హిందీ సాహిత్యంలో తెలుగు తేజం!
ABN , Publish Date - Sep 08 , 2026 | 12:11 AM
గాంధీజీ ప్రోత్సహించిన ‘హిందీ ప్రచార ఉద్యమం’ ద్వారా దక్షిణ భారతదేశంలో హిందీ ప్రచారం బహుముఖంగా విలసిల్లింది. దాని ఫలితంగా దక్షిణ భారతదేశంలోని ఎందరో హిందీ సాహిత్య రంగంలో తమ ప్రతిభను వెల్లడించారు.
గాంధీజీ ప్రోత్సహించిన ‘హిందీ ప్రచార ఉద్యమం’ ద్వారా దక్షిణ భారతదేశంలో హిందీ ప్రచారం బహుముఖంగా విలసిల్లింది. దాని ఫలితంగా దక్షిణ భారతదేశంలోని ఎందరో హిందీ సాహిత్య రంగంలో తమ ప్రతిభను వెల్లడించారు. సర్వశ్రీ వారణాశి రామమూర్తి రేణు, ఆలూరి బైరాగి, అరిగపూడి రమేశ్ చౌదరి, ఆచార్య సుందరరెడ్డి, డా. పి.ఆదేశ్వరరావు, బాలశౌరిరెడ్డి, డా. కర్ణరాజ శేషగిరిరావు, డా. భీమ్‌సేన్ నిర్మల్, సూర్యనారాయణ భాను, పుల్లయ్యరావు... ఇలా హిందీ సాహిత్యంలో వివిధ ప్రక్రియలలో తమ ప్రతిభను వెల్లడించిన తెలుగువారు ఎందరో ఉన్నారు, కానీ డా. ఆదేశ్వరరావు వలె అన్ని ప్రక్రియలలోనూ ప్రతిభను విస్తరింపజేసినవారు చాలా అరుదు.
ఆదేశ్వరరావు 1936లో గుంటూరులో ఒక విద్యావంతుల కుటుంబంలో జన్మించారు. గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు హైస్కూల్‌లో ప్రముఖ హిందీ, తెలుగు కవి ఆలూరి బైరాగి వద్ద హిందీ అధ్యయనం చేశారు. బైరాగి ప్రభావంతో తన 18వ ఏట నుంచే ఆయన కవితా వ్యాసంగాన్ని ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ హిందీ పత్రికలైన ‘స్రవంతి’, ‘దక్షిణ భారత్’లలో ఆయన కవితలు వెలువడ్డాయి. 1955లో గుంటూరు హిందూ కళాశాల నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం బీఏ పట్టాను పొంది బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో హిందీ ప్రధానంగా ఎం.ఏ చదువును ప్రారంభించారు. అక్కడ ప్రముఖ హిందీ సాహిత్యవేత్తలు, పండితుల శిష్యరికంలో ఆయనలోని ప్రతిభ పూర్ణ వికాసం పొందింది. 1965లో ‘హిందీ ఔర్ తెలుగుకే స్వచ్ఛందతావాది కావ్యధారాకే తులనాత్మక అధ్యయన్’ అన్న పరిశోధనా గ్రంథంపై ఈయనకు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు డాక్టరేట్ ప్రదానం చేశారు.
ఈ బృహత్ గ్రంథంలో ఆయన హిందీ, తెలుగు భావ కవిత్వంలోని సమాన–అసమానతలను సోదాహరణంగా వివరించారు. ఈ గ్రంథం ద్వారా హిందీ తులనాత్మక విమర్శకులలో అగ్రతాంబూలం అందుకున్న అయిదుగురిలో ఆదేశ్వరరావు ఒక స్థానాన్ని పొందారని ఢిల్లీ విశ్వవిద్యాలయ ఆచార్యులు శీతాంశు కీర్తించారు. ఆ తరువాత మద్రాసులోని ‘దక్షిణ భారత హిందీ ప్రచార సభ’ పోస్టు గ్రాడ్యుయేటు శాఖలో అయిదేళ్లు లెక్చరర్‌గా పనిచేసి, ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగంలో ఆచార్యుడిగాను, విభాగాధిపతిగాను పనిచేశారు. 2020 సెప్టెంబర్ 9న స్వర్గస్థులయ్యే వరకు ఆయన కవిగా, విమర్శకుడిగా–భాషా తత్వవేత్తగా, అనువాదకుడిగా, హిందీ సాహిత్య రంగంలో తనకొక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
ఆదేశ్వరరావు 1969లో ‘అంతరాల్’ అనే కవితా సంపుటిని వెలువరించారు. దానిలో ఆయన 1957 నుంచి 1965 వరకూ రాసిన కవితలు ఉన్నాయి. ఈ కవితా సంపుటి 1971లో భారత ప్రభుత్వ ఉత్తమ సృజనాత్మక గ్రంథంగా బహుమతి పొందింది. ఇందులో కవిగా ఆయన... కొన్నిచోట్ల ఆదర్శ ప్రేమికుడిగా ప్రేయసితో ఊహాలోకాలలో విహరిస్తూ, మరికొన్నిచోట్ల భగ్న ప్రేమికుడిగా విరహ వేదనను అనుభవిస్తూ దర్శనమిస్తాడు. ఒకచోట ప్రేయసిని ‘‘బినా తెరే రూప్ దేఖే, దేవి కైసే జీ సకూం మై?’’ అంటాడు. ‘పంఖ్ లగాదో ప్రాణోంమే’ అనే కవితలో తన బాహువులకే రెక్కలు వస్తే ప్రేయసిని హృదయంలో దాచుకుని, వినీల ఆకాశంలోకి ఎగిరిపోవాలని ఆకాంక్షిస్తాడు. కొన్ని తత్వ ప్రధానమైన కవితలు కూడా ఇందులో కనపడతాయి.
