Share News

వేల టీచర్లకు వెలుగునిచ్చి..!

ABN , Publish Date - Oct 28 , 2026 | 12:24 AM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వేలమంది ఉపాధ్యాయులను తయారు చేసిన ఉత్తమ అధ్యాపకురాలు, పాఠ్యపుస్తకాల రచయిత, తెలుగు భాష అమలు కోసం, ఉన్నతీకరణ కోసం, అలుపెరుగని పోరాటం చేసిన మాతృభాషా ప్రేమికురాలు, డా. సరోజన బండ. అక్టోబర్ 22న అమెరికాలోని వర్జీనియాలో తుదిశ్వాస విడిచారు.

వేల టీచర్లకు వెలుగునిచ్చి..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వేలమంది ఉపాధ్యాయులను తయారు చేసిన ఉత్తమ అధ్యాపకురాలు, పాఠ్యపుస్తకాల రచయిత, తెలుగు భాష అమలు కోసం, ఉన్నతీకరణ కోసం, అలుపెరుగని పోరాటం చేసిన మాతృభాషా ప్రేమికురాలు, డా. సరోజన బండ. అక్టోబర్ 22న అమెరికాలోని వర్జీనియాలో తుదిశ్వాస విడిచారు.

1941 ఏప్రిల్ 3న సిద్దిపేట జిల్లాలోని (ఒకప్పుడు వరంగల్ జిల్లా) మారుమూల గ్రామమైన లద్నూర్‌లో మల్లయ్య, అంబమ్మ దంపతులకు సరోజన జన్మించారు. ఆ రోజుల్లో కేవలం దొరలు, ధనికులు మాత్రమే విద్యను అందిపుచ్చుకునేవారు. అలాంటిది ఒక పద్మశాలీ బిడ్డగా పాఠశాలకు వెళ్లి చదువుకోవడం చాలా గొప్ప విషయం. సమాజ వ్యతిరేకతలను పట్టించుకోకుండా ఆమె తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. 1963లో సికింద్రాబాద్‌లోని బోయిగూడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయినిగా ఉద్యోగంలో ప్రవేశించారు. ఉద్యోగం చేస్తూనే ఎ.ఎన్.రావు మార్గదర్శకత్వంలో ఏ శిక్షణా లేకుండా పదో తరగతి పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రీ యూనివర్సిటీ కోర్సు, బీఏ, బీఈడీ పూర్తిచేశారు. 1974లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ తెలుగు పట్టా పొందారు. పీజీ అనంతరం కూడా తాను ఇంకా ఉన్నత విద్యనభ్యసించాలని సరోజన నిశ్చయించుకున్నారు. ఇదే ఆమెను 1976లో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిగ్రీ (ఎంఈడీ) పూర్తి చేసేలా చేసింది. 1992లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ‘పాఠశాల స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాల్లో స్త్రీ హోదా చిత్రణ గురించిన అధ్యయనం’ అనే అంశంపై పరిశోధన చేసి, పీహెచ్‌డీ పట్టా పొందారు.


విద్యావంతురాలైన ఆమె రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ)లో చేరి 45 పాఠ్యపుస్తకాలకు రూపకల్పన చేశారు. రాష్ట్ర ఉన్నత విద్యా అధ్యయన సంస్థలో ప్రొఫెసర్‌గా ఎదిగి, ఎంతో మందిని ఉపాధ్యాయులుగా, తెలుగు పండితులుగా తీర్చిదిద్దారు. ‘ఇల్లాలి చదువు ఇంటికే కాదు, ప్రపంచానికే వెలుగు’ అని సరోజన నిరూపించారు. ఆమె ఒక్కరే చదవడం కాదు, తన కుటుంబ సభ్యులందరినీ చదువుకోవాలని ప్రోత్సహించేవారు. చదువుకోలేని, ఫీజులు కట్టలేని వారికి తానే ఫీజులు కట్టి మరీ చదివించేవారు.

సంగీతం వినడమన్నా, పుస్తక పఠనమన్నా, సొంత బాణీలో పాటలు పాడడమన్నా, గ్రామీణ జీవనశైలిని ఆచరించడమన్నా సరోజన ఎనలేని ఆసక్తిని ప్రదర్శించేవారు. ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్‌బుక్ కమిటీలో సభ్యులుగా ఉన్నప్పుడు వివిధ పాఠ్య పుస్తకాలు వెలువడ్డాయి. ‘అనియత విద్య’ పాఠ్యపుస్తకాల రచనలోనూ ఆమె పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు రూపొందించిన నవోదయ పాఠ్య పుస్తకాలు, సీబీఎస్‌ఈ సిలబస్ తెలుగు పాఠ్యపుస్తకాలకు సంపాదకులుగా, విషయ, భాషా నిపుణులుగా వ్యవహరించారు. మానవ వనరుల మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో గిరిజన పాఠ్య పుస్తకాలను గోండీ, సవర భాషల్లో రచించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం దూరవిద్య తెలుగు బోధనా పద్ధతుల రచనలో పాల్గొన్నారు. తెలుగు అకాడమీ వారు ప్రచురించిన తెలుగు బోధనా పద్ధతులు గ్రంథానికి, ఆనాటి పదో తరగతి ఉపవాచకం ‘విశ్వమాత థెరీసా’కు సరోజన సంపాదకురాలు.


