ఈ భారతీయులూ ‘లెక్క’లోకి వచ్చేనా?
ABN , Publish Date - Apr 02 , 2026 | 05:24 AM
వ్యవస్థాగత వివక్షలకు అతి దారుణంగా లోనవుతున్న వారు డీనోటిఫైడ్ ట్రైబ్స్ (విముక్త జాతులు– డీఎన్‌టీ), నొమాడిక్ ట్రైబ్స్ (సంచార తెగలు–ఎన్‌టీ), సెమీ నొమాడిక్ కమ్యూనిటీస్...
వ్యవస్థాగత వివక్షలకు అతి దారుణంగా లోనవుతున్న వారు డీనోటిఫైడ్ ట్రైబ్స్ (విముక్త జాతులు– డీఎన్‌టీ), నొమాడిక్ ట్రైబ్స్ (సంచార తెగలు–ఎన్‌టీ), సెమీ నొమాడిక్ కమ్యూనిటీస్ (అర్ధ సంచార సామాజికులు – ఎస్‌ఎన్‌టీ) అనడంలో సందేహం లేదు. మరి, స్వతంత్ర భారతదేశ ప్రప్రథమ పూర్తిస్థాయి ‘కుల గణన’ ఈ వర్గాల వారికి న్యాయం చేస్తుందా? ఇంతవరకు అలాంటి ఆశావహ సంకేతాలు ఏవీ కానరావడం లేదు. 17 సంవత్సరాల జాప్యంతో జనాభాగణన–2027ను నిర్వహిస్తున్న భారత రిజిస్ట్రార్ జనరల్ డీఎన్‌టీ/ఎన్‌టీలను ‘కుల గణన’లో భాగం చేసే విషయమై పెదవి విప్పడం లేదు. ఆ దురదృష్టకర భారతీయులను ‘కుల గణన’లో భాగం చేస్తారా అనే ప్రశ్నకు సూటిగా సమాధానమిచ్చేందుకు ప్రభుత్వం నిరాకరిస్తోంది. తమను కులగణనలో చేర్చేలా ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు చివరి ప్రయత్నంగా ఆ సామాజికుల ప్రతినిధులు దాఖలు చేసిన ఒక పిటిషన్‌ను దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. కులగణనలో డీఎన్‌టీ/ఎన్‌టీలను చేర్చే విషయమై భారత రాజ్య వ్యవస్థ చూపుతున్న సౌమ్య వ్యతిరేకత బ్రిటిష్ వలసపాలకులు ఆ వర్గాల పట్ల అనుసరించిన క్రూర విధానాలను కొనసాగించడమేనని నిష్కర్షగా చెప్పక తప్పదు. విముక్త జాతులు, సంచార తెగలకు జరిగిన చారిత్రక అన్యాయం అంతా ఇంతాకాదు. ఆ అన్యాయం ఇప్పటికీ దాదాపుగా అదే రీతిలో కొనసాగుతోందనేది ఒక కఠోర వాస్తవం. ఆ చారిత్రక అన్యాయాన్ని రూపుమాపి, ఆ వర్గాలకు న్యాయం చేసేందుకు సంపూర్ణ కులగణనతో కూడిన జనాభా గణన–2027 ఒక చరిత్రాత్మక అవకాశం కల్పిస్తోంది. మరి ఈ అపూర్వ అవకాశాన్ని సద్వినియోగం చేయకపోవడమంటే భారత రాజ్య వ్యవస్థ ఒక విధ్యుక్త ధర్మనిర్వహణలో తనకుతానుగా విఫలమయినట్టే, సందేహం లేదు.
