Share News

దిమాగీ నక్సల్స్‌లోకి వారు వస్తే విషమం!

ABN , Publish Date - Aug 25 , 2026 | 12:34 AM

సమాంతర పరిణామాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. మన జీవితాల్లో జరుగుతున్నవి ఇంకెక్కడో అచ్చంగా అలాగే సాగుతుంటే వాటిని తెలుసుకోవాలన్న కుతూహలం పెరుగుతుంది.

దిమాగీ నక్సల్స్‌లోకి వారు వస్తే విషమం!

సమాంతర పరిణామాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. మన జీవితాల్లో జరుగుతున్నవి ఇంకెక్కడో అచ్చంగా అలాగే సాగుతుంటే వాటిని తెలుసుకోవాలన్న కుతూహలం పెరుగుతుంది. కానీ సారూప్యతలు కొన్ని సందర్భాల్లో భయానకంగానూ ఉంటాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ ‘దిమాగీ నక్సల్స్‌’ అనే పదాన్ని వాడి పెద్ద చర్చకు దారితీశారు. నక్సలైట్ల భావజాలంతో ప్రేరేపితులైన కొందరు ఆలోచనాపరులు దేశంలో అనేక రంగాల్లో పాతుకుపోయారనీ, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసే స్థాయికి వారు ఎదిగారనీ విమర్శించారు. భౌతికంగా నక్సలైట్లను తుదముట్టించామనీ ఇప్పుడు దిమాగీ నక్సల్స్‌ను ఏకాకులను చేయాలనీ పిలుపునిచ్చారు. భారత్‌లో దిమాగీ నక్సల్స్‌ కిందకు ఎవరు వస్తారన్నది ప్రధాని స్పష్టంచేయలేదు. రాజకీయ ఉపన్యాసాల్లో వ్యక్తులనూ, బృందాలనూ ఫలానా వాళ్లుగా ముద్రవేయటమే ప్రధానంగా ఉంటుంది. అందుకే వాళ్ల గురించి కచ్చితమైన నిర్వచనాలు అప్పటికప్పుడు ఉండవు. తమను ఉద్దేశించే మోదీ దిమాగీ నక్సల్స్‌ అనే పదాన్ని వాడారని భావించిన కాంగ్రెస్‌ నేతలు ఎదురుదాడికి దిగారు. కొందరైతే తాము దిమాగీ నక్సల్స్‌మేనంటూ ప్రకటనలు కూడా చేశారు. ప్రతిపక్షాలను దిమాగీ నక్సలైట్లుగా ముద్రవేయటం ప్రధాని మోదీ అభిమతం కాదనీ భారత రాజ్యాంగాన్ని అంగీకరించకుండా హింస ద్వారా ప్రభుత్వాన్ని కూల్చుదామనుకునే వాళ్లను ఉద్దేశించి మాత్రమే దాన్ని ఆయన అన్నారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు వివరణ ఇచ్చారు.


