Share News

ఓటుహక్కు లేనివారుగా పౌరులు!

ABN , Publish Date - Mar 21 , 2026 | 03:54 AM

భారత గణతంత్ర రాజ్యం ఆవిర్భవించిన తరువాత ఇంచుమించు మొదటి నాలుగు దశాబ్దాల పాటు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) అనే రాజ్యాంగ సంస్థ ఉనికి గురించి చాలామంది భారతీయులకు తెలియనే తెలియదు.

ఓటుహక్కు లేనివారుగా పౌరులు!

భారత గణతంత్ర రాజ్యం ఆవిర్భవించిన తరువాత ఇంచుమించు మొదటి నాలుగు దశాబ్దాల పాటు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) అనే రాజ్యాంగ సంస్థ ఉనికి గురించి చాలామంది భారతీయులకు తెలియనే తెలియదు. భారత రాజ్యాంగంలోని 15వ విభాగం (ఎన్నికలు) లోని నిబంధనల గురించి తెలిసిన వారూ బహు తక్కువ మందేనని అనడం సత్యదూరమేమీ కాదు. లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎనలేని ఆనందోత్సాహాలతో ప్రజలు ఓటు వేస్తున్నారు. అయితే ఎన్నికల నియమ నిబంధనలు, పోలింగ్‌ ఏర్పాట్లు, సన్నాహాలకు సంబంధించిన విషయాలు, మరీ ముఖ్యంగా ఎన్నికల ఫలితాల ప్రకటనకు దారి తీసే ప్రక్రియ గురించి అవగాహన ఉన్నవారు చాలా తక్కువ మందే అనడంలో అత్యుక్తి లేదు.

ఓటర్‌ జాబితాలలో తమ పేరు ఉన్నవారందరూ ఓటు వేయగలుగుతారు. ఈ ప్రకారం కోట్లాది మంది ఓటు వేయడం జరుగుతోంది. అయితే అనేక లక్షల మంది ఓటు వేయలేక పోవడమూ జరుగుతోంది. ఒక నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిచినప్పటికీ ఆ నియోజకవర్గంలోని ఓటర్లు అందరూ ఆ అభ్యర్థిని తమ ప్రతినిధిగా అంగీకరించి తమ జీవన వ్యాపకాలలో నిమగ్నమవుతారు.


చెదురుమదురు హింసాత్మక సంఘటనలు, దొంగ ఓట్లు వేస్తున్నవారిని పట్టుకోవడం మినహా ఎన్నికలు చాలవరకు పెద్దగా ప్రాధాన్యం లేని సంఘటనలుగా మిగిలిపోతున్నాయి. ఈ ప్రశాంత పరిస్థితుల వెనుక చాలా అన్యాయాలు జరిగిపోతున్నాయి. చాలా మంది ప్రజల పేర్లను ఓటర్‌ జాబితాలలో చేర్చడం జరగడం లేదు. ఓటర్‌ జాబితాలలో ఉన్న చాలా మంది తమ ఓటుహక్కు వినియోగించుకోలేని పరిస్థితులు నెలకొనడం ప్రతి ఎన్నికల సందర్భంలోనూ పునరావృతమవుతూనే ఉంది. ఓటుహక్కు వినియోగించుకోలేక పోతున్న వారిలో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వారు, మతపరమైన మైనారిటీలు అత్యధికంగా ఉంటున్నారు. ఓటుహక్కును వినియోగించుకోలేని పరిస్థితులపై పోలింగ్‌ రోజున, ఆ తరువాత కొన్ని దినాల వరకు ఆందోళనలు జరుగుతాయి. ఆ తరువాత అవి వాటికవే చల్లారిపోతాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) భారత ఎన్నికల సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తారు. సీఈసీ సాధారణంగా ప్రముఖ సివిల్‌ సర్వెంట్‌ అయి ఉండడం కద్దు. అయితే ఆయన ప్రజల దృష్టికి పెద్దగా వచ్చే వ్యక్తికాదు. మౌనంగా తన విధులు నిర్వహించే అధికారి. సీఈసీ అరుదుగా మాత్రమే వివాదాల్లో చిక్కుకుంటారు. కోర్టుల చుట్టూ తిరగవలసిన తిప్పలూ ఆయనకు ఉండవు. రాజకీయ పక్షాలు చీలిపోయినప్పుడు, వివిధ పార్టీలకు ఎన్నికల చిహ్నాలు కేటాయించడంపై వివాదం రగుల్కొన్నప్పుడు మాత్రమే సీఈసీ వార్తల్లోకి రావడం పరిపాటి.