వివిధ అంశాలకు సంబంధించి ఆమె రచించిన పాటలు, ప్రసంగాలు, రూపకాలు ఎన్నో ఆకాశవాణి, హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమయ్యాయి. రేడియోలో పాకాల యశోదారెడ్డి ‘మహాలక్ష్మి ముచ్చట్లు’ వినిపిస్తే అదే కోవలో సరోజన బండ ‘లచ్చుమమ్మ ముచ్చట్లు’ వినిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ పక్షాన 1994లో ఇంగ్లాండులోని లీడ్స్ యూనివర్సిటీలో ‘ప్రాథమిక విద్య పాఠ్యప్రణాళిక నిర్మాణం, పాఠ్యపుస్తక రచన’లో శిక్షణ పొందారు. అనంతరం ఆమె సంపాదకత్వం వహించిన రెండో తరగతి తెలుగు వాచకం దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు ఇరవై ఏళ్ల పాటు పాఠ్యపుస్తకంగా ఉంది.

సప్తస్వరాలు, ఒక పూవు పూసింది, ఎర్రమందారం, అక్షర రూపాలు అనే కవితా సంపుటాలు, అనంత వైభవం అనే సావనీర్‌ను వెలువరించారు. లచ్చుమమ్మ ముచ్చట్లు (రేడియో ముచ్చట్లు), ప్రకృతికే ఆభరణాలు (రేడియో నాటకాలు), అక్షరమే ఆయుధం (రేడియో ప్రసంగాలు), గాలిపడిగెలు (మ్యూజింగ్స్), సరోజం (ఆత్మకథ), వాచకాలు మన వారసత్వ సంపద (తెలుగు వాచకాల నాణ్యతపై వ్యాసాలు), ఇండియా కథలు–అమెరికా వెతలు అనే పుస్తకాలను వెలువరించారు. ఇవిగాక నిజాం కాలం నాటి అనేక యథార్థ సంఘటనలను ‘బర్రెంక చెట్టు ఒక యాది..’ లాంటి ఎన్నో కథలుగా రచించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఒకటి నుంచి పదో తరగతి వరకు అందుబాటులోకి వచ్చిన తెలుగు పాఠ్యపుస్తకాలు విద్యార్థుల స్థాయికి తగ్గట్టుగా లేవని వివిధ పత్రికల్లో వ్యాసాలు రాసి ఆందోళనను వెలిబుచ్చారు. అలాగే లోకాయుక్తలో కేసు వేసి అమెరికా నుంచే విచారణలో పాల్గొన్నారు. తుది తీర్పును వెలువరించిన లోకాయుక్త... పాఠ్యపుస్తకాల రూపకల్పనలో సరోజన లాంటి విద్యావేత్తల సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని ఆనాటి పాఠశాల విద్యా సంచాలకులను ఆదేశించింది.


నేటి విద్యార్థుల్లో తెలుగు భాష పట్ల ఆసక్తి తగ్గిపోతోందని దానికి ప్రభుత్వాలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాధ్యత వహించాలనేవారు సరోజన. తన ఆత్మకథ ‘సరోజం’లో కూడా గత ఎనిమిది దశాబ్దాల సామాజిక పరిణామాలను చాలా దగ్గరగా పరిశీలించి, కాలగతిలో జీవన విధానంలోని తారతమ్యాలను అక్షరీకరించారు. తన ఉద్యోగ జీవితంలో కూడా నిరంతరం పోరాడేవారు. లంచగొండితనం అన్నా, లాబీయింగ్ అన్నా మండిపడేవారు. నందమూరి తారక రామారావు, డా. సి.నారాయణరెడ్డి, పి.వి.నరసింహారావుల ప్రశంసలు పొందారు. తెలంగాణ ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం వంటివి ఎన్నో అందుకున్నారు. అమెరికాలోనూ అనేక పురస్కారాలు అందుకున్నారు.

తుదిశ్వాస దాకా కూడా ఆమె విద్యార్థుల గురించి, తెలుగు భాషా వికాసం గురించి తపనపడ్డారు. సమ సమాజం కోసం తపనపడే సరోజన లాంటి విదుషీమణి, విద్యావేత్త, మానవతామూర్తి, రచయిత్రి, అధ్యాపకురాలు ఉండడం చాలా అరుదు. ఆమె మరణం సామాజిక సంక్షేమ చింతనాపరులకు, ఉభయ తెలుగు రాష్ట్రాల విద్యా రంగానికి, తెలుగు భాషా వికాసానికి తీరని లోటు.

- డా. వెల్దండి శ్రీధర్

Updated Date - Oct 28 , 2026 | 12:27 AM