Share News

కుంకి ఏనుగు ఆదర్శం

ABN , Publish Date - Apr 12 , 2026 | 12:18 AM

‘అవిగో అవే పోకిరి ఏనుగులు’ పెద్దపెద్ద దుంగలతో కట్టిన క్రాల్ బైట, కాళ్ళకి సంకెళ్ళతో భారంగా కదులుతున్న రెండు ఏనుగులను చూపిస్తూ అన్నాడు మావటి. కళ్ళ నుంచి మదజలం స్రవించే కాలంలో విశృంఖల సంచారం చేస్తూ ఎదురొచ్చిన మనుషులను...

కుంకి ఏనుగు ఆదర్శం

‘అవిగో అవే పోకిరి ఏనుగులు’ పెద్దపెద్ద దుంగలతో కట్టిన క్రాల్ బైట, కాళ్ళకి సంకెళ్ళతో భారంగా కదులుతున్న రెండు ఏనుగులను చూపిస్తూ అన్నాడు మావటి. కళ్ళ నుంచి మదజలం స్రవించే కాలంలో విశృంఖల సంచారం చేస్తూ ఎదురొచ్చిన మనుషులను కాళ్ళతో తొక్కి, తొండంతో విసిరి చంపిన ఏనుగులివి. దేవాలయాల ఉత్సవాలలో కావొచ్చు, పరేడ్లలో కావొచ్చు, అడవి మంద నుంచి తప్పిపోయి జనావాసాలలో చొరబడినవి కావొచ్చు. అప్పటివరకూ కేవలం పత్రికల్లో, చానెళ్ళలో వార్తలుగా మాత్రమే కనబడినవి, ఇపుడు ఏనుగుల శిబిరంలో మావటీల చేత, సాటి మంచి ఏనుగుల చేత శిక్షణ పొందుతూ కనిపించాయి.

ఈ అద్భుత దృశ్యం– అనేక దొంతరల పశ్చిమ కనుమల్లో, కావేరీ పరీవాహక ప్రాంతాన, కొడగు జిల్లాలోని మడికెరె వెదురువనాలలో ఉన్న ‘దుబారే ఎలిఫెంట్ క్యాంప్’లో కనబడుతుంది. మనకి ఆధ్యాత్మిక, మత కోణాలలో గోసంరక్షణ కేంద్రాలు, మానవీయకోణంలో పెంపుడు జంతువులు, వీధి జంతువుల సంరక్షణ కేంద్రాల వంటివి అనేకం ఉన్నాయి. కానీ మనుషులతో వాటి పరస్పరతకి చాలా పరిమితులు ఉన్నాయి. అయితే దుబారే ఎలిఫెంట్ క్యాంప్ పైవాటికి భిన్నమైనది, ప్రత్యేకమైనది. ప్రసిద్ధి చెందిన మైసూరు దసరా ఉత్సవాల ఊరేగింపులలో పాల్గొనడానికి శిక్షణ ఇవ్వడం కోసం, అడవిలో ఏనుగుల మంద నుంచి తప్పిపోయిన వాటిని సంరక్షించడం కోసం మైసూరు రాజవంశీకులు మొదట ఈ కేంద్రాన్ని మొదలుపెట్టారు. 1980 తర్వాత కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఈ కేంద్రపు పరిధిని పెంచింది.


‘ఏనుగు ఏనుగు నల్లనా ఏనుగు కొమ్ములు తెల్లనా’ అని పాడుకుని పరవశించిన మనుషులకి– ఒక రోజంతా ఏనుగులకి దగ్గరగా వెళ్ళగలిగే అవకాశం వస్తే ఏం చేయొచ్చు? సౌమ్యమైన, తెలివైన, ఒక మహాకాయపు అడవి జంతువు మందగమనంతో మన పక్కగా సాగిపోవడాన్ని రెప్పలార్పకుండా చూడవచ్చు. నీటిమడుగులో జలకాలాడుతూ తొండంతో అది కురిపించే నీటిజల్లులలో తడిసిపోవచ్చు. మావటీల సాయంతో దాని ఒళ్ళురుద్ది, లాలపోసి, ఎండుగడ్డితో చుట్టిన ఇంత ధాన్యపుకట్ట తినిపించవచ్చు. వాటి మేధస్సు, పరోపకారం, ఆటవికబలం, జ్ఞాపకశక్తిని స్వయంగా చూసి అబ్బురపడవచ్చు. మనిషిని ఏనుగు, ఏనుగుని మనిషి ఇంత సన్నిహితంగా అర్థం చేసుకోవడం, పరస్పరం నేర్చుకోవడం ఈ క్యాంప్ ప్రత్యేకత.

