Share News

Cultural Diversity: బహుళ భారత్‌లు–అనేక ఆంతర్యాలు

ABN , Publish Date - Jan 09 , 2026 | 05:03 AM

ఏ మనిషి అయినా ప్రాథమిక అవసరాలు తీరిన తరువాత గుర్తింపు, గౌరవం కోసం ఆరాటపడతాడు. వ్యక్తులలోను, సమాజాలలోను ఈ ఆరాటం ఉంటుంది.

Cultural Diversity: బహుళ భారత్‌లు–అనేక ఆంతర్యాలు

ఏ మనిషి అయినా ప్రాథమిక అవసరాలు తీరిన తరువాత గుర్తింపు, గౌరవం కోసం ఆరాటపడతాడు. వ్యక్తులలోను, సమాజాలలోను ఈ ఆరాటం ఉంటుంది. అయితే, నిర్దిష్ట సంస్కృతులు, భాషలకు సంబంధించిన వారు తమ తమ భాషా సంస్కృతుల గుర్తింపు, గౌరవం కోసం పడుతున్న ఆరాటం అపార వైవిధ్యమున్న మన సమాజంలో తరచూ వక్రగతిలో వ్యక్తమవుతోంది. నేను చూసిన ఒక వీడియోలో ఒక వ్యక్తిని మరాఠీ భాష మాట్లాడి తీరాలని ఒక యువతి నిక్కచ్చిగా చెబుతోంది. తాను హిందీ మాత్రమే మాట్లాడగలనని, మనం భారతదేశంలో ఉన్నాం కనుక మనమందరమూ హిందీలో మాట్లాడుకోవాలని ఆ ‘ఇతర’ వ్యక్తి సమాధానమిచ్చాడు. ఇరువురి మధ్య వాద ప్రతివాదాలు ప్రారంభమయ్యాయి. అంతిమంగా వారిరువురి వాగ్యుద్ధం ఆంగ్లభాషలో కొనసాగింది! ఆ మరాఠీ యువతి, హిందీ భాషీయుడి మధ్య మాటల యుద్ధం సమంజసమైనదేనా?

మరో వీడియోలో ఒక మహిళ మరొక మహిళను హిందీలో చీవాట్లు పెడుతోంది. బాధితురాలు అయిన మహిళ బురఖాలో ఉంది. తనపై హిందీలో వర్షిస్తున్న తిట్లకు ఆమె కన్నడంలో ప్రతిస్పందిస్తోంది. ఇరువురూ బిగ్గరగా మాట్లాడుతున్నారు. జెండర్‌ భాగస్వామ్యం ఆ మహిళల మధ్య ఎలాంటి ప్రత్యేక బంధనాన్ని సృష్టించలేదు. భాషా దురభిమానం బరువు కింద ఆ సహజ బంధం పనికిరాకుండాపోయింది. తమ భాషను గుర్తించి, గౌరవించాలని ఎవరైనా కోరుకోవడం సహజం. అయితే ఆ ఆరాటం ఇతరులను బలవంతం చేసేందుకు పురిగొల్పకూడదు. అలా చేయడం ఇతరుల హక్కులను కాలరాయడమే. తమ నమ్మకాలు, విలువలు, అభ్యాసాలనే ఇతరులూ విశ్వసించాలని, అనుసరించాలని కోరుకోవడమే తప్పు. పైగా వాటిని ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించడం నాగరీక సంస్కారానికి విరుద్ధం. అయినా నేటి సమాజంలో చాలా మంది అటువంటి సంకుచితత్వాలను వదులుకోలేకున్నారు. అసలు అవి సంకుచితత్వాలనే వివేకం కూడా చాలామందికి లేదు. కాకపోతే హిందీ, కన్నడ భాషల్లో పరస్పరం అరుచుకున్న మహిళలు ఇరువురూ తాము నివసిస్తున్న పితృస్వామ్య వ్యవస్థ విసురుతున్న సవాళ్లను సమష్టిగా ఎదుర్కోవడంపై అలక్ష్యం చూపడం సబబేనా?


