Share News

విశ్వ దీపావళి

ABN , Publish Date - Nov 07 , 2026 | 01:17 AM

కాలానికి కొత్త అర్థాన్నిచ్చేవీ, జీవితానికి నూతన శోభ చేకూర్చేవీ పండుగలు. ఆదివారం మనం జరుపుకోనున్న దీపావళి పర్వదినం భావి కాలం, రేపటి జీవితం పట్ల మనలో నిండు ఆశాభావాన్ని నెలకొల్పే వేడుక.

విశ్వ దీపావళి

కాలానికి కొత్త అర్థాన్నిచ్చేవీ, జీవితానికి నూతన శోభ చేకూర్చేవీ పండుగలు. ఆదివారం మనం జరుపుకోనున్న దీపావళి పర్వదినం భావి కాలం, రేపటి జీవితం పట్ల మనలో నిండు ఆశాభావాన్ని నెలకొల్పే వేడుక. దీపావళి మరుసటి రోజు నుంచి తుర్కీయేలోని అంతాల్యాలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 12 రోజుల పాటు అంతర్జాతీయ వాతావరణ సదస్సు– కాప్‌ 31 జరగనున్నది.

ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో ఇంచుమించు ప్రతిరోజు మన దేశంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక స్థాయిలో ప్రాకృతిక విపత్తు సంభవించింది. ఈ వైపరీత్యాల్లో వందలాది ప్రజలూ, గొడ్డూ గోదా చనిపోవడం జరిగింది.. వేల కోట్ల రూపాయల ఆస్తినష్టం సంభవించింది. వేలాది గృహాలు కూలిపోవడంతో పేదలు మరింతగా పేదరికంలోకి, రుణగ్రస్తతలోకి జారిపోయారు. సంపన్న యూరోప్‌, అమెరికాలలో దావానలాలు, వడగాడ్పుల సంగతి అలా ఉంచితే అభివృద్ధి చెందుతున్న ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలో సంభవించిన ప్రాకృతిక విపత్తులు, నేపాల్‌ను కుదిపివేసిన హిమాలయ సునామీ, పాకిస్థాన్‌ను అల్లకల్లోలం చేసిన వరదలు గత సమీపకాలంలో ఎరుగనివి. వీటన్నిటికీ కారణం వాతావరణ మార్పు. అది పాపంలా విషమిస్తోంది, విస్తరిస్తోంది. అక్షరాలా అది మానవ పాపాల పర్యవసానమే. తన మనుగడకు ఆధారభూతమైన ధరిత్రి పర్యావరణ వ్యవస్థలను స్వార్థ ప్రయోజనాలకు విచక్షణారహితంగా విధ్వంసం చేస్తున్నందు వల్లే నేడు ఈ ప్రాకృతిక ఉత్పాతం పెచ్చరిల్లిపోతోంది.


పారిశ్రామిక విప్లవానంతరం శిలాజ ఇంధనాల వినియోగం మితి మీరిపోవడం వల్ల కార్బన్‌ డై ఆక్సైడ్‌ తదితర కాలుష్య కారక వాయువుల ఉద్గారాల వెల్లువతో భూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ ఉద్గారాలకు ప్రధాన బాధ్యత చారిత్రకంగా సంపన్న పాశ్చాత్య దేశాలదే అయినప్పటికీ నష్టపోతున్నది ఆసియా, ఆఫ్రికాదేశాలే. ధరిత్రి మనుగడకు సంభవిస్తున్న హానిని నివారించేందుకు ప్రపంచ దేశాలు సంకల్పించిన ఫలితంగానే గత మూడున్నర దశాబ్దాలుగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ వాతావరణ సదస్సు ఏటా జరుగుతోంది. రోజుల తరబడి చర్చలు, సంప్రదింపుల అనంతరం తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మానాలు అమలు కాకపోవడమే అసలు సమస్య. కాలుష్య కారక ఉద్గారాలను తగ్గించడం, శిలాజ ఇంధనాల స్థానంలో హరిత ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడం, భావితరాలకు సురక్షిత పర్యావరణాన్ని అందించడం అనేవి ఈ సదస్సుల లక్ష్యాలు. 2015లో పారిస్‌లో జరిగిన సదస్సులో భూ ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్‌కు పరిమితం చేయడం లేదా 2 డిగ్రీ సెల్సియస్‌ కంటే తక్కువగా ఉంచే విషయమై ప్రపంచ దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని అమలుపరచడంలో పేద దేశాలకు సంపన్న దేశాలు ఆర్థిక సహాయమందించాలనేది కూడా ఆ ఒడంబడికలో భాగమే. అయితే అభివృద్ధి చెందిన దేశాలేవీ తమ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తించడం లేదు. ఈ బాధ్యతారాహిత్యాన్ని తొలగించేందుకే గత సదస్సులలో తీసుకున్న నిర్ణయాలు, చేసిన వాగ్దానాలను ఆచరణలోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా తుర్కియేలో కాప్‌ 31 సదస్సు జరగనున్నది.


వాతావరణ మార్పును అరికట్టడంలో ఈ కాప్‌ సదస్సు అయినా నిర్ణయాత్మకమైన ప్రగతిశీల చరిత్రను నిర్మించగలదా? ఒక తిరుగులేని వాస్తవంగా సమస్త మానవాళి అనుభవంలోకి వస్తోన్న వాతావరణ మార్పును నివారించేందుకు, కనీసం దాని తీవ్రతను తగ్గించేందుకు సమస్త దేశాలు సమైక్యంగా కార్యాచరణకు పూనుకోవలసి ఉంది. ఈ విపత్తు ఎంత తీవ్రమైనది అయినప్పటికీ దానిని సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన వైజ్ఞానిక ప్రతిభా పాటవాలు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయనే వాస్తవాన్ని క్లైమేట్‌ సైన్స్‌లో జగదీష్‌ శుక్లా (2007లో అల్‌గోర్‌తో పాటు నోబెల్‌ శాంతి పురస్కారాన్ని పొందిన ఐక్యరాజ్యసమితి ఐపీసీసీ నివేదిక రచయితలలో ఒకరు) మౌలిక కృషే నిదర్శనం. కావాల్సిందలా నైతిక నిబద్ధత. ‘భవిష్యత్తు గతం నుంచి పుట్టదు. వర్తమానంలో మనం చేసే పనులను, భవిష్యత్తు గురించి మనకున్న ఆలోచనలే నిర్దేశిస్తాయి’ అంటూ నోబెల్‌ రసాయనశాస్త్ర పురస్కార గ్రహీత ఇల్యా ప్రిగోజిన్‌ చేసిన వ్యాఖ్యను గుర్తుచేసుకోవల్సిన అవసరమున్నది. మరి మనం మన భావితరాలకు కాలుష్యరహిత పర్యావరణ వ్యవస్థలను అందించేందుకు దృఢంగా సంకల్పించుకుంటే వాతావరణ మార్పును అరికట్టడంలో మన వ్యవహారశైలిలో చిత్తశుద్ధితో కూడిన మౌలిక మార్పు తప్పకుండా చోటుచేసుకుంటుంది. అదే జరిగితే దీపావళి పరమార్థం– భావికాలం, రేపటి జీవితం పట్ల నిండు విశ్వాసాన్ని నెలకొల్పడం– స్థానికతను అధిగమించి విశ్వజనీనమవుతుంది. అటువంటి విశ్వ దీపావళికి ఈ ఏడాది కాప్‌ సదస్సు దోహదం చేయగలదని ఆశిద్దాం.

Updated Date - Nov 07 , 2026 | 01:21 AM