Teacher Rights: రేపు డీటీఎఫ్ ధర్నా
ABN , Publish Date - Jan 09 , 2026 | 05:08 AM
పాఠశాల విద్యలో వస్తున్న మార్పులు, తీసుకొస్తున్న సంస్కరణలు అంతిమంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు బలపడడానికే పనికొస్తున్నాయి.
పాఠశాల విద్యలో వస్తున్న మార్పులు, తీసుకొస్తున్న సంస్కరణలు అంతిమంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు బలపడడానికే పనికొస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో విద్య నానాటికీ కునారిల్లుతున్నది. విద్యార్థుల నమోదు దాదాపు యాభై శాతానికి పడిపోయింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పథకాలు ఏవీ పాఠశాల విద్యను బలోపేతం చేయలేకపోతున్నాయి. విద్యా సంవత్సరంలో పూర్తిగా చదువు చెప్పనీయకుండా ప్రమాణాల సాధన పేరుతో వంద, డెబ్బై అయిదు రోజుల ప్రణాళికలతో అకడమిక్ క్యాలెండర్ అలంకారప్రాయమైంది. అధికారులకు, ఉపాధ్యాయులకు నిర్ణీత ప్రమాణాల సాధన ఒక అభద్రతాభావాన్ని సృష్టించింది. కుదురుగా 220 పనిదినాలు టీచర్లను చదువు చెప్పనిచ్చి ఉంటే ప్రమాణాల విషయంలో ఇంతటి భయాందోళనలకు కలిగేవి కావు.
పాఠశాల విద్యలో మాతృభాషా మాధ్యమం అమలుచేయాలి; ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి; నాడు–నేడులో భాగంగా నిర్మాణాలు మధ్యలో ఆగిపోయిన పాఠశాలలకు నిధులివ్వాలి; విద్యాశక్తి ప్రోగ్రాంతో పాటు బోధనకు ఆటంకం కలిగించే వివిధ కార్యక్రమాల నిర్వహణ రద్దు చేయాలి; ఫార్మటివ్ అసెస్మెంట్ పరీక్షలు డీసెంట్రలైజ్ చేయాలి; ఉద్యోగ నియామకాలలో కాంట్రాక్టు, ఎమ్టీఎస్ విధానం రద్దు చేయాలి; స్థానిక సెలవుల ప్రకటన పాఠశాల ప్రధానోపాధ్యాయుని పరిధిలో ఉండాలి వంటి తదితర డిమాండ్లతో విద్యారంగ సమస్యల పరిష్కారం, ఉపాధ్యాయుల ఆత్మగౌరవ పరిరక్షణ కోసం జనవరి 10న విజయవాడ ధర్నాచౌక్‌లో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) ధర్నా నిర్వహిస్తున్నది.
– డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్