మానవ ప్రవర్తన విచిత్రమైనది. ఇతర ప్రాంతాలకు చెందిన సహచరుల నుంచి తమ భాషా సంస్కృతులకు సంపూర్ణ గుర్తింపు గౌరవాన్ని డిమాండ్‌ చేస్తున్న వారు– ఇతర దేశాలకు చదువు, ఉద్యోగం కోసం వెళ్లినప్పుడు అక్కడి సంస్కృతిని గౌరవిస్తున్నారా? సమాధానం స్పష్టమే. ఈ తరహా విద్యావంతులు విదేశీ సమాజాలలో ఉన్నప్పుడు తమకొక నిర్దిష్టమైన గుర్తింపు, గౌరవాన్ని పొందేందుకు ఎంతగా ఆరాటపడతారో చెప్పనవసరం లేదు. వినడానికి సిద్ధంగా ఉన్నవారికి తమ విలక్షణ అస్తిత్వం గురించి అరుస్తూ మరీ చెబుతారు. నలుగురి మధ్యా అటువంటి ప్రవర్తన ఎబ్బెట్టుగా ఉంటుందనే విషయాన్ని సైతం పట్టించుకోరు. స్వకీయ గుర్తింపునకు ఎందుకంత పవిత్రతను ఆపాదిస్తున్నారు? బహుశా అది ఒక ఆవశ్యక మానసిక ఓదార్పునివ్వడం వల్ల కావచ్చు. అయితే అపార వైవిధ్యమున్న భారతీయ సంస్కృతీ సంప్రదాయాలలో భాగమైన, తమవైన ఉప భాషా సంస్కృతుల మాన్యత విషయమై అంతగా పట్టింపులకు పోవడం ఆశ్చర్యకరం. మన ఆహార అలవాట్లనే చూడండి. మన సువిశాల భారత భూమిలో అన్ని భాషా సంస్కృతుల వారూ, కుల మతాల వారూ చేతులతో తినడం సర్వవ్యాపకంగా ఉన్నది. అయితే ప్రాంతాల వారీగా భిన్న భిన్న రీతుల్లో ఉండడం కద్దు. ఆ మాటకొస్తే ఆహారాన్ని వండుకునే పద్ధతి కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది. ప్రతి భారతీయ కుటుంబమూ పప్పు వండుకోవడం పరిపాటి. అయితే ఈ ప్రధాన ఆహార పదార్థాన్ని సిద్ధం చేసుకునే రీతి రివాజులు ప్రాంతాల వారీగా భిన్నంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు.

పురాతన యోగా సంప్రదాయాన్నే తీసుకోండి. యోగాభ్యాసంలో అనేక పద్ధతులు ఉన్నాయి. ఒక ప్రాంతంలో ఉన్న పద్ధతులు మరొక ప్రాంతం వారికి కొత్తగా ఉండడం కద్దు. అలాగే స్త్రీల చీరకట్టు. అద్భుతమైన వైవిధ్యమున్న స్త్రీల వస్త్రధారణ ఇది. చీరకట్టు సౌందర్య శోభలో కూడా అందమైన వైవిధ్యం ఉంది. భారతీయులు అందరికీ నోరూరించే పుచ్కా అనే స్ట్రీట్‌ ఫుడ్‌ బహుళ రుచులతో ఉంటుంది. గోల్‌గప్పా, జల్‌పూరీ తదితర ప్రాంతీయ నామాలతో సుప్రసిద్ధమైన ఈ స్నాక్‌ను వివిధ ప్రాంతాలవారు వివిధ రీతుల్లో వండుకుంటారు.


వైవిధ్యానికి ఉన్న ప్రాధాన్యాన్ని ఒకనాటి మన రాజులు, చక్రవర్తులు గుర్తించినట్టుగా నేడు మనం గుర్తిస్తున్నామా? శివాజీ మహరాజ్‌ సైన్యంలో ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మొగల్‌ చక్రవర్తుల ప్రధాన సైనికాధికారులు అందరూ రాజపుత్ర వీరులే. హిందూ రాజులు జైన, బౌద్ధ మతస్థులకు చేసిన దాన ధర్మాల గురించి ఈనాటికీ మనం చెప్పుకుంటూనే ఉన్నాం. రాజులు, చక్రవర్తులు వాటిని తమ రాజధర్మంలో భాగంగా గుర్తించారు. ప్రజలకు ఆమోదమైన పరిపాలననందించేందుకే వారు ఆ పుణ్య విధులు నిర్వర్తించారు. తమ సువిశాల సామ్రాజ్యాలలో ప్రజలు అందరూ ఒకే భాష మాట్లాడేవారు కాదని, ఒకే మతాన్ని అనుసరించేవారు కాదనే సత్యాన్ని నాటి మన రాజులు, చక్రవర్తులు గుర్తించారు. ఆ వైవిధ్యాన్ని గౌరవించారు, సమున్నతం చేశారు. దానశీలురు అయ్యారు. ఉదారంగా వ్యవహరించారు. బహుళ సంస్కృతీ సంప్రదాయాలను పోషించి పెంపొందించారు. దేశ దేశాల సార్థవాహులు ఈ భారత భూమికి వచ్చేందుకు సానుకూల పరిస్థితులు కల్పించారు. అపార వైవిధ్యం అలరారుతుండగా ఒకే విధమైన జీవనరీతులు లేదా సజాతీయతను కీర్తించడం ఎందుకు?

