యూథనేసియా అనే పదం గ్రీకు భాష నుంచి వచ్చింది. ఆధునిక వైద్యశాస్త్రంలో దీనికి... ‘తీవ్రమైన, నయం కాని వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి జీవితాన్ని ముగించడం ద్వారా బాధను తగ్గించడం’ అని అర్థం. చాలా దేశాలలో ఈ చర్చ దయ చుట్టూ తిరుగుతుంది.
ధార్మిక తత్వంలో మరణం వినాశనం కాదు, అది జీవన ప్రయాణంలో భాగం మాత్రమే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక శ్లోకంలో ఇలా చెబుతాడు. ‘‘ఆత్మకు జననం లేదు, మరణం లేదు, అది ఎప్పటికీ నశించదు.’’ అలాగే మరో శ్లోకంలో ‘‘మనిషి పాత బట్టలు విసిరి, కొత్తవి ధరించినట్లే, ఆత్మ పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది. అందువల్ల సనాతన ధర్మంలో మరణం విషాదం కాదు, అంతం కాదు... అది ఒక పరివర్తన మాత్రమే.
మన ఋషులు ఒక గొప్ప నిజాన్ని చెప్పారు. మరణం గురించి అవగాహన మనిషిని మారుస్తుంది. మన జీవితం శాశ్వతం కాదని తెలుసుకున్నప్పుడు అహంకారం తగ్గుతుంది, జ్ఞానం పెరుగుతుంది. ధార్మిక దృష్టిలో మరణంపై ధ్యానం మూడు గొప్ప మార్పులను తెస్తుంది. 1) వినయం– శరీరం తాత్కాలికమని గ్రహించడం 2) వైరాగ్యం– సంపద, అధికారం వంటి వాటిపై అతిగా ఆసక్తి తగ్గడం 3) పరమార్థం– జీవితం అర్థవంతంగా గడపాలనే ప్రేరణ. అందువల్ల మరణం ఒక గురువు లాంటిది. మరణాన్ని లోతుగా గ్రహించిన వ్యక్తి మరింత కరుణతో, ధైర్యంతో, లక్ష్యంతో జీవిస్తాడు.
సనాతన ధర్మం ఒక గొప్ప భావనను చెబుతోంది. ప్రతి మనిషికీ జననం ఒక పవిత్ర అవకాశం. ప్రతి జీవితం ఒక చిన్న అవతారం వంటిదే. కుటుంబానికి, సత్యానికి, సమాజానికి సేవ చేయడానికి ఆత్మ ఈ భూమిపై అవతరిస్తుంది. మన బాధ్యతలను నెరవేర్చినప్పుడు జీవితం సంపూర్ణమవుతుంది. ధార్మిక దృక్పథం ఇలా చెబుతుంది– బాధపడుతున్న వారికి కరుణతో సేవ చేయాలి; మరణాన్ని సహజ పరిణామంగా అంగీకరించాలి. జీవితాన్ని బలవంతంగా పొడిగించడం కాదు, ఉద్దేశపూర్వకంగా ముగించడం కూడా కాదు. మరణం– గౌరవంతో, అవగాహనతో అనుమతించడం మాత్రమే.
- డా. బూర నర్సయ్యగౌడ్, ధార్మిక హిందూ పరిషత్