పెన్షనర్లతో చెలగాటమెందుకు?
ABN , Publish Date - Apr 15 , 2026 | 04:09 AM
ప్రభుత్వాలు వృద్ధుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఇది నేడు పరాకాష్ఠకు చేరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 55కు తగ్గించారు.
పెన్షనర్లు అందరూ ఆఫీసర్లు కాదు. సహజ వనరులు, అధిక ఆదాయాలున్న వారు కాదు. వీరిలో వాచ్‌మెన్లు, అటెండర్లు, రికార్డు అసిస్టెంట్లు, డ్రైవర్లు, పోలీసులు, ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. ఇలాంటివారినా ప్రభుత్వం వేధించేది? పెన్షనర్లకు అప్పుపడ్డ ప్రభుత్వానికి జ్ఞానోదయమవుతుందా?
ప్రభుత్వాలు వృద్ధుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఇది నేడు పరాకాష్ఠకు చేరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 55కు తగ్గించారు. ఈ చర్య ఉద్యోగుల పాలిట ఆత్మహత్యా సదృశమైంది. తరువాత నాదెండ్ల భాస్కరరావు దానిని 58కి మార్చారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేక ప్రభుత్వాలు ఇలాంటి పిల్లిమొగ్గలు వేస్తూ తలబొప్పి కట్టించుకుంటున్నాయి. నూతన ఆర్థిక విధానాల వెల్లువలో ప్రభుత్వాలు ప్రజల, ఉద్యోగుల, నిరుద్యోగుల హక్కుల కన్నా విధులకు ప్రాధాన్యం ఇస్తూ ఒక్కటొక్కటిగా హక్కులను నిర్వీర్యం చేస్తున్నాయి. ఉద్యోగుల హక్కులు, భద్రత, స్వీయగౌరవం, సమాజ నాగరికతా వికాసం అనే భావజాలాన్ని లాభనష్టాల భావజాలంగా, ప్రైవేటు రంగానికి కలిసివచ్చే భావజాలంగా అభివృద్ధి చేస్తూ వచ్చాయి. ఈ భారమంతా వృద్ధతరం మోయాల్సివస్తున్నది.
యాభై ఏళ్లు దాటిన వాళ్లను మీడియా వృద్ధులు అంటున్నది! ఇదే నిజమైతే అన్ని రంగాలలో వీరే శక్తికి మించిన కృషి చేస్తున్నారు. 58 ఏళ్లు నిండి రిటైరైన వాళ్లను తిరిగి కాంట్రాక్టు, అవుట్‌సోర్స్ పద్ధతుల్లో నియమించుకుని వారి శ్రమను దోచుకుంటున్నారు. ఇటీవల ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెన్షన్ల సమస్య తీవ్ర చర్చనీయాంశమవుతున్నది. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. రాష్ట్ర పెన్షనర్లు ఇటీవల నిర్వహిస్తున్న ఆందోళన శిబిరాలకు వెళ్లినప్పుడు పెన్షనర్లు తమ బాధ ప్రభుత్వానికి తెలిసేలా రాయమని కోరారు. ప్రభుత్వం ఎవరి కోసం ఇంత బాధ్యతారాహిత్యంగా ఉంటున్నది? ఎందుకు వృద్ధతరానికి అప్పు పడింది? ఎందుకు వారి స్వాభిమానాన్ని దెబ్బతీసి బలవన్మరణాల చితి మీదికి నెట్టి చోద్యం చూస్తున్నది. పెన్షనర్లు ఆవేదన పడుతున్నారు కానీ ఇది విధాన వైఫల్యం అనుకోవడం లేదు. అందుకు మూలాలు గ్రహించే చైతన్యం అవసరం. ఈ పని సంఘాలు చేయడం లేదు, అయితే పెన్షనర్లు బలవుతున్నారు.
ఇప్పటికే పెన్షనర్లను సీపీఎస్, ఓపీఎస్‌గా విడగొట్టారు. ఓపీఎస్ వారిని 2025కు ముందు, తరువాతి వాళ్లుగా విడగొడుతున్నారు. ప్రభుత్వం ఉద్దేశం పెన్షన్లు ఎగ్గొట్టాలనే. ఇప్పటికే వివిధ కార్పొరేషన్లలో దశాబ్దాలు పనిచేసి రిటైరయిన ఉద్యోగులకు పెన్షన్లు లేవు. వారు తమ జీవితాలు కరిగించుకుని కార్పొరేషన్లకు, తద్వారా సమాజానికి సేవలు చేసి రిటైరై, ఇవాళ బేల ముఖాలతో బతుకులు ఈడుస్తున్నారు. ఇళ్లు లేనివాళ్లు, పిల్లలు స్థిరపడని వాళ్లు, రోగాల పాలై కుదురుకోని వాళ్లు అనేక కష్టాలతో స్వీయగౌరవ సంక్షోభంలో ఉన్నారు. వారు యవ్వనంలో శ్రమ చేసిన కాలాన్ని నిలువునా దోచుకున్న ప్రభుత్వాలకే బాధ్యత లేనప్పుడు ఎవరు వారిని కాపాడగలరు? సీపీఎస్ వాళ్లు తమని ఓపీఎస్‌లోకి మార్చమని ఉద్యమాలు చేస్తున్నారు. ఎన్డీయే, ఇండీ కూటమి ప్రభుత్వాలు జూదమాడుతున్నాయి. కానీ విధాన సమీక్ష చేయడం లేదు. తమకు హక్కుగా రావలసిన, తమ దగ్గర బలవంతంగా మినహాయించుకున్న డబ్బు కూడా ఇవ్వకుండా ఉద్యోగులను వేధించడం మరొక దుర్మార్గం.