సారూప్యతకు స్థిరమైన, సార్వత్రిక నిర్వచనం లేదు. ఒక విషయాన్ని ఏ ఇద్దరు వ్యక్తులూ ఒకే దృక్కోణం నుంచి చూడరు. సజాతీయత సందర్భోచితమైనది, భావోద్వేగమైనది. అది సామాజిక, రాజకీయ శక్తులతో ప్రభావితమవుతుంది. ముఖ్యంగా రాజకీయవర్గాలు దానిని తమ స్వార్థ ప్రయోజనాలకు నేర్పుగా ఉపయోగించుకోవడం కద్దు. ఎన్నికలలో గెలవడం ముఖ్యం కదా. స్పష్టమైన, కచ్చితమైన విధానాలు ఎన్నికలలో విజయాలకు దోహదం చేయవు. ప్రజలలో ఉమ్మడి భావోద్వేగాలు, భావసారూప్యతలు లేదా కులమతాలు, వర్గాలు, ప్రాంతాలు మొదలైన సంకుచితత్వాల ఆధారంగా ప్రజలలో విభజనలు సృష్టించడం ద్వారానే ఎన్నికలలో విజయాలు సుసాధ్యమవుతాయి.


ప్రజాసమూహాలలో సామూహికత లేదా సాధారణత్వం ఒక దేశానికి విలక్షణ గుర్తింపును సృష్టిస్తుందనే విశ్వాసం విస్తృతంగా ఉన్నది. ఆ సమష్టి గుర్తింపు జాతీయ స్వాభిమానాన్ని పెంచుతుందని, జాతీయ భద్రతకు భరోసా కల్పించడంతో పాటు, ఆర్థిక అభివృద్ధిని ఇతోధికం చేస్తుందనే విశ్వాసం కృత్రిమమైనది. బూటకపు విశ్వాసాలు ఏ సమాజానికీ ఎటువంటి ఉపకారమూ చేయవు. ఒక సమాజంలో సజాతీయతకు ఆరాటపడితే సరిపోదు. దానిని అమలుపరచవలసిన అవసరమున్నది. ఎందుకంటే సజాతీయత దానికదే ఒక ఏకీకృత శక్తి కాదు, కాలేదు. ప్రజల జీవన కార్యకలాపాలు ఒకే విధంగా ఉన్నంత మాత్రాన ఏకీకరణ సాధ్యమవుతుందా? చెప్పవచ్చినదేమిటంటే సహజంగా ఉండేది వైవిధ్యం మాత్రమే. సజాతీయతను సృష్టించాలంటే ప్రజా సమూహాలను పలు విధాలా ఒత్తిడి చేయవలసి ఉంటుంది. ఇలా అమలయ్యే సజాతీయత స్థిరంగా ఉండదు. శాశ్వతంగా ఉండడమనేది జరగదు.

సామాజిక సారూప్యతలు, భావ సారూప్యతలు ప్రజలను సమైక్యపరచలేవు. వ్యక్తుల మధ్య, సమూహాల మధ్య పరస్పర గౌరవమే సమైక్యతకు ప్రాథమిక ప్రాతిపదిక అవుతుంది. ప్రజలు సమానత్వాన్ని ఆశిస్తారు. గుర్తింపు, గౌరవం కోసం ఆరాటమే సమానత్వాన్ని ఆశించేందుకు వ్యక్తులు, సమాజాలను పురిగొల్పుతుంది. భాష, మతం, ప్రాంతం ప్రాతిపదికన గుర్తింపులు సులభంగానే లభిస్తాయి. అయితే ఆ గుర్తింపులు శాశ్వతమైనవి కావు, సార్థకమైనవి అసలే కావు. స్థిరంగా, శాశ్వతంగా ఉండే ఏకైక విషయం మనలోని మానవత్వమే. ‘అంతరంగం అట్టడుగున అంతమందిమీ మానవులమే’ అని మహాకవి ఒకరు అన్నారు. మానవ నాగరికత ప్రభాతంలోనే ఈ సత్యాన్ని గుర్తించిన వేదఋషులు ‘వసుధైక కుటుంబకం’ (సమస్త ప్రపంచమూ ఒకే కుటుంబం) అని ఉద్ఘోషించారు. మనం ఔదలదాల్చి, ఆచరించవలసిన ధర్మమది.

-సమీర్‌ నజరేత్‌

(ది టెలిగ్రాఫ్‌)

Updated Date - Jan 09 , 2026 | 05:03 AM