భారతీయ సమాజంలో పూర్తిగా అట్టడుగు వర్గాలైన డీఎన్‌టీ/ఎన్‌టీల ఉనికి గురించి అత్యధికులకు తెలియనే తెలియదనడం ఎంతమాత్రం సత్యదూరం కాదు. విద్యావంతులైన భారతీయులు దళితుల ఉనికిని గుర్తిస్తారు. గుర్తించక తప్పని పరిస్థితులు ఉన్నాయనేది ఎవరూ కాదనలేని ఒక వాస్తవం. ‘గిరిజనుడు’ అంటే అడవుల్లో నివసించేవాడనే భావన చాలామందిలో పాదుకుపోయి ఉన్నది. అయితే విముక్త జాతులు (డీనోటిఫైడ్ ట్రైబ్స్) అన్నా సంచార తెగలు, అర్ధ సంచార తెగల వారి విషయమై అత్యధిక భారతీయులకు ప్రాథమిక అవగాహన సైతం లేదని చెప్పక తప్పదు. మన సామాజిక విశ్వంలో బెనర్జీలు, గౌడలు, గోగోయిలు, అయ్యర్లు, అయ్యంగార్‌లు, ఝాలు, మీనన్‌లు, మిశ్రాలు, పట్నాయక్‌లు, రావులు, సింగ్‌లు, తివారీలు లేదా యాదవ్‌లతో నిండిపోయి ఉన్నది. అందులో బెహ్రూపియా, బిర్హొర్, ఫకీర్, గడియా లోహర్లు, జోగీలు, కల్బేలియాలు, కొల్హాటీలు, లంబాడాలు, బంజారాలు, మాల్దారీలు, పెర్నాలు, సాంసీలు, సపేరాలు, గుజ్జర్లు, ఎరుకలు మొదలైనవారికి తావు లేనేలేదు. వారి అస్తిత్వం మన కళ్లకు ఆనదు. అసలు అటువంటివారు మన ధరిత్రిపై నడయాడుతున్నారన్న వాస్తవాన్ని గుర్తించనే గుర్తించం కదా.
పశ్చిమ బెంగాల్‌లోని డీనోటిఫైడ్ ఖేరియా సబర్, లోధా తెగలపై జరుగుతున్న క్రూర, వ్యవస్థీకృత వేధింపులపై రచయిత్రి మహాశ్వేతాదేవి 2007లో రాసిన ఒక వ్యాసం శీర్షిక ‘Hated, Humiliated, Butchered’ వర్తమాన భారతదేశంలోని డీఎన్‌టీ/ఎన్‌టీ సామాజికుల దుస్థితికి అద్దం పడుతోంది. పేదలు, దళితులు, ఎల్‌జీబీటీక్యూలు ఎదుర్కొంటున్న అవస్థలు, అన్యాయాలు అన్నిటికీ లోనవుతున్న ఒకే ఒక్క సామాజికవర్గం ఏదైనా ఉంటే అది డీఎన్‌టీ/ఎన్‌టీలే అనడం అసత్యమేమీ కాదు. పేద ప్రజలకు మాదిరిగానే వారికి విద్యా సదుపాయాలు అందుబాటులో లేవు, ఉపాధి అవకాశాలు మృగ్యం, జీవిత హుందాకు అవసరమైన ప్రాథమిక వసతులు వారికి గగన కుసుమాలే. దళితుల వలే వారు కూడా నానా వివక్షలను, అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నారు. ఆదివాసీల మాదిరిగానే ప్రధాన స్రవంతి నుంచి వారూ వెలివేతకు గురయ్యారు. ఎల్‌జీబీటీక్యూ వ్యక్తుల మాదిరిగానే వారూ కళంకితులు. తరతరాలనాటి కళంకాలు వారిని ఎంతకూ వీడడం లేదు. మరింత స్పష్టంగా చెప్పాలంటే అమెరికాకు అక్కడి ఆదిమవాసులు ఎలాంటివారో వర్తమాన భారతదేశానికి విముక్త జాతులు, సంచార తెగలవారు అలాంటివారు.