మిగులు బడ్జెట్‌తో, అధిక ఆదాయంతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని తన తప్పుడు ఆర్థిక విధానాలతో కేసీఆర్ అప్పులపాలు చేశారు. ఎవరూ అడగకపోయినా ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 61 సంవత్సరాలకు పెంచేశారు. అంత వయస్సు దాటి రిటైరైన వారికి ఈ ప్రభుత్వం తక్షణ పెన్షన్ మాత్రమే ఇస్తున్నది తప్ప, ఇతరత్రా బకాయిలు ఇవ్వడం లేదు. ఇది పెద్ద సంక్షోభంగా పరిణమించింది. పీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్, గ్రూప్ ఎల్‌ఐసి, లీవు నగదు వంటివన్నీ దాచుకున్నవే. గ్రాట్యుటీ మాత్రం సర్వీసు లెక్కించి ఇచ్చేది. కమ్యుటేషన్ అయితే పెన్షనర్లతో ప్రభుత్వం అధిక వడ్డీతో చేసే వ్యాపారం. పదకొండున్నర ఏళ్లలో తీరిపోయే అధిక వడ్డీ మొత్తాన్ని పదిహేనేళ్లు వసూలు చేస్తున్నది. పెన్షన్ అమ్మడం, కొనడం లాభనష్టాల వ్యాపారంగా ప్రభుత్వం నడుపుతున్నది. పెన్షనర్లు పొందే మొత్తం చాలా తక్కువ సమయంలో మార్కెట్‌లోకి వస్తుంది. అన్ని రంగాలలో ఇది ఆర్థిక చలనాన్ని వేగవంతం చేస్తుంది. ప్రభుత్వానికీ మార్కెట్‌కీ ఇది బాగా తెలుసు. పెన్షనర్లు తమ సర్వీసులో దాచుకున్న మొత్తాలు ఒక్కసారిగా తమ ఖాతాలలో జమ అయినప్పుడు పొందే చిన్నపాటి ఆనందం కూడా వారికి మిగలలేదు. ఇవ్వవలసినవన్నీ పెండింగ్‌లో పడేసి, ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు ఇవ్వడం తమ గొప్పగా ప్రభుత్వం చెప్పుకుంటున్నది. ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ కించిత్తు కూడా సిగ్గుపడడం లేదు.
కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో తమ ఆదాయ మార్గాలను ప్రకటించడం చూస్తున్నాం. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల ఆదాయాలు పడిపోతుండగా, సేవారంగ ఆదాయాలు పెరిగినట్టుగా చూపుతున్నాయి. ఈ అన్ని రంగాలకూ అవసరమైన నిపుణత కలిగిన మానవశక్తిని అందించింది వృద్ధతరం కాదా? ప్రభుత్వాలకు ఈ సోయి ఎందుకు ఉండదు? ప్రభుత్వానికి వచ్చే నెలనెలా ఆదాయం అప్పుల అసలు, వడ్డీలకు కట్టవలసి వస్తున్నదని, కొత్తగా చేసే అప్పులన్నీ పాత అప్పుల కిస్తీలకు పోతుంటే ఆదాయం చాలడం లేదని ముఖ్యమంత్రి అంటున్నారు. పాత ప్రభుత్వాన్ని ఇంటికి పంపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది ఈ మాటలు వినడానికి కాదు. తల్లిదండ్రులను చూడని కొడుకులూ బిడ్డల ఆదాయాల నుంచి వారి రక్షణ చూస్తామని ప్రభుత్వం చట్టం చేసింది కదా! ఈ చట్టం సారాంశం ప్రభుత్వానికి వర్తించదా? ఏళ్లకేళ్లు ఆలస్యం చేసి చెల్లించే డబ్బు విలువ పడిపోతే ఆ భారాన్ని మోయాల్సింది కూడా వృద్ధులైన పెన్షనర్లే. ఐదేళ్లు రాజకీయాలు చేసుకుని దిగిపోయి, జీవితకాలం పెన్షన్లు పొందే చట్టసభల సభ్యులకు ఈ సమస్య రూపసారాలు ఎందుకు అర్థం కావడం లేదు? పెన్షనర్లు అందరూ ఆఫీసర్లు కాదు. సహజ వనరులు, అధిక ఆదాయాలున్న వారు కాదు. వీరిలో వాచ్‌మెన్లు, అటెండర్లు, రికార్డు అసిస్టెంట్లు, డ్రైవర్లు, పోలీసులు, ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. ఇలాంటివారినా ప్రభుత్వం వేధించేది? పెన్షనర్లకు అప్పుపడ్డ ప్రభుత్వానికి జ్ఞానోదయమవుతుందా?
- ఎం. రాఘవాచారి
పాలమూరు అధ్యయన వేదిక