నిజంగానే హింసతో ప్రభుత్వాన్ని కూల్చాలనుకునే వారికి మద్దతు ఇచ్చే మేధావులకే దిమాగీ నక్సల్స్‌ ముద్రను పరిమితం చేస్తే అదొక తీరుగా ఉంటుంది. కానీ మేధోరంగంలో అలాంటి వ్యక్తులు ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నారు. వాళ్లు ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసే స్థాయిలో లేరు. ప్రజలను ఉర్రూతలూగించే స్థాయిలో వాళ్ల ఆలోచనలు ఇప్పుడు లేవు. దిమాగీ నక్సల్స్‌ జాబితాలోకి ప్రభుత్వ విధానాలూ, సిద్ధాంతాలపై అసమ్మతి తెలిపే వారందరూ వస్తే పరిస్థితులు వేరే విధంగా మారతాయి. భిన్న భావవ్యక్తీకరణకే అప్పుడు ప్రమాదం ముంచుకొస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతోన్న పరిణామాలను చూస్తే ఆ ప్రమాదాన్ని తేలికగా తోసిపుచ్చలేం. మనకు ఎంతో దగ్గరైన ప్రజాస్వామ్య దేశాల్లో అమెరికాతో పాటు, ఇటలీ, ఇజ్రాయెల్‌లు కూడా అగ్రభాగాన ఉన్నాయి. అక్కడి ప్రభుత్వాధినేతలూ, పాలక పార్టీల నాయకులూ రాజ్యాంగానికి లోబడి వ్యవహరించే మేధావులపై, విద్యావేత్తలపై, సాహిత్యకారులపై గురిపెట్టి మరీ ఎదురుదాడులు చేస్తున్నారు. ఆ మూడు దేశాల్లో ఉదారవాద ప్రజాస్వామ్యం, బహుళ సంస్కృతి వాదం, సామాజిక–ఆర్థిక న్యాయంపై పట్టుదలతో వ్యవహరించే మేధావులను జాతి వ్యతిరేకులుగా చిత్రీకరించటం ఎక్కువైంది. వాళ్లందరినీ వామపక్షవాదులుగా, దేశ సంస్కృతిని విచ్ఛిన్నం చేసేవారుగా ముద్రవేసి విమర్శలు గుప్పించటం సాధారణమైపోతోంది. అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ధోరణి బాగా పెరిగింది. వ్యక్తి స్వేచ్ఛకూ భావవ్యక్తీకరణకూ తిరుగులేదనుకునే దేశంలో సాక్షాత్తూ అధ్యక్షుడే ఎదురుదాడి ఆరంభించటం ఇతర దేశాల్లోని నాయకులకూ ప్రేరణగానే ఉంటుంది. భారత్‌లో కూడా వివిధ రూపాల్లో హిందూత్వ రాజకీయాలను వ్యతిరేకించే మేధావులపై విమర్శలూ, ఆరోపణలూ ఇటీవలకాలంలో బాగా ప్రబలం అవుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని పరిస్థితిని మదింపువేస్తే అమెరికా, ఇటలీ, ఇజ్రాయెల్‌లో జరిగే పరిణామాలకూ ఇక్కడి వాటికీ సారూప్యత స్పష్టంగానే కనపడుతుంది. అమెరికా సమాజం మరింత మానవత్వంగా ఉండాలనీ, సంపదలో అసమానత్వాన్ని తగ్గించాలనీ, పర్యావరణాన్ని పరిరక్షించాలనీ, రక్షణ ఖర్చులకు కోతపెట్టాలనీ కోరుకునే మేధావులను ట్రంప్‌ ఎన్నో సందర్భాల్లో రాడికల్‌ లెఫ్ట్‌, అల్ట్రాలెఫ్ట్‌ అనీ, మార్క్సిస్టులూ, ఫాసిస్టులూ అని ముద్రలు వేసి విమర్శించారు. ‘‘మన దేశంలో చీడపురుగుల్లా ఉన్న కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు, ఫాసిస్టులు, రాడికల్‌ లెఫ్ట్‌ దుండగులను మనం నిర్మూలిస్తాం’’ అంటూ ఎన్నోచోట్ల విరుచుకుపడ్డారు. మేధావులకూ, ప్రగతిశీల విద్యార్థులకూ నిలయాలైన విశ్వవిద్యాలయాలపై ఒక దశలో బహుముఖ యుద్ధమే మొదలుపెట్టారు. వెనుకబడిన జాతులకూ, వివిధ సంస్కృతుల వారికీ, మహిళలకూ తగు ప్రాధాన్యం ఇవ్వాలనే విధానాలకు వర్సిటీలు స్వస్తిచెప్పాలని డిమాండు చేశారు. ఆ విధానాలన్నీ ప్రతిభను దెబ్బతీస్తాయన్నదే ఆయన వాదన. ట్రంప్‌ ఉద్దేశంలో రిజర్వేషన్ల లాంటివి ఏవీ ఉండకూడదు. తన మాటవినటం లేదని హార్వర్డ్‌ యూనివర్సిటీకి నిధులనే ఆపేశారు. మూర్ఖులనూ అవివేకులనూ ఆ వర్సిటీ తయారుచేస్తోందని దుయ్యబట్టారు.