విముక్త జాతులు, సంచార తెగలు ఆధునికీకరణ బాధితులు. ఔషధ మొక్కలు, సంప్రదాయ చికిత్సలు, పశుపాలన సంబంధిత జ్ఞాన విజ్ఞానాలను, నేత, అల్లికలు తదితర చేతి వృత్తుల నైపుణ్యాలను ఒక తరం నుంచి మరో తరానికి అందిస్తూ వస్తోన్న విశిష్ట సంస్కృతీ సంపన్నులు ఈ తెగలవారు. పారిశ్రామిక నాగరికత వారి జీవనోపాధులను నిర్మూలించింది. ఆధునిక వైజ్ఞానిక పురోగతి వారి జ్ఞానసంపదను తూష్ణీకరించింది. వారి వృత్తి నైపుణ్యాలు అడవిగాచిన వెన్నెల అయిపోయాయి. భారత రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూలులో లేని వందలాది భాషల వ్యవహర్తలు వారు. అయితే వారి భాషలు కేవలం ‘మాండలికాలు’గా ప్రాధాన్యం కోల్పోయాయి. ఆ మౌఖిక భాషలలోని అపూర్వ జ్ఞానసంపద వ్యర్థమైపోతోంది. ప్రదర్శన కళల్లో నిష్ణాతులు, వ్యాయామ అభ్యాసాలలో ఆరితేరినవారైనప్పటికీ కనీస గుర్తింపులేక అల్లల్లాడిపోతున్నారు. వారికీ దురవస్థలను కల్పించింది 1871 నాటి క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్.. ఆ చట్టం ప్రకారం వారు పుట్టుకతోనే నేరస్థులుగా పరిగణితులు అయ్యారు. అనేక ఆంక్షలకు గురయ్యారు. కన్న ఊళ్ల నుంచి, సొంత కుటుంబాల నుంచి దూరం కావాల్సిన దుస్థితికి లోనయ్యారు. 1952లో ఆ చట్టాన్ని రద్దు చేసినా, తమకు ఆపాదించిన కళంకాల నుంచి ఇప్పటికీ విముక్తి పొందలేకపోతున్నారు. 1871 చట్టం రద్దుతో ఆ చట్టం పరిధిలోని వారందరూ డీనోటిఫై అయ్యారు. హిందీ వ్యక్తీకరణ ‘విముక్తి’ అనేది ఆ డీనోటిఫికేషన్ స్ఫూర్తిని బాగా ప్రతిబింబిస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఈ విముక్త జాతులకు చెందిన కార్యకర్త ఒకరు ‘స్వాతంత్ర్యం మీకు 1947లో వచ్చింది, మాకు 1952లో వచ్చింది’ అన్నాడు. ఈ దురదృష్టకర భారతీయుల విషయంలో వలసవాద మనస్తత్వాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు పూర్తిగా రూపుమాపుతుంది?
సంచార తెగల సంక్షేమానికి పాలకులు శ్రద్ధ చూపేలా చేయడంలో విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు మరెవ్వరికంటే విస్తృత, ప్రభావశీల కృషి చేసిన ఉదాత్తుడు గణేశ్ దేవి. మన సమాజ జీవితంలో ఆ తెగల ఉనికికి ప్రాధాన్యం కానరాకపోవడం యాదృచ్ఛికం కాదని, వలసపాలన కాలం నాటి చట్టాలు, స్వతంత్ర భారత అధికార వ్యవస్థల నిరంతర నిర్లక్ష్యం వల్ల ఆ సామాజికుల దుస్థితి మరింతగా వ్యవస్థీకృతమయిందని భాషావేత్త, రచయిత అయిన గణేశ్ దేవి వాదించారు. అవును, ప్రభుత్వాలు, రాజకీయ పక్షాలు వారిని ఒకే విధంగా ఉపేక్షిస్తున్నాయి. భారత రాజ్య వ్యవస్థ ఆ సామాజికవర్గాల ఉనికిని అంగీకరించేందుకు మొండిగా తిరస్కరిస్తోంది. సంచార తెగలలో కొన్ని షెడ్యూల్డు కులాలుగాను, మరికొన్ని షెడ్యూల్డు తెగలుగాను, ఇంకొన్ని ఓబీసీలు (ఒకే తెగ భిన్న రాష్ట్రాలలో వేర్వేరు జాబితాలలో ఉంటోంది!) గాను గుర్తింపు పొందుతున్నాయి. అయితే చాలా తెగలు ఎక్కడా ఎటువంటి ప్రస్తావనకు నోచుకోవడం లేదు. ‘డీనోటిఫికేషన్’ జరిగిన దాదాపు 75 సంవత్సరాల తరువాత కూడా డీఎన్‌టీ/ ఎన్‌టీ జనాభా స్థితిగతులపై భారత రాజ్య వ్యవస్థకు సరైన అవగాహన లేదు. ఈ దురదృష్టకర సామాజికవర్గాల వారు దేశ జనాభాలో 8 నుంచి 14 కోట్ల మంది దాకా ఉండవచ్చని మాత్రం తెలుస్తోంది.