1990లో సీఈసీగా టిఎన్‌ శేషన్‌ నియమితులయ్యారు. రాజ్యాంగంలోని 15వ విభాగానికి ఆయన ఊపిరి పోశారు. రాజకీయ పక్షాలు, ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు చట్టాలను పాటించేలా ఆయన కట్టడి చేశారు. ఈసీఐకి అపరిమిత అధికారాలు ఉన్నాయన్న సత్యాన్ని ప్రజలకు ఆయన ఎరుక పరిచారు. ఎన్నికల వ్యవహారాలకు సంబంధించి సుప్రీం కోర్టులో ఈసీఐ తరఫున ఆయన పలు కేసులు దాఖలు చేశారు. సర్వోన్నత న్యాయస్థాన తీర్పులను అందరూ పాటించేలా నిష్కర్షగా వ్యవహరించారు. శేషన్‌ తన విధుల నిర్వహణలో నిష్ఠాబద్ధంగా తటస్థత పాటించేవారు. ఎవరి పట్ల అనుచిత ఆదరం చూపేవారు కాదు, ఎవరినీ నిష్కారణంగా అయిష్టపడేవారు కాదు. చండశాసనుడిగా వ్యవహరించి ప్రజల మదిలో అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోయారు. ఆయన తరువాత సీఈసీలు అయిన జేఎమ్‌ లింగ్డో, టిఎస్‌ కృష్ణమూర్తి, నవీన్‌ చావ్లా, ఎస్‌వై ఖురేషి తమ విధులను నిష్పాక్షికంగా నిర్వహించి ప్రజల ప్రశంసలకు పాత్రులయ్యారు. అయితే గత దశకంలో సీఈసీ ప్రతిష్ఠ మసకబారడం ప్రారంభమయింది. సీఈసీలు వివాదాల్లో చిక్కుకోవడం ఆరంభమయింది.


2025–26లో ప్రారంభించిన ఓటర్‌ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) సీఈసీ తటస్థతను అప్రతిష్ఠ పాలు చేసింది. రాజ్యాంగంలోని అధికరణ 326 ఇలా పేర్కొంది: ‘లోక్‌సభకు, రాష్ట్ర శాసనసభలకు ఓటుహక్కు విధానంపై ఆధారపడి ఎన్నికలు జరుగుతాయి. అనగా భారతీయులై ఉండి, నిర్దేశిత తేదీకి 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ఓటుహక్కు ఉంటుంది. ఏ నిర్దిష్ట తేదీకి 18 సంవత్సరాలు నిండవలెనో లోక్‌సభ లేక శాసనసభ నిర్ణయిస్తుంది (సందర్భానుసారంగా). అయితే నిర్దిష్ట ప్రదేశంలో నివాసం ఉండక పోవటం, మానసిక అస్వస్థత, నేరాలు చేయుట, అవినీతి చట్ట వ్యతిరేక చర్యలు మొదలగు కారణాలపై ఈ రాజ్యాంగం కింద గానీ, లేక మరేదైనా శాసనం కింద గానీ ఓటర్లుగా అనర్హులైన వారికి ఓటర్లుగా నమోదయ్యే అర్హత ఉండదు.’ వయోజన ఓటుహక్కు, పౌరుడు, ఓటరుగా నమోదయ్యే హక్కు అనే అంశాల గురించి ఈ నిబంధన నొక్కి చెప్పింది. మరింత సరళంగా చెప్పాలంటే వయోజనులు అందరినీ (ఈ దేశ పౌరులు కాకపోతే మినహా) ఓటర్ జాబితాలలో చేర్చాలని నిర్దేశించింది. సాధారణంగా తాజాగా సవరించిన ఓటర్‌ జాబితాలలో మొత్తం ఓటర్ల సంఖ్య సంబంధిత రాష్ట్ర వయోజన జనాభాకు ఇంచుమించు సరిసమానంగా ఉంటుంది. ప్రతి పది సంవత్సరాలకు జనాభా గణన నిర్వహిస్తే వయోజనుల సంఖ్య కచ్చితంగా తెలుస్తుంది. మన దేశంలో చివరి జనాభా గణన 2011లో జరిగింది. అయితే అత్యాధునిక గణాంక పద్ధతులను ఉపయోగించి జనాభా పెరుగుదలను అంచనా వేయవచ్చు. నిపుణులు ఆ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఈ దృష్ట్యా తాజాగా సవరించిన ఓటర్‌ జాబితాలలో మొత్తం ఓటర్ల సంఖ్య ఒక రాష్ట్రంలోని వయోజన జనాభాకు సంబంధించిన అంచనాకు దాదాపుగా సమస్థాయిలో ఉండితీరాలి.


