సమైక్యతా మార్గంలోనే వికసిత భారత్
ABN , Publish Date - Jun 30 , 2026 | 12:36 AM
భారతదేశం అంతటి గొప్ప దేశం మరొకటి ఉండదు. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలు, యాసలు, ఆచారాలతో ఎంతో విభిన్నమైన మనుషులను ఏకతాటిపైకి తెచ్చింది మన దేశం.
‘భారతదేశం అంతటి గొప్ప దేశం మరొకటి ఉండదు. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలు, యాసలు, ఆచారాలతో ఎంతో విభిన్నమైన మనుషులను ఏకతాటిపైకి తెచ్చింది మన దేశం. భిన్నత్వంలో ఏకత్వం అనే గొప్ప భావనకు మించింది ఏముంటుంది?’ – ఇవి జూన్ 15న ఢిల్లీలో ‘జాతీయ సమైక్యత కోసం... సేన ప్రస్థానం’ సమావేశం నిర్వహించిన జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌గారు చేసిన వ్యాఖ్యలు. ‘‘నేను ప్రతీసారీ ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం అని ఎందుకు అంటానంటే మన మొదటి ప్రాధాన్యం దేశం అవ్వాలి. తర్వాతే ప్రాంతం. అయితే కొన్ని దశాబ్దాలుగా ఈ స్ఫూర్తి మెల్లగా తగ్గుతోంది. ఇది చాలా ప్రమాదకరం’’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మతతత్వం, ప్రాంతీయతత్వం, కులతత్వం, భాషా దురభిమానం పెరిగిపోతున్న నేటి రోజుల్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక ఆవేదనను అర్థం చేసుకోవచ్చు.
నిజానికి ఇన్ని విభిన్న కులాలు, మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు ఉన్న దేశం ప్రపంచంలో మరొకటి లేదు. ఇన్ని వైవిధ్యాలు ఉన్నా కూడా ఒక దేశంగా మనం ఉన్నామంటే కారణం మనలోని భిన్నత్వంలోని ఏకత్వ స్ఫూర్తే! భారతదేశం అంటే కేవలం భూభాగం కాదు, అది 140 కోట్ల ప్రజల గుండె చప్పుడు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి నాగాలాండ్ వరకు- భిన్నత్వమే మన బలం. స్వాతంత్య్రం వచ్చే నాటికి భారత్‌లో 565 సంస్థానాలు ఉండేవి. ఇవి ప్రత్యేక దేశాలుగా మారితే భారత్ ముక్కలవుతుందని గ్రహించిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ రెండేళ్లలో అన్నింటినీ భారత్‌లో విలీనమయ్యేలా కృషి చేశారు. అందుకనే ఆయన్ను భారత సమైక్యతా శిల్పి అని గౌరవించుకుంటాం. జాతీయ సమగ్రత పట్ల, సుపరిపాలన పట్ల, ప్రజాసేవ పట్ల ఆయన అచంచల నిబద్ధత భావి తరాల వారికి స్ఫూర్తిదాయకం. భారత రాజ్యాంగం జాతీయ సమైక్యతకు ప్రాధాన్యమిచ్చి భారతదేశాన్ని ఒక సర్వసత్తాక, సామ్యవాదం, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. అయితే ఈ మధ్య కాలంలో ‘భారతదేశం నా మాతృ భూమి, భారతీయులందరూ నా సహోదరులు’ అన్న ప్రతిజ్ఞ నోటిమాటగానే మిగిలిపోతున్నది. భారతావనికి మూలమైన భిన్నత్వంలో ఏకత్వ భావన బీటలు వారుతుంది. భాష, యాస, ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత విశ్వాసాలు, ప్రాంతాల ఆధారంగా తోటి భారతీయులను చిన్నచూపు చూస్తూ అపహాస్యం చేసే వికృత ధోరణి పెరిగిపోతుంది. జాతీయ సమైక్యత, సమగ్రతలను అవి ప్రమాదంలో పడేస్తున్నాయి.
