భారతీయ తాత్త్విక జ్ఞానసింధువు
ABN , Publish Date - Oct 09 , 2026 | 01:57 AM
తత్వశాస్త్రాన్ని జీవితానుభవాల్లోంచి ఔపోసన పట్టిన అరుదైన ప్రవక్త ధర్మానంద కోశాంబి. తొలి నాగరిక నవ బౌద్ధ భిక్షువు. బహుభాషావేత్త, జైన దార్శనికుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, అచంచల గాంధేయవాది...
తత్వశాస్త్రాన్ని జీవితానుభవాల్లోంచి ఔపోసన పట్టిన అరుదైన ప్రవక్త ధర్మానంద కోశాంబి. తొలి నాగరిక నవ బౌద్ధ భిక్షువు. బహుభాషావేత్త, జైన దార్శనికుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, అచంచల గాంధేయవాది... ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో. భారతీయ తాత్త్విక స్రవంతికి తిరుగులేని దిక్సూచిగా జీవితాంతం వెలిగిన అవిశ్రాంత సత్యాన్వేషి ధర్మానంద కోశాంబి.
పోర్చుగీసు పాలిత గోవాలోని సంకోలే అనే గ్రామంలో అక్టోబర్ 9, 1876న ధర్మానంద కోశాంబి జన్మించారు. పదహారేళ్లకే ఆయనకు వివాహమైంది. సంస్కృతం చదువుకోవడానికని ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. పూణె, ఇండోర్, గ్వాలియర్, ఉజ్జయిని, ప్రయాగ ప్రాంతాలు తిరిగారు. కాశీలో కొన్నేళ్లు ఉండి సంస్కృతం అభ్యసించారు. తర్వాత నేపాల్, శ్రీలంక, బర్మా దేశాలకు వెళ్లి పాళీ భాష నేర్చుకున్నారు. అప్పుడే బౌద్ధం స్వీకరించారు. కలకత్తా విశ్వవిద్యాలయం మొదలుకుని, బరోడా సంస్థానం వరకూ ఎన్నో ఉద్యోగాలు చేశారు. పూణెలోని ఫెర్గూసన్ కళాశాలలో పనిచేస్తున్నప్పుడు డాక్టర్ జేమ్స్‌వుడ్స్ ఆహ్వానం మేరకు హార్వర్డ్ యూనివర్సిటీలో రెండేళ్లు ఆచార్యుడిగా ఉన్నారు. ఆ సమయంలోనే తన సహ ఆచార్యుడి వద్ద రష్యన్ భాషను నేర్చుకున్నారు కోశాంబి. తర్వాత రెండేళ్లు సోవియట్ యూనియన్‌లోని లెనిన్ గ్రాడ్ యూనివర్సిటీలో పాళీ భాషా సాహిత్యాలను బోధించారు. ఆ కాలంలోనే మార్క్సిజాన్ని కూడా లోతుగా అధ్యయనం చేశారు.
తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. గుజరాత్ విద్యాపీఠంలో ఆచార్యుడిగా పనిచేశారు. ఎందరో విద్యార్థులను స్వాతంత్ర్యోద్యమం వైపు నడిపించారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు గాను ఆరేళ్ల పాటు జైలుశిక్ష అనుభవించి, చిత్రహింసలకు గురై అనారోగ్యం పాలయ్యారు. జైలులో ఉన్నప్పుడే అనేక జైన మత గ్రంథాలను కూడా అనువదించారు. బౌద్ధ కార్యకర్తల కోసం బొంబాయిలో మొదటిసారిగా ‘బహుజన విహార’ను స్థాపించారు. ఇది ఇప్పటికీ ఉంది.
ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మానంద కోశాంబి భార్య బాలబాయి గంగూబాయి ఆయనకు తోడుగా నిలిచారు. వారి కుమార్తె మాణిక్ కోశాంబి 1922లో రాడ్‌క్లిఫ్ కళాశాల నుంచి పట్టభద్రురాలైన మొదటి దక్షిణాసియా మహిళ. కుమారుడు డి.డి.కోశాంబి ప్రఖ్యాత మార్క్సిస్టు మేధావి, చరిత్రకారుడు, గణిత శాస్త్రజ్ఞుడు. తర్వాతి కాలంలో దేశంలో ఆలోచనాపరులుగా, భావోద్యమకారులుగా పేరొందిన బుద్ధిజీవులు ఎందరో ధర్మానంద కోశాంబి జీవితం నుంచి స్ఫూర్తి పొందినవారే.
మహాత్మాగాంధీ స్థాపించిన సేవాగ్రామ్ ఆశ్రమంలో చాలా కాలం ఉన్న ధర్మానంద కోశాంబి, 70 ఏళ్ల వయసులో జైనమతంలోని ‘సల్లేఖన’ పద్ధతి ద్వారా స్వచ్ఛంద ఉపవాస దీక్ష పాటిస్తూ జూన్ 4, 1947న మరణించారు. కొంకణ్ ప్రాంతపు హిందువుగా పుట్టి, విశ్వజనీన బౌద్ధుడిగా మారి, జైనుడిగా ప్రాణం విడిచిన అసాధారణ భారతీయ తత్త్వవేత్త ధర్మానంద దామోదర కోశాంబి. అందుకే, ఆయన జీవితం ఆదర్శదాయకం.
జీవితాంతం క్షేత్రస్థాయి సాహిత్యకారుడిగానే మసలిన ధర్మానంద కోశాంబి, అనేక బౌద్ధ, జైన గ్రంథాలు రచించారు. బుద్ధుని జీవితం గురించి ఆయన మరాఠీలో సాధికారికంగా రాసిన ‘భగవాన్ బుద్ధ’ పుస్తకం అనేక భాషల్లోకి అనువాదమైంది. ‘బోధిసత్వ’ అనే నాటకం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇవే కాకుండా, ‘నివేదన’ పేరిట ధర్మానంద కోశాంబి అద్భుతంగా రాసిన స్వీయచరిత్ర కూడా తెలుగు సహా ఎన్నో భారతీయ భాషల్లోకి అనువాదమై ప్రచురితమైంది.
‘నిబద్ధతగల కర్మయోగి’ ధర్మానంద కోశాంబి అని మహాత్మాగాంధీ కీర్తించారు. డా. బి.ఆర్అంబేడ్కర్, పండిత్ రాహుల్ సాంకృత్యాయన్ వంటి మహామహులకు మార్గదర్శిగా నిలిచిన బహుముఖ ప్రజ్ఞాశాలి కోశాంబి. ప్రజా రచయితగా, భాషావేత్తగా, భావోద్యమకారుడిగా, నవబౌద్ధుడిగా, స్వాతంత్ర్యోద్యమశీలిగా, నిత్య సంచారిగా, అన్నిటికీ మించి మహా మానవతావాదిగా చివరివరకూ జీవించిన జ్ఞాన కృషీవలుడు. కోశాంబి మార్గంలో నడవడమే ఆయనకు ఇవ్వదగ్గ సార్థక నివాళి.
- గౌరవ్
(నేడు ధర్మానంద కోశాంబి 150వ జయంతి)