కష్టకాలం..!
ABN , Publish Date - Oct 03 , 2026 | 12:03 AM
నైరుతి రుతుపవనాలు ముగిసి, వాతావరణంలో కొత్తమార్పు మొదలైంది. పగటి ఉష్ణోగ్రతలు వేగంగా హెచ్చుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ నెల అంతా మార్చినాటి వేడిమిని అనుభవించాల్సి వస్తుందని..
నైరుతి రుతుపవనాలు ముగిసి, వాతావరణంలో కొత్తమార్పు మొదలైంది. పగటి ఉష్ణోగ్రతలు వేగంగా హెచ్చుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ నెల అంతా మార్చినాటి వేడిమిని అనుభవించాల్సి వస్తుందని, వచ్చేనెల అది మరింత పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలే కాదు, కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా అధికంగానే ఉంటాయన్న అంచనాలు భయపెడుతున్నాయి. వర్షాలు తగ్గిపోవడానికి తోడు వేడిమి పెరగడం మరింత నరకం.
దేశంలో కొనసాగుతున్న ఎల్‌నినో పరిస్థితులు డిసెంబరు నాటికి పతాకస్థాయికి చేరుకున్న పక్షంలో ఆ కష్టాలు ఊహకు అందనివి. అసలే ఆలస్యంగా వచ్చిన నైరుతి రుతుపవనాలు 13శాతం లోటుతో ముగిశాయి. సాధారణ వర్షపాతంతో పోల్చినా 109 మిల్లీమీటర్ల లోటు ఏర్పడింది. గత పాతికేళ్ళకాలంలో అత్యల్పవర్షపాతం నమోదు కావడం ఇది నాలుగోసారి. 2015 ఎన్‌నినో సంవత్సరం తరువాత అత్యంతలోటుతో ముగిసిన రుతుపవనాలు ఇవేనట. సెప్టెంబర్ చివరలో కురిసిన వర్షాలు కూడా ఈ లోటును పెద్దగా పూడ్చలేకపోయాయి. దేశంలోని చాలా ప్రాంతాలు తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. చాలా రిజర్వాయర్లలో డెబ్బైఐదు శాతానికి మించి నీరు లేకపోవడం పదేళ్ళ సగటున చూసినా తక్కువే. దీనికితోడు, ఎల్‌నినో ప్రభావం ఫిబ్రవరి దాకా కొనసాగే అవకాశం ఉన్నందున, ఈశాన్య రుతుపవనాల్లోనూ లోటు ఉండవచ్చన్న అంచనాలు మరింత భయాన్ని కలిగిస్తున్నాయి. రేపు ఓ నాలుగు చినుకులు ఎక్కువ పడతాయన్న నమ్మకం ఉంటే, ఇప్పటి ఉపద్రవాన్ని దాటగలమన్న ధైర్యం పెరుగుతుంది.
తగ్గుతున్న నీటినిల్వలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు రబీ మీద ప్రభావం చూపడం ఖాయం. వ్యవసాయ ఉత్పత్తి తగ్గి, ఆహారద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉన్నదని పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఫిబ్రవరి వరకూ ఎల్‌నినో అసాధారణ స్థాయిలో ఉండబోతున్నదన్న అంచనాల నేపథ్యంలో, గోధుమలు, ఇతర పంటలపైన ఆ ప్రభావం కాదనలేనిది. ఇప్పటికే, చాలా ఆహారోత్పత్తుల ధరవరల్లో మార్పు కనిపిస్తున్నది. వరి, పప్పుధాన్యాలు, చెరుకు వంటి పంటలు సాగు అయ్యే ప్రాంతాల్లో వర్షపాతంలో ఏర్పడిన లోటు భవిష్యత్ ప్రమాదాన్ని సూచిస్తోంది. దీనికితోడు, వరిసాగు విస్తీర్ణం నాలుగుశాతం మేరకు తగ్గి, దిగుబడిపై నమ్మకం లేక రైతులు కూడా పంటలకు దూరంగా ఉంటున్నారన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
సూపర్ ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపే దేశాల్లో భారత్ కూడా ఉన్నందున ఈమారు ఏ మాత్రం ఉపేక్ష పనికిరాదు. కరువు ప్రభావాన్ని సాధ్యమైనంత తగ్గించి, రైతులకు సకాలంలో వివిధరకాల సహాయం అందించడానికి కేంద్రం, రాష్ట్రాలు పూర్తి సమన్వయంతో వ్యవహరించాలి. తాగునీరుకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి, దాని దుర్వినియోగాన్ని శిక్షార్హమైన నేరంగా ప్రభుత్వాలు ప్రకటించాలి. చెరువులు, కుంటల్లోని నీటిని కాపాడుకుంటూ, వాటిని తాగడానికి పరిమితం చేయాలి. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ప్రైవేటు, ప్రభుత్వం అన్న తేడాలేకుండా అన్ని రకాల నిర్మాణ కార్యకలాపాలను నిలిపివేయడం మంచిది. భూగర్భజలాల వెలికితీతమీద కఠిన నియంత్రణలు ఉండాలి. పంట ప్రణాళికలు మారాలి, వైవిధ్యం పెరగాలి, నీటి సమర్థ నిర్వహణకు అధికప్రాధాన్యం దక్కాలి.
నీటిలోటు, అధిక ఉష్ణోగ్రతల ప్రభావం పరిశ్రమలు, సేవలు, పర్యాటకం ఇత్యాది రంగాల మీద కూడా వివిధస్థాయిల్లో ఉంటుంది. విపరీతమైన వేడిమి వల్ల ఆరోగ్యాలు సైతం దెబ్బతింటాయి. దీనివల్ల, పదిహేనువేల పైచిలుకు మరణాలు అదనంగా సంభవించవచ్చునని కొన్ని నివేదికలు హెచ్చరిస్తున్నాయి కూడా. పరిశీలకులను పంపి, రాష్ట్రాలు చెబుతున్నదానికి భిన్నంగా కరువును లెక్కవేసి, నామమాత్రపు సాయాన్ని ప్రకటించే గతకాలపు విధానాలను కేంద్రం పక్కనబెట్టి వాటితో కలిసినడవాల్సిన కష్టకాలం ఇది. పదేళ్ళుగా పూర్తిస్థాయి సమావేశం జరపని అంతర్‌రాష్ట్రమండలిని కేంద్రం ఇందుకు వాడుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు, మరికొన్ని చోట్ల వరదలు ఏర్పడే అనిశ్చితపరిస్థితుల మధ్య ఎల్‌నినో కష్టకాలాన్ని సమన్వయంతో దేశం ఒక్కటిగా ఎదుర్కోవాల్సి ఉంది. రాబోయే నెలల్లో భారీ ఆహారసంక్షోభం తలెత్తవచ్చునని విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ ప్రధానంగా పశ్చిమాసియా పరిస్థితులు నేపథ్యంలో హెచ్చరించినప్పటికీ, ఎల్‌నినో కూడా తోడైనందువల్ల దేశం మరింత అప్రమత్తంగా ఉండకతప్పదు.