సాహితీ విమర్శకుడిగా కూడా ఆయనకు హిందీ సాహిత్యంలో ప్రత్యేక స్థానం ఉన్నది. ఆయన రాసిన విమర్శనాత్మక గ్రంథాలలో పైన చెప్పిన పరిశోధనా గ్రంథంతోపాటు, ‘కవి పంత్ ఔర్ ఉన్‌కి ఛాయావాదీ రచనాయే’, ‘తులనాత్మక్ శోధ్ ఔర్ సమీక్షా’ ముఖ్యమైనవి. ‘కవి పంత్ ఔర్ ఉన్‌కీ ఛాయావాదీ రచనాయే’ గ్రంథంలో మహాకవి సుమిత్రానందన్ పంత్ రచనలలోని భావ రమణీయతను, కల్పనా ప్రాభవాన్ని, శైలిలోని సొబగును విమర్శనాత్మకంగా వివరించారు. ‘తులనాత్మక్ శోధ్ ఔర్ సమీక్షా’ ఈయన పరిశోధనా వ్యాసాల సంగ్రహం.
అనువాదకుడిగా కూడా ఆదేశ్వరరావు హిందీ, తెలుగు, ఇంగ్లీషు భాషలపై తనకున్న అధికారాన్ని, ఆయా భాషల సాహిత్యాల్లో తనకున్న పాండితీ ప్రకర్షను నిరూపించుకున్నాడు. ఆయన తెలుగు నుంచి హిందీలోకి చేసిన అనువాదాల్లో బుచ్చిబాబు ‘ఆత్మవంచన’, త్రిపురనేని రామస్వామి చౌదరి ‘ఖూనీ’ అనే నాటకాలు, కోనేరు రామకృష్ణారావు ‘చంపక’ అనే గేయ నాటిక; ప్రఖ్యాత తెలుగు కవులైన అడివి బాపిరాజు, రాయప్రోలు సుబ్బారావు, కరుణశ్రీ, గురజాడ, శ్రీశ్రీ, బైరాగి, నారాయణబాబు, పట్టాభి, తిలక్, సోమసుందర్, దాశరథి, ఆరుద్ర, సినారె మొదలైనవారి కవితలు; పైడిపల్లి రవీంద్రబాబు, అద్దేపల్లి రామమోహనరావు, బలిజేపల్లి రాఘవరావు మొదలగువారి కథలు ముఖ్యమైనవి. జ్ఞానపీఠ్ బహుమతి పొందిన రామధారిసింహ్ దినకర్ మహోన్నత కావ్యసృష్టి ‘ఊర్వశి’ని ఆదేశ్వరరావు ఇంగ్లీషులోకి అనువదించారు. ఇది ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ఇండియన్ హెరాల్డ్’లో ధారావాహికగా వచ్చింది. ఇవి మాత్రమేగాక బెంగాలీ కవి బుద్ధదేబ్ బసు ‘కాలసంధ్య’ గేయ నాటికను తెలుగులోకి అనువదించారు. ఇది 1968లో ఆకాశవాణి మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమైంది. 1979లో ఆదేశ్వరరావు హిందీ సాహిత్యానికి చేసిన ఎనలేని సేవలను గుర్తించి అఖిల భారతీయ హిందీ ప్రసార ప్రతిష్ఠాణ్, పాట్నా వారు ‘సాహిత్యమణి’ గౌరవ పట్టా ఇచ్చి సత్కరించారు. ఈ విధంగా ఆదేశ్వరరావు తన సాహిత్య ప్రయాణంలో అటు హిందీ సాహిత్యానికి, తద్వారా ఇటు తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేశారు.
- ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
రాజ్యసభ పూర్వ సభ్యులు, జాతీయ అధ్యక్షులు విశ్వహిందీ పరిషత్
(రేపు ఆదేశ్వరరావు వర్ధంతి)