అయితే ‘సర్‌’ అనంతర ఓటర్‌ జాబితాలు ఆశ్చర్యం గొలుపుతున్నాయి. అంతకు మించి అసంతృప్తికి కారణమవుతున్నాయి. ‘సర్‌’ అనంతర ఓటర్‌ జాబితాల్లోని ఓటర్ల సంఖ్య, సంబంధిత రాష్ట్రాలలోని వయోజన జనాభా అంచనాలకు మధ్య దిగ్భ్రాంతికరమైన వ్యత్యాసమున్నట్లు యోగేంద్రయాదవ్‌ నిరూపించారు. దీన్ని బట్టి ‘సర్‌’ సమ్మిళితంగా జరగలేదని, లక్షలాది వయోజన పౌరులను ఓటర్‌ జాబితాలలో చేర్చలేదని స్పష్టమయింది.

‘సర్‌’ ప్రక్రియ పూర్తయిన రాష్ట్రాలకు సంబంధించిన ఈ కింది గణాంకాలను చూడండి: ప్రతి రాష్ట్రం పేరు ఎదుట ఉన్న మొదటి సంఖ్య ‘సర్‌’కు పూర్వం ఓటర్ల–వయోజన జనాభా మధ్య నిష్పత్తి కాగా రెండో సంఖ్య తుది ఓటర్ల సంఖ్య వయోజన జనాభా మధ్య నిష్పత్తి– (అంకెలు అన్నీ శాతాల్లో) బిహార్‌: 96.7 శాతం; 90.7 శాతం; ఛత్తీస్‌గఢ్‌: 99.5, 87.3; గుజరాత్‌: 96.0, 97.2; కేరళ: 100.7; 97.2; మధ్యప్రదేశ్‌: 96.0, 89.8; రాజస్థాన్‌: 97.2, 91.2; తమిళనాడు: 106.8; 94.3; ఈ రాష్ట్రాలు అన్నిటిలో కలిపి మొత్తంగా: 98.7 శాతం, 90.3 శాతం.

ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ప్రభుత్వం, రాజకీయ పక్షాలు, పౌర బృందాలు ఎంత కర్తవ్య నిష్ఠతో నిర్వహించినా ఓటుహక్కుకు సంపూర్ణంగా అర్హులైన వయోజన ఓటర్లలో కొందరి పేర్లు, స్వల్ప సంఖ్యలోనే అయినప్పటికీ ఓటర్‌ జాబితాల్లో లేకుండా పోయేందుకు అవకాశమున్నది. అయితే ఓటర్‌ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమంలో అటువంటి కర్తవ్య నిష్ఠ లోపించినట్టు స్పష్టంగా కనిపించింది. ఇదెంతవరకు సబబు? అమెరికాలో చట్టాల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న కారణాలతో ఓటర్‌ జాబితాల నుంచి మినహాయింపబడిన ఆఫ్రికన్‌ అమెరికన్లను ఓటర్లుగా నమోదు చేసేందుకు పౌరహక్కుల చట్టం–1964 కింద అవసరమైన అన్ని ప్రయత్నాలు జరగడం పరిపాటి. మన ‘సర్‌’ కార్యక్రమాన్ని ఆ అమెరికన్‌ కర్తవ్యపాలనతో పోల్చి చూడండి.


వయోజన ఓటుహక్కు ప్రాతిపదికన పౌరులు అందరూ ఓటర్‌ జాబితాలలో ఉండేట్టుగా చూడవలసిన బాధ్యత భారత ఎన్నికల సంఘానికి ఉన్నది. అది ఈసీఐ నైతిక బాధ్యత. అయితే ‘సర్‌’ ప్రక్రియ కింద ఓటర్ల నమోదులో ఈసీఐ ఒక శత్రుత్వ వైఖరి ప్రదర్శించింది. తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన భారాన్ని ఓటర్ల పైనే మోపింది. తమ పౌరసత్వాన్ని నిరూపించుకోలేని వారిని ఓటర్‌ జాబితా నుంచి తొలగించింది. పైన ప్రస్తావించిన గణాంకాలను పరిశీలిస్తే ‘సర్‌’ అమలైన ప్రతి రాష్ట్రంలోను సగటున 10 శాతం మంది ఓటర్లకు ఓటర్‌ జాబితాలలో స్థానం లభించలేదని విదితమవుతుంది. ఓటర్‌ జాబితాలలో కనిపించకుండా పోయిన వ్యక్తులు వయోజనులేనా? అవును, వయోజనులే.. ఆ వయోజనులు అందరూ పౌరులేనా? అవును, పౌరులే (వారు పౌరులు కాదని నిరూపణ అయితే మినహా). మరి వారి పేర్లు ఓటర్‌ జాబితాలలో ఎందుకు కనిపించడం లేదు? ఈ దేశ పౌరులు కానివారు ఓటర్లు కాకుండా నిరోధించవలసిన ఈసీఐ, భారతదేశ పౌరులు అయిన లక్షలాది భారతీయులను ఓటుహక్కు లేనివారుగా చేయడంలో ‘సఫలమయింది’.

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - Mar 21 , 2026 | 03:57 AM