కులాభిమానం పేరుతో ఇతర కులాలను తక్కువ చేసి మాట్లాడడం, మతాన్ని రాజకీయంగా వాడుకోవడం, ప్రాంతీయాభిమానం ముసుగులో ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిలించడం, ఒక భాషపైన, యాస పైన అతి ప్రేమ, అభిమానం చూపిస్తూ ఇతర భాషల్ని తక్కువగా చేసి మాట్లాడడం నేడు చూస్తున్నాం. వసుధైక కుటుంబంగా ఉండాల్సిన మన దేశంలో... దేశాన్ని బలహీనపరిచే ‘‘మా రాష్ట్రం, మా ప్రజలు, మా భాష, మా నీళ్లు’’ అనే సంకుచితత్వాన్ని కొందరు నాయకులే పెంచి పోషిస్తున్నారు. ఈ అతి తత్వాలు దేశ సమగ్రతకు ముప్పుగా మారుతున్నాయి. మరోవైపు దేశాన్ని అస్థిరపరిచడమే ఏకైక లక్ష్యంగా పనిచేసే ‘సీమాంతర ఉగ్రవాదం’ మన జాతీయ సమగ్రతకు పెను సవాలుగా మారుతోంది. కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వప్రయోజనాల సాధన కోసం నేరస్తులతో సంబంధాలను కొనసాగిస్తూ, దేశ సమగ్రతకు విఘాతం కలిగిస్తున్నారు. ఈ విషయాన్ని వోహ్రా కమిషన్ ఆధారాలతో సహా రుజువు చేసింది.
విభజన వాదులతో జాతి సమైక్యతకు వాటిల్లిన ముప్పు నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత నేటి యువత పైనే ఉంది. సమాజంలో మార్పు కోరుకుంటే రాదు- ప్రయత్నిస్తేనే వస్తుందని యువత తెలుసుకోవాలి. ‘‘మా సమస్యకి వేరెవరో కారణం, ఎవరో నష్టపోతేనే మేము ప్రయోజనం పొందగలము’’ అనే ధోరణి అనాగరిక ప్రజాస్వామ్య సంస్కృతే తప్ప, ఆధునిక ప్రజాస్వామ్యం అనిపించుకోదని గ్రహించాలి. ఇక్కడ ‘‘నేను తెలుగువాడిని’’, ‘‘నేను తెలంగాణవాడిని’’ అనే భావన కంటే ‘‘నేను భారతీయుడిని’’ అనే భావన గొప్పది కావాలి. వేరే ప్రాంతం వారనో, వేరే భాష మాట్లాడుతున్నారనో, చూడడానికి భిన్నంగా కనిపిస్తున్నారనో సాటి భారతీయుల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తే- భారత జాతీయతను అవమానించినట్లే!
విపరీతమైన ప్రాంతీయతత్వం దేశ సమైక్యతకు భంగం కలిగిస్తుంది. భారత్‌ను తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి బ్రిటిష్‌వారు ‘విభజించు, పాలించు’ సూత్రానికి అనుగుణంగా ప్రాంతీయతత్వాన్ని ప్రోత్సహించడమే భారత్ – పాకిస్థాన్ విడిపోవడానికి దారితీసింది. మరోసారి అటువంటి పరిస్థితులు తలెత్తకుండా యువత అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రాల సమాహారమైన మన దేశంలో ఎక్కడివారైనా, ఎక్కడికైనా వెళ్లి, స్థిరపడి, శాంతియుతంగా పనిచేసుకోవచ్చని రాజ్యాంగం స్పష్టం చేసింది. రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి ఉండడం భారతీయులందరి కర్తవ్యం.
ఏ దేశానికైనా బలం ఆ దేశ ఐక్యతే! ఏ దేశాభివృద్ధి అయినా అక్కడి ప్రజల ఐక్యతతోనే సాధ్యమవుతుంది. జాతీయ సమగ్రత అనేది వివిధ రకాల పువ్వులతో కట్టిన దండ లాంటిది. ప్రతి పువ్వు రంగు, వాసన వేరు. కానీ దారం ఒక్కటే. ఆ దారం తెగితే దండ విడిపోతుంది. ఆ దారమే ‘‘భారతీయత’’.
- కూసంపూడి శ్రీనివాస్
జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి