పూమొగ్గల విస్ఫోటనం ఎమిలీ కవిత్వం
ABN , Publish Date - Oct 12 , 2026 | 03:44 AM
ఎమిలీ డికిన్సన్ (1830–1886) జీవించి ఉండగా ఏడే ఏడు కవితలు ప్రచురణకు పంపింది. తర్వాత ఆమె టేబిల్ సొరుగులో పద్దెనిమిది వందల కవితలు దొరికాయి. శీర్షికలు లేకుండా, కాలక్రమం వరుస లేకుండా బొత్తులుగా కుట్టేసి వదిలేసిన..
‘‘The Poets light but Lamps–
Themselves – go out–
(కవులు దీపాలు వెలిగించి/ వారు మలిగిపోతారు)’’
– Emily Dickinson.
ఎమిలీ డికిన్సన్ (1830–1886) జీవించి ఉండగా ఏడే ఏడు కవితలు ప్రచురణకు పంపింది. తర్వాత ఆమె టేబిల్ సొరుగులో పద్దెనిమిది వందల కవితలు దొరికాయి. శీర్షికలు లేకుండా, కాలక్రమం వరుస లేకుండా బొత్తులుగా కుట్టేసి వదిలేసిన ఆ కవితలు ఇప్పుడు ప్రపంచ అత్యుత్తమ సాహిత్యంలో మొదటి వరస దీపాల్లా కూచున్నాయి.
ఎమిలీ ఏ ఒక్క ప్రత్యేక సిద్ధాంతానికో, రాజకీయ సాహిత్య ఉద్యమాలకో విధేయత చూపలేదు. ఏ ఒక్క కాలాన్నో, దాని చరిత్రనో కవిత్వంతో చిరస్థాయిగా నిలబెట్టాలని వ్యర్థ ఊహలు చెయ్యలేదు. ఆమె కవిత్వం భౌమ్యకాలాలను అనువర్తించని అనాది ఆకాశం, ఇప్పటికీ బూదినీలం చెక్కుచెదరని మానవ చింతనాకాశం. చిన్నతనంలో దగ్గరి బంధువుల, స్నేహితుల మరణాలు ఆమెను తీవ్రంగా కదిలించాయి. జీవితంలో ‘మరణా’న్ని మించిన చిక్కుముడి లేదనిపించింది. ఆ విషాద విభ్రమం తన మనసుకు ఒక శాశ్వత నేపథ్యం అయిపోయింది.
‘‘Ceasing to be (నిష్క్రమణ); మరణమంటే ఉన్నట్లుండి ‘ఉండకుండాపోవటం’ ’’ అన్నాడు కీట్స్. ఎమిలీ పెర్సోనాలో ఇంకిపోయి చివరివరకూ నిలిచింది షేక్‌స్పియర్, జాన్ కీట్స్. సౌందర్యాన్ని, జీవితాన్ని చూసేటప్పుడే ఇది అశాశ్వతమని విషాదంగా తలచుకునే కవి కీట్స్, సౌందర్యం తాలూకు అన్ని పార్శ్వాలను, దశలను చూడగల ఋషి షేక్‌స్పియర్ – ఈ ఇద్దరూ ఎమిలీలో మనకు కనిపిస్తారు.
ఎమిలీ ప్రకృతిని చూసిన విధంలో గంభీర శబ్దాలు ఉండవు. బంగారం రంగుతో ఒక్కసారి భళ్ళున తెల్లవారదు. ‘‘నేను చెప్తాను సూర్యుడు ఎలా వచ్చాడో’’ అంటూ, – ‘‘A ribbon at a time’’ అంటుంది. ‘‘ఒక్కో రంగు నిదానంగా పురి విప్పుతూ Amethyst, purple, violet.. ఇలా ఒక్కో కాంతిపుంజం రెక్కలు పరుచుకుంటుంటే, కొండలు తమ తలపాగాలను విప్పుతుంటే, చిన్నచిన్న పిట్టలు పాడుతుంటే, ఒక్కో వస్తువూ వెలుతురులో కనపడటం మొదలవుతుంటే, అంచెలంచెలుగా ఉదయం అవుతుంది’’ అట! నేచర్‌ను ఎమిలీ రొమాంటిక్ కవుల్లా, ట్రాన్సెండెంటల్ కవుల్లా చూడదు. సింబలిస్ట్‌లా అందులో ప్రతీకలనూ వెతకదు. తోటలో పూవులు చూస్తుంది, పాములు కనపడితే అదీ చెపుతుంది.