ఈ కేంద్రంలో దాదాపు ముప్పై ఏనుగులు ఉన్నాయి. సందర్శకులను ఏనుగులకి సన్నిహితం చేయడం అనే ఆలోచన ద్వారా కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ మంచి ఫలితాలను రాబట్టింది. సందర్శకుల ప్రవేశానికి, ఏనుగులకు స్నానం చేయించడానికి, ఆహారం తినిపించడానికి రుసుము చెల్లించాలి. దీనిద్వారా వచ్చే ఆదాయంతో తిండిపుష్ఠి కలిగిన ఈ భారీ జంతువులకి ఆహారం సమకూర్చడం సులువయింది. ‘మావత’లుగా తరతరాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న కొంతమంది స్థానిక ఆదివాసీలకి స్థిరమైన ఆదాయం వస్తోంది. కొంతమంది గైడ్లుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం మీద భారం పడకుండా దుబారే స్వయంసమృద్ధి సాధించింది. అన్నిటికన్నా ముఖ్యం– మనిషికీ జంతువుకీ మధ్యనున్న పరమ ఆదిమమైన బాంధవ్యం ఇక్కడ అత్యంత నిసర్గంగా నిరూపించబడుతుంది.


‘మంచి–చెడు–సంస్కరణ’ ప్రాతిపదికలో ఇక్కడ రెండు రకాల ఏనుగులు ఉన్నాయి. కుంకి ఏనుగులు, పోకిరి ఏనుగులు. ఏడాది కిందట అకస్మాత్తుగా కుంకి ఏనుగుల చర్చ మీడియాలో విస్తృతంగా వచ్చింది. ఏపీలోని ఏజెన్సీ పరిసర గ్రామాల్లో ఏనుగుల గుంపు దాడులు పెరిగిపోయాయి. మనుషులు చనిపోతున్నారు, ఏనుగుల తొక్కిడి చేత పంటలు నాశనమవుతున్నాయి. వీటిని అదుపు చేయడానికి ఏపీ ప్రభుత్వం– కర్ణాటక నుంచి ఆరు కుంకి ఏనుగులను తెప్పించింది. ఇవి దుబారే ఎలిఫెంట్ క్యాంప్ నుంచే వెళ్ళాయి.

కుంకి ఏనుగులు కఠిన శిక్షణ పొందిన బలమైన, సమర్థమైన మంచి ఏనుగులు. ఇవి జనావాసాలు, పొలాలు, ఇతర ప్రాంతాల్లో అల్లకల్లోలం చేస్తున్న ఏనుగుల గుంపుని అదుపు చేసి సురక్షితంగా అడవులలోకి తిప్పి పంపుతాయి. గాయపడిన ఏనుగులను గుర్తించి వైద్యానికి లొంగేలా చేస్తాయి. అన్నిటికన్నా ముఖ్యం పోకిరి ఏనుగుల పట్ల వాటి వైఖరి. మదించిన ఏనుగుని బుజ్జగించి, అదిలించి సాత్వికంగా మారేలా చేస్తాయి. వశంలో లేని వ్యతిరేకబలాన్ని, శిక్షణతో కూడిన సానుకూలశక్తితో ఓడించి అదుపు చేయడమన్న భావన నాగరీకులుగా భావించే మనుషులకి సాధ్యం కావడమే అతికష్టం. అలాంటిది కుంకి ఏనుగు ఈ పని చక్కగా చేస్తుంది.


‘ఏనుగు ఎప్పటికీ మర్చిపోదు’ అనేది ఒక నానుడి. అవును, ఏనుగులు మంచినీ చెడునీ కూడా తొందరగా మరచిపోవు. వాటిని గుర్తించగల వివేచన, సరిదిద్దగల మేధస్సు కుంకి ఏనుగుల సొంతం. ఇవి సాటి పోకిరి ఏనుగుల సంస్కరణకి పాటుపడటం– వాటినుంచి మనం నేర్చుకోవలసిన విషయం. పదిమంది పిల్లలు కూడి ఒక పిల్లనో పిల్లవాడినో ఒంటరిని చేసి, వేధించుకు తినడం బాల్యపు క్రూరమైన అమాయకత్వం. మనలో చాలామంది ఇప్పటికీ బాల్యదశ దాటలేదు. మనకు భిన్నంగా ఉన్నవారినో, మన మనో న్యాయస్థానంలో తప్పు చేసినవారినో, మనకు అస్సలు నచ్చనివారినో వెలివేసి శిక్షించడం మీదున్న ఆసక్తి మనకి సంస్కరణ మీద ఉండదు. ఎందుకంటే తోటివారి సంస్కరణకి ప్రజాస్వామికంగా పాటుపడాలీ అంటే మన మనసుకి, బుద్ధికి, కుంకి ఏనుగు తీసుకున్నంత కఠోరమైన శిక్షణ ఇవ్వాలి. ఇవ్వాల్సిందే తప్పదు. మంచి–చెడు, నేరము– శిక్షల మాయావలయం ఛేదించడాన్ని– ఒక కుంకి ఏనుగు సైతం దాని పరిధిలో నేర్పిస్తుందీ అంటే హృదయం ఒగ్గి వినక తప్పదు.

-కె.ఎన్. మల్లీశ్వరి

Updated Date - Apr 12 , 2026 | 12:20 AM