కనుకనే డీనోటిఫైడ్, సంచార తెగల వారి సంఘాల, నాయకుల డిమాండ్లు మూడు ‘సీ’లతో (Cognisance–గుర్తింపు, Categorisation–వర్గీకరణ, Counting–లెక్కింపు)తో ప్రారంభమవుతున్నాయి. తొట్ట తొలుత ఈ తెగల ఉనికిని అంగీకరించాలి, ఆ తరువాత జనాభా గణనలో వారిని లెక్కించాలి, పిమ్మట ఎస్సీ, ఎస్టీయేతరులుగా వారికి రాజ్యాంగంలో ఒక కొత్త షెడ్యూలును సృష్టించాలి. ఇది, ‘నేషనల్ అలయెన్స్ ఆఫ్ నొమాడిక్ అండ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్ గ్రూప్’ అధ్యక్షుడు దక్జిన్ కుమార్ బజ్‌రంగే డిమాండ్. ఆయన ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొత్తగా ఏర్పడిన ‘డీఎన్‌టీ–ఎన్‌టీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ సైతం ఇదే విషయాన్ని పునరుద్ఘాటిస్తూ సెన్సస్–2027లో ఈ తెగల వారికి ఒక ప్రత్యేక కాలమ్, ఒక ప్రత్యేక కోడ్ కేటాయించాలని గట్టిగా డిమాండ్ చేస్తోంది.
ఇదేమీ గొంతెమ్మ కోరిక కాదు. అది కచ్చితంగా నెరవేర్చేందుకు సాధ్యమైనదే. భారత రాజ్య వ్యవస్థ పత్రాల భాండాగారమే ఆ డిమాండ్‌ను నెరవేర్చేందుకు తోడ్పడుతుంది. ఒక పథ నిర్దేశక పత్రం– రెంకే కమిషన్ నివేదిక–2008 గురించి నేను మీ దృష్టికి తీసుకువస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం నియమించిన ఈ కమిషన్ విముక్త జాతుల, సంచార తెగల జనాభా 10.74 కోట్లు అని అంచనా వేసింది. ఈ సామాజికవర్గాల వారు భయానక వివక్షల నెదుర్కొంటున్నారని ప్రముఖంగా ప్రస్తావించింది, దీని కంటే ముఖ్యంగా ఇటీవలి ఇడేట్ కమిషన్ (నేషనల్ కమిషన్ ఫర్ డీనోటిఫైడ్, నొమాడిక్ అండ్ సెమీ– నొమాడిక్ ట్రైబ్స్)–2017 నివేదికను సైతం తప్పక ప్రస్తావించాలి. ఈ కమిషన్, ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ జాబితాలలో విస్తరించి ఉన్న ఇంచుమించు పన్నెండు వందల డీఎన్‌టీ/ ఎన్‌టీ/ఎస్‌ఎన్‌టీ సామాజికవర్గాలను గుర్తించింది. దీనితో పాటు 269 వర్గీకరించని లేదా వర్గీకరణకు వీలులేని వర్గాలను నమోదు చేసింది. డీనోటిఫైడ్, నొమాడిక్, సెమీ నొమాడిక్ తెగలను వర్గీకరించి జనాభా గణనలో వారిని లెక్కించాలని ఇడేట్ కమిషన్ సిఫారసు చేసింది.
చెప్పవచ్చినదేమిటంటే జనాభా గణన–2027లో డీనోటిఫైడ్, నొమాడిక్, సెమీ నొమాడిక్ తెగలవారి లెక్కింపునకు అవసరమైనవన్నీ ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నాయి. కుల గణన విషయమై సర్కారు విధానపరమైన నిర్ణయం తీసుకున్నది. విముక్త జాతుల, సంచార వర్గాల వారి సమగ్ర జాబితా ఉన్నది. ఆ వర్గాల లెక్కింపు జరగాలని రాజ్యాంగబద్ధ కమిషన్ సిఫారసు చేసింది. అయితే ఈ విషయంలో ప్రభుత్వానికి రాజకీయ సంకల్పం ఉన్నదా? లేక, ఆ సంకల్పం వహించేలా ప్రభుత్వంపై ప్రజా ఒత్తిడి తీసుకురావలసి ఉన్నదా? అనేదే ఇప్పుడు మనముందున్న ప్రశ్న.
యోగేంద్ర యాదవ్
(వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ అధ్యక్షుడు)
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్ ప్రిన్స్‌కు వందోసారి కూడా ఓటమి ఖాయం: మోదీ
ఎన్డీయే వస్తే తమిళనాడును దక్షిణ ప్రదేశ్‌గా మార్చేస్తారు: స్టాలిన్