మనిషి, ప్రకృతి, దేవుడు– వీరి మధ్య సంబంధాలనూ, దూరాలనూ ఎమిలీ చూసిన విధం పూర్తిగా వేరు, ఇతర కవులతో పోలిస్తే. ‘‘Truth is beauty, beauty truth (సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం)’’ అన్నాడు కీట్స్. ఈమె ఆ రెండిటినీ (సత్యాన్నీ సౌందర్యాన్నీ) అన్నాచెల్లెలు చేసింది. పక్కపక్కవే అయినా రెండు విడి విడి సమాధుల్లో పడుకోబెట్టింది. ‘చెల్లెలు’ అంటున్నది మనతో:
‘‘And so, as Kinsmen, met a Night– We talked between the Rooms–’’ (అలా ఒకరాత్రి కలుసుకున్నాం, సహోదరులుగా–గదుల (సమాధుల)/ మధ్య గోడకు అటు ఇటు ఉండి మాట్లాడుకున్నాం.)
సాధారణాలు, ప్రసిద్ధాలు– రెండిటితోనూ ఎమిలీది తిరుగుబాటే. ఆమెకు ఇష్టమైన బైబిల్ కింగ్ జేమ్స్ బైబిల్, ఇష్టమైన జీసస్ బాధపడటం తెలిసిన జీసస్. ఆమెకు క్రీస్తు దయామయుడుగా కాదు, ఎన్నో హింసలు పడిన దయనీయుడుగా కనపడతాడు. ఆమె కవితల్లో ఏంజెల్స్ సాధారణంగా కవులు తలుచుకునే దూదిరెక్కల అందమైన దేవదూతలు కాదు, స్థూలకాయులు ఉగ్రరూపులైన ‘cherubim’గా కనపడతారు. ఆమె ప్రార్థన చర్చ్‌కే వెళ్ళి చేయవలసినది కాదు; ‘‘I keep Sabbath staying at Home’’ (నేను ప్రార్థన ఇంట్లో ఉండి చేస్తాను), పోనీ ఇల్లే స్వర్గమా! – ‘‘God, keep me from what they call households’’ (దేవుడా నాకు ఈ ఇంటి బాదరబందీ తప్పించు) అంటుంది. పనిలోపనిగా పెళ్లంటే ‘‘Born – Bridalled – shrouded’’ (పుట్టుక బయటపడేస్తుంది ఆడపిల్లను – పెళ్ళి మళ్ళీ కప్పేస్తుంది) అని మూడు ముక్కల్లో తేల్చి చెప్పింది.
స్నేహితులున్నప్పటికీ ఎమిలీ ఎంచుకున్న జీవితం ఏకాంతమే. ప్రేమించటం బొత్తిగా తెలియనిది కాదు. తన ఉద్విగ్నతకు సరితూగే ప్రేమ దొరకదనుకుందో లేక తన వ్యక్తిత్వ ఆవరణలోకి ఎవరినీ పూర్తిగా లోపలికి రానివ్వనితత్వమో కానీ ఆమె జీవితంలో ప్రేమ, వివాహం అనే సంఘటనలు లేవు. స్నేహాన్ని, అభిమానాన్ని, ప్రేమను ఉత్తరాల్లో పెట్టేది. న్యూ ఇంగ్లాండ్‌లో తలెత్తిన 1850 నాటి మత పునరుద్ధరణ ఎమిలీని అటో ఇటో తేల్చుకోమన్నది. ‘రక్షకుడు’, ‘నమ్మకం’ వంటి ఊహల స్థానంలో ‘‘Escape is such thankful Word’’ (విముక్తి, ఆత్మస్వేచ్ఛ కదా ఆహ్లాదమైన మాటలు) అనిపించి, ‘విముక్తి’ని ఎంచుకుంది తన పవిత్ర పదంగా.
ఈ 1850 ముందరి శీతాకాలమంతా ఎమర్సన్ కవితలతో గడిచిపోయిందామెకు, ‘‘అది ఒక దీర్ఘ శీతాకాలపు స్వప్నం, నేనింకా అందులోంచి మేలుకోలేదు,’’ అంది. కానీ మేలుకుంది, కవిత్వంలోకి. కొత్త కవిత్వమూ మేలుకుంది ఆమెతో. ఎమిలీ కవిత్వపు కొత్తదనాన్ని అప్పట్లో అరాచక వ్యాకరణం అన్నారు; వాక్యం మధ్యలో కాపిటల్ లెటర్స్, విరామ చిహ్నాల స్థానంలో డాష్ గుర్తులు, క్రమం తప్పిన ప్రాసలు చూసి. కష్టమైన కవిత్వమనీ అన్నారు. ఎమిలీ కవిత్వం చదవటంలో కష్టమల్లా కాగితంపైన కనపడుతున్న అక్షరాల్లో లేదు, అవి చెప్పకుండా వదిలేస్తున్నది గ్రహించటానికి పాఠకులు పెట్టవలసిన శ్రద్ధలో ఉంది. అలా అని ఆమె పొడుపుకథలు రాసిన కవయిత్రి అస్సలు కాదు.
‘‘Elliptical language’’ (పదగ్రస్తం) శైలి ఎమిలీ సృష్టి. పదాల నడుమ ఆమె పెట్టే ఈ ‘–’ గీతలు, కాగితం మీద నాటిన ఆ పదాల అర్థం మొలకెత్తేందుకు వదిలిన స్థలాలు. ‘మాట’కు కవి కల్పించిన స్థలసమయాలను సూచించే ఈ గీత ఎమిలీకే ప్రత్యేకమైన పంక్చువేషన్. పాఠకులకు ఆగి ఆలోచించటానికి కవి ఇచ్చే అవకాశమది. అప్పటి సాహిత్యకారులకు, ప్రచురణకర్తలకు ఇవి కొరుకుడు పడలేదు. మార్చుకొమ్మని చెప్పి చూశారు. ఆమె పోయాక నచ్చినవిధంగా మార్చి ప్రచురించారు. 1998లో R.W. Franklin వేసిన పుస్తకంలో మాత్రమే ఆమె కవితలు రాసినవి రాసినట్లు అచ్చయ్యాయి. ఆలోచనలు, ఉద్వేగాలు అతిశయాలు, వాటిని చెప్పడానికి వాహికగా ఆమె వాడిన శబ్దసంపద అసాధారణం. ఎప్పటికైనా ఈ రాతలను అర్థచేసుకునే పాఠకులు పుట్టకపోరు అనే విశ్వాసం తనది.
ఎమిలీ కవితలు చూపులకు చిట్టిపూమొగ్గలు. లయతో నర్తించే శబ్దాలు. చీల్చేసే మచ్చుకత్తులు: ‘‘I felt a cleaving in my head’’ (నా తల చీలడం తెలుస్తోంది), దహించే అగ్ని కణికలు: ‘‘Fire, taking villages for breakfast’’ (ఆ అగ్ని పొద్దున్నే ఊళ్ళకు ఊళ్ళను తిని త్రేన్చుతోంది). ఇంతా, కవితలో వాక్యాలు నాలుగో ఎనిమిదో, అంతే! అణుశక్తి నింపుకుని అర్థవిస్ఫోటనానికి సిద్ధంగా ఉన్న పూమొగ్గలవి! ‘‘Ashes denote that Fire was–’’ (కనపడే బూడిద కుప్ప అగ్ని ఎటువంటిదో చెపుతుంది.)
మొదట ఒక కాంతి (దృశ్యం) కవిని వెలిగిస్తుంది, అది అగ్నిగా మారి కవిని దహిస్తుంది. చివరకు మిగిలిన పిడికెడు అక్షరాలను చూసి దగ్ధం చేసిన అగ్ని ప్రాభవం ఎంతటిదో, దగ్ధమైన వస్తువు మహత్త్వం ఎలాటిదో పాఠకుడు కనుక్కోగలగాలి!
కఠినమైన రూపకం మరొకటి వాడి కవిత్వం పుట్టుకను ఇలా చెప్తుంది ఎమిలీ: ‘‘Essential Oils are wrung’’ (పూవుల్లోని పరిమళసారం పిండితేనే వస్తుంది). షేక్‌స్పియర్ సానెట్ 5 (సందర్భం వేరైనా): ‘‘శిశిరం రాల్చినా, పూవులు తీయగా బతికే ఉంటాయి, వడగట్టి తమ నుండి తీసిన పరిమళద్రవ్యంలో’’ అనేటప్పుడు ‘‘వడకట్టి’’ అనేందుకే కొంచెం ఆగి ఆలోచించి ఉంటాడు. అదే ఈమేమో ‘‘సూర్యుడితో పాటు స్క్రూలు కూడా అవసరం పూవుల నుండి అత్తరు పిండటం కోసం’’ అంటూ – అత్తరైనా కవిత్వమైనా కావాలంటే ఇంత సంఘర్షణ అని తేల్చేసి, పనిలో పనిగా తన సీనియర్ మాటలకున్న నాజూకు ముసుగు తీసేసింది.
ఎమిలీకే సాధ్యమైన మరొక ఫీట్, మెటఫర్‌ను వాడుకున్న విధానం. కవులు గతంలో వాడిన పోలికల జోలికి పోదామె, రెండు అనాది వస్తువుల్లో సరికొత్త పోలికలు చూడగల దృష్టి, వాటిని చాలా సామాన్యమైన వాక్యనిర్మాణంలో పెట్టే ప్రజ్ఞ ఉన్నాయి ఆమెకు. ‘రూపకం’ నిర్వచనానికీ, దాని ప్రయోజనానికి అప్పటివరకూ ఉన్న హద్దులను చెరిపేసింది ఆమె ప్రయోగం. కవిత మొదట్లో కనపడే ఉపమేయ ఉపమానాలు కవితతో ప్రయాణించి పరస్పరం ప్రభావితం చేసుకుంటూ క్రమంగా రూపాంతరం చెందుతాయి.
కొన్నిసార్లు కవిత ముగిసే సరికి (నాలుగు వాక్యాల పద్యమైనా) అవి రెండూ అటుది ఇటూ, ఇటుది అటూ మారి నిలబడి పద్యం మొదలైనప్పటి ఊహను మారుస్తాయి. ‘Hope is the thing with feathers’ (నమ్మకం, ఒక జతరెక్కలుంటాయి దానికి)- అన్న కవిత, నమ్మకం ఒక పక్షి వంటిది అని పోలుస్తూ, రెండూ క్షణంలో ఎగిరిపోయే రకాలే అని ధ్వనిస్తూ మొదలై, పక్షి మీద రెండు స్టాంజాలను నడిపించాక మళ్ళీ ముగింపులో ‘‘అది నన్ను ఒక్కనాడూ ఏమీ అడగలేదు’’ (it never, in extremity, asked a crumb of me) అంటూ తిరిగి ‘నమ్మకం’ను గుర్తుచేస్తుంది. ఈ కవిత చదివాక ఎవరికైనా నమ్మకం రెక్కలు లేకుండా కనపడుతుందా, ఏ పక్షిని చూసినా నమ్మకం గుర్తుకు రాకుండా ఉంటుందా?
అలాగే, ‘‘Is’’ అన్న క్రియాపదాన్ని వాడుతూ ఒక పోలికను నిర్ద్వంద్వంగా ప్రతిపాదన చేస్తూ మొదలవటం ఎమిలీ కవితల మరొక లక్షణం: ‘‘Renunciation is a piercing virtue (సన్యసించటం తీక్షణ బాణం వంటి సుగుణం)’’, ‘‘Eden is that old fashioned House (ఈడెన్ పాత తరహా గృహం)’’ – ఇటువంటి నిర్ధారణలతో సులభంగా కనపడుతూ మొదలైన కవితలు, రెండు వాక్యాలు కాగానే మొదట్లో చెప్పిన మాటకు పూర్తి విరుద్ధమైన మాటతో ఎదురవుతాయి, పాఠకుడిని గొప్ప సందేహాల మధ్య నిల్చోపెడుతాయి. పాఠకుడిని రెచ్చగొట్టి పద్యానికి ఏ భావం సాధ్యమో ఆలోచించమనటం ఆమెకు ఆట.
మనిషి మెదడంటే ఆమెకు గౌరవం. ఎంత? ‘‘The Brain is just the weight of God– (తూకం చూడు, దేవుడూ మెదడూ రెండూ సమానం కిలోల లెక్కలో, ఒక విషయంలోనే భేదం –శబ్దానికి, మాటకు ఉండే భేదం–)’’ అంటుంది.
దేవుడితోనే పరాచికాలా ఎమిలీకి?
దైవస్వరూపమైన అనాది శబ్దానికి ఒక నవీన భాష ఎమిలీ డికిన్సన్ కవిత్వం. మరి కలడా లేడా దైవం? – ‘‘So I–the undivine abode/ Of His ElectContent–/ Conform my Soul–as 'twere a Church,/ Unto Her Sacrement–’’ (అదైవమైన ఆవాసం నేను– / దైవానికి తగిన నివాసంగా/ మలుచుకుంటాను ఆమెను,/ నా ఆత్మను పవిత్రంగా–’’.
దైవం ఎక్కడో ఎత్తైన ఆకాశాలలో ఉన్నప్పటికీ తను కిందికి దిగినప్పుడు (దిగక తప్పదు, పై స్టాంజాలో ‘stoop’ ఉన్నది) కాలూన్చి నిలబడేందుకు ఒక చోటు కావాలనుకుంటాడు, అది నేనవుతాను. తనను ప్రతిష్టించుకోగల ఆలయంగా మలచుకుంటాను నా ఆత్మను (con‘form’). అతనికీ, ఆమె (నా ఆత్మ)కూ పవిత్ర ఒడంబడిక సాధ్యం చేస్తుంది ఈ మానవదేహం’’.
‘‘మనిషి కోసం దిగిరానిదే, లేదు మనుగడ దేవుడికి!’’ అనే అహంకారం కాదిక్కడ. దిగివస్తున్న ఆ దేవుడు వాలేందుకు వీలైన కొమ్మను నేను, ఆయనకొక ఆలయాన్నే అవుతాను నేను!’’ అనగల ఆత్మ ధృతి Emily ది.
- పద్మజ సూరపరాజు