ముఖ్యంగా ట్రంప్‌, ఆయన మద్దతుదారులు రెండు పదాలపై (వోక్‌–Woke, డీఈఐ–DEI) విమర్శలను కేంద్రీకరించారు. వోక్‌ అంటే సామాజిక అన్యాయాల గురించి అప్రమత్తంగా ఉండటం. జాతి, లింగ వివక్షతలూ, సామాజిక అసమానతలూ, అల్పసంఖ్యాకవర్గాల హక్కుల పరిరక్షణతో పాటు ఇతర వ్యవస్థీకృత అన్యాయాల పట్ల అవగాహనతో ఉండి వాటిని తొలగించాలని కోరుకునే వాళ్లను వోక్‌ వ్యక్తులంటూ వ్యంగ్యంగా విమర్శించటం పరిపాటైంది. ఇక డీఈఐలో మొదటి అక్షరం డీ అంటే వైవిధ్యానికి (డైవర్సిటీ) ప్రాధాన్యం ఇవ్వటం. అంటే పదవుల్లో, విద్యాలయాల్లో, ఉద్యోగుల్లో వివిధ జాతులు, వివిధ సామాజిక నేపథ్యాలు కలిగిన వారికి తగు ప్రాతినిధ్యం ఉండేలా చూడటం. ఈ అంటే ఈక్విటీ. సమాన అవకాశాలు ఉండేలా కొన్ని ఏర్పాట్లు చేయటం, ప్రోత్సాహాలు ఇవ్వటం. ఐ అంటే ఇన్‌క్లూజన్‌. సంస్థల్లో వివిధ వర్గాల వారిని గౌరవప్రదంగా భాగస్వాములను చేయటం. నిజానికి ఇవేమీ అమెరికా సమాజాన్ని తలకిందులు చేసే విప్లవాత్మకమైన డిమాండ్లు కావు. వీటిని అమలుపరిస్తే అమెరికా సమాజం సోషలిజంలోకి వెళ్లిపోదు. మతం నాశనమైపోదు. క్రైస్తవమత సంస్కృతికి విఘాతం కలగదు. కానీ వీటిపై ఆలోచించటానికీ కనీసం సానుభూతితో పరిశీలించటానికీ కూడా ట్రంప్‌ లాంటి వారు సిద్ధంగా లేరు. సామాజిక న్యాయం కోరుకునే వాళ్లందరినీ ప్రస్తుతం అల్ట్రాలెఫ్ట్‌ వాదులుగానే చూస్తున్నారు. వాళ్ల వల్ల అమెరికా సమాజం మనుగడకే ముప్పు వస్తుందనీ ప్రచారం చేస్తున్నారు. కొన్ని యూరపు దేశాల్లో మాదిరిగా లెఫ్ట్‌ పార్టీలు అమెరికాలో ఎప్పుడూ బలంగా లేవు. లెఫ్ట్‌ మేధావుల సంఖ్య కూడా ఎక్కువ కాదు. కానీ మతం చుట్టూ, జాత్యహంకారం చుట్టూ, వలసజీవులపై విద్వేషం చుట్టూ రాజకీయాలను నడిపేవాళ్లు.. ప్రజాస్వామ్యంలో సాధారణంగా వచ్చే డిమాండ్లను సైతం ఉపేక్షించలేరనటానికి అమెరికాలోని పరిణామాలే నిదర్శనం.


ఇటలీ ప్రధాని మెలోనీ వ్యాఖ్యలు కొన్ని విషయాల్లో ట్రంప్‌కంటే భిన్నంగా ఉండవు. ‘నేను శత్రువులుగా భావించే వాళ్లలో వామపక్షాలవారే మొదట ఉంటారు’ అని ఆమె నిర్మొహమాటంగా చెప్పారు. ‘వోక్‌’ కల్చర్‌ అనేది మన దేశాలను (క్రైస్తవ) విడదీస్తుంది. మన చరిత్రను పునర్‌ నిర్వచిస్తుంది. మన ఉమ్మడి సంప్రదాయాలను నాశనం చేస్తుంది’ అని ఘాటుగా విమర్శించారు. సామాజిక అన్యాయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పే ‘వోక్‌’ కల్చర్‌ నిజంగానే గత చరిత్రను పునర్‌ నిర్వచిస్తుంది. చరిత్రను సామాజిక అన్యాయాలు, సామాజిక వివక్ష దృష్టితోనే చూస్తుంది. రాజులు, ప్రభువుల ఘనకార్యాలకే పెద్దపీట వేయదు. యుగయుగాల్లో జరిగిన అన్యాయాలనూ, దురాగతాలనూ బాధితుల కోణం నుంచి పరామర్శిస్తుంది. వాటిని బలంగా వెలుగులోకి తీసుకొస్తుంది. ఇలా తవ్వితీసిన చరిత్ర ఆసరాతో గత అన్యాయాలను మళ్లీ జరగకుండా మనుషులను మేల్కొలుపుతుంది. కానీ సంకుచిత జాతీయవాదులు చరిత్రలో అన్యాయాల వైపు చూడరు. జాతి చరిత్ర అంతా మనం గొప్పలు చెప్పుకొనే విధంగానే ఉండాలని కోరుకుంటారు. తప్పొప్పులపై శీతకన్ను వేస్తారు. దోపిడీలూ, దురాక్రమణలూ చరిత్రలో లేనట్లుగానే మాట్లాడతారు. వోక్‌ దృష్టితో సమాజాన్ని చూసేవాళ్లే.. ఇటలీలోని యూనివర్సిటీలు, మ్యూజియంలు, థియేటర్లు, ఒపెరా సంస్థల్లో పాతుకుపోయారని భావించిన మెలోనీ వాళ్లను తొలగించటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పాఠ్యాంశాలను తిరగరాసి ఇటలీలో తాము గొప్పవాళ్లు అనుకునే వారికే పెద్దపీట వేయాలని చూస్తున్నారు. యూరపులో భావ విప్లవానికి కారణమైన అనేక మంది మేధావుల చరిత్రలను పాఠాల నుంచి తొలగిస్తున్నారు. మతమౌఢ్యం కంటే అధికంగా, మూర్ఖంగా జాతీయవాదాన్ని జపించే చోట ఇతర దేశాల ఘనతలనూ విజయాలనూ ఏ మాత్రం అంగీకరించే ప్రసక్తి ఉండదు.


ఇజ్రాయెల్‌లో పరిణామాలు కూడా ఏమీ భిన్నంగా లేవు. ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలను ప్రశ్నించే వారందరినీ జాతి విద్రోహులుగా ముద్రవేయటం నెతన్యాహు పాలనలో బాగా ఎక్కువైంది. పాలస్తీనా సమస్యపై మానవత్వ ధోరణితో మాట్లాడే అవకాశం క్రమేపీ అక్కడ సన్నగిల్లిపోతోంది. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు అధికారాలను సైతం తగ్గించివేస్తున్నారు. ఇజ్రాయెల్‌లో 20శాతంగా ఉన్న అరబ్బుల స్థితిగతులపై నిష్పక్షపాతంగా చర్చలు జరిగే పరిస్థితి లేదు. వాళ్లకు ఉండాల్సిన సమాన హక్కుల గురించి ఎక్కడా చర్చలు జరగవు. ఇక పాలస్తీనాను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయటమే సమస్యకు పరిష్కారం అనే ధోరణిలో మేధావులు ఎవరు మాట్లాడినా హేళనలనూ, తిట్లనూ భరించాల్సిందే.

దిమాగీ నక్సల్స్‌ అంటే ఫలానా వాళ్లు మాత్రమేనని మంత్రి రిజిజు వివరణ ఇచ్చినా వివాదం తొలగిపోవటం లేదు. ప్రజాస్వామ్యాన్ని ఒక విధానంగా అంగీకరించి, సామాజిక– ఆర్థిక న్యాయాన్ని కోరే వారందరినీ రాడికల్‌, అల్ట్రాలెఫ్ట్‌ పరిధిలోకి తీసుకువచ్చి.. అమెరికా, ఇటలీ, ఇజ్రాయెల్‌లో లాగా విమర్శలు, ఆరోపణలు ఎక్కుపెడితే ఇక్కడి పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుంది. ప్రజాస్వామ్య తిరోగమనానికే అది దారితీస్తుంది. విదేశాంగ విధాన అవసరాల కోసం అమెరికా, ఇజ్రాయెల్‌, ఇటలీతో సన్నిహితంగా మెలగొచ్చు. కానీ అంతర్గత విధానాల్లో దూకుడుగా సమాంతర ప్రయాణం మొదలుపెడితే అవాంఛనీయ వైపరీత్యాలకే దోహదం చేస్తుంది. ఇప్పటికే ఆ పోకడలు కొన్ని రంగాల్లో ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. అసమ్మతికి చోటు ఇవ్వటం అనేది భారత సంస్కృతీ పరంపరలో చాలా కీలకం. అనేక భాషలకు, సంస్కృతులకు నిలయమైన భారత్‌ది ఎప్పుడూ విలక్షణమైన ప్రయాణమే. దాన్ని వదులుకుంటే పైమెరుగులతో కూడిన ప్రజాస్వామ్యం మిగలొచ్చు. కానీ సారంలో, స్ఫూర్తిలో మాత్రం అది సన్నగిల్లిపోతుంది. అప్పుడు ప్రజాస్వామ్యానికే దిమాగ్‌ పోతుంది!

(ఆంధ్రజ్యోతి ఎడిటర్‌)

Updated Date - Aug 25 , 2026